చాకొలెట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చాకొలెట్
Chocolate most commonly comes in dark, milk, and white varieties, with cocoa solids contributing to the brown color
వంటకం వివరాలు
ప్రధానపదార్థాలు Chocolate liquor

చాకొలెట్ చెట్ల నుండి వచ్చే, కాఫీని పోలిన, పదార్థం. దీనిని రకరకాల పానీయాలలోను, తినుభండారాలలోను, మిఠాయి లలోను కలుపుతారు. చాకొలెట్ కలిసిన వంటకాలు, పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. స్నేహితులైనా, ప్రేమికులైనా, ఆత్మీయులైనా, అధికారులైనా, శుభాకాంక్షలు చెప్పాలన్నా, అభినందనలు తెలపాలన్నా, స్వాగతిస్తున్నా, వీడిపోతున్నా, ఇచ్చిపుచ్చుకునే కానుక చాకొలెట్. ఒకప్పుడు ఎవరినైనా కలవాలన్నా, శుభాకాంక్షలు చెప్పాలన్నా, పూలూ పండ్లే తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు వీటి స్థానంలోకి చాకొలెట్ వచ్చేసింది. ముఖ్యంగా చిన్నపిల్లలకయితే చాకొలెట్ ని మించిన కానుక లేనే లేదు. అందుకే అందమైన పెట్టెలలో అలంకరించి మరీ అందిస్తున్నారు. పెళ్ళి, పుట్టినరోజు, కొత్త సంవత్సరం, వంటి వేడుకల్లోనూ ఫ్యాషన్ వేదికలమీదా అద్భుతమైన చాకొలెట్ కళాకృతులతో ఆహూతుల్ని అలరిస్తూ తీసి రుచుల్ని అందిస్తున్నారు.

చరిత్ర

[మార్చు]

దక్షిణ అమెరికాలో ఒకానొకప్పుడు నివసించిన మాయ, ఆజ్టెక్ జాతులు చాకొలెట్ తో చేసిన పానీయాలు విరివిగా తాగేవారు. పురావస్తు పరిశోధకుల మాటలని బట్టి చూస్తే చాకొలెట్‌ సుమారు 3,000 సంవత్సరాల కిందటే ఉపయోగంలో ఉండేదిట. చాకొలెట్‌ని మనకి పరిచయం చేసిన ఘనత హాంస్‌ స్లోన్‌ (Hans Sloan) అనే ఐర్లండు దేశపు వైద్యుడికి దక్కుతుంది. (ఈయన లండన్‌లో ఉన్న బ్రిటిష్ మ్యూజియం సంస్థాపకులలో ఒకడు.) ఈయన జమైకాలో బ్రిటిష్‌ గవర్నర్‌ దగ్గర పనిచేస్తూన్న రోజులలో చేదుగా ఉండే కోకో తాగలేక దాంట్లో కాసిన్ని పాలు కలిపేడు. (టీలో పాలు కలిపి తాగడం కూడా బ్రిటిష్‌ వాళ్ల అలవాటే!) చేదుగా ఉన్న కొకోలో పాలు కలిపేసరికి దాని రుచే మారిపోయింది. అప్పటివరకు వేడి నీళ్లల్లో కలుపుకు తాగే కోకో పాలల్లో కలిపేసరికి ఎంతో రుచిగా తయారయింది. అప్పటినుండి ఘనరూపంలో ఉన్న చాకొలెట్‌కి కూడా పాలు కలిపేసరికి తినడానికి వీలుగా తయారయింది. [1]

చాకొలెట్ - రకాలు - తయారీ

[మార్చు]

కకోవా (cocoa/కొకొ) గింజలతో చేసే చాక్లెట్ల రుచులూ, రకాలూ కోకొల్లలు. ప్రాథమికంగా చాకొలెట్ మూడు రకాలు.

  • కకోవా లిక్కర్ (గింజ తొడిమనుంచి తీసే పొడి లేదా ద్రవం)
  • కకోవా బటర్ (గింజలోని కొవ్వుపదార్థం)
  • కకోవా పొడి (లిక్కర్, కొవ్వు తీసేయగా మిగిలిన పొడి) ని వాడుతూ చేస్తారు.

కకోవా అభిషవానికి (లిక్కర్‌కి) కాస్త కకోవా వెన్న (బటర్), పంచదార కలిపి చేసేదే నల్ల (డార్క్ లేదా బ్లాక్) చాకొలెట్. ఇందులో కలిపే కకోవా అభిషవం గాఢత కనీసం 35 శాతానికి తగ్గకూడదనే నిబంధన ఉంది. ఖరీదైన డార్క్ చాకొలెట్ లో 70 నుంచి 99 శాతం కకోవా లిక్కర్ ఉంటుంది. కకోవా ద్రవం లేదా పొడి కనీసం 20 శాతం ఉండి పాలు, పంచదారతో కలుపుతూ చేసేదే పాల చాకొలెట్. కకోవా బటర్ మాత్రమే వాడుతూ పాలు, పంచదారతో చేసేదే తెల్ల చాకొలెట్. ఇందులో కకోవా అస్సలు ఉండదు. ఈ మూడు రకాలకీ జోడించే పాలు, పంచదార శాతాన్ని బట్టి ఎన్నో రకాల చాకొలెట్ లు చేస్తారు. వీటిల్లోనూ పుదీనా, వెనీలా, కాఫీ, ఆరెంజ్, స్ట్రాబెర్రీ... ఇలా రకరకాల షాడబాలనీ (ఫ్లేవర్లని), బాదం, వేరుసెనగ, పిస్తా, వంటి పలుకులనూ జోడిస్తూ చేసే మరెన్నో రకాలు చాకొలెట్ లు ఉన్నాయి. షీ ఫ్యాట్ ను చాకొలెట్ తయారిలో ఉపయోగిస్తారు.చాకొలెట్ తయారిలో కొకొ బట్టరుకు ప్రత్నామ్నయంగా షీఫ్యాట్/షీ బట్టరు ను ఉపయోగిస్తారు.

చాకొలెట్ ని నిల్వ చెయ్యడం

[మార్చు]

తాజాగా ఉన్న చాకొలెట్ మంచి రుచిగా ఉంటుంది. తాజాగా ఉన్న చాకొలెట్ కి ఉన్న కూర్పరితనం (texture), షాడబం (flavor) నిల్వ ఉన్న చాకొలెట్ కి ఉండవు. అందుకని, చాకొలెట్ ని ఎప్పుడు తినదలుచుకున్నామో అప్పుడే కొనుక్కుని తినడం మంచిది. ఘన రూపంలో ఉన్న చాకొలెట్ ని చల్లగా ఉన్న (65 - 68 F), చెమ్మదనం (humidity) తక్కువగా ఉన్న ప్రదేశంలో నిల్వ చేస్తే చాల రోజులు తాజాగా, కమ్మగా ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకుని నిల్వ చేస్తే నల్ల చాకొలెట్ ఏడాది పాటు పాడవకుండా ఉంటుంది. పాల చాకొలెట్, తెల్ల చాకొలెట్ ఆరు నెలలు నిల్వ ఉంటాయి. నిల్వ చేసిన చాకొలెట్ కి గాలి, వెలుగు తగల కూడదు. ఎండ తగిలితే చాకొలెట్ కరిగి ముద్దయిపోతుంది. అందుకనే ఇండియాలో నాణ్యమైన చాకొలెట్ కొనుక్కుని, తిని, ఆనందించడం కష్టం. మనకి బజారులో దొరికే చాకొలెట్ ఎండకి, వేడికి తట్టుకోవాలి కనుక దానిలో ఏదో కలపాలి. అలా కలిపితే చాకొలెట్ అసలు రుచి పోతుంది.

ఇండియాలో అన్ని కాలలోను వేడిగానే ఉండే ప్రదేశాలే ఎక్కువ కనుక తినగా మిగిలిన చాకొలెట్ ని రిప్రిజిరేటర్ లో పెట్టక తప్పదు. అటువంటి పరిస్థితులలో చాకొలెట్ ని డబ్బాలో పెట్టి, మూత గట్టిగా పెట్టి, రిప్రిజిరేటర్ లో దాచుకుని, తినే ముందు కొద్ధి క్షణాలు వెచ్చబడనిచ్చి తినడం మంచిది. మూత పెట్టపోతే రిప్రిజిరేటర్ లో ఉన్న వంటకాల వాసనలు చాకొలెట్ కి అంటుకుని రుచి పాడవుతుంది.

