చాగంటి సోమయాజులు
చాగంటి సోమయాజులు | |
---|---|
![]() చాగంటి సోమయాజులు (చాసో) | |
జననం | చాగంటి సోమయాజులు 1915,జనవరి 15 శ్రీకాకుళం |
మరణం | 1994 జనవరి 1 | (వయసు: 78)
ఇతర పేర్లు | చాసో |
ప్రసిద్ధి | తెలుగు రచయిత |
చాగంటి సోమయాజులు (1915, జనవరి 15 - 1994 జనవరి 1) ప్రముఖ తెలుగు రచయిత. చాసోగా అందరికీ సుపరిచితుడు. ఆయన మానవతావాదిగా ప్రారంభమై, మార్క్సిస్టుగా మారి, కథల్లో ప్రగతిశీల విలువలు, పీడిత ప్రజల బాధలు, సమస్యలు గురించి విస్తృతంగా రచనలు చేశాడు.[1]
ఈయన మొట్ట మొదటి రచన చిన్నాజీ 1942లో భారతి అనే పత్రికలో ప్రచురితమైంది. ఆ తరువాత ఎన్నో కథలు, కవితలు రాశాడు. ఈయన రాసిన చాలా కథలు హిందీ, రష్యన్, కన్నడ, మరాఠి, మలయాళం, ఉర్దూ భాషలలోకి అనువదించబడ్డాయి. 1968లో చాసో కథలుగా పుస్తక రూపంలో చాసో కథా సంకలనం వెలువడింది. ఆయన 70వ జన్మదిన సందర్భంగా కొద్ది మంది ముఖ్యమైన రచయతల కథలు సంకలనం చేశాడు.
ఈయన స్నేహితులైన శ్రీ శ్రీ, శ్రీరంగం నారాయణ బాబు, రోణంకి అప్పలస్వామి వంటి వారిని ప్రభావితం చేశాడు.
జీవిత చిత్రం
[మార్చు]1915 జనవరి 17 న శ్రీకాకుళంలో కానుకొలను లక్ష్మీనారాయణ శర్మ, తులసమ్మ లకు చాగంటి సోమయాజులు జన్మించాడు. తులసమ్మ అనబడే పెదతల్లికి దత్తుడిగా విజయనగరం వెళ్ళాడు. నాగావళీ తీరంలో పైరుపచ్చల మధ్య బాల్యం గడిచింది. చాసో అయిదోఫారం వరకు శ్రీకాకుళంలో చదివాడు. విజయనగరం ఉన్నత పాఠశాలలో ఎస్.ఎస్.ఎల్.సి. పూర్తి చేసి మహారాజా కళాశాల విజయనగరంలో పైచదువులు చదివాడు.
కళాశాల విద్యార్థిగానే ఆయన కవితారచనకి శుభారంభం పలికాడు. తొరుదత్, సరోజినీ నాయుడు ల కవిత్వం, లియో టాల్‌స్టాయ్, మాక్సిం గోర్కీ ల కళాత్మక వ్యక్తీకరణ, ప్రగతిశీల మార్క్సిస్టు దృక్పథం చాసోను ప్రభావితం చేశాయి. సృజనాత్మక ప్రక్రియలైన కథ, కవిత్వం, రెండింటినీ దాదాపు ఒకే సమయంలో వ్రాస్తూ వచ్చినా తర్వాతి కాలంలో ఆయన కథా రచనకే ప్రాధాన్యమిచ్చాడు.
అభ్యుదయ సాహిత్యోద్యమ వేదిక, అభ్యుదయ రచయితల సంఘం మొదటి మహాసభలు తెనాలిలో 1943లో జరిగాయి. ఆనాటి నుంచి కన్నుమూసే వరకూ ఆయన ‘అరసం’లోనే ఉంటూ కార్యకర్తగా నాయకునిగా తెలుగునాట అభ్యుదయ సాహిత్య ఉద్యమానికి విశేష సేవలందించారు.
