జాలరి నృత్యం
- ఈ తరం వారికి తెలియని పడవ పాటలు, జాలారి పాటలు ఎన్నో ఉన్నాయి. ఇవి కంఠస్థంగానే తప్ప, ఈ గ్రంథంలోనూ పొందు పరచలేదు. నలభై సంవత్సరాల క్రితం వరకూ మన రవాణా అంతా నదుల ద్వారా, కాలువల్లో పడవల ద్వారా జరిగేది. గాలి వాటము సరిగా లేనపుడు పడవ సరంగులు, పడవకు కట్టిన తాడుతో పడవను లాగుతూ పాటలు పాడుతు వుండేవారు. ఈ పాటలు జానపద కళారూపాలు. ఏదో ఒక రూపాన ఈ పాటలు ఈ నాటికి కనువిందు చేస్తున్నాయి.
పడవల్లో
[మార్చు]సరకులే కాదు, ప్రయాణీకులు కూడా పడవలలోనే ప్రయాణం చేసే వారు ఆ రోజుల్లో . ఈ నాడు రవాణా అంతా రైళ్ళ ద్వారా, లారీల ద్వారా జరాగటం వల్ల పడవల రవాణా తగ్గి పోయింది. జాలర్లంతా ఈ పడవల ద్వారా జీవించే వారు. అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పడవల రవాణా సాగుతూనే ఉంది. జాలర్ల పడవల్ని తెరచాపలు గట్టి గాలి వాటాన పడవల్ని నడిపేవారు. గాలి లేనప్పుడు పడవ సరంగులు పడవకు తాడు కట్టి కాలువ గట్టున నడుస్తూ లాగేవారు. బరువైన పడవల్ని అతి కష్టంగా అరుపులతో, కేకలతో పాటలతో పడవల్ని లాగే వారు. పాటల్ని లయ బద్ధంగా పాడుతూ తాళ బద్ధమైన అడుగులతో పాటలు పాడుతూ తమ శ్రమనంతా మర్చి పోయేవారు. పల్లెల ప్రక్కగా ప్రవహించే ఈ కాలువల్లో పల్లెవారు పాడే పాటలు రాత్రిం బవళ్ళూ అతి శ్రావ్యంగా వినిపించేవి. వీటిలో శృంగారంపాలు ఎక్కువగా వుండేది. ప్రకృతిని గురించీ, పరిసరాలను గురించీ, పాటలు పాడేవారు.
పడవ సరంగులుగా, జాలరులుగా కొంత మంది వేషాలు ధరించి రంగ స్థలం మీద జాలరుల వేషాలతో గడ పట్టి పడవ నడపటం, చుక్కాని పట్టటం, తెర చాప ఎత్తటం మొదలైన అభినయాలతో విద్యార్థులు మొదలైన వారు అక్కడక్కడ ప్రదర్శించేవారు. కానీ ఈ జాలరి వేషాన్ని విజయనగరంకు చెందిన డి.వై.సంపత్ కుమార్ తన నాట్య ప్రదర్శనలతో పాటు ఈ వేషాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించి జాతీయ అంతర్జాతీయ ప్రఖ్యాతి వహించారు. అవార్డుల నందుకున్నారు. ప్రజానాట్య మండలి కళాకారుడుగా ఈ కళా రూపాన్ని దేశ మంతటా ప్రదర్శించారు.
ఆంధ్రజాలరి
[మార్చు]ఆంధ్రజాలరిగా ప్రఖ్యాతి వహించిన సంపత్కుమార్ జాలరి వేషం ధరించి ఉదయాన్నే లేచి ఎంతో సంతోషంగా చేపలు పట్ట టానికి తన నావతో సముద్రంలోకి వెళతాడు. చేపల కోసం గాలిస్తాడు. ఇంతలో కారు మేఘాలతో తుపాను కమ్ముకుంటుంది. పడవ వూగిపోతూ వుంటుంది. జాలరి మెలికలు తిరిగి పోతాడు. ఇంతలో ఒక పెద్ద చేప గాలానికి తగుల్కుని జాలర్ని అతలాకుతలం చేస్తుంది. అయినా పట్టు విడువని జాలరి పడవలో తల క్రిందులై పోతూనే ఎంతో కష్ట పడి ఆ చేపను ఒడ్డుకు చేర్చటం తుఫాను హోరు తగ్గి పోవటంతో విజయ వంతంగా ఆనందంతో గంతు లేస్తాడు. ప్రదర్శనానికి రంగ స్థలం తెరమీద బ్యాక్ ప్రొజక్ష్ణన్ తో సముద్ర హోరుని చూపిస్తారు. ఉరుముల్ని, మెరుపుల్ని లైటింగ్ తో జిగేలు మనిపిస్తారు. నేపథ్య్యంలో సన్ని వేశాన్ని అనుసరించి తబలా ధ్వనులు అద్భుతంగా సహరిస్తాయి. ఈ కళా రూపాన్ని అత్యద్భుతంగా సృష్టించిన ఘనత సంపత్కుమార్కు దక్కుతుంది. ఈ కళారూపానికి సంబంధించిన పడవ పాటల్ని ప్రజా నాట్య మండలి రాష్ట్ర దళం జాతీయ సమైక్యతకు ఉపయోగించింది.
మూలాలజాబితా
[మార్చు]- తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ప్రచురించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు