డా. బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనం

వికీపీడియా నుండి
(డా. బి.ఆర్. అంబేడ్కర్ స్మృతివనం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
డా. బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనం
ప్రదేశంట్యాంక్‌బండ్, హైదరాబాదు, తెలంగాణ
రకంస్మృతివనం
నిర్మాన పదార్థంకాంస్యం
వెడల్పు45.5 అడుగులు
ఎత్తు125 అడుగులు
నిర్మాణం ప్రారంభం2021 ఏప్రిల్ 14 (2021-04-14)
పూర్తయిన సంవత్సరం2023
ప్రారంభ తేదీ2023 ఏప్రిల్ 14 (2023-04-14)
అంకితం చేయబడినదిభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్. అంబేద్కర్

డా. బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనం (Dr. B.R. Ambedkar Memorial) అనేది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ట్యాంక్‌బండ్ సమీపంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన స్మృతివనం.[1] భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్. అంబేద్కర్ పేరిట నిర్మించిన ఈ స్మృతివనంలో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.[2] భూమి నుండి 175 అడుగుల ఎత్తులో ఉన్న ఈ విగ్రహం దేశంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం.[3]

2023 ఏప్రిల్ 14న ఆంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా అంబేద్కర్ ముని మనవడు ప్రకాశ్ అంబేద్కర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, 50వేలమంది ప్రజల సమక్షంలో ముఖ్యముంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాడు.[4]

రూపకల్పన[మార్చు]

125 అడుగులతో దేశంలో అతి ఎత్తయిన అంబేద్కర్ విగ్రహంతో హైదరాబాదు నగరంలోని దాదాపు 11.04 ఎకరాల విస్తీర్ణంలో 146.50 కోట్ల రూపాయలతో ఒక స్మృతివనాన్ని ఏర్పాటుచేయనున్నట్లు 2016, ఏప్రిల్‌ 14న నిర్వహించిన 125వ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించి, శంకుస్థాపన కూడా చేశాడు. నిర్మాణ పనులకు ఎస్సీ సంక్షేమ శాఖ నిధులు అందించగా, రోడ్లు-భవనాల శాఖ నిర్మాణ బాధ్యతలు స్వీకరించింది. ఎస్సీ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని డిజైన్‌ అసోసియేట్స్‌కు ప్రభుత్వం అప్పగించింది. 146.50 కోట్ల రూపాయల అంచనాతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్‌కు వెంటనే సీఎం కేసీఆర్‌ ఆమోదముద్ర వేశాడు.[5]

నిర్మాణం[మార్చు]

విగ్రహాల అధ్యయనం[మార్చు]

కడియం శ్రీహరి నేతృత్వంలోని క్యాబినెట్ సబ్‌కమిటీ మొదట అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టుపై ప్రాథమిక అధ్యయనం చేపట్టి, నిర్మాణం కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది, భారీ విగ్రహాల నిర్మాణంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి 2017 ఫిబ్రవరిలో చైనా, సింగపూర్ వంటి ఇతర దేశాల్లోని భారీ విగ్రహాలపై అధికారుల బృందం అధ్యయనం చేసింది.

నిర్మాణ పనుల అప్పగింత[మార్చు]

రోడ్లు-భవనాల శాఖ ఆధ్వర్యంలో 2021 జూన్‌ 3న నిర్మాణ ఒప్పందం కుదిరింది. గుజరాత్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, పూణేలోని వంద అడుగుల ఛత్రపతి శివాజీ, బెంగళూరులోని 153 అడుగుల శివుడు, 90 అడుగుల కెంపెగౌడ విగ్రహాలను రూపొందించిన నోయిడా డిజైన్‌ అసోసియేట్స్‌కే అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.

నమూన విగ్రహం ఆవిష్కరణ[మార్చు]

98 ఏళ్ళ పద్మభూషణ్ అవార్డు గ్రహీతరామ్ వంజీ సుతార్, ఆయన కుమారుడు అనిల్‌ సుతార్‌ విగ్రహ నమూనాలను తీర్చిదిద్దారు. 2020 సెప్టెంబరులో రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, కొప్పుల ఈశ్వర్, ఈటెల రాజేందర్, సత్యవతి రాథోడ్ తదితరులు అంబేద్కర్ విగ్రహ నమూనాను ఆవిష్కరించారు.[6]

125 అడుగుల అంబేద్కర్ విగ్రహా శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం

భారీ విగ్రహ తయారీ, ప్రతిష్ట[మార్చు]

