Jump to content

ఆరవీడు వంశం

వికీపీడియా నుండి
విజయ నగర రాజులు
సంగమ వంశము
మొదటి హరిహర రాయలు 1336-1356
మొదటి బుక్క రాయలు 1356-1377
రెండవ హరిహర రాయలు 1377-1404
విరూపాక్ష రాయలు 1404-1405
రెండవ బుక్క రాయలు 1405-1406
మొదటి దేవరాయలు 1406-1422
రామచంద్ర రాయలు 1422
వీర విజయ బుక్క రాయలు 1422-1424
రెండవ దేవ రాయలు 1424-1446
మల్లికార్జున రాయలు 1446-1465
రెండవ విరూపాక్ష రాయలు 1465-1485
ప్రౌఢరాయలు 1485
సాళువ వంశము
సాళువ నరసింహదేవ రాయలు 1485-1491
తిమ్మ భూపాలుడు 1491
రెండవ నరసింహ రాయలు 1491-1505
తుళువ వంశము
తుళువ నరస నాయకుడు 1491-1503
వీరనరసింహ రాయలు 1503-1509
శ్రీ కృష్ణదేవ రాయలు 1509-1529
అచ్యుత దేవ రాయలు 1529-1542
సదాశివ రాయలు 1542-1570
ఆరవీటి వంశము
రామ రాయ 1542-1565
తిరుమల దేవ రాయలు 1565-1572
శ్రీరంగ దేవ రాయలు 1572-1586
వేంకటపతి దేవ రాయలు 1586-1614
శ్రీరంగ రాయలు 1 1614-1614
రామదేవ రాయలు 1617-1632
పెద వేంకట రాయలు 1632-1642
శ్రీరంగ రాయలు 2 1642-1646

ఆరవీటి వంశము విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన వంశాల్లో నాలుగవది, చివరిదీను. ఇది తెలుగు వంశము. వీరి వంశానికి ఆ పేరు ప్రస్తుత ప్రకాశం జిల్లా కంభం తాలూకాలోని ఆరవీడు గ్రామం పేరు మీదుగా వచ్చింది. వీరు అధికారికంగా 1571 నుండి సామ్రాజ్యాన్ని పాలించినా, వీరనరసింహ రాయలు కాలం నుంచే సైన్యంలో ప్రముఖ పాత్ర పోషించారు.

పరిచయము

[మార్చు]

భారతదేశ చరిత్రలోనే ఒకానొక కీలకమైన, నిర్ణయాత్మకమైనదిగా చరిత్రకారులు భావించే యుద్ధం, రాక్షసి తంగడి యుద్ధం (తళ్ళికోట యుద్ధం). ఈ యుద్ధంతోనే విజయనగర మహాసామ్రాజ్యం పతనమైపోయింది. విజయనగర సామ్రాజ్యానికి ప్రధాన లక్షణాలైన వ్యవసాయం, వ్యాపారం, విదేశీ వాణిజ్యం, కళలు, సాహిత్యం అన్నీ చారిత్రిక అవశేషాలుగా మిగిలిపోయినాయి. ప్రపంచంలో ఏ నగరంలోనూ జరగనంత విధ్వంసం జరిగింది. ఈ అరాచకాలు, అల్లకల్లోలాలు సుమారు అయిదు నెలలపాటు కొనసాగినాయి. ముస్లిం సుల్తానులంతా ఏకమై ఓడించి విజయనగర సామ్రాజ్యపతనం చూసి సంబరపడ్డారు. కానీ, వారు తిరిగి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోవటాన్ని అదనుగా భావించిన మొగల్ రాజ్యపాలకులు దాడి చేసి వారిని సులభంగా జయించారు.

ఆరవీటి వంశము విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన నాలుగవ, చివరి వంశము. ఆరవీటి వంశము తెలుగు వంశము.

రామరాయల మరణాంతరం పెనుగండ పారిపోయిన తిరుమల రాయలు పెనుగొండను రాజధానిగా చేసుకుని పాలించాడు. అతను అరవీటి వంశస్థుడు. కనక అతని పాలనతో అరవీటి వంశ పాలన ప్రారంభమయింది. అరవీటి వంశస్తుల స్వస్థలం కర్నూలు జిల్లా ఆరెవీడు. కనక వారి వంశానికి ఆరవీటి వంశం అని పేరు వచ్చింది.ఈ వంశానికి మూలపురుషుడు ఆరవీటి సోమరాజు. విజయనగరపాలకులకు సామంతులు.

సాళువనరసింహరాయల కాలంలో ఆరవీటి తిమ్మరాజు నరసింహరాయల వద్ద సేనాధిపతిగా పనిచేశారు. తిమ్మరాజుకు రామరాయలు, వెంకటాద్రి రాయలు, తిరుమలరాయలు అని ముగ్గురు కుమారులు.వారిలో రామరాయలు, వెంకటాద్రి రాయలు తళ్ళికోట యుద్ధంలో మరణించారు. వారి మరణం తరువాత తిరుమలరాయలు సదాశివ రాయలను వెంటబెట్టుకుని పెనుగొండకు పారిపోయాడు. అయిదు నెలలపాటు జరిగిన విధ్వంసం తరువాత విజయనగరానికి తిరిగివచ్చి పునర్నిర్మించటానికి ప్రయత్నించారు... కానీ సుల్తానుల దాడుల వల్ల బాగు చేయలేనంతగా ధ్వంసం అయిన విజయనగరాన్ని బాగుచేయలేమని గ్రహించి....విజయనగరాన్ని వారికి ఒదిలేయక తప్పిందికాదు...

