కంభం
కంభం | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 15°34′36.1200″N 79°6′19.8000″E / 15.576700000°N 79.105500000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | కంభం |
విస్తీర్ణం | 8.81 కి.మీ2 (3.40 చ. మై) |
జనాభా (2011)[1] | 15,169 |
• జనసాంద్రత | 1,700/కి.మీ2 (4,500/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 7,588 |
• స్త్రీలు | 7,581 |
• లింగ నిష్పత్తి | 999 |
• నివాసాలు | 3,769 |
ప్రాంతపు కోడ్ | +91 ( 08406 ) |
పిన్‌కోడ్ | 523333 |
2011 జనగణన కోడ్ | 590896 |
కంభం, ఆంధ్రప్రదేశ్ రాష్టం, ప్రకాశం జిల్లా, కంభం మండల లోని జనగణన పట్టణం. [2] ఇది కంభం మండలానికి కేంద్రం, చారిత్రక పట్టణం.కంబం పట్టణం 15,5669 ° N 79,1167 ° E వద్ద ఉంది.ఇది సముద్ర మట్టానికి 184 మీటర్ల (606 అడుగులు) ఎత్తులో ఉంది.
గ్రామ చరిత్ర
[మార్చు]గుండికా వీరాంజనేయస్వామివారి ఆలయం గుండ్లకమ్మనది ఒడ్డున "నాగంపల్లి" పాత గ్రామం ఉంది. మొఘల్ సామ్రాజ్యం పరిపాలనా కాలంలో నాయక్ వీధి, పార్కు వీధి, కోనేటి వీధి, మెయిన్ బజారు కలుపుకొని "గుల్షానాబాద్" పాత గ్రామం ఉంది. ప్రస్తుతం న్యూ ఢిల్లీ రికార్డ్స్ లో కూడా "గుల్షానాబాద్" అని ఉంది.[ఆధారం చూపాలి] "గుల్షానాబాద్" (కంభం) 17 వ శతాబ్దంలో 6000 జనాభా ఉండేది. అప్పట్లో "గుల్షానాబాద్" (కంభం) నగర పాలక సంస్థ (మునిస్పాలిటి) ఉంది. శ్రీ కృష్ణదేవరాయల విజయనగర రాజవంశం రాణి వరదరాజమ్మ (జగన్మోహిని రాణి) పరిపాలనా కాలంలో పెద్ద కంభం, చిన్నకంభం, పేరు గల వారిని చెరువు ఆనకట్టకు (తూములు) కట్టబడే గోడకు వారిని బలి దానం చేసారు.[ఆధారం చూపాలి] వారి చిహ్నంగా "కంభం" ప్రస్తుతం అని పిలువ బడుతుంది.
శాసనాలు
[మార్చు]కంభంలో రెండు శాసనాలు లభ్యమైనవి. మొదటిది 1706లో ఔరంగజేబ్ పరిపాలనా కాలంలో కంభం కోట ఖిలాదార్ ఖాజా మొహమ్మద్ షరీఫ్ మరణం గురించి ప్రస్తావిస్తుంది. రెండవది 1729లో మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షా పరిపాలనా కాలంలో కంభం గవర్నర్ మొహమ్మద్ ఖయ్యూం కుమారుడు మొహమ్మద్ సాహీన్ గురించి ప్రస్తావిస్తుంది.
