చార్‌ధామ్
చార్ ధామ్ బద్రీనాథ్ • రామేశ్వరం ద్వారక • పూరీ |
---|
భారతదేశంలోని నాలుగు సుప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, ద్వారక, పూరీ, రామేశ్వరం లను కలిపి చార్ ధామ్ గా వ్యవహరిస్తారు. ఆదిశంకరాచార్యులచే స్థాపించబడిన ఈ క్షేత్రాలలో మూడు వైష్ణవ క్షేత్రాలు, ఒక శైవ క్షేత్రము ఉంది. కాలక్రమేణా చార్ ధామ్ అనే పదము హిమాలయాలలోని పుణ్యక్షేత్రాలను ఉద్దేశించేదిగా వ్యవహారంలోకి వచ్చింది.
చరిత్ర
[మార్చు]మూలాధారాలు లేనప్పటికీ భారతదేశంలో హిందూమత వ్యాప్తికి విస్తృతంగా కృషిచేసిన ఆది శంకరాచార్య ఈ నాలుగు పుణ్యక్షేత్రాలకు చార్‌ధాం హోదాను ఆపాదించాడు. ఈ నాలుగు ఆలయాలు భారతదేశం యొక్క నాలుగు వైపులా ఏర్పడటం గమనార్హం. ఉత్తరాన బద్రీనాథ్ ఆలయం, తూర్పున పూరీ లోని జగన్నాథ ఆలయం, పశ్చిమాన ద్వారక లోని ద్వారకాధీశ ఆలయం, దక్షిణాన రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయం స్థాపితమై ఉన్నాయి. సిద్ధాంతపరంగా ఈ దేవాలయాలు శైవమతానికి, వైష్ణవ శాఖలకు మధ్య విభజించబడి ఉన్నప్పటికీ, చార్ ధామ్ తీర్థయాత్ర ఒక హిందూ మతం వ్యవహారంగా భావింపబడుతుంది. 20వ శతాబ్ద మధ్యకాలం నుండి హిమాలయా పర్వత సానువులలో ఉన్న బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను కలిపి ఛోటా చార్‌ధామ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ యాత్ర ద్వారా ఉత్తరాఖండ్ పర్యాటకం అత్యధికంగా లాభపడుతున్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యాత్రను బాగా ప్రోత్సహిస్తున్నది.
పుణ్యక్షేత్రాలు
[మార్చు]బద్రీనాథ్ ఆలయం
[మార్చు]ఈ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్హ్వాల్ పర్వతశ్రేణులలో అలకనంద నది ఒడ్డున ఉంది. ఈ పట్టణం నీలకంఠ పర్వత శ్రేణులలోని నర నారాయణ పర్వత సానువుల మధ్యన 6,560 మీటర్ల ఎత్తులో ఉంది.
ద్వారకాధీశ ఆలయం
[మార్చు]ఈ ఆలయం భారతదేశ పశ్చిమాన గుజరాత్ రాష్ట్రంలో స్థాపించబడింది. ఈ నగరం నామం ద్వార్ (వాకిలి) అనే సంస్కృత పదం నుండి జనించింది. ఈ నగరం గోమతి నది సమీపంలో, నది సముద్రంలో సంగమించే కచ్ సింధుశాఖ వద్ద స్థాపితమైంది. ఈ గోమతి నది, గంగా నదికి ఉపనదిగా భావించే గోమతి నది, ఒక్కటి కావు.
పూరీ జగన్నాథ ఆలయం
[మార్చు]ఈ నగరం భారతదేశ తూర్పు భాగంలో ఒడిషా రాష్ట్రంలో స్థాపితమైంది. ఈ నగరం భారతదేశ అతి ప్రాచీన తూర్పు నగరాలలో ఒకటి. ఇది బంగాళాఖాతం ఒడ్డున ఉంది.
రామనాథస్వామి ఆలయం
[మార్చు]రామేశ్వరము భారతదేశ దక్షిణాన తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇది భారతదేశ ద్వీపకల్ప చివరి భాగంలో మన్నార్ సింధుశాఖ వద్ద ఉంది. పురాణాల ప్రకారం శ్రీరాముడు ఈ ప్రదేశం నుండే రామసేతు నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఇది శైవులకు అంకితమైన ప్రముఖ దేవాలయం. శ్రీరాముడు ఈ ఆలయాన్ని స్థాపించాడని ప్రతీతి..