Jump to content

తుళువ వంశం

వికీపీడియా నుండి
(తుళువ వంశము నుండి దారిమార్పు చెందింది)

తుళువ వంశము విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన మూడవ వంశము. కర్ణాటకలోని తుళు రాష్ట్రము వీరి జన్మస్థలమైనందున తుళువ వంశమనే పేరు వచ్చింది. హరిహర రాయలు 1342 ప్రాంతములో తుళునాడును జయించినప్పటినుండి ఈ వంశస్థులు విజయనగర ఆస్థానములో రాజోద్యోగాలు నిర్వహిస్తూ ఉన్నారు. సాళువ వంశస్థులవలెనే వీరూ తమది చంద్రవంశమని వర్ణించుకున్నారు. ఈ వంశానికి మూలపురుషుడు తిమ్మరాజు. ఇతని కొడుకు ఈశ్వర నాయకుడు సాళువ నరసింహుని సేనాపతిగా 1481లో మహమ్మద్ షాను కందుకూరు వద్ద ఓడించి అతడి శిబిరాన్ని దోచుకున్నాడు. వరాహపురాణం ఇతణ్ణి దేవకీపురాధిపుడని వర్ణిస్తున్నది. ఉత్తర ఆర్కాటు జిల్లా ఆరణి తాలూకాలోని దేవికాపురమే దేవకీపురమై ఉంటుంది. ఈ వాదనను బలపరుస్తూ అక్కడి బృహదాంబాలయంలో తుళువ వంశస్థులకు చెందిన అనేక శాసనాలు లభించాయి. ఈ ఈశ్వరనాయకుడే శ్రీకృష్ణదేవరాయల పితామహుడు. ఈశ్వరనాయకుని కుమారుడు నరసానాయకుడు. కృష్ణరాయలను ఆయన ఆస్థానకవి అల్లసాని పెద్దన సంపెట నరపాల అని వర్ణించాడు, దీన్ని బట్టి వీరి ఇంటిపేరు సంపెట అయి ఉండవచ్చని భావిస్తున్నారు.[1]

తుళువ వంశస్థుల మాతృభాష కన్నడమైనా తెలుగు భాషను అభిమానించి ఆదరించారు. జంటకవులు నంది మల్లయ్య, ఘంట సింగయలు రచించిన వరాహపురాణాన్ని నరసానాయకుడు అంకితం పొందినాడు. ఈయన కుమారుడు కృష్ణ రాయల తెలుగు అభిమానం జగద్విదితం. అయినా వీరికి తాము కన్నడిగులమన్న మాతృభాషా భావం లేకపోలేదు. కృష్ణరాయలు ఆంధ్ర మహావిష్ణువు తనను కన్నడరాయ అని సంబోధించాడని గర్వంగా చెప్పుకున్నాడు.

సాళువ వంశపు చివరి రోజుల్లో సరసానాయకుడు రాజ్యపాలన నిర్వహించినా అధికారికంగా పట్టాభిషిక్తుడై విజయనగర సామ్రాజ్యంలో తుళువ వంశ పాలనకు నాంది పలికింది నరసానాయకుని పెద్దకొడుకు వీరనరసింహ రాయలు.

మూలాలు

[మార్చు]
  • ఆంధ్రుల చరిత్ర - బి.యస్.యల్.హనుమంతరావు
విజయనగర రాజులు విజయ నగర రాజులు
సంగమ వంశం | సాళువ వంశం | తుళువ వంశం | ఆరవీడు వంశం | వంశ వృక్షం | పరిపాలన కాలం | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధం | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యం