సమీప గ్రామాలు
[మార్చు]- చినకంభం-4 కి.మీ, * నాగులవరం - 4 కి.మీ, * దర్గా - 5 కి.మీ, * జంగంగుంట్ల-5 కి.మీ, * కందులాపురం- 4 కి.మీ,
జనాభా గణాంకాలు
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం, కుంభం పట్టణ పరిధిలో మొత్తం 3,769 కుటుంబాలు నివసిస్తున్నాయి.మొత్తం జనాభా 15,169, అందులో 7,588 మంది పురుషులు కాగా, 7,581 మంది స్త్రీలు ఉన్నారు. [3] సగటు లింగ నిష్పత్తి 999. కంభం పట్టణంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1624, ఇది మొత్తం జనాభాలో 11%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 825 మంది మగ పిల్లలు, 799 మంది ఆడ పిల్లలు ఉన్నారు. పిల్లల లింగ నిష్పత్తి 968, ఇది సగటు లింగ నిష్పత్తి (999) కంటే తక్కువ.అక్షరాస్యత మొత్తం రేటు 78.7%.అవిభాజ్య ప్రకాశం జిల్లా 63.1% అక్షరాస్యతతో పోలిస్తే కుంభం అధిక అక్షరాస్యతను కలిగి ఉంది. పురుషుల అక్షరాస్యత రేటు 89.12% స్త్రీల అక్షరాస్యత రేటు 68.36%.
రవాణా సౌకర్యాలు
[మార్చు]రాష్ట్రం రహదారి వినుకొండ-నంద్యాల-కడప విజయవాడ-గుంతకల్ పట్టణం మీదుగా ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్ గుంటూరు-గుంతకల్ రైల్వే లైను మార్గంలో ఉంది.
విద్యా సౌకర్యాలు
[మార్చు]1938 లో స్థాపించిన ప్రభుత్వం ఉన్నత పాఠశాలతో పాటు గురుకుల పాఠశాల, మరి ఇతర ప్రైవేటు పాఠశాలలున్నాయి. 1938 లో స్థాపించిన ప్రభుత్వం జూనియర్ కళాశాలతో పాటు గురుకుల జూనియర్ కళాశాల,మరి ఇతర ప్రైవేటు జూనియర్ కళాశాలలున్నాయి. ప్రభుత్వం డిగ్రీ కళాశాలతో పాటు, పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు, డిఇడి కళాశాలలు, బీఇడి కళాశాలలు, పారామెడికల్ కళాశాలలున్నాయి.
వైద్య సౌకర్యం
[మార్చు]స్థానిక వైద్యవిధాన పరిషత్తు వైద్యశాలతో పాటు పలు ప్రైవేట్ వైద్యశాలలున్నాయి.
బ్యాంకులు
[మార్చు]ది కంభం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ తో పాటు పలు ప్రభుత్వరంగ బ్యాంకులు సేవలందిస్తున్నాయి.
కంభం చెరువు
[మార్చు]కంభం చెరువు ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా కంభం లో ఉంది. ఈ చెరువు 15వ శతాబ్దంలో గుండ్లకమ్మ నదిపై శ్రీకృష్ణ దేవరాయులు కాలంలో ఈ చెరువును నిర్మించారు.ఆసియా ఖండంలోనే మానవ నిర్మితమైన చెరువుల్లో అతిపెద్దది.[4]కంభం చెరువు 23.95 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది.3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. కానీ ఇటీవల పూడిక కారణంగా 2 టీఎంసీలకే పరిమితం అయినది. ఈ చెరువు ద్వారా 6,944 ఎకరాలకు సాగునీరు చేరుతుంది.ప్రస్తుతం కంభం చెరువు ఆయకట్టు పరిధిలో అరటి, పసుపు, శనగ, వరి వంటి పంటలు విరివిగా పండిస్తున్నారు. 2 లక్షల జనాభా తాగునీటి సమస్య తీరుస్తుంది.ఈ చెరువు 9 సార్లు మాత్రమే పూర్తిగా నిండింది. అది కూడా 1917, 1949, 1950, 1953, 1956, 1966, 1975, 1983, 1996,2005,2020 పూర్తిగా నిండింది.[5]
రాజకీయాలు
[మార్చు]కంభం పట్టణం 2009 వరకు ఒక కంభం అసెంబ్లీ నియోజకవర్గంలో భాగంగా ఉంది.తరువాత కంభం నియోజకవర్గం పునర్వ్యవస్థీకరించి, గిద్దలూరు నియోజకవర్గంలో విలీనం చేసారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]- శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం (కాపువీధి)
- శ్రీ వరదరాజమ్మ వారి ఆలయం:- చారిత్రాత్మక కంభం చెరువుకట్టపై వేంచేసియున్నది
- శ్రీ కాశీవిశ్వేశ్వర శ్రీ కోటేశ్వరస్వామివారి ఆలయం (శివాలయం):- ఈ ఆలయం, కంభం-పోరుమామిళ్ళ మార్గంలో, గుండికా నది ఒడ్డున ఉంది.