తిరుమలరాయలు (1570 - 1572)

[మార్చు]

ఇతను సామ్రాజ్యాన్ని మూడు భాగాలుగా విభజించి ఆ ప్రాంతాలకు తన కుమారులను ప్రతినిధులుగా ఉంచాడు. తిరుపతి, కంచి, శ్రీరంగంలలో ఉన్న దేవాలయాలకు మరమ్మత్తులు చేయించాడు. తిరుమలరాయలు గొప్ప సాహితీవేత్త. ఇతను స్వయంగా కవి... జయదేవుని గీతగోవిందానికి వ్యాఖ్యానం వ్రాశాడు.

మొదటి శ్రీరంగదేవరాయలు (1572 - 1585)

[మార్చు]

ఇతను తిరుమలరాయని పెద్దకుమారుడు. ఇరుగుపొరుగు సుల్తానుల నుంచి అనేక దాడులను ఎదుర్కొన్నాడు. తొలుత అహోబిలాన్ని పోగొట్టుకున్నప్పటికీ తిరిగీ స్వాధీనం చేసుకున్నాడు. ఇతనికి సంతానం లేకపోవడం వల్ల చంద్రగిరి రాజప్రతినిధిగా ఉన్న ఇతని తమ్ముడు రెండో వెంకటరాయలు సింహాసనం అధిష్టించాడు.

రెండవ వెంకటపతిరాయలు (1585 - 1614 )

[మార్చు]

విజయనగర సామ్రాజ్యానికి చెందిన గొప్ప, శక్తివంతులైన రాజుల్లో ఇతనే చివరివాడు. ఇతను కూడా దక్కన్ ముస్లిం ల దాడికి లోనయ్యాడు. వెంకటరాయలు తన సామంతులనూ, నాయకులనూ ఒకతాటిపైకి తెచ్చి గుత్తిని ఆక్రమించుకున్నాడు. రుస్తుమ్ ఖాన్ నాయకత్వంలో వచ్చిన గోల్కొండ మొత్తం సైన్యాన్ని ఓడించి, గండికోటను ఆక్రమించుకున్నాడు. ఉదయగిరితో పాటు, కృష్ణానది వరకూ ఉన్న ప్రాంతాలు వెంకటరాయల అధికారంలోకి వచ్చినాయి. రాజ్యంలోని తిరుగుబాట్లను కూడా అణచివేశాడు. మొగల్ చక్రవర్తి అక్బర్ సార్వభౌమాధికారాన్ని అంగీకరించమని రాయబారిని పంపినా ధైర్యంగా తిరస్కరించాడు. ఈతను చంద్రగిరిని రాజధానిగా చేసుకున్నాడు. ఇతను కవి పండిత పోషకుడు. ఈతని ఆస్థానంలో వేదపండితుడైన అప్పయ్యదీక్షితులు, చెన్న బసవపురాణం వ్రాసిన విరూపాక్ష పండితుడు, జైన వ్యాకరణాన్ని రచించిన బట్టలంకదేవుడు మొదలైన ప్రసిద్ధకవులు ఉండేవారు. వారేకాక భోజరాజీయాన్ని రచించిన అనంతామాత్యుడు ఉండేవారు. ఇతనికి కుమారులు లేకపోవడంవల్ల రెందో శ్రీరంగరాయలను తన వారసుడుగా నియమించాడు. రెందో శ్రీరంగరాయల (1616) తరువాత రామదేవరాయలు (1616-1630), మూడవ వెంకటపతి రాయలు (1630-1642) లు పాలించారు. వీరి తరువాత మూడో శ్రీరంగరాయలు పాలించాడు. ఆయన పరిపాలన కాలంలోనే బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ వారు వర్తక సంఘంగా దక్షిణ భారతదేశంలోకి, మరీ ముఖ్యంగా తమిళ, ఆంధ్రదేశాల్లోకి చేరప్రారంభించారు. ఈస్టిండియా కంపెనీ వారు చెన్నపట్టణంలో కోటకట్టుకునేందుకు, చంద్రగిరిలో చర్చిలు నిర్మించుకునేందుకు అనుమతులు ఇచ్చారు.[1]

మూడో శ్రీరంగరాయలు (1642 - 1675 )

[మార్చు]

అనేకానేక అంతర్యుద్ధాలు, మోసాలు...., దక్షిణాది నాయకులు కుట్రలతో బీజాపూర్ సుల్తాన్ తో చేతులుకలిపి ఇతన్ని ఓడించారు.ఇతనితోనే అరవీటి వంశమేకాకుండా విజయనగర సామ్రాజ్యంకూడా పతనమైపోయింది. విజయనగర సామ్రాజ్యంలో ఎక్కువభాగాన్ని బీజాపూరు, గోల్కొండ సుల్తానులు ఆక్రమించారు. దిగువన దక్షిణాత్యంలో విజయనగర సామంతులైన మధుర, తంజావూరు, మైసూరు, నాయకరాజులు తమ తమ ప్రాంతాలను స్వంతం చేసుకుని తమ స్వంత రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు.

మూలాలు

[మార్చు]
  1. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
విజయనగర రాజులు విజయ నగర రాజులు
సంగమ వంశం | సాళువ వంశం | తుళువ వంశం | ఆరవీడు వంశం | వంశ వృక్షం | పరిపాలన కాలం | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధం | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యం