Jump to content

చెన్నాప్రగడ భానుమూర్తి

వికీపీడియా నుండి
చెన్నాప్రగడ భానుమూర్తి

చెన్నాప్రగడ భానుమూర్తి గొప్ప సంస్కృత విద్వాంసుడు[1]. రచయిత.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

ఇతడు పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరు మండలం, కాళీపట్నం గ్రామంలో కనకాచలం, వెంకమ్మ దంపతులకు 1863, మార్చి నెలలో జన్మించాడు[2]. ఇతని తండ్రి కుమ్మరపురుగుపాలెం గ్రామానికి కరణంగా పనిచేసేవాడు. అమలాపురం, నరసాపురం పట్టణాలలో ఇతని ప్రాథమిక, హైస్కూలు విద్యలు కొనసాగింది. చిలకమర్తి లక్ష్మీనరసింహం, కొండా వెంకటప్పయ్యలు ఇతని సహాధ్యాయులు. తరువాత రాజమండ్రి లోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో గణితశాస్త్రంలో పట్టభద్రుడైనాడు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ మెట్కాఫ్ దొరకు ఇతడు ప్రియశిష్యుడిగా మెలిగాడు. తరువాత ఉపాధ్యాయ శిక్షణ కూడా పొందాడు. ఇతడు స్వయంకృషితో సంస్కృతం నేర్చుకున్నాడు. సంస్కృతంలో సిద్ధాంతకౌముదిని బోధించే స్థాయికి స్వంతంగా ఎదిగాడు.

ఉద్యోగం

[మార్చు]

ఉపాధ్యాయ శిక్షణ తరువాత ఇతడు కొంతకాలం విజయవాడలోని మిషన్ హైస్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. పిమ్మట కొన్ని మాసాలు రెవెన్యూ శాఖలో గుమాస్తాగా పనిచేశాడు. ఆ తరువాత ఇతడు బందరు నోబుల్ కళాశాలలో గణితశాస్త్ర పండితుడిగా పనిచేశాడు. ఆ సమయంలో రఘుపతి వేంకటరత్నం నాయుడు ఇతని సహోద్యోగి. వారిరువురి మధ్య సాన్నిహిత్యం ఉండేది. భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరు కృష్ణారావు మొదలైన వారు ఇతని శిష్యులుగా ఉండేవారు. తరువాత 1909లో మద్రాసు ప్రభుత్వము ఇతడిని తెలుగు ట్రాన్సిలేటర్‌గా నియమించింది. ఇతడు ప్రభుత్వోద్యోగంలో ఉండి కూడా స్వదేశీ ఉద్యమానికి, ఖాదీ ఉద్యమానికి ఆకర్షితుడయ్యాడు. మద్రాసులో ఇతనికి సర్వేపల్లి రాధాకృష్ణన్, కందుకూరి వీరేశలింగం, కొక్కొండ వెంకటరత్నం వంటివారు మిత్రులుగా ఉండేవారు. వేదం వేంకటరాయశాస్త్రి, వేటూరి ప్రభాకరశాస్త్రి, వావిలికొలను సుబ్బారావు మొదలైనవారు సాహిత్యపరమైన సందేహాలను నివృత్తి చేసుకొనేందుకు ఇతడిని సంప్రదించేవారు.

సంఘసంస్కరణ, జాతీయోద్యమం

[మార్చు]

ఇతడు తన మిత్రుడు కొండా వెంకటప్పయ్య ప్రారంభించిన ఆంధ్ర జాతీయకళాశాలకు వెనుక ఉండి ప్రోత్సహించాడు. కృష్ణా పత్రిక బాల్యావస్థలో ఉన్నపుడు తన సహకారం అందజేశాడు. 1905లో వందేమాతరం ఉద్యమ సమయంలో గ్రామగ్రామాలలో తిరిగి జాతీయ భావాలను ప్రచారం చేశాడు. ఆ సమయంలో చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి ఇతనికి సన్నిహితుడయ్యాడు. స్థానికంగా వ్యతిరేకత ఎదురైనా చెన్నాప్రగడ భానుమూర్తి వితంతు వివాహాలను సమర్థించేవాడు.

రచనలు

[మార్చు]
  1. హేమలత[3] (నాటకము)
  2. భారతధర్మదర్శనము
  3. బాలచంద్ర చరిత్రము
  4. మండపాల చరిత్రము
  5. ప్రియదర్శిక (నాటకము)

మూలాలు

[మార్చు]
  1. "ఆంధ్రపత్రిక ఉగాది సంచిక 1914 - పేజీ 251". Archived from the original on 2016-03-05. Retrieved 2020-06-28.
  2. The Great Indian Patriots, Volume 2 - P. Rajeswar Rao - pages 212&213
  3. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో హేమలత పుస్తకప్రతి