సంతోషం (2002 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంతోషం
Santopsham.jpg
దర్శకత్వంకొండపల్లి దశరథ్
రచనగోపీ మోహన్
నిర్మాతకె.ఎల్.నారాయణ
ఛాయాగ్రహణంఎస్. గోపాల రెడ్డి
కూర్పుకె. వి. కృష్ణారెడ్డి
సంగీతంఆర్. పి. పట్నాయక్
నిర్మాణ
సంస్థలు
విడుదల తేదీలు
9 మే 2002
నిడివి
150 నిమిషాలు
దేశంభారత్
భాషతెలుగు

సంతోషం 2002 లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్ర సంగీతం మంచి ప్రేక్షకాదరణ పొందింది.

కథ[మార్చు]

కార్తీక్ (అక్కినేని నాగార్జున), ఊటీలో స్థితిమంతుడైన ఒక ఆర్కిటెక్ట్. అతడు పద్మావతి (గ్రేసీ సింగ్) తో ప్రేమలో పడతాడు. అతను ప్రేమకు పచ్చజెండా ఊపడానికి ఆమె కొంచెం సమయం తీసుకుంటుంది. పద్మావతికి ఒక అందమైన చెల్లి (చిన్నాన్న కూతురు) భాను (శ్రియా సరన్) ఉంటుంది. వీరి ప్రేమకు పద్మావతి తండ్రి రామచంద్రయ్య (కె.విశ్వనాథ్) అంగీకరించడు. తను ఎంపికచేసిన అబ్బాయినే వివాహమాడమని పద్మావతిని ఆదేశిస్తాడు. దీనితో పద్మావతి ఇంటి నుండి పారిపోయి కార్తీక్ ని వివాహం చేసుకుంటుంది. కానీ తన తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందడానికి తహతహలాడుతుంటుంది. వీరు న్యూజిలాండ్ వెళ్ళిపోయి అక్కడే స్థిరపడిపోతారు. వీరికి ఒక అబ్బాయు లక్కీ కలుగుతాడు. తర్వాత జరిగే ఒక ప్రమాదంలో పద్మావతి చనిపోతుంది. రామచంద్రయ్య వారిది ఉమ్మడి కుటుంబం. వీరి కుటుంబంలో జరిగే ఒక వివాహ వేడుకకు కార్తీక్, పద్మావతి లను కూడా ఆహ్వానించాలను కొందరు ప్రతిపాదిస్తారు. వారి కోరిక ప్రకారం వివాహానికి వచ్చిన కార్తీక్ కి మిశ్రమ స్పందన ఎదురవుతుంది. అందరూ అతడిని ఇష్టపడినా రామచంద్రయ్య మాత్రం మాట్లాడడు. కార్తీక్ తన మంచి స్వభావంతో రామచంద్రయ్య మనసును గెలుచుకోగలుగుతాడు. దీనితో అతడిని అల్లుడిగా అంగీకరిస్తాడు. ఈ క్రమంలో భాను, కార్తీక్ ని ప్రేమించడం ప్రారంభిస్తుంది. కానీ భానును పవన్ (ప్రభుదేవా) ప్రేమిస్తుంటాడు. చివరికి భాను ఎవరిని పెళ్ళాడింది అనేది ముగింపు.

నిర్మాణం[మార్చు]

అభివృద్ధి[మార్చు]

దుర్గ ఆర్ట్స్ పతాకంపై పలు విజయవంతమైన సినిమాలు నిర్మించిన పి.ఎల్.నారాయణ, ఎస్ గోపాలరెడ్డిల వద్ద 2002 నాటికి కథానాయకుడు అక్కినేని నాగార్జున డేట్స్ ఉన్నాయి, కానీ కథే లేదు. చాలామంది రచయితలు కథలు చెప్తున్నారు కానీ ఏదీ నచ్చక ఫైనలైజ్ కాలేదు. ఇదిలా ఉండగా నటుడు బెనర్జీ నువ్వు నేను సినిమాలో పనిచేస్తూండగా అక్కడ అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న దశరథ్ని అడిగి ఆయన వద్ద ఉన్న కథ విన్నారు. దశరథ్ టాలెంట్ గుర్తించిన బెనర్జీ ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నిర్మాతలు పి.ఎల్. నారాయణ, ఎస్.గోపాలరెడ్డిలకు ఆయన కథని సినిమా తీసేందుకు సూచించారు. వాళ్ళకు దశరథ్ చెప్పిన కథను వన్ హౌస్గా తరుణ్ హీరోగా తీద్దామని భావించారు. అయితే తరుణ్ చాలా బిజీగా ఉండడంతో ఈలోగా దశరథ్ నువ్వు నేను సినిమాలో పనిచేయడం కొనసాగించారు.

దశరథ్ కు నాగార్జున డేట్స్ తమ నిర్మాతల వద్ద ఉండడం, ఎవరూ అందుకు తగ్గ కథ చెప్పలేకపోవడం తెలిసింది. దాంతో తనవద్ద ఉన్న ఓ యాక్షన్ కథని వాళ్ళకి చెప్పారు. ఆ కథ వాళ్ళకు బాగా నచ్చడంతో నాగార్జునకు కూడా నరేట్ చేయించారు. నాగార్జునకు ఆ కథ నచ్చినా ఓ సందేహం మిగిలింది. అప్పటికే షాజీ కైలాశ్ దర్శకత్వంలో శ్రీరాం అనే యాక్షన్ సినిమాలో చేసేందుకు అంగీకరించారు. ఇప్పుడు మళ్ళీ ఈ యాక్షన్ కథలో నటిస్తే, కొద్ది కాలవ్యవధిలో రెండు యాక్షన్ సినిమాలు విడుదల కావడం సరైనదేనా అని సందేహించారు. దాంతో ఏదైనా కుటుంబకథ, ప్రేమకథ లాంటివి చెప్పమన్నారు.

దాంతో రచయిత గోపీమోహన్ తో కలసి ఓ కుటుంబ కథాచిత్రం తయారుచేసే పనిలో పడ్డారు దశరథ్. హిందీ సినిమా హమ్ దిల్ దే చుకే సనమ్లో కథానాయకుడు అజయ్ దేవ్ గణ్ పాత్రలాంటి క్యారెక్టరైజేషన్ నాగార్జున పాత్రకు ఉంటే బావుంటుందని భావించారు దశరథ్. దాంతో ఆ పాత్ర, దానికి అనుగుణంగా మిగిలిన పాత్రలు అల్లుకుని ఆ క్రమంలో కథాంశం వారంరోజుల్లో పూర్తిచేశారు. ఆ కథాంశాన్ని నాగార్జునకు చెప్పగా ఆయనకు బాగా నచ్చింది. దాంతో పూర్తి స్క్రిప్ట్ తయారుచేయమని నాగార్జున దశరథ్ కు పురమాయించేశారు.

ఆ క్రమంలో స్క్రిప్టును పూర్తిగా తయారుచేశారు దశరథ్. అయితే సినిమాలో క్లైమాక్స్ విషయంలో మాత్రం ఏదో అసంతృప్తి కలిగింది ఆయనకి. తన మిత్రబృందంలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ని సంప్రదించారు. ఓ చిన్న సమావేశంలో క్లైమాక్స్ సాగే విధానాన్ని వివరించారు దశరథ్. విన్నాకా త్రివిక్రమ్ పెన్నూ కాగితంతో కూడా పనిలేకుండా వరుసగా రావాల్సిన డైలాగులన్నీ చెప్పుకుంటూ పోయారు. ఆ డైలాగుల స్కీమ్ నే క్లైమాక్స్ కి పెట్టుకున్నారు. చివరకి సినిమా ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ పూర్తయ్యాకా దాన్ని నాగార్జునకు వినిపించారు. అయితే నాగార్జున వినేసి, ఏం స్పందించకుండా మౌనంగా ఉండిపోయారు. స్క్రిప్ట్ నచ్చలేదనే దశరథ్ అనుకుని నువ్వు నేను సినిమా పనిలో పడిపోయారు. ఆ సినిమా షూటింగ్ లో ఉండగానే నిర్మాత నారాయణ కబురుపెట్టి ఫోనులో "సినిమా నాగార్జునకు బాగా నచ్చేసింది. నిన్నే దర్శకునిగా పెట్టి తీద్దామంటున్నా"రని చెప్పారు.

అయితే సినిమా ప్రాజెక్ట్ ఫైనలైజ్ అయిపోయి తానే దర్శకునిగా పెట్టినా దశరథ్ కి ధైర్యం చాలలేదు. "స్క్రిప్ట్ వరకూ నేను ఇస్తాను, దర్శకత్వం వేరేవాళ్ళతో చేయించుకోండి" అని చెప్పేశారు. కానీ నాగార్జున మాత్రం ఆయనే దర్శకునిగా ఉండాలని నిర్ణయించుకుని దానికి ఏం కావాలని అడిగారు. దానికి దశరథ్ తనకు ధైర్యం చాలట్లేదని, ఆగస్టు 2001లో కాకుండా నవంబరు నెలవరకూ సినిమా షూటింగ్ ఆపితే తాను ఈలోగా సిద్ధమవుతానని చెప్పారు. స్క్రిప్ట్ నచ్చడం, దర్శకుడిగా దశరథ్ అయితేనే కరెక్ట్ అన్న నిర్ణయానికి రావడంతో నాగార్జున అందుకు కూడా అంగీకరించారు. దశరథ్ దర్శకత్వంలో ఈ సినిమా 2001 నవంబరులో ప్రారంభమైంది. సినిమాకి సంతోషం అన్న పేరు రచయిత గోపీమోహన్ పెట్టారు.[1]

నటీనటుల ఎంపిక[మార్చు]

కథ మొదటినుంచీ అక్కినేని నాగార్జునను దృష్టిలోపెట్టుకుని తయారుచేసి, ఆయన అంగీకారంతోనే ప్రాజెక్టు ఫైనలైజ్ అయింది. హీరోయిన్ గా అప్పటికి కొత్తగా విడుదలై, ఘనవిజయం సాధించిన హిందీ సినిమా లగాన్ సినిమాలో నటించిన గ్రేసీ సింగ్ అయితే బావుంటుందని దశరథ్ భావించారు. లగాన్ ఘనవిజయం సాధించివుండడంతో ఆమె డేట్స్ దొరకవు అనుకున్నా ఆమె కథ విని బాగా నచ్చడంతో డేట్స్ ఇచ్చారు. సినిమాలో మరో హీరోయిన్ పాత్రకు వెతుకులాట జరిపారు. చాలామందినే పరిగణించి చూశారు. పబ్లిసిటీ డిజైనర్ కృష్ణ ఆఫీసులో అప్పుడు ఆయన డిజైన్ చేస్తున్న ఉషాకిరణ్ మూవీస్ ఇష్టం పోస్టర్లు చూశారు. ఆ సినిమాతోనే వెండితెరకు పరిచయమైన శ్రియా అందంగా, కొత్తగా ఉండడంతో ఆమె అయితే బావుంటుందని దశరథ్ కి అనిపించింది. అయితే చిన్నవయసులో ఉన్నట్టు కనిపిస్తున్న శ్రియ నాగార్జున పక్కన హీరోయిన్ గా సరిపోతుందానన్న అనుమానం వచ్చింది. దాంతో స్క్రీన్ టెస్ట్ చేశారు. అందులో ఒకే అయి శ్రియాని మరో కథనాయిక పాత్రలో తీసుకున్నారు. సినిమాకు కీలకమైన రెండవ కథానాయకని ప్రేమించి పెళ్ళి వరకూ తీసుకువెళ్ళే పాత్రకు ఎవరిని తీసుకోవాలన్న సమస్య ఉత్పన్నమైంది. ఆ పాత్రకు ఆకర్షణీయమైన, అప్పటికే ఒక ఇమేజి ఉన్న నటుడైతే సినిమాకు ప్లస్ అవుతుంది. నిర్మాత గోపాలరెడ్డి ఆ పాత్రకి ప్రభుదేవాని సూచించారు, ఆయనైతే ఇంటర్వెల్ తర్వాత డ్యాన్స్ కి ప్రాధాన్యత ఉన్న మంచి పాట కూడా పెట్టుకోవచ్చని ఆలోచన. ఆ ఆలోచన దర్శకునికి నచ్చింది, ప్రభుదేవాను సంప్రదించగా ఒకే చేశారు.[1]

పాటలు[మార్చు]

