కొడాలి లక్ష్మీనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొడాలి లక్ష్మీనారాయణ
దస్త్రం:Kodali lakshminarayana .jpg
చారిత్రక శిరోమణి
జననం: 1908
మోపర్రు గ్రామం.గుంటూరు జిల్లా
మరణం:1985
వృత్తి: జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు
జాతీయత:హిందువు
Subjects:భారతదేశ చరిత్ర, సంస్కృతి,గ్రంథాలయ చరిత్రల గురించి పరిశోధన
తొలి కృతి:భారతీయ, ఆంధ్రా గ్రంథాలయాల చరిత్ర

కొడాలి లక్ష్మీనారాయణ (1908 - 1985) రచయిత ప్రసిద్ధ చారిత్రిక పరిశోధకులు, ఉత్తమ ఉపాధ్యాయులు. చారిత్రక శిరోమణి, విద్యా విశారద మొదలైన బిరుదుల కలవు.

జీవిత సంగ్రహం[మార్చు]

వీరు గుంటూరు జిల్లా మోపర్రు గ్రామంలో 1908 సంవత్సరం జన్మించారు. తెనాలి, గుంటూరులో విద్యాభ్యాసం పూర్తిచేసి అక్కడే జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి 1966 లో పదవీ విరమణ చేశారు.

వీరు స్వీయ ఆసక్తి మీద భారతదేశ చరిత్ర, సంస్కృతి గురించి అపారమైన పరిశోధన చేశారు. వీరు ఇతిహాస పరిశోధక గ్రంథమాల స్థాపించి, తొలి కుసుమంగా ప్రాచీన భారతీయ గ్రంథాలయ చరిత్రను 1946లో ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1966లో ఆంధ్రదేశ గ్రంథాలయ చరిత్రను ప్రచురించారు.

తెలుగు నాట అనేక ప్రదేశాలలో వీరికి కవి సన్మానాలు జరిగాయి. విద్యా విశారద, చారిత్రక శిరోమణి మొదలైన బిరుదులను ప్రధానం చేసారు.[1]

చారిత్రక పరిశోధన[మార్చు]

లక్ష్మీనారాయణ గారి పరిశోధక వ్యాసాలు వివిధ పత్రికలలో ముఖ్యంగా నార్ల సంపాదకత్వంలో ఉన్న ఆంధ్ర ప్రభలో ప్రచురితం అయ్యాయి. హిందూ మతంలో ముఖ్యమైన గ్రంధాలైన రామయణం, మహా భారతం పై విస్తృత పరిశోధన చేసారు.

మూల రామాయణం ఏది? దానిలొ ప్రక్షిప్తాంశాలు ఏవి? రామ కధ నిజంగా జరిగిందా లేదా అనే అంశాలు పురాణ దృష్టితో కాకుండా చారిత్రిక దృష్టితో చూడాలని చెపుతూ 1949లో వాల్మీకి రామాయణ విమర్శనం అనే పరిశోధనా గ్రంధాన్నిరాసారు. హేతు బద్దంగా రాసిన ఈ గ్రంధం విమర్శకుల ప్రశంసలు పొందింది.

వేదాలను విభజించిన లేక విస్తరించిన వారందరు వేద వ్యాసులే నని, వాయు, విష్ణు పురాణాలలో 28 మంది వ్యాసులను ఉన్నారని వారిలో చివరి వాడు మహా భారతం రాసిన కృష్ణ ద్వైపాయనుడు. ఈయన కీ.పూ. 10 లేక 11 వ శతాబ్ది వాడని అంటూ 1957లో మహా భారత విమర్శనం హేతు బద్దంగా రాసి విమర్శకుల ప్రశంసలు పొందారు.