చాసో 1994 జనవరి 1 న మరణించాడు. మరణానంతరం తన భౌతికకాయాన్ని మెడికల్ కాలేజీకి పరిశోధనల నిమిత్తం ఇమ్మని కోరటం ఆయన అభ్యుదయ జీవన దృక్పథానికి నిదర్శనం.
రచనలు
[మార్చు]చాసో కథలలో వస్తువూ, శిల్పమూ పోటాపోటీగా సాగుతాయి. చాసో కథా నిర్మాణంలో వైశిష్ట్యం ఏమంటే చాసో కథ ద్వారా ఏదీ వాచ్యంగా చెప్పడు. అచ్చులో చాసో తొలికవిత ‘ధర్మక్షేత్రము’ భారతి 1941 జూన్ సంచికలో వెలువడింది . తొలి కథ చిన్నాజీ 1942 భారతి పత్రికలో ముద్రించబడింది..
వర్తమాన సమాజంలో వైరుద్ధ్యాలు, ఆర్థిక సూత్రాలే మానవ సంబంధాలలో, మనిషి మనుగడలో కీలకపాత్ర నిర్వహిస్తాయనే సత్యాన్ని అలవోకగా ‘కాందిశీకుడు’ కవిత( రచనాకాలం: 1937-40) ఆవిష్కరించింది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో బర్మాపై జపాన్ బాంబు దాడులు జరిపాక, బర్మా నుండి అనేక తెలుగు కుటుంబాలు కట్టుబట్టలతో కాలినడకతో స్వగ్రామాలు చేరినప్పుడు ఇక్కడి దుర్భరస్థితిని ఒక తల్లి హృదయావేదనగా చాసో అక్షరీకరించాడు. ‘నమ్ముకున్న పుడమితల్లి, కట్టుకున్న భార్య రెండూ అతడికి కాకుండా పోయాయని’, చివరికి ‘పొయి లో నిప్పులేదు, నీకేం పెట్టేది నా నాయనా’ అనే తల్లి విలాపం పఠితను కన్నీళ్ళు పెట్టిస్తుంది.
కుంకుడాకు
[మార్చు]ఆయన రాసిన కథ 'కుంకుడాకు' లో కథానాయిక ‘గవిరి’ ఎనిమిదేళ్ళ బాలిక. 1943 ఫిబ్రవరిలో పుట్టిన. ఒక కూలివాడి కూతురు. తల్లిదండ్రులు కూలికెడితే కర్రా, కంపా ఏరి ఇంటికి ఒకపూట వంట చెరకు తేవాల్సిన బాధ్యత ఆమె నెత్తిమీదుంది. అందుకే ఊళ్లోంచి పొలానికి బయల్దేరింది. వెంట మోతుబరి రైతు కూతురు పారమ్మ కూడా ఉంది.
"ఊళ్ళో బడిపిల్లలు ప్రార్థన మొదలుపెట్టేరు. 'తల్లీ నిన్ను దలంచి...' అని మేష్టారందిస్తున్నారు. 'తల్లీ నిన్ను దలంచి' అని పిల్లలంతా ఒక్కమాటు వూరెగర గొడుతున్నారు. ఆకులూ, కంపలూ ఏరుకుంటున్న ‘గవిరి’ని చెయ్యని నేరానికి భుక్తగారు పాంకోడు తీసి విసురుతాడు. అది గవిరి పిక్కమీద ఎముకకి తగిలి- ‘పీక తెగ్గోసిన కోడిలాగ గిలగిల కొట్టుకొని చుట్టుకుపోయింది’. ఏడ్చి ఏడ్చి కళ్ళు తెరిస్తే- పొద్దు లేచిపోవటం- బడిలో పిల్లలు ఎక్కాలు వల్లె వేయటం వినబడుతోంది. లేచి కళ్ళంలోని కుంకుడాకుని పోగుచేసి తట్టలోకి ఎత్తింది. ఎమికమీద పాంకోడు దెబ్బ బాధ ‘ఓలమ్మో’ అంటూ మర్లా ఉక్కిరి బిక్కిరిగా ఏడ్చుకుంటూ గోర్జిలోకి వెళ్ళింది. బడి పిల్లలింకా ఎక్కాలు చదువుతున్నారు.