- శ్రీ అంకాళమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయం కంభం చెరువు ఆనకట్ట వద్ద ఉంది.
- కందులపురం యందు ఫైర్ స్టేషన్ దగ్గర గల కొండపైన, శ్రీ మస్తాన్ వలి స్వామి దర్గా ఉంది.
- జుమ్మామస్జిద్ 1629 లో భారతదేశం (దక్షిణ) చక్రవర్తి కట్టించారు.
- గచ్చు కాలువ మస్జిద్ 1729 లో మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షా కట్టించారు.
- బేస్తవారిపేట పోవు దారిలో మస్జిద్ ను ఔరంగజేబ్ పరిపాలనా కాలంలో కట్టించారు.
- గుండ్లకమ్మ నది గురించి 1794 మార్చిలో ఒక తెలియని కళాకారుడు చిత్రీకరించాడు. ఈ చిత్రం పెయింటింగ్ ఇప్పటికీ బ్రిటిష్ లైబ్రరీలో ఉంది.
గ్రామ ప్రముఖులు
[మార్చు]- అబ్దుల్ గఫూర్ "ఖురాన్"ను మొదటిసారిగా సరళీకరించిన కంభంవాసి పేరు మౌల్వి అబ్దుల్ గఫూర్ ఇస్లాంపై మమకారంతో అబ్దుల్ గఫూర్ 1946లో కంభంలో తన నివాసం పక్కనే మసీదు నిర్మించాడు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ వెళ్లి దారుల్ ఉలూమ్ దేవబంద్‌లో మౌల్వి కోర్సు పూర్తి చేశాడు. అప్పటి నుంచి అతని పేరు మౌల్వి అబ్దుల్ గఫూర్‌గా మారింది. కొంత కాలం కర్నూలు ఇస్లామియా అరబిక్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆ కళాశాల ఇంకా ఉంది. ఈ నేపథ్యంలో తన కల సాకారం చేసుకోవడానికి ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేశారు. కంభంలో అతను నిర్మించిన మసీదులో కూర్చొని ఖరాన్‌ను 3 భాగాలుగా తెలుగులోకి అనువదించాడు. ఇదే సమయంలో ఓ వైపు అరబిక్ లిపి, దాని పక్కనే తెలుగులిపి, మరో పక్క పూర్తి తెలుగులో అర్థంతో పాటు, ఇంగ్లీషు లిపి కూడా రాసాడు. 1948 నాటికి పుస్తకం ముద్రణ పూర్తిచేసుకుంది. గఫూర్.. ఖురాన్‌తో పాటు మహ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర, మిష్కాత్ షరీఫ్ పుస్తకాలను రచించాడు.ఇతనికి ఇద్దరు మగపిల్లలు, ముగ్గురు అమ్మాయిలున్నట్లు తెలిసింది. ఖురాన్ అనువాదం తర్వాత మక్కా వెళ్లాడు. అయితే మక్కా యాత్ర చేసిన ఫొటోలు ఉండకూడదని వాటిని తగులబెట్టారట. గఫూర్ అనువాదం తర్వాత 1978లో విజయవాడ వాసి హమీదుల్లా షరీఫ్.. ఉర్దూలోని ఖురాన్‌ను తెలుగులోకి అనువదించాడు.ఇస్లాంలోని అంశాలను తెలియజేసే ఖురాన్ ముస్లింలకు అత్యంత పవిత్రమైంది. రంజాన్ మాసంలో అవతరించిన ఈ దివ్య గ్రంథం శాంతి.. సమానత్వం.. సేవా గుణాలకు ప్రతీకగా నిలుస్తుంది. గతంలో ఇతర భాషల్లోనే అనువాదమైన ఖురాన్‌ను ఎలాగైనా తెలుగులోకి తర్జుమా చేసి రాష్ట్ర ప్రజలకు అంకితమివ్వాలనే ఆలోచన మొట్టమొదటిగా కంభం వాసికి కలిగింది. అరబిక్, ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ వంటి 30కి పైగా వివిధ భాషల్లో అచ్చయిన ఖురాన్ అప్పటికింకా తెలుగు ప్రజలకు సరిగా అందుబాటులోకి రాలేదు. దీనిపై కలత చెందిన అబ్దుల్ గఫూర్ చివరకు తెలుగులో సరళీకరించారు.
