కె.ఎల్.నారాయణ
కె.ఎల్.నారాయణ తెలుగు చలనచిత్ర నిర్మాత.
విశేషాలు
[మార్చు]ఇతడు 1957, సెప్టెంబర్ 16వ తేదీన గుడివాడలో జన్మించాడు.[1] ఇతడు హైదరాబాద్ లిటిల్ ఫ్లవర్ హైస్కూలులో కె.జి. నుండి ఆరవ తరగతి వరకు చదువుకున్నాడు. తరువాత గన్నవరంలోని సెయింట్ జాన్స్ హయ్యర్ సెకండరీ స్కూలులో పదవ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ పిమ్మట విజయవాడలోని లైలా కాలేజీలో ఇంటర్మీడియట్ వరకు చదివి కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో ఎం.బి.బి.ఎస్. చదివాడు. ఇతనికి చిన్నతనం నుండే సినిమాల పట్ల ఆసక్తి ఉండేది. సినిమా రంగంలోకి ప్రవేశించే ముందు ఇతడు రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ వ్యాపారం చేశాడు.[1]
సినిమా రంగం
[మార్చు]1987లో ప్రముఖ కెమెరామెన్ ఎస్. గోపాల రెడ్డితో ఇతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఇద్దరూ 1990లో దుర్గా ఆర్ట్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటైన దుర్గా ఆర్ట్స్ ద్వారా తొలిసారిగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో క్షణక్షణం అనే సినిమాను నిర్మించాడు. ఆ చిత్రం సంచలనం సృష్టించడంతో బాటు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. ఆ తర్వాత అక్కినేని నాగార్జున హీరోగా ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో హలో బ్రదర్ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా కూడా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో నాగార్జున తొలిసారి ద్విపాత్రాభినయం చేశాడు. ఆ తర్వాత ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, కోడి రామకృష్ణ దర్శకత్వంలో దొంగాట సినిమాలను తీశాడు. అక్కినేని నాగార్జున హీరోగా సంతోషం అనే సినిమాను నిర్మిస్తూ దశరథ్ కుమార్‌ను దర్శకుడిగా పరిచయం చేశాడు.[1]
సినిమాల జాబితా
[మార్చు]- క్షణక్షణం (1990)
- హలో బ్రదర్ (1994)
- ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996)
- దొంగాట (1997)
- సంతోషం (2002)
- నిన్నే ఇష్టపడ్డాను (2003)
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 బులెమోని వెంకటేశ్వర్లు (8 May 2002). తెలుగు సినిమా వైతాళికులు (1 ed.). హైదరాబాద్: నెక్స్ట్ స్టెప్ పబ్లికేషన్స్. p. 40.[permanent dead link]
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కె.ఎల్.నారాయణ పేజీ