ప్రాచీన కాలం నుంచి తెలుగునాడును వ్యవహరించే త్రిలింగ నామంలోని మూడు శివలింగాల్లో శ్రీశైలం ఒకటి. సుప్రసిద్ధమైన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. శ్రీశైలం ఇక్ష్వాకులు, పల్లవులు, విస్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, శివాజీ లాంటి ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం. శ్రీశైల చరిత్ర దాదాపుగా 5వ శతాబ్ది నుంచి ఆంధ్రదేశ చరిత్రలో అవిచ్ఛిన్నంగా కొనసాగుతూంటుంది. వివిధ రాజవంశాలు శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తూ ఆ క్రమంలో శాసనాలు వేయించారు. ఎందరో కవులు తమ రచనల్లో శ్రీశైల మల్లికార్జునుని ప్రస్తుతిస్తూ ప్రస్తావించారు. ఈ చారిత్రిక నేపథ్యంలో 'చారిత్రిక శ్రీశైలం క్షేత్రం' అనే గ్రంధాన్ని 1967లో రాసారు.[2].

భారతదేశమంతా కర్మభూమిగా ప్రసిద్ధిచెందితే కాశీ మాత్రం మోక్షభూమి అన్న ప్రత్యేకత కలిగివుంది. వారణ, అసి నదుల మధ్యనున్న భూమి అనాది, అనంతమని భారతీయుల విశ్వాసం. పౌరాణికంగానే కాక కాశీకి చారిత్రికంగా కూడా చాలా ప్రాధాన్యత ఉంది. భారతీయ సంస్కృతితో ఎంతగానో ముడిపడ్డ నగరం కావడంతో చరిత్రలో ప్రాచీన రాజ్యాలకు, పరిశ్రమలకు, దండయాత్రలకు ఇలా ఎన్నింటికో సాక్షీభూతంగా నిలిచింది. ఈ నేపథ్యంలో 'చారిత్రిక కాశీ క్షేత్రము ' గ్రంథంలో పలు కోణాల నుంచి చరిత్రను పునర్నిర్మించారు.[2]

వీరు రాసిన నాగార్జున చరిత్ర ను ఆంధ్రా విశ్వవిద్యాలయం వారు 1951లో 'భాషా ప్రవీణా' ఫైనల్ పరీక్షకు పాట్య పుస్తకంగా నిర్ణయించింది.

మరణం[మార్చు]

కొడాలి లక్షీనారయణ గారు తన 78 సంవత్సరాల వయస్సులో 26 ఫిబ్రవరి 1985 తేదీన పరమపదించారు.

రచనలు[మార్చు]

తెలుగు రచనలు[మార్చు]

  • భారతీయ గ్రంథాలయ చరిత్ర
  • ఆంధ్రదేశ గ్రంథాలయ చరిత్ర
  • మహా భారత విమర్శనం
  • వాల్మీకి రామాయణ విమర్శనం
  • చారిత్రిక శ్రీశైలం క్షేత్రం[2]
  • చారిత్రిక కాశీ క్షేత్రము[2]
  • భారతీయ సంస్కృతి[2]
  • భారత విదుషీరత్నాలు (2 భాగాలు)
  • ప్రాచీన యోగులు
  • వ్యాసావళి (3 భాగాలు)
  • ప్రాచీన భారత ప్రజాస్వామికములు
  • సూర్యదేవర రాజన్య చరిత
  • తురిమెళ్ళ, మోపర్రు గ్రామాల చరిత్ర
  • రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు
  • కృష్ణ దేవరాయల చరిత్ర
  • తెనాలి రామలింగం చరిత్ర
  • వివాహముల చరిత్ర
  • సాయపనేనివారి చరిత్ర
  • ముసునూరి వీరులు
  • భద్రాచల రామదాసు చరిత్ర
  • వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర
  • భారతీయ పుణ్యాంగనల చరిత్ర
  • అల్లూరి సీతారామరాజు
  • విస్తృత ఆంధ్ర నాయకుల చరిత్ర

ఆంగ్ల రచనలు[మార్చు]

  • English Education
  • The Voice of the Secular Democratic India
  • Gandhi in the Eyes of the World History of Medicine
  • Glory of our National Flag

మూలాలు[మార్చు]

  1. లక్ష్మీనారాయణ, కొడాలి (2005). 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగము. హైదరాబాదు: తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు. p. 604.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 'చారిత్రిక శ్రీశైలం, భారతీయ సంస్కృతి, చారిత్రిక కాశీ క్షేత్రం' మూడు పుస్తకాల సంపుటి- భారత డిజిటల్ లైబ్రరీలో పుస్తక ప్రతి.