- త్యాగరాజు (1767 మే 4 - 1847 జనవరి 6) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. అతని కీర్తనలు శ్రీరాముని పై అతనికిగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై అతనికి ఉన్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. ఉపనయనం తరువాత తండ్రిగారి బోధలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన రామ షడక్షరీ మంత్ర ప్రభావం, తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగ రాజస్వామి వారిలో మూర్తీభవించాయి.త్యాగరాజు ప్రస్తుత కంభం మండలంలో కాకర్ల అను గ్రామంలో తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబంలో 1767 లో జన్మించాడు. త్యాగరాజు కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం. ఇతని జన్మనామం కాకర్ల త్యాగ బ్రహ్మం వీరు మురిగినాడు తెలుగు బ్రాహ్మణులు.త్రిలింగ వైదీకులు. ఇతడి పూర్వీకులు ప్రస్తుత ప్రకాశం జిల్లా కంభం మండలంలో కాకర్ల అను గ్రామం నుండి తమిళ దేశానికి వలస వెళ్లారు.
- పూల సుబ్బయ్య కంభంలో జన్మించాడు. 1952లో కంభం పంచాయతీకి వార్డు సభ్యులుగా పోటీచేసి ఓడిపోయాడు. అప్పుడు మార్కాపురానికి మకాం మార్చి, న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి, తిరిగి ఆరు సంవత్సరాల తరువాత, రాజకీయాలలోకి వచ్చి, యర్రగొండపాలెం శాసనసభకు సి.పి.ఐ.అభ్యర్థిగా పోటీచేసి, మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. అదే స్థానంలో 1967 లోనూ, 1978లోనూ, మార్కాపురం నుండి శాసనసభ్యులుగా ఎన్నికైనాడు. వరుస కరువు కాటకాలతో కుదేలవుచున్న అన్నదాతల చింతలు తీర్చేటందుకు, వెలిగొండ ప్రాజెక్టు మాత్రమే పరిష్కారమని తలచి, ప్రజా పోరాటాల ద్వారా ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసారు . ఫలితంగా మూడు జిల్లాల వరదాయిని, "వెలుగొండ ప్రాజక్టు" నిర్మాణానికి అడుగులు పడినవి. అతని సేవలకు గుర్తుగా ప్రభుత్వం, ఈ జలాశయానికి "పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు" అని నామకరణం చేసింది.[6]
- ఒకరైన శ్యామశాస్త్రి, ప్రముఖ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకులు ఇక్కడి వారే.
ప్రధాన పంటలు
[మార్చు]ప్రధాన వృత్తులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
- ↑ "Villages and Towns in Cumbum Mandal of Prakasam, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-30. Retrieved 2022-10-30.
- ↑ "Cumbum Population, Caste Data Prakasam Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-30. Retrieved 2022-10-30.
- ↑ S.murali (2016-09-27). "Cumbum tank a big draw in Prakasam". The Hindu. ISSN 0971-751X. Retrieved 2020-12-06.
- ↑ "25 సంవత్సరాల తర్వాత.. కంభం చెరువు తొణికిసలాడుతుండటంతో." www.andhrajyothy.com. Retrieved 2020-12-06.
- ↑ "Poola Subbaiah Veligonda Project:-". irrigationap.cgg.gov.in. Archived from the original on 2022-07-05. Retrieved 2022-10-30.
వెలుపలి లంకెలు
[మార్చు]