‘పదహారార్లు తొంభైయారు’ అని ఒకరు అరుస్తున్నారు. ‘పదాహారార్లు తొంభైయారు’ అని అంతా కలిసి పాడుతున్నారు."
గోచీపాత పెట్టుకున్న ఎనిమిదేళ్ళ గవిరి రోషంతో, ఆత్మాభిమానంతో భుక్తకి చెప్పిన సమాధానం ద్వారా వ్యవస్థ వికృత స్వరూపం మనకు దృశ్యమానమౌతోంది.
కొన్ని ఇతర రచనలు, సజీవ పాత్రలు
[మార్చు]- 'ఎందుకు పారేస్తాను నాన్నా' : దిగువ తరగతి ప్రజల స్థితిగతులకు అద్దం పడుతున్న చిన్నారి.
- 'చిన్నాజీ': ‘వెన్నెట్లో రేరాణి వాసనలా నీ మువ్వలమాటలు వింటాడే’ అంటూ పాడుతూ వచ్చే చిన్నాజీ.
- 'వాయులీనం' : ‘తల్లి వెళ్ళిపోయింది... వెళ్ళిపోతూ తల్లి గుణాన్ని చూపించుకుంది’ అంటూ ఇంటి ఖర్చులకుగాను తన ఫిడేలు అమ్మి తనకి చీరకూడా తెచ్చిన భర్త వంక అనారోగ్యంతో బాధపడుతూ గుడ్లనిండా నీళ్ళు నింపుకుని చూస్తున్న రాజ్యము.
- 'కుక్కుటేశ్వరం': ‘పదండి భడవల్లారా... నేనే దొంగ మార్కెట్‌లో అమ్ముకొని మేడలు కడుతున్నా ను. నాకు ఉరిశిక్ష తక్కువ వెయ్యకండి... నా పొగ కుక్కుటేశ్వరుడికి ధూపం వెయ్యండి’ అంటూ బియ్యపుమూటని భుజాన కెత్తుకొని రైల్వే ఉద్యోగుల వెంట వెళ్తున్న ముసలమ్మ.
కథా సంకలనాలు
[మార్చు]చాసో కథల రెండో కూర్పు విశాలాంధ్ర ప్రచురణాలయం 1983లో ముద్రించింది. ఇందులో మొత్తం 40 కథలున్నాయి.
పురస్కారాలు
[మార్చు]- 1987లో ఆంధ్రపదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ వారిచే కొండేపూడి సాహితీ సత్కారాన్ని అందుకున్నాడు.[2]
స్మరణలు
[మార్చు]1995 నుంచి చాసో కుటుంబ సభ్యులు ‘చాసో స్ఫూర్తి’ పేరు ఒక ట్రస్ట్ నెలకొల్పి, ప్రతి ఏటా చాసో జన్మదినం జనవరి 17న సృజనాత్మక సాహిత్య వికాసానికి, నిబద్ధతతో కృషి చేస్తున్న అభ్యుదయ రచయితలలో ఒకరికి ‘చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారం’ అందిస్తున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "Modern storyteller". The Hindu (in Indian English). 2012-01-12. ISSN 0971-751X. Retrieved 2025-03-07.
- ↑ పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284.
యితర లింకులు
[మార్చు]- CS1 Indian English-language sources (en-in)
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- 1915 జననాలు
- 1994 మరణాలు
- తెలుగు రచయితలు
- తెలుగు కథా రచయితలు
- శ్రీకాకుళం జిల్లా రచయితలు
- కొండేపూడి సాహితీ సత్కార గ్రహీతలు