బండారులంక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బండారులంక, గ్రామం చేనేత చీరలకు ప్రసిద్ధి. ఈ గ్రామం అమలాపురం నుంచి 3 కిలో మీటర్ల దూరం ఉంది. ఈ గ్రామంలో చేనేత కులాలకు చెందిన వారు అధికంగా నివసిస్తున్నారు. వారిలో దేవాంగులు, కర్ణభక్తులు అనే చేనేత కులస్థులు ఎక్కువగా నివసిస్తున్నారు. వీరు చేనేత చీరలు నేయటంలో అందె వేసిన వారు.

గ్రామ చరిత్ర[మార్చు]

పిండారీలు, థగ్గులు గ్రామాల మీద పడి దోచుకునే బ్రిటిష్ వారి కాలంలో, బండారులంక గ్రామం కూడా అందుకు బలి అయ్యింది. అయితే, మలిపెద్ది వెంకన్న అనే బండారులంక వాసి, తనకు తెలిసిన కర్ర సాము, కత్తిసాముతో వారిని వీరోచితంగా ఎదుర్కొని కొందరిని చంపగా, మరికొందరు పారిపోయారు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ వీరోచిత కార్యానికి, ధైర్య సాహాసాలకు మెచ్చి బాటన్‌ని బహూకరించారని ఇక్కడి పెద్దలు కథలు కథలుగా చెప్పుకుంటారు. (పోలీసు అధికార్లు, సైనికాదికారులు వాడే కర్రను బాటన్ అంటారు. అది చిన్న పోలీసు అధికార్లను, చిన్న సైనికాధికార్లను అజమాయిషీ చేయటానికి, అధికార చిహ్నంగా వాడతారు). ఈ థగ్గులను, విలియం బెంటిక్, సమర్ధవంతంగా అణచివేసి, బ్రిటిష్ ఇండియాలోని పల్లెలకు ప్రశాంతతను ఇవ్వడంతో ఈ ఊరు ప్రశాంతంగా మారిందని చెపుతారు.

ఈ గ్రామం ప్రక్క నుంచి, గోదావరి నది పాయ అయిన కౌశిక నది ప్రవహిస్తుంది. ఈ నదిని విశ్వామిత్రుడు తీసుకు వచ్చాడని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.

సౌకర్యాలు,దేవాలయాలు[మార్చు]

  • ఈ గ్రామంలో (కొత్త బండారులంకలో) శివాలయం, విష్ణుమూర్తిఆలయం, దేవాంగుల కుల దైవమైన చాముండేశ్వరి గుడి, గ్రామ దేవత మురుగులమ్మ గుడి ఉన్నాయి. పాత బండారులంకలో వీరభద్ర స్వామి గుడి ఉంది. వీరభద్రపురంలో గణపతి గుడి ఉంది. ఈ ఊరు రామలింగరాజు నగర్, పాత బండారులంక, వీరభద్ర పురం, కొత్త బండారులంక, కాపటి వీధి, బ్రాహ్మణ వీధి, కోమటి వీధి, మాడా వారి వీధి, చిన చంద్రపురం అనే ప్రాంతాలుగా విడదీయబడి ఉంది.
  • చేనేత కార్మికుల కోసం చేనేత సహకార సంఘం - వీవర్స్ కోపరేటివ్ సొసైటీ ఉంది. ప్రతీ శ్రావణ పౌర్ణమికి చాముండేశ్వరి గుడి దగ్గర జ్వాలా తోరణం వెలిగించటం సంప్రదాయం. గుడి ముఖ్య ద్వారం దగ్గర తోరణం లాగ గడ్డి కట్టి, శివ పార్వతుల విగ్రహాలు ఊరేగి వచ్చిన తరువాత, ఆ విగ్రహాలను తీసుకుని పూజారి ఆ తోరణం క్రిందగా వెళుతూ, గడ్డి తోరణాన్ని వెలిగిస్తాడు. అలా వెలుగుతున్న తోరణాన్నే జ్వాలా తోరణం అంటారు. ఆ వెంటనే భక్తులు, ఆ మంటల క్రింద నుంచి ఆలయంలోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటారు. అలా చేస్తే పుణ్యం అని భావిస్తారు.
  • ఒక ఉన్నత పాఠశాల (హైస్కూలు), ప్రాథమిక పాఠశాల, సబ్ పోస్టు ఆఫీసు ఉన్నాయి.

ఇతర విశేషాలు[మార్చు]

  • ఇక్కడ రకరకాల డిజైన్లలో నేసిన అనేక చీరలు ఈ బండారులంక గ్రామం నుంచి ఎగుమతి అవుతున్నాయి. బండారులంక చీరలు ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలతో పాటుగా భారతదేశమంతటా దొరుకుతాయి.
  • గంగలకుర్తి అగ్రహారం బండారులంక గ్రామానికి దగ్గరలో ఉంది. అమలాపురం నుంచి అంబాజీపేట వెళ్ళే దారిలో ఈ గ్రామం రహదారి ప్రక్కనే కనిపిస్తుంది. సంస్కృత భాషలో మహా పండితుడైన, పండిత జగన్నాధ రాయలు, ఇక్కడికి దగ్గరలోనే వున్న ముంగండ గ్రామంలో జన్మించారు.
  • ఒకప్పుడు బండారులంక గ్రామానికి, అమలాపురం పట్టణానికి, మధ్య దారి పొడవునా వరి పొలాలు, పఛ్ఛని తివాచీలు పరిచినట్లుగా ఉండేవి. నేడు, అమలాపురం - బండారులంక ల మధ్య నివాసాలు పెరిగి, కలిసి పోయే పరిస్థితిలో ఉన్నాయి. ఆ పచ్చని పొలాలు తగ్గి పోయాయి.

1956 వరద[మార్చు]

పూర్వం, ఈ గ్రామానికి గోదావరి వరద భయం ఉండేది. కానీ ప్రభుత్వ చర్యల వలన ఆ వరద భయం తప్పింది. 1956, ఆగష్టులో వచ్చిన వరద అతి భయంకరమైందిగా ఇక్కడ చెబుతారు. అపార నష్టం కలిగించిన వరద ఇది. ఆ తరం నాటి ప్రజలు ఇప్పటికీ 1956 నాటి వరదను తలుచుకుంటారు.

కొన్ని విషయాలు[మార్చు]

  • పిన్ కోడ్: 533221
  • ఎస్టీడీ కోడ్: 08856
  • పోస్టాఫీసు టెలిఫోన్ నెంబరు: 233082

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]