45.5 అడుగుల వెడల్పుతో, 9 టన్నుల కాంస్యపు పూతతో, 791 స్టెయిన్‌లెస్ స్టీల్‌తో 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని తయారుచేశారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా విగ్రహం చెక్కుచెదరకుండా ఉండేందుకు ఉక్కుతో విగ్రహాన్ని తీర్చిదిద్ది ఆపై ఇత్తడి తొడుగులను బిగించారు. విగ్రహ నమూనాలను ఢిల్లీలో పోతపోసి హైదరాబాద్‌కు తరలించి, పార్లమెంట్ ఆకారంలో 50 అడుగుల ఎత్తయిన పీఠంపై స్తూపాన్ని నిర్మించిన తరువాత విగ్రహ భాగాలను భారీ క్రేన్ల సహాయంతో క్రమపద్ధతిలో అమర్చారు. మూడు దశాబ్దాల పాటు విగ్రహం మెరుస్తూ ఉండేలా పాలీయురేతీన్‌ కోటింగ్‌ వేశారు. విగ్రహం పాదాల వద్దకు చేరుకునేందుకు వీలుగా మెట్లమార్గం, ర్యాంపుతోపాటు 15 మంది ఎక్కగల సామర్థ్యంతో రెండు లిఫ్టులు ఏర్పాటుచేశారు.[3]

అంబేద్కర్ స్మారక భవనాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం

స్మారక భవనం[మార్చు]

భారీ అంబేద్కర్‌ విగ్రహం కిందన 27,476 చదరపు అడుగుల విస్తీర్ణంలో పార్లమెంట్‌ తరహాలో రాజస్థాన్‌ నుంచి ప్రత్యేకంగా ధోల్‌పూర్‌ లేతగోధుమ, ఎరుపు రంగు ఇసుక రాళ్ళతో మూడంతస్తుల్లో స్మారక భవనం నిర్మించబడింది. భవనం లోపల ఆడియో విజువల్ రూమ్స్, సెమినార్‌లు, స్కిల్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్‌ల కోసం ప్రత్యేక గదులు నిర్మించబడ్డాయి. స్మారకం వెలుపల ఉన్న 2.93 ఎకరాల ఖాళీ స్థలంలో పచ్చదనం కోసం స్మృతివనంలో రాక్ గార్డెన్, ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, వాటర్ ఫౌంటేన్, శాండ్ స్టోన్ నిర్మించారు. స్మృతివనంలో దాదాపు 450 వరకు కార్లను నిలిపే అవకాశం ఉంటుంది.

ఫోటో గ్యాలరీ, గ్రంథాలయం[మార్చు]

విగ్రహం కింద, పీఠం లోపల స్మారక భవనంలో ఒక మ్యూజియం, అంబేద్కర్ జీవితంలోని ముఖ్య సంఘటనలకు సంబంధించిన ఫొటో గ్యాలరీని, ఏర్పాటుచేయనున్నారు. అంబేద్కర్ జీవిత విశేషాలకు సంబంధించిన అరుదైన చిత్రాలను సమీకరించేందుకు, అంబేద్కర్ రచనలు సహా ఆయన జీవితానికి సంబంధించి ఏయే పుస్తకాలు అందుబాటులోకి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వ భాషాసాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ నియమించబడింది.

అంబేద్కర్ విగ్రహం ముందు సీఎం కేసీఆర్, అంబేద్కర్ మునిమనవడు ప్రకాశ్ అంబేద్కర్ తదితరులు

ముఖ్యమంత్రి పర్యవేక్షణ[మార్చు]

 • 2023 మార్చి 10న ముఖ్యమంత్రి కేసీఆర్, అంబేద్కర్ విగ్రహం పర్యవేక్షణలో భాగంగా విగ్రహం బేస్ లో నిర్మిస్తున్న విశాలమైన హాళ్ళను, ఆడియో విజువల్ ప్రదర్శనకోసం నిర్మిస్తున్న ఆడిటోరియం పనులు, బయట వాటర్ ఫౌంటేన్, లాండ్ స్కేపింగ్ పనులను పరిశీలించారు.[7]

ఆవిష్కరణ[మార్చు]

2023 ఏప్రిల్ 14న ఆంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా ముఖ్యముంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ముని మనవడు ప్రకాశ్ అంబేద్కర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యేలా, అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరయ్యేలా 750 బస్సులను ఏర్పాటుచేసింది.[8]

హుస్సేన్ సాగర్ తీరంలో దాదాపు 50 వేలమంది సమక్షంలో విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు విడుదల చేయగా ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ, రోడ్లు భవనాలు-రవాణా-విద్యుత్తు శాఖల అధికారుల సమన్వయంతో ఘనంగా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించింది. రెండు లక్షల మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, 80 వేల స్వీటు ప్యాకెట్లు సిద్ధంచేసింది. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా పీఠం లోపల ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటుచేసింది.[9]

అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన, బాబాసాహెబ్ మనుమడు మాజీ లోకసభ సభ్యుడు శ్రీ ప్రకాశ్ అంబేద్కర్ తో ప్రగతి భవన్ నుంచి మధ్యాహ్నం 3.15 కు బయలుదేరిన కేసీఆర్ నేరుగా హుసేన్ సాగర్ పక్కనే ఆవిష్కరణకు సిద్ధమైన అంబేద్కర్ మహా విగ్రహం చెంతకు చేరుకున్నారు. అక్కడ బౌద్ధ బిక్షువులు వారి సాంప్రదాయ పద్ధతిలో ప్రార్థనలు చేస్తూ ఆహ్వానం పలికారు. విగ్రహావిష్కరణలో భాగంగా దాదాపు 30 మంది బౌద్ధ గురువులు ప్రార్థనలతో కేసీఆర్ తొలుత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెట్టిన బేస్ భవనాన్ని ప్రకాశ్ అంబేద్కర్ ఆవిష్కరించాడు. విగ్రహ వేదిక మీద ఏర్పాటుచేసిన అంబేద్కర్ పాలరాతి స్థూపానికి బౌద్ధ సాంప్రదాయంలో భిక్షువులు ప్రార్థనలు చేశారు. తర్వాత స్తూపం లోపల ఉన్న లిప్టులో ముఖ్యమంత్రి అంబేద్కర్ విగ్రహం పాదాల వద్దకు చేరుకుని నివాళులర్పించారు. అక్కడ 20 మంది బౌద్ధ గురువులు ప్రార్థనలు నిర్వహించారు. విగ్రహావిష్కరణ తరువాత హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించారు. అనంతరం అక్కడి బహిరంగ సభలో ఆహూతులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు.[3]

అంబేద్కర్ స్మారక భవనంలో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ దృశ్యం

విగ్రహ విశేషాలు[మార్చు]

 • శంకుస్థాపన: 2016 ఏప్రిల్ 14
 • అంచనా వ్యయం: రూ.146.50 కోట్లు
 • కన్సల్టెంట్ సంస్థ: డిజైన్ అసోసియేట్స్
 • సాంకేతిక అనుమతి: 2021 జనవరి 23
 • గుత్తేదారుతో ఒప్పందం: 2021 జూన్ 3
 • గుత్తేదారు సంస్థ: కేసీపి ప్రాజెక్ట్స్ లిమిటెడ్

రెండు ఎకరాల విస్తీర్ణంలో పీఠం.. విగ్రహం[మార్చు]

సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
 • అంబేద్కర్ స్మారక ప్రాంగణ విస్తీర్ణం: 11.80 ఎకరాలు
 • పీఠం నిర్మాణం, విగ్రహం ఏర్పాటు: రెండు ఎకరాల విస్తీర్ణంలో
 • విగ్రహ స్తూపం (పీఠం) ఎత్తు: 50 అడుగులు
 • పీఠం వెడల్పు: 172 అడుగులు
 • విగ్రహం బరువు: 465 టన్నులు
 • విగ్రహం వెడల్పు: 45 అడుగులు
 • వినియోగించిన ఉక్కు 791 టన్నులు
 • ఉపయోగించిన ఇత్తడి: 96 మెట్రిక్ టన్నులు
 • రోజూ పనిచేసిన కార్మికులు: 425 మంది
 • విగ్రహ రూపశిల్పి: రామ్ వి సుతార్

గుర్తింపులు[మార్చు]

 • హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్‌లో డాక్టర్ బీఆర్ అంబేంద్కర్ విగ్రహం నమోదైంది.[10]

ఆవిష్కరణ కార్యక్రమ చిత్రాలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. Today, Telangana (2021-03-20). "Hyderabad: 125-foot Ambedkar statue works to start on April 14". Telangana Today. Archived from the original on 2021-03-20. Retrieved 2022-11-14.
 2. telugu, NT News (2022-11-04). "చకచకా 'అంబేద్కర్‌ స్మృతివనం'". www.ntnews.com. Archived from the original on 2022-11-10. Retrieved 2022-11-14.
 3. 3.0 3.1 3.2 "BR Ambedkar: జాతి గర్వించేలా.. జగమంతా కనిపించేలా." EENADU. 2023-04-13. Archived from the original on 2023-04-13. Retrieved 2023-04-13.
 4. "CM KCR:దేశమంతా దళిత బంధు ఇచ్చే రోజు వస్తుంది: సీఎం కేసీఆర్‌". EENADU. 2023-04-14. Archived from the original on 2023-04-14. Retrieved 2023-04-14.
 5. telugu, NT News (2023-04-13). "Ambedkar statue | అటు మోదీ, ఇటు కేసీఆర్‌.. ఎవరు పనిమంతుడు?". www.ntnews.com. Archived from the original on 2023-04-13. Retrieved 2023-04-13.
 6. "Hyderabad's Ambedkar statue to come up in next 15 months, says Telangana govt". The News Minute (in ఇంగ్లీష్). 2021-09-10. Archived from the original on 2021-10-16. Retrieved 2022-11-14.
 7. Today, Telangana (2023-03-10). "CM KCR inspects Secretariat, Ambedkar Statue and Martyrs' Memorial". Telangana Today. Archived from the original on 2023-03-28. Retrieved 2023-04-11.
 8. ABN (2023-04-14). "Ambedkar statue: అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్, ప్రకాష్ అంబేద్కర్". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-04-14. Retrieved 2023-04-14.
 9. telugu, NT News (2023-04-04). "CM KCR | దేశం గర్వించేలా డాక్ట‌ర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-04-05. Retrieved 2023-04-15.
 10. telugu, NT News (2023-04-15). "Ambedkar Statue | హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం". www.ntnews.com. Archived from the original on 2023-04-15. Retrieved 2023-04-15.

వెలుపలి లంకెలు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.