వైద్య సంబంధ ఉపయోగాలు

[మార్చు]
  • కకోవా శాతం సుమారు 70 నుంచి 85 శాతం ఉండే డార్క్ చాక్లెట్‌లో ఎన్నో పోషకాలున్నాయి. ఎండిన కకోవా గింజలలో బహుఫీనాలుల వంటి "ఏంటీఆక్సిడెంట్లు", షాడబార్థాలు (flavonoids) దరిదాపు 8 శాతం వరకు ఉంటాయి. స్వతంత్ర ప్రతిపత్తితో అతి చురుగ్గా తిరుగాడే బణు సమూహాలు (free radicals) విశృంఖలంగా తిరుగుతూ ఉంటే అవి జీవకణాలకి హాని చేస్తాయి. ఏంటీఆక్సిడెంట్లు ఇటువంటి విశృంఖల రాసులని అదుపులో పెడతాయి. ఉష్ణమండలాలలో పెరిగే కాఫీ, టీ, కోకో (కకోవా), మొదలైన మొక్కలన్నీ ఇటువంటి ఏంటీఆక్సిడెంట్‌ లని తయారు చెయ్యడమనేది గమనించవలసిన విషయం. ఎందుకంటే సూర్యుడి నుండి వచ్చే తీక్షణమైన కిరణాల ధాటికి ఈ మొక్కలలోని జీవకణాలలో కూడా విశృంఖల రాసులు తయారవుతాయి. వీటి నుండి రక్షించుకునే ప్రయత్నంలో మొక్కలు ఏంటీఆక్సిడెంట్‌ లని తయారు చేసుకుంటాయి. వాటిని మనం తస్కరించి ఉపయోగించుకుంటున్నామన్నమాట.
  • చాకొలెట్ తినడం వల్ల సమకూరే వైద్యపరమైన లాభాలని ప్రశంసించే ముందు ఈ లాభాలు, ప్రయోజనాలు నాటు చాకొలెట్ తినడం వల్ల వస్తాయి కాని, మనం బజారులో కొనుక్కుని తినే మిఠాయి చాకొలెట్ వల్ల కాదని గమనించాలి. కనుక ఈ దిగువ ఇచ్చిన జాబితాని చదివేటప్పుడు వాటిని అక్షరసత్యాలుగా తీసుకోవడం శ్రేయస్కరం కాదు.
    • అతిగా తింటే ఏదీ మంచిది కాదు కాని, మోతాదుగా తింటే చాకొలెట్‌ ఆరోగ్యానికి మంచిది. రక్తపోటుని అదుపులో పెట్టడానికి నల్ల చాకొలెట్ ఒక దివ్య ఔషధమని కొత్త పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. నల్ల చాకొలెట్లో- కేటచిన్‌ అనే షాడబార్థం (ఫ్లావనాయిడ్) ఉంటుంది. ఇది మన రక్త నాళాలను వ్యాకోచించేటట్లు చేసే శక్తి కలిగి ఉంటుందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అందువల్ల రక్తనాళాలలో రక్త ప్రసరణ సులువుగా జరుగుతుంది.
    • ఇవి హృద్రోగాలనూ క్యాన్సర్లనూ దూరంగా ఉంచుతాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
    • చాక్లెట్ మెదడు పనితీరునీ మెరుగుపరుస్తుంది. డిప్రెషన్‌ని తగ్గిస్తుంది. చాక్లెట్ తింటే మనసు ఉత్సాహంగా ప్రశాంతంగా ఉంటుంది. మంచి నిద్ర పడుతుంది. ఇందులోని థియోబ్రొమైన్ మెదడులో న్యూరో ట్రాన్స్‌మిటర్లుగా పనిచేసే సెరటోనిన్, డోపమైన్ రసాయనాల విడుదలకు సహకరిస్తూ ఆనందాన్ని కలిగిస్తుంది. ఒత్తిడిని తగ్గించి, మెదడు చురుగ్గా ఉండేలా చేస్తుంది.
    • 100 గ్రా. చాక్లెట్ బార్‌లో 67శాతం ఐరన్, 58 శాతం మెగ్నీషియం, 89 శాతం కాపర్, 98 శాతం మాంగనీసూ 11 గ్రా. పీచూ ఉంటాయి. పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, సెలీనియంలూ, బి1, బి2, డి, ఇ విటమిన్లూ ఉంటాయి. అయితే వంద గ్రా. చాక్లెట్ రోజూ తీసుకోలేం. ఎందుకంటే దీన్నించి 600 క్యాలరీలూ వస్తాయి. అందువల్ల ఒక ఔన్సు అంటే 28.5 గ్రా. చాక్లెట్ బార్‌ని తినడం ఆరోగ్యానికి మంచిదేనన్నది నిపుణుల ఉవాచ. దీనివల్ల ఇతర స్వీట్లూ నూనె పదార్థాలను తినాలన్న కోరిక తగ్గుతుంది.
    • కకోవా ఉపయోగించి తయారుచేసిన చాక్లెట్ వల్ల జీర్ణనాళ క్యాన్సర్ వచ్చే అవకాశము తగ్గుతుంది.
    • ఫ్రీ రాడికల్స్ జీర్ణనాళములోని పేగుభాగపు క్యాన్సర్ ని తెస్తున్నాయ్ని కనుగొనబడింది . అటువంటి ఫ్రీ రాడికల్స్ నుండి జీర్ణనాళ రక్షణకు చాక్లెట్లు చక్కగా పనికొస్తాయని కొన్ని పరిశోధనలవల్ల వ్యక్తమయినది .
    • ఫ్లావనాల్స్ అనే పదార్థం శరీరంలో ఎండోథీలియం నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తిని పెంచుతుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణ ప్రక్రియకు తోడ్పడుతుంది. అంతేకాకుండా తక్కువ రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. అయితే అధిక రక్తపోటు ఉన్న వారు ఈ డార్క్ చాక్లెట్లు తీసుకుంటే సత్ఫలితాలుంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.
    • చాక్లెట్లు తింటే పళ్లు పుచ్చిపోతాయనేది అపోహ మాత్రమే. చాక్లెట్లే కాదు, పిండిపదార్థాలు ఉన్న ఏ పదార్థం ఇరుక్కున్నా పళ్లు పుచ్చిపోతాయి. చాక్లెట్‌లోని సహజ కొవ్వులవల్ల మిగిలిన స్వీట్లకన్నా దీన్ని శుభ్రం చేయడం తేలిక. కకోవాలోని టానిన్లు త్వరగా పాచి పట్టనీయవు.
    • కానీ కొంత మందికి కోకోవా పడదు అలర్జీ వస్తుంది . నిద్ర కుడా కొందరిలో సరిగా పట్టదు . చాకోలిట్లు వాడడంలో జాగ్రత్త పడాలి .

చాకోలెట్ - శృంగారవాంఛ

[మార్చు]
  • చాక్లెట్ శృంగార వాంఛలని ప్రేరేపిస్తుందంటారు. నాటి అజ్‌టెక్ రాజు మాంటెజుమా రోజుకి 50 కప్పుల చాక్లెట్ తాగేవాడట. ప్రియురాల్ని కలుసుకునేముందు మరీ ఎక్కువట. ఈ రాచపోకడే చివరకు ప్రేమికుల రోజున ప్రేమికులు చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయానికి దారితీసింది. అయితే ప్రేమలో పడ్డప్పుడు విడుదలయ్యే ఫినైల్ ఇథైల్ ఎమీన్, శృంగార వాంఛను పెంచే ట్రిప్టోఫాన్ కకోవాలోనూ ఉంటాయని తేలింది. ఇదెలా ఉన్నా ఈ రెండూ ఆనందాన్ని కలిగించే సెరటోనిన్ విడుదలకు తోడ్పడతాయి.
  • చాకొలెట్ లో ఉండే అమినో ఆమ్లాలు అడ్రినాలిన్, డోపమైన్ అనే రసాయనాల విడుదలకు కారణమవుతాయి. అడ్రినాలిన్ ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని, డోపమైన్ ఆనందాన్ని పెంచే హార్మోన్ గా పనిచేస్తాయి. ఇక వాటిలో ఉండే కొన్ని రసాయనాలు పురుషాంగము లోని రక్తనాళాల్లో ఉండే ఎండోలియం పని తీరును మెరుగుపరుస్తాయి. రక్తనాళాలను వ్యాకోచింప జేసి రక్త సరఫరా వేగంగా జరిగేలా చేసే " నైట్రిక్ ఆక్సైడ్" ఉత్పత్తికి తోడ్పడతాయి. కోకోవా ఎక్కువగా ఉండే బ్లాక్ చాకొలెట్ వాడితేనే ఫలితం బాగా ఉంటుంది.
  • కోకా చాక్‌లెట్లు తిని సెక్స్‌లో పాల్గొంటే మరింత హుషారుగా వుంటుందన్నది కేవలం మానసిక భావనే తప్ప నిజం కాదట

