Jump to content

కోనసీమ జిల్లా

అక్షాంశ రేఖాంశాలు: 16°56′N 82°13′E / 16.93°N 82.22°E / 16.93; 82.22
వికీపీడియా నుండి
(డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి దారిమార్పు చెందింది)
కోనసీమ జిల్లా
డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా
1. కోనసీమ ముఖ ద్వారం, 2. అమలాపురం గడియార స్తంభం, 3. శుభ కలశం
కోనసీమ జిల్లా చిత్రమాల
దేశంభారత దేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
ప్రాంతంకోస్తా
Seatఅమలాపురం
విస్తీర్ణం
 • Total2,083 కి.మీ2 (804 చ. మై)
జనాభా
 (2011)[1]
 • Total17,19,100
భాషలు
 • అధికారతెలుగు
Time zoneUTC+5:30 (IST)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 0 ( )

కోనసీమ జిల్లా, అధికారికంగా, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా 2022లో కొత్తగా ఏర్పడిన జిల్లా.[1] ఇది పూర్వపు తూర్పు గోదావరి జిల్లా నుండి కొన్ని మండలాలను విడగొట్టుట ద్వారా ఆవిర్బంచింది. జిల్లా కేంద్రం అమలాపురం. గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతమే కోనసీమ. ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన గోదావరి పలు పాయలుగా మారుతుంది. అందులో వశిష్ఠ, వైనతేయ, గౌతమీ పాయల మధ్య ప్రాంతమే కోనసీమ. నదీ పాయల మధ్య దీవుల సముదాయంలా కోనసీమ కనిపిస్తుంది. బంగాళాఖాతం తీరాన్ని ఆనుకుని ఉంటుంది. గతంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా ఉన్న రాజోలు, కొత్తపేట, రామచంద్రపురం, ముమ్మడివరం, మండపేట, అమలాపురం, పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలతో ఈ జిల్లా అవతరించింది. జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం, కొత్తపేట అనే మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఈ రెవెన్యూ డివిజన్లను 22 మండలాలుగా విభజించారు. 2011 భారత జనగణన ప్రకారం, జిల్లాలో జనాభా మొత్తం 17.191 లక్షలు మంది ఉన్నారు.[2] జిల్లా వైశాల్యం 2,083 చ. కి. విస్తీర్ణంతో ఉంది. అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ద్రాక్షారామంలో పంచారామలలో ఒకటైన శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వరస్వామి దేవాలయం జిల్లాలో ప్రముఖ పర్యాటక ఆకర్షణలు.

పేరు

[మార్చు]

గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతమే కోనసీమ. రాజమండ్రి వద్ద అఖండ గోదావరిగా పిలిచే ఆ నదీ ప్రవాహం ఆ తర్వాత దిశ మారుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దిగువన పలు పాయలుగా మారుతుంది. అందులో వశిష్ఠ, వైనతేయ, గౌతమీ పాయల మధ్య ప్రాంతమే కోనసీమ. నదీ పాయల మధ్య దీవుల సముదాయంలా కోనసీమ కనిపిస్తుంది. బంగాళాఖాతం తీరాన్ని ఆనుకుని ఉంటుంది.

తెలుగు నిఘంటువు ప్రకారం కోన అంటే చాలా అర్థాలున్నాయి. అందులో అడవి వంటివి బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే కోన అంటే మూల అని, సీమ అంటే ప్రదేశం అని తెలుగు అధ్యాపకుడు ముళ్లపూడి రామచంద్రం అభిప్రాయపడ్డారు.[3]

"గోదావరి జిల్లాల్లో ఇప్పుడు కోనసీమగా పిలుస్తున్న ప్రాంతం ఓ మూలన ఉంటుంది. అందులోనూ భౌగోళికంగా నదీ ప్రవాహానికి చివరిలో ఉంది. ఇది ఓ దీవిని తలపిస్తుంది. రోడ్డు రవాణా మార్గాలు అంతగా లేని రోజుల్లో రాకపోకల కోసం పడవల మీద గోదావరిని దాటాల్సి వచ్చేది. అందుకే ఆ ప్రదేశాన్ని కోనసీమగా పిలుస్తారు. కోనసీమ గురించి 12వ శతాబ్దం నాటి నుంచే ప్రస్తావన ఉంది. నన్నయ్య వంటి వారి రచనల్లోనూ కోనసీమ గురించి పేర్కొన్నారు. అనేక శతాబ్దాలుగా కోనసీమగానే ఈ ప్రాంతాన్ని పిలుస్తున్నారు" అని ముళ్లపూడి రామచంద్రం వివరించారు. కోనసీమ అనే పేరు రావడానికి ఆనాటికి ఇది అటవీ ప్రాంతంగా ఉండడం వంటి ఇతర కారణాలు కూడా ఉండవచ్చనే అభిప్రాయం అతను వ్యక్తం చేశాడు.[3]