సినిమాకి ఆర్పీ పట్నాయక్ సంగీత దర్శకత్వం వహించారు. సినిమాలో పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి, కులశేఖర్ రాశారు. ఆర్పీ పట్నాయక్, చంద్రసిద్ధార్థ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, దశరథ్, సునీల్ తదితరులంతా మొదటి నుంచీ స్నేహితులు. ఈ సినిమా సిటింగ్స్ జరుగుతున్న సమయంలో ఆర్పీ, దశరథ్, చంద్రసిద్ధార్థ్ తదితరులు కారులో గండిపేట్ వెళ్ళారు. సినిమాలో "లోలోన మనసంతా సంతోషమే" పాట వచ్చే సిట్యువేషన్లో దానికి సాకీలో ఓ ఇంగ్లీష్ పాట పెడదామన్న విషయంలో డిస్కషన్లు జరుగుతున్నాయి. కారులో వెళ్తూండగా ఆర్పీ ఓ ట్యూన్ అనుకుంటూండగా, వెనువెంటనే చంద్రసిద్ధార్థ్ "సో మచ్ టు సే" (so much to say) అంటూ ఆ ట్యూన్ కి పాడేశారు. అది నచ్చడంతో ఆయనతోనే ఆ ఇంగ్లీష్ పాటని రాయించారు. "లోలోన మనసంతా సంతోషం" పాట మొదట పల్లవి ప్రారంభం "గలగలా గోదారిలా.. కిలకిలా రావేచెలీ" అంటూ సాగేలా రాయించుకున్నారు. కానీ చిత్రీకరణ సమయంలో నృత్యాలు చేయడానికి వచ్చిన రాజు సుందరం - ఛ ఇదేం లిరిక్ అంటూ చిత్రీకరణ ఆపేశారు. ఆ రోజు రాత్రి ఆర్పీ, దశరథ్ ఎంత ప్రయత్నించినా గీతరచయిత కులశేఖర్ దొరకలేదు, ఆయన ఫోన్ అవుటాఫ్ కవరేజ్ ఏరియాలో ఉంది. దాంతో ఇక తప్పక తామిద్దరం డిస్కస్ చేసుకుని "దేవుడే దిగివచ్చినా స్వర్గమే నాకిచ్చినా.. షాజహాన్ తిరిగొచ్చినా తాజ్ మహల్ రాసిచ్చినా" అంటూ సాగే లిరిక్ రాసుకున్నారు. చివరకి అదే నిలిచింది.[1]

హాస్య సన్నివేశాలు[మార్చు]

  • కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం ల మధ్య హాస్య సన్నివేశం చాలా బాగుంటుంది. ఒక పార్టీలో ఇద్దరూ కలిసినప్పుడు కోట గురించి బ్రహ్మానందం ఒకే డైలాగ్ ను ఒక పదిసార్లు వివిధ మోడ్యులేషన్ తో చెప్పి అందర్నీ నవ్విస్తాడు. "He is very strong man. మీరు ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ కాలంలో చించేశేవారు" అనేది ఆ డైలాగు. ఇది చెబుతున్నప్పుడు వినేవారిలో ఒకడు చెవిటివాడు; అప్పుడు బ్రహ్మానందం ఎక్స్‌ప్రెషన్ అల్టిమేట్ గా ఉంటుంది. కడుపుబ్బ నవ్వుతాము.[2]

నటవర్గం[మార్చు]

  • మాస్టర్ అక్షయ్‌ బుచ్చు [5]

సాంకేతికవర్గం[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 పులగం, చిన్నారాయణ. "సో మచ్ టు సే...సంతోషం". సాక్షి. Retrieved 14 August 2015. సినిమా వెనుక స్టోరీ - 3
  2. సంతోషం కామెడీ సీన్.
  3. సాక్షి, ఆంధ్రప్రదేశ్ (13 November 2014). "నా జీవితమే ఓ పుస్తకం". Sakshi. Archived from the original on 18 మే 2020. Retrieved 18 May 2020.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (17 November 2015). "విలన్‌గా భయపెడుతున్నా". andhrajyothy.com. Archived from the original on 18 మే 2020. Retrieved 18 May 2020.
  5. Sakshi (14 June 2021). "'సంతోషం'లో నటించిన ఈ బుడ్డోడు గుర్తున్నాడా? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే." Sakshi. Archived from the original on 14 జూన్ 2021. Retrieved 14 June 2021.