చాకొలెట్లు - ప్రపంచవ్యాప్త వినియోగము

[మార్చు]
  • ప్రపంచవ్యాప్తంగా ఏటా పది లక్షల కోట్ల రూపాయల చాక్లెట్ ఉత్పత్తుల్ని వినియోగిస్తున్నారు. వీటిల్లో సగం వాటా అమెరికన్లదే. మిల్క్ చాక్లెట్లంటే వాళ్లకి మరీ ఇష్టం. వంటల్లోనూ చాక్లెట్ రుచిని కోరుకుంటున్నారు.
  • వ్యక్తిపరంగా చూస్తే అందరికన్నా ఎక్కువగా స్విట్జర్లాండ్ వాసులు ఏడాదికి తలకి సుమారు 11 కిలోల పైనే తినేస్తున్నారు. విచిత్రంగా ఊబకాయం, గుండెజబ్బులు తక్కువగా ఉన్న దేశాల్లో స్విట్జర్లాండ్ ఒకటి.
  • చాక్లెట్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం కోట్ డీవార్

ప్రపంచంలోనే ఖరీదైన చాకొలెట్లు

[మార్చు]

నిప్‌షిల్ట్ ఫ్రిట్జ్ కంపెనీ 1999లో రూపొందించిన చాకొపొలాజి ప్రపంచంలోకెల్లా ఖరీదైనది. అత్యుత్తమ ట్రఫెల్, కకోవా బీన్స్‌తో తయారయ్యే దీన్ని ఆర్డరుమీద చేస్తారు. అరకిలో సుమారు రూ. 2 లక్షలు. తరవాతి స్థానం సుమారు రూ. 56 వేల ఖరీదు చేసే నోకా వింటేజ్ కలెక్షన్‌ది. దీనికోసం ట్రినిడాడ్, ఈక్వెడార్, వెనెజులా, కోట్ డీవార్ నుంచి కకోవా గింజల్ని సేకరిస్తారు. నాణ్యమైన కకోవా గింజలతోనూ 24 క్యారెట్ల బంగారు ఆకులతోనూ చేసే డెలాఫీది మూడో స్థానం. సుమారు రూ. 33 వేలు. బార్ విషయానికొస్తే బంగారుపూత పూసిన క్యాడ్‌బరీస్ విస్పాదే ప్రథమస్థానం. దీని ఖరీదు రూ. లక్షా ఆరువేలు.

