చుంబీ లోయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చుంబీ లోయ
డ్రోమో, ట్రోమో, జూమో
1938 లో చుంబీ లోయ
1938 లో చుంబీ లోయ
ఫ్లోర్ ఎత్తు3,000 మీ. (9,800 అ.)
Long-axis directionఉత్తర-దక్షిణ
భూగోళ శాస్త్ర అంశాలు
ప్రదేశంఈశాన్య భారతదేశం
పట్టణ లేదా నగర కేంద్రంఫారీ, యాటుంగ్
నదీ ప్రాంతంఅమో ఛు

చుంబీ లోయ, హిమాలయాలలో టిబెట్ పీఠభూమి నుండి దక్షిణం వైపుగా సిక్కిం, భూటాన్‌ల మధ్య విస్తరించి ఉండే లోయ. టిబెట్లో దీన్ని డ్రోమో అని, ట్రోమో అనీ అంటారు. ఇది టిబెట్ అటానమస్ రీజియన్లోని యాడాంగ్ కౌంటీ పరిపాలనా విభాగంలో ఉంది.[2] చుంబీ లోయ నాథూ లా, జెలెప్ లా పర్వత కనుమల ద్వారా నైరుతి దిశలో సిక్కింకు అనుసంధానించబడి ఉంది.

ఈ లోయ సముద్ర మట్టం నుండి 3,000 మీ. (9,800 అ.) మీ (9,800 అడుగులు) ఎత్తున ఉంది. హిమాలయాలకు దక్షిణాన ఉన్నందున, ఇక్కడ టిబెట్లోని చాలా ప్రాంతాల కంటే తడిగా, సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది. ఈ లోయలో తూర్పు హిమాలయాల్లోని వెడల్పాటి ఆకులుండే అడవుల రూపంలో కొంత వృక్షసంపద ఉంటుంది. పెడిక్యులారిస్ చుంబికా అనే మొక్కకు ఈ లోయ పేరిటే ఆ పేరు పెట్టారు. 1904 లో బ్రిటిషు భారతదేశానికి చెందిన యంగ్ హస్బెండ్ సాహసయాత్ర ల్హాసాకు వెళ్లే మార్గంలో చుంబీ లోయ గుండానే వెళ్ళింది. దండయాత్ర ముగింపులో, యుద్ధ నష్టపరిహారానికి బదులుగా బ్రిటిషు వారు చుంబీ లోయను స్వాధీనం చేసుకున్నారు. టిబెటన్లు చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని మూడు వాయిదాలలో చెల్లించడానికి చైనా అంగీకరించడంతో, చుంబీ లోయను 1908 ఫిబ్రవరి 8 న తిరిగి టిబెట్‌కు ఇచ్చేశారు.[2][3]

భౌగోళికం

[మార్చు]
మ్యాప్ 1: 1888 లో చైనా సామ్రాజ్యం మ్యాప్ (ఎడ్వర్డ్ స్టాన్‌ఫోర్డ్). భూటాన్‌తో సరిహద్దుల వరకు కుదించబడింది. దాని పశ్చిమాన ఉన్న చుంబీ లోయ, తూర్పున తవాంగ్ ప్రాంతాన్ని బ్రిటీష్ వారు హిమాలయాలలో "ప్రమాదకరమైన చీలికలు"గా పరిగణించారు.
మ్యాప్ 2: చుంబీ వ్యాలీ మ్యాప్ ( AMS, 1955)