ప్రభుత్వం జిల్లా పేరును డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చుటకు ప్రాథమిక ప్రకటన చేస్తూ అభ్యంతరాలను 30 రోజులలోగా తెలియపరచాలని కోరింది. దీనిని వ్యతిరేకిన్తూ అల్లర్లు, విధ్వంసం జరిగింది. 2022 జూన్ 24 న జరిగిన సమావేశంలో పేరు మార్పుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 2022 ఆగస్టు 2 న ఖరారు గెజెట్ ప్రకటన విడుదలైంది.

చరిత్ర

[మార్చు]
అమలాపురంలో సూర్యాస్తమయం సమయం

2022 ఏప్రిల్ 4న ఈ జిల్లా ప్రారంభించబడింది. గతంలో తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా ఉన్న రాజోలు, కొత్తపేట, రామచంద్రాపురం, ముమ్మడివరం, మండపేట, అమలాపురం, పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలతో ఈ జిల్లా అవతరించింది. కొత్తజిల్లా ఏర్పాటులో భాగంగా అమలాపురంలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. అమలాపురానికి సమీపాన ఉన్న ముమ్మిడివరంలో ఎయిమ్స్ కళాశాల భవనాల్లో 43 ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఒకేచోట ఏర్పాటు చేస్తున్నారు. అమలాపురం నల్లవంతన దిగువన ముక్తేశ్వరం రోడ్డులో అంబేద్కర్ కమ్యూనిటీ హాలుకు ఎదురుగా డీఆర్డీఏ భవనాల ఏర్పాటు చేశారు. పాత మాంటిస్సోరి స్కూలు భవనంలో జిల్లా ఎస్పీ కార్యాలయం ఏర్పాటైంది.[4]

భౌగోళిక స్వరూపం

[మార్చు]
కాలువ గట్లు
కోనసీమలో అరటి పొలాలు
కోనసీమ పొలాలు
కోనసీమ పొలాలు

కోనసీమ జిల్లాకు ఉత్తరాన తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, తూర్పున కాకినాడ జిల్లా, దక్షిణాన బంగాళాఖాతం, పశ్చిమాన పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. ఉత్తరం వైపు గోదావరి పాయ గౌతమి, దక్షిణం వైపున వశిష్ట అనే గోదావరి పాయ మధ్యలో కోనసీమ ఉంది. కోనసీమ త్రిభుజాకార ప్రదేశం కావున గోదావరి, బంగాళాఖాతాలు చుట్టుముట్టి ఉన్నాయి.

జిల్లా వైశాల్యం 2,083 చదరపు కిలోమీటర్లు. జిల్లా ప్రధాన కార్యాలయం అమలాపురం నుండి రాష్ట్ర రాజధాని అమరావతికి 200 కి.మీ. దూరంలో ఉంది. ఈ ప్రాంతం వరి పొలాలతో, అరటి, కొబ్బరిచెట్లతో కళకళ లాడుతూ ఉంటుంది. సారవంతమైన ఒండ్రు నేలలు, ఇసుకతో కూడిన మట్టి నేలలు డెల్టా ప్రాంతంలో కనిపిస్తాయి.

వాతావరణం

[మార్చు]

ఈ జిల్లాలో ఈశాన్య ఋతుపవనాలు, నైరుతీ ఋతుపవనాల కారణంగా జూన్ నుండి అక్టోబరు వరకు వర్షాలు కురుస్తుంటాయి.ఏడాది పొడుగునా వాతావరణం సాధారణంగా ఉంటుంది. ఏప్రిల్‌ నుండి జూన్‌ వరకు మాత్రం ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెంటీగ్రేడు వరకు పెరుగుతాయి. జిల్లా లోని సాధారణ వర్షపాతం - 1280.0 మి మీ. సగానికి పైగా వర్షపాతం నైరుతి ఋతుపవనాల వలన కలగగా మిగిలినది ఈశాన్య ఋతుపవనాల వలన కలుగుతుంది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 జనగణన ప్రకారం, జిల్లా పరిధిలో జనాభా 17.191 లక్షలు.[2]

పరిపాలన

[మార్చు]

జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, అవి కొత్తపేట, అమలాపురం, రామచంద్రపురం. ఈ రెవెన్యూ డివిజన్లను 22 మండలాలుగా విభజించారు .

మండలాలు

[మార్చు]

జిల్లా పునర్వ్యవస్థీకరణ తర్వాత కొత్తపేట రెవెన్యూ డివిజను ఏర్పాటు చేశారు.[5] దీని ఫలితంగా అమలాపురం డివిజనులో 10, కొత్తపేట రెవెన్యూ డివిజనులో లో 7, రామచంద్రపురం డివిజనులో 5 మండలాలు ఉన్నాయి.

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]
అంతర్వేది
ద్రాక్షారామం

ఇంకా కోనసీమ తిరుపతిగా విరాజిల్లుతున్న [వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, [అప్పనపల్లి] శ్రీ బాలబాలాజీ వారి దేవస్థానం, [అయినవిల్లి]లోని విఘ్నేశ్వరుడి ఆలయం, మురమళ్ల]లోని భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయం, [ర్యాలీ]లోని జగన్మోహిని కేశవస్వామి ఆలయం, [ముక్తేశ్వరం]లోని క్షణ ముక్తేశ్వరాలయం, [పలివెల]లోని శ్రీ ఉమా కొప్పులింగేశ్వర ఆలయం [మందపల్లి]లోని శనీశ్వర ఆలయం [మురమళ్ళ] శ్రీ శ్రీ శ్రీ మాణిక్యాంబా ఆలయం

పట్టణాలు

[మార్చు]

రాజకీయ విభాగాలు

[మార్చు]

కోనసీమ జిల్లాలో రెండు లోక్‌సభ నియోజకవర్గాలు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.[6]

లోక్‌సభ నియోజకవర్గాలు

[మార్చు]

అసెంబ్లీ నియోజకవర్గాలు

[మార్చు]
  1. అమలాపురం
  2. కొత్తపేట
  3. పి. గన్నవరం
  4. ముమ్మిడివరం (పాక్షికం). మిగిలిన భాగం కాకినాడ జిల్లాలో ఉంది.
  5. మండపేట
  6. రాజోలు
  7. రామచంద్రపురం

రవాణా వ్యవస్థ

[మార్చు]

ఆలమూరు, సిద్దాంతం వద్ద గోదావరి నదిపై వంతెనల నిర్మాణంతో జిల్లాలోని అన్ని ప్రాంతాలు చక్కటి రహదారులతో అనుసంధానించబడ్డాయి.కోనసీమ ప్రాంతాన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్‌కు కలుపుతూ గోదావరి నదిపై యానాం - యెదురులంక వంతెనను బాలయోగి వారధిగా 2002లో ప్రారంభించారు. కోనసీమ జిల్లాకు కాకినాడ నుండి కోటిపల్లి వరకు 45 కి.మీ రైలు మార్గం (బ్రాడ్ గేజ్) సౌకర్యం ఉంది. సమీప విమానాశ్రయం రాజమండ్రి విమానాశ్రయం.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

కోనసీమ జిల్లాల్లో 1420 ప్రాథమిక పాఠశాలలు,292 ప్రాథమికోన్నత పాఠశాలలు, 413 ఉన్నత పాఠశాలలు వివిధ నిర్వహణల కింద పనిచేస్తున్నాయి.ప్రాథమిక పాఠశాలలో 3610 మంది ఉపాధ్యాయులు, యుపి పాఠశాలలో 1833 మంది, ఉన్నత పాఠశాలల్లో 4560 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 75 జూనియర్ కళాశాలల్లో 949 మంది లెక్చరర్లు పనిచేస్తున్నారు. [ఆధారం చూపాలి]

ఆర్ధిక స్థితిగతులు

[మార్చు]

కోనసీమ జిల్లా వ్యవసాయం ప్రధానంగా వున్న జిల్లా.నీటి సదుపాయం ఉన్నందున వ్యవసాయం, (అక్వా కల్చర్) జిల్లా ప్రజలకు ప్రధాన వృత్తులుగా ఉన్నాయి.కోనసీమలో వరి తర్వాత ఎక్కువగా అరటిని పండిస్తారు.వీటితోపాటు అరటి, మామిడి, పనస, సపోటా, బత్తాయి పంటలు పండిస్తారు.లంక గ్రామప్రాంతాలలో విస్తారంగా పండిస్తారు.ఇటీవల జరిపిన పరిశోధనల మూలంగా సహజవాయువు నిలువలు బయటపడడం వలన ఈ ప్రదేశం పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుంది.చమురు శుద్ధి కర్మాగారాలున్నాయి. ప్రస్తుతం ఇది దేశంలో అతి పెద్ద చమురు, సహజవాయు ఉత్పత్తి కేంద్రంగా ఉంది.

సంస్కృతి

[మార్చు]

ఈ ప్రాంతం పురాతన ఆంధ్ర సంస్కృతీ సంప్రదాయాల నిలయం. ఇక్కడ ఇంకా అంతరించని కొన్ని ఆంధ్ర సంప్రదాయాలు చూడవచ్చు. అతిథి, అభ్యాగతులను