చాకొలెట్ గురించి కొన్ని విశేషాలు

[మార్చు]
  • కకోవా చెట్ల స్వస్థలం దక్షిణ అమెరికా. దీన్ని కకావో అని పిలిచేవారు. వీటిని మొదట ఆల్మెక్ అమెరికన్లు గుర్తించారు. మాయన్లూ అజ్‌టెక్‌ల ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. అప్పట్లో వీళ్లు కకోవా గింజల్నే కరెన్సీగా వాడేవారు.
  • చాక్‌లెట్ వాడకం అన్నది క్రీస్తుపూర్వం 100వ సంవత్సరం నుంచీ వుందని లెక్క తేల్చారు. ఆ కాలంలో దక్షిణ మెక్సికోలోని OLMECS అనే ఆటవికుల తెగ చాక్‌లెట్ పానీయాన్ని సేవించేవారని పరిశోధకులు తేల్చారు.
  • 1528లో స్పానిష్ పరిశోధకుడు HERNANDO CORTEZ కోకా బీన్స్ మెక్కను దక్షిణ అమెరికా నుంచి స్పానిష్ రాజకుటుంబానికి బహుమతిగా తెచ్చాడట.
  • మొదటి సారి మెక్సికోలో చాక్‌లెట్ బార్ తయారీ ప్రారంభమైంది. అదీ 300 ఏళ్ల క్రితం. ఆ తరువాత చాలా కాలానికి 1840లో ప్రఖ్యాత క్యాడ్‌బరీ కంపెనీ ప్రారంభమైంది.
  • మనుషులకు అంత ప్రియమైన చాక్‌లెట్లు కుక్కలకు మాత్రం ఏమంత మంచివి కాదట. చాక్‌లెట్‌ల్లో వుండే థియోబ్రొమైన్ అనే పదార్థం కుక్కల సెంట్రల్ నెర్వస్ సిస్టమ్‌ను దెబ్బతీస్తుందట.
  • మిల్క్ చాక్లెంట్లంటే ప్రపంచవ్యాప్తంగా మోజే కానీ, మగవారు ఎక్కువ డార్క్ చాక్‌లెట్లనే ఇష్టపడతారని ఓ సర్వేలో తేలింది.
  • ఏటా ప్రపంచవ్యాప్తంగా ఏడు బిలియన్ డాలర్ల విలువైన చాక్‌లెట్లు ఖర్చయిపోతున్నాయి.
  • అర కిలో చాక్లెట్ తయారీకి సుమారు 400 కకోవా గింజలు కావాలి. ఏటా ఆరు లక్షల టన్నుల గింజల్ని చాక్లెట్ల కోసం వాడుతున్నారు.
  • శక్తి కోసం నెపోలియన్ వెంట ఎప్పుడూ ఓ చాక్లెట్ ఉండేదట. జ్ఞాపకశక్తి పెరిగేందుకు రోజూ చాక్లెట్ పూత పూసిన 3 వెల్లుల్లి రెబ్బల్ని ఉదయాన్నే తినేవాడట రూజ్‌వెల్ట్.
  • లండన్‌లోని ఆర్చిపెలాగో రెస్టారెంట్ మెనూలో చాక్లెట్ పూతపూసిన తేళ్లు ఉంటాయి.
  • లిథ్వేనియాలోని విల్నియిస్‌లో ఆక్రోపాలిస్ షాపింగ్‌మాల్‌లో వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ చాక్లెట్ రూమ్‌ని ఏర్పాటు చేసింది. పైకప్పు నుంచి ఫ్లోరింగ్ వరకూ అందులో అన్నీ చాక్లెట్ నిర్మితాలే. ఇది కేవలం చూసేందుకే. గొడివా కంపెనీ కూడా చాక్లెట్ రూమ్‌ని ఏర్పాటు చేసింది. సోఫాలో కూర్చుని మరీ ఆ గదిలోని చాక్లెట్ అందాలను ఆస్వాదించవచ్చు.
  • ఆనందాన్ని పంచేందుకో పెంచుకునేందుకో చాక్లెట్ తినే సందర్భాల నుంచి అన్నింటా చాక్లెట్ అనే సంస్కృతి భారతీయులకీ అలవాటైపోయింది. హాట్ చాక్లెట్ ఫౌంటెయిన్లతోపాటు చాక్‌టెయిల్సూ, చాక్‌షేకులూ, చాకొపిజ్జాలూ, శాండ్‌విచ్‌లతో కూడిన చాక్లెట్‌రూమ్‌లు భారత నగరాల్లోనూ ఉన్నాయి. ఔత్సాహిక వంటగాళ్ళు అయితే చాక్లెట్ కేకులూ కుకీలూ డెజర్ట్‌లూ బిస్కెట్లూ డ్రింకులూ ఐస్‌క్రీములూ, పాప్‌కార్న్‌లతో పాటు లడ్డూలూ ఇడ్లీలూ దోసెలూ సమోసాలక్కూడా చాక్లెట్ రుచులు అద్దేస్తున్నారు.
  • ప్రతి సంవత్సరం జూలై 7న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ చాక్లెట్ దినోత్సవం (అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవం) నిర్వహించబడుతుంది.[2][3]

ఇవి కూడ చూడండి

[మార్చు]

నోసిల్లా

మూలాలు

[మార్చు]
  1. Davide Castelvecci, Chocalate: Mixing the bitter treat with milk was the popular breakthrough, Scientific American, p 96, September 2009
  2. ఈనాడు, హాయ్ బుజ్జీ (16 February 2019). "తియ్యగా తిందాం... కమ్మగా విందాం!". www.eenadu.net. Archived from the original on 18 February 2019. Retrieved 7 July 2020.
  3. నమస్తే తెలంగాణ, జాతీయం (7 July 2020). "చాక్లెట్ డేను ఈ రోజే.. ఎందుకు జ‌రుపుకుంటారు?". ntnews. Archived from the original on 7 July 2020. Retrieved 7 July 2020.

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చాకొలెట్&oldid=4344832" నుండి వెలికితీశారు