చుంబీ లోయ త్రిభుజాకారంలో, ఉత్తరాన విశాలమైన ద్వారంతో ఉంటుందని జోసెఫ్ డాల్టన్ హుకర్ వర్ణించాడు. దీనికి పశ్చిమాన చోలా శ్రేణి "గిప్మోచి"[a], తూర్పున "కాంఫీ లేదా చాకూంగ్ శ్రేణి" సరిహద్దులుగా ఉన్నాయని, ఇది "చుములారి" (చోమోల్హరి) కు ఆనుకుని ఉంటుందని ఆయన భావించాడు.[4] ఈ పేర్లు తరువాతి సాహిత్యంలో కనిపించవు, కానీ 20వ శతాబ్దం మధ్యకాలంలోని మ్యాపుల్లో తూర్పు సరిహద్దును "మసాంగ్ క్యుంగ్డు శ్రేణి" గా ఖుందుగాంగ్ శిఖరం (27°32′38′′N 89°06′57′′E/27.5438 °N 89.1159 °E/ అందులోని రెండవ ప్రధాన శిఖరంగా గుర్తించారు.[5]

టిబెట్‌కు చెందిన చుంబీ లోయ (ప్రస్తుతం ఇది చైనాలో భాగం) పశ్చిమాన సిక్కిం, తూర్పున భూటాన్ - ఈ రెండు హిమాలయ రాజ్యాల మధ్య ఉంది: సిక్కిం, భూటాన్‌లను భారత ఉపఖండంలో భాగంగా, దక్షిణాసియాలో భాగంగా ఉన్నాయి. సిక్కిం భారతదేశ రాష్ట్రంగా విలీనమైంది.

వ్యూహాత్మక ప్రాముఖ్యత

[మార్చు]
మ్యాప్ 3: నేపాల్, బంగ్లాదేశ్ మధ్య భారతదేశపు సిలిగురి కారిడార్ వైపు చూపుతున్న టిబెట్ లోని చుంబీ లోయ

చైనా లోని చుంబీ లోయ, దానికి దక్షిణాన ఉన్న భారతదేశ సిలిగురి కారిడార్‌లు "ప్రపంచ ఆధిపత్య పోటీలో కీలకమైన వ్యూహాత్మక పర్వతీయ చోక్పాయింట్లలో" ఒకటిగా సుసాన్ వాల్కాట్ పరిగణించింది.[6] జాన్ గార్వర్ చుంబీ లోయను "మొత్తం హిమాలయ ప్రాంతంలో వ్యూహాత్మకంగా అత్యంత ముఖ్యమైన రియల్ ఎస్టేట్" అని వర్ణించాడు.[7] హిమాలయాలకు దక్షిణాన చుంబీ లోయ సిక్కిం, భూటాన్‌ల మధ్య విస్తరించి, భారతదేశంలోని సిలిగురి కారిడార్ వైపు "బాకు" లాగా చొచ్చుకుని ఉంటుంది. సిలిగురి కారిడార్, భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నేపాల్, బంగ్లాదేశ్‌ల మధ్య 24 కిలోమీటర్ల వెడల్పు గల ఇరుకైన కారిడార్. ఇది మధ్య భారతదేశం లోని ప్రాంతాలను అరుణాచల్ ప్రదేశ్ సహా ఈశాన్య రాష్ట్రాలతో కలుపుతుంది. "కోడి మెడ" గా పేరున్న సిలిగురి కారిడార్ భారతదేశానికి వ్యూహాత్మక ముప్పు ప్రాంతం. భూటాన్ కు సంబంధించి దీనికి కీలకమైన వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉంది. దేశంలోని ప్రధాన సరఫరా మార్గాలు దీనిగుండానే ఉన్నాయి.[6][8][9][10]

చారిత్రికంగా సిలిగురి, చుంబీ లోయ రెండూ భారతదేశం టిబెట్‌ల మధ్య వాణిజ్య రహదారిలో భాగంగా ఉండేవి. 19 వ శతాబ్దంలో, బ్రిటిషు భారత ప్రభుత్వం బ్రిటిషు వాణిజ్యం కోసం ఈ మార్గాన్ని తెరవడానికి ప్రయత్నించింది. ఇది సిక్కింపైన, దాని వ్యూహాత్మక నాథు లా, జెలెప్ లా కనుమల పైనా వారి ఆధిపత్యానికి దారితీసింది. 1890 నాటి ఆంగ్లో-చైనీస్ ఒప్పందం, యంగ్ హస్బెండ్ దండయాత్ర తరువాత, బ్రిటిష్ వారు యాతుంగ్, లాసా వాణిజ్య స్థావరాలను, వాటిని రక్షించడానికి సైనిక దళాలనూ ఏర్పాటు చేశారు. ఈ వాణిజ్య సంబంధాలు 1959 లో చైనా ప్రభుత్వం వాటిని రద్దు చేసేవరకూ కొనసాగాయి.[6][11][12]

చుంబీ లోయలో చైనా స్థిరమైన సైనిక నిర్మాణాలను చేస్తోందని, అనేక రక్షణ దళాలను నిర్మించిందని, లోయను బలమైన సైనిక స్థావరంగా మారుస్తోందని భారత నిఘా అధికారులు పేర్కొన్నారు.[13] 1967 లో నాథూ లా, చో లా కనుమల వద్ద సరిహద్దు ఘర్షణలు జరిగాయి. ఆ ఘర్షణల్లో , భారతీయులు ఎత్తైన మైదానాన్ని నియంత్రించి, అనేక చైనీస్ స్థావరాలను నాశనం చేసారని టేలర్ ఫ్రావెల్ పేర్కొన్నాడు.[14] వాస్తవానికి, చుంబీ లోయలో భారత, భూటాన్ దళాలకు లోయ చుట్టూ ఉన్న ఎత్తులపై నియంత్రణ ఉన్నందున చైనా సైన్యం బలహీనమైన స్థితిలో ఉందని భావిస్తారు.[15][16]

ఎత్తులను అదుపు లోకి తెచ్చుకోవాలన్న కోరిక వలన చైనా చుంబీ లోయ దక్షిణ సరిహద్దు వద్ద ఉన్న డోక్లామ్ పీఠభూమికి వస్తుందని భావిస్తున్నారు.[17] డోక్లామ్ పీఠభూమి నియంత్రణ వల్ల చైనాకు మూడు వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయని భారత భద్రతా నిపుణులు పేర్కొన్నారు. మొదట, ఇక్కడి నుండి చుంబీ లోయ సవివరంగా కనిపిస్తుంది. రెండవది, ఇది సిక్కింలోని భారత రక్షణపై పైచేయి సాధిస్తుంది. ఇవి ప్రస్తుతం ఈశాన్య దిశలో డోంగ్క్యా శ్రేణి వైపు ఉన్నాయి. మూడవది, ఇక్కడి నుండి దక్షిణాన ఉన్న వ్యూహాత్మక సిలిగురి కారిడార్‌ కనిపిస్తుంది. గిప్మోచి పర్వతం, జోంపెల్రి పర్వతశ్రేణిపై అదుపు తెచ్చుకుంటే చైనీయులు హిమాలయాల అంచుకు చేరుకుంటారు. అక్కడ నుండి వాలుల్లో భూటాన్, భారతదేశాల దక్షిణ పర్వత ప్రాంతాల్లోకి దిగగలరు. ఇక్కడి నుండి చైనా, మైదానాల్లో భారత దళాల కదలికలను పర్యవేక్షించగలదు లేదా యుద్ధం జరిగినప్పుడు ముఖ్యమైన సిలిగురి కారిడార్పై దాడి చేయగలదు. న్యూ ఢిల్లీకి, ఇది "వ్యూహాత్మక రెడ్లైన్" . [15][18][19] "భారత సైన్యానికి దాని వ్యూహాత్మక ప్రాముఖ్యత స్పష్టంగా తెలుసు" అని కరోలిన్ బ్రాసార్డ్ చెప్పింది.[20]

చరిత్ర

[మార్చు]
డుంగ్కర్ మొనాస్టరీ, యాతుంగ్‌కు ఉత్తరాన 6 మైళ్ల దూరంలో ఉంది. 1927 జనవరి 1 న తీసిన ఫోటో.

సా.శ. మొదటి సహస్రాబ్దిలో చుంబీ లోయ టిబెట్, భారతదేశాల మధ్య వాణిజ్య మార్గంగా ఉపయోగించబడిందని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. భారతదేశానికి వెళ్లే రహదారిపై నియంత్రణను భారతీయ గురువైన "ఆర్యదేవ", యోంటెండ్రాక్ అనే పేరుగల లోట్సావాకు ఇచ్చినట్లు చెప్పబడింది.

క్రీ. శ. 1206 లో, బఖ్తియార్ ఖిల్జీ చుంబీ లోయ గుండా టిబెట్‌పై దండయాత్ర చేసాడు. అక్కడ అతను టిబెటన్ల చేతిలో ఓడిపోయి, వెనక్కి వెళ్ళవలసి వచ్చింది.[21]

ఈ వాస్తవం 14వ శతాబ్దానికి చెందిన గ్రంథాలలో ప్రస్తావించబడింది .[22] 14వ శతాబ్దం మధ్యకాలంలో శాక్య పాలక ప్రతినిధి ఫక్పా బాల్జాంగ్ (ఫాగ్స్-పా-దపాల్-బ్జాంగ్) పేరిట మరింత స్పష్టమైన ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అతను పారో, హా తదితర ప్రదేశాల నుండి 150 మంది నాయకులను, గురువులనూ ఫరీలో విందు కోసం ఆహ్వానించి వారందరినీ చంపేశాడు. దీని తరువాత, ఈ ప్రాంతాలు అతని నియంత్రణలోకి వచ్చాయి. అతను ఫారి వద్ద ఒక జోంగ్‌ను, వాణిజ్య మార్కెట్లనూ నిర్మించాడని, తన తమ్ముడు ఫక్పా రిన్చెన్ ('ఫాగ్స్-పా-రిన్-చెన్') ను మొదటి జిల్లా గవర్నరుగా నియమించాడనీ తెలుస్తోంది.[22] దీని తరువాత పశ్చిమ భూటాన్ పై నియంత్రణ గురించి ప్రస్తావన లేదు గానీ, ఫారి వర్తక సంత మాత్రం 18వ శతాబ్దం వరకూ బాగానే కొనసాగింది.[22]

సిక్కిం సంప్రదాయం ప్రకారం, 1642 లో సిక్కిం రాజ్యం స్థాపించబడినప్పుడు, ఇందులో చుంబీ లోయ, తూర్పున హా లోయ, అలాగే దక్షిణాన డార్జిలింగ్, కాలింపాంగ్ ప్రాంతాలు ఉన్నాయి. 18 వ శతాబ్దంలో సిక్కిం భూటాన్ నుండి పదేపదే దాడులను ఎదుర్కొంది. ఈ ప్రాంతాలు తరచుగా చేతులు మారాయి. 1780 లో భూటాన్ చేసిన దాడి తరువాత, ఒక పరిష్కారం కుదిరింది. దీని ఫలితంగా హా లోయ, కాలింపాంగ్ ప్రాంతాలను భూటాన్‌కు బదిలీ చేశారు. ఈ ప్రాంతాల మధ్య ఉన్న డోక్లామ్ పీఠభూమి ఈ భూభాగాలలో భాగంగా ఉండి ఉండవచ్చు. చుంబీ లోయ అప్పటికే సిక్కిం నియంత్రణలో ఉందని తెలుస్తోంది.[11][23]

చరిత్రకారులు ఈ కథనాన్ని సమర్థించారు, తొలి సిక్కిం రాజ్యం ఆధునిక సిక్కిం లోని పశ్చిమ భాగానికే పరిమితమై ఉందని సౌల్ ముల్లార్డ్ పేర్కొన్నాడు. తూర్పు భాగం స్వతంత్ర నాయకుల నియంత్రణలో ఉండేది. వారు భూటానీలతో సరిహద్దు వివాదాలను ఎదుర్కొని, కాలింపాంగ్ ప్రాంతాన్ని కోల్పోయారు.[24] చుంబీ లోయను సిక్కిం ప్రజలు స్వాధీనం చేసుకున్నారా అనేది అనిశ్చితంగా ఉంది. కానీ టిబెటన్లు అక్కడ భూటాన్ చొరబాట్లను అడ్డుకున్నట్లు తెలుస్తోంది.[25]

1756 లో గూర్ఖాల ఆధ్వర్యంలో నేపాల్ ఏకీకరణ తరువాత, నేపాల్, భూటాన్‌లు పరస్పర సమన్వయంతో సిక్కింపై దాడులు చేశాయి. 1774 లో ఆంగ్లో-భూటానీస్ ఒప్పందం కుదరడంతో భూటాన్ ఈ పోటీ నుండి వైదొలగింది.[26] సిక్కిం, నేపాల్‌ల మధ్య ఒక ఒప్పందాన్ని టిబెట్ కుదిర్చింది. ఇది నేపాల్‌కు ఇబ్బంది కలిగించినట్లు చెబుతారు. దీని తరువాత, 1788 నాటికి నేపాల్, తీస్తా నదికి పశ్చిమాన ఉన్న సిక్కిం ప్రాంతాలన్నింటినీ అలాగే టిబెట్లోని నాలుగు ప్రావిన్సులనూ ఆక్రమించింది.[25] టిబెట్ చివరికి చైనా సహాయం కోరింది, ఫలితంగా 1792 లో చైనా-నేపాల్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంతో చైనా, హిమాలయ రాజకీయాల్లోకి నిర్ణయాత్మకంగా ప్రవేశించింది. విజయవంతమైన చైనా జనరల్ భూ సర్వేను ఆదేశించాడు, ఈ ప్రక్రియలో చుంబీ లోయ టిబెట్లో భాగంగా ప్రకటించారు.[13] యుద్ధం తరువాత తమకు జరిగిన నష్టాలపై సిక్కిం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.[24]

తరువాతి దశాబ్దాలలో సిక్కిం బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీతో సంబంధాలను ఏర్పరచుకుని, ఆంగ్లో-నేపాలీ యుద్ధం తరువాత కోల్పోయిన తన భూభాగాన్ని తిరిగి పొందింది. అయితే, బ్రిటిష్ వారితో సంబంధాలు గడ్డుగానే ఉండిపోయాయి. సిక్కిం ప్రజలు టిబెట్ పట్ల విధేయతను కొనసాగించారు. 1861 లో తుమ్లాంగ్ ఒప్పందం ద్వారా బ్రిటిషు వారు తమ ఆధిపత్యాన్ని అమలు చేయడానికి ప్రయత్నించారు. 1890 లో టిబెట్‌పై ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు భావించిన చైనీయులతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ద్వారా సిక్కిం నుండి టిబెటన్లను మినహాయించాలని వారు ప్రయత్నించారు. ఆంగ్లో-చైనీస్ ఒప్పందం సిక్కింను బ్రిటిషు రక్షిత ప్రాంతంగా గుర్తిస్తూ, "మౌంట్ గిప్మోచి" నుండి మొదలయ్యే తీస్తా నది ఉత్తర పరీవాహక ప్రాంతాన్ని సిక్కిం టిబెట్ మధ్య సరిహద్దుగా నిర్వచించింది. 1904 లో, బ్రిటిషు వారు టిబెట్‌తో మరో ఒప్పందంపై సంతకం చేశారు, ఇది ఆంగ్లో-చైనీస్ ఒప్పందం లోని నిబంధనలను ధ్రువీకరించింది. ఈ ఒప్పందంలో భాగంగా సిక్కిం, టిబెట్‌ల మధ్య ఏర్పాటు చేసిన సరిహద్దు నేటికీ ఉనికిలో ఉందని జాన్ ప్రెస్కాట్ పేర్కొన్నాడు.[24][27][25][28]

ఇవి కూడా చూడండి

[మార్చు]

గమనికలు

[మార్చు]
  1. "Gipmochi" (Gyemochen) appears prominently in Hooker's writings because its location and height had been known to him, measured earlier by the Survey of India through trigonometric methods from Darjeeling. Hooker himself did not visit Gipmochi. See the page on Gipmochi.

మూలాలు

[మార్చు]
  1. "Brahmaputra River System". Government of Assam, Water Resources.
  2. 2.0 2.1 Powers & Templeman, Historical Dictionary of Tibet (2012)
  3. Great Britain. Foreign Office, East India (Tibet) (1904).
  4. Hooker, Himalayan Journals, Volume 2 (1854).
  5. Karan, Bhutan: A Physical and Cultural Geography (1967), p. 9, "To the southwest of Chomo Lhari, the western slopes of the Khungdugang mountain and Merug La separate Bhutan from the Chumbi valley of Tibet. To the north of Merug La the Torsa river (known as the Amo Chu) cuts across the international boundary."
  6. 6.0 6.1 6.2 Walcott, Bordering the Eastern Himalaya (2010).
  7. Garver, Protracted Contest (2011).
  8. Smith, Bhutan–China Border Disputes and Their Geopolitical Implications (2015).
  9. Van Praagh, Great Game (2003).
  10. Kumar, Acharya & Jacob, Sino-Bhutanese Relations (2011).
  11. 11.0 11.1 Chandran & Singh, India, China and Sub-regional Connectivities (2015).
  12. Aadil Brar (12 August 2017), "The Hidden History Behind the Doklam Standoff: Superhighways of Tibetan Trade", The Diplomat, archived from the original on 22 August 2017
  13. 13.0 13.1 Bajpai, China's Shadow over Sikkim (1999).
  14. Fravel, Strong Borders, Secure Nation (2008).
  15. 15.0 15.1 Lt Gen H. S. Panag (8 July 2017), "India-China standoff: What is happening in the Chumbi Valley?", Newslaundry, archived from the original on 18 August 2017
  16. Ajai Shukla (4 July 2017), "The Sikkim patrol Broadsword", Business Standard, archived from the original on 22 August 2017
  17. "'Bhutan Raised Doklam at All Boundary Negotiations with China' (Interview of Amar Nath Ram)", The Wire, 21 August 2017, archived from the original on 23 August 2017
  18. Ankit Panda (13 July 2017), "The Political Geography of the India-China Crisis at Doklam", The Diplomat, archived from the original on 14 July 2017
  19. Bhardwaj, Dolly (2016), "Factors which influence Foreign Policy of Bhutan", Polish Journal of Political Science, vol. 2, no. 2, p. 30
  20. Brassard, Caroline (2013), "Bhutan: Cautiously Cultivated Positive Perception", in S. D. Muni; Tan, Tai Yong (eds.), A Resurgent China: South Asian Perspectives, Routledge, p. 76, ISBN 978-1-317-90785-5
  21. Nitish K. Sengupta (1 January 2011). Land of Two Rivers: A History of Bengal from the Mahabharata to Mujib. Penguin Books India. pp. 63–64. ISBN 978-0-14-341678-4.
  22. 22.0 22.1 22.2 Ardussi, Bhutan before the British (1977).
  23. Harris, Area Handbook for Nepal, Bhutan and Sikkim (1977).
  24. 24.0 24.1 24.2 Mullard, Opening the Hidden Land (2011).
  25. 25.0 25.1 25.2 Shakabpa, Tibet: A Political History (1984).
  26. Banerji, Arun Kumar (2007), "Borders", in Jayanta Kumar Ray (ed.), Aspects of India's International Relations, 1700 to 2000: South Asia and the World, Pearson Education India, p. 196, ISBN 978-81-317-0834-7
  27. Prescott, Map of Mainland Asia by Treaty (1975).
  28. Phuntsho, The History of Bhutan (2013).
"https://te.wikipedia.org/w/index.php?title=చుంబీ_లోయ&oldid=4305839" నుండి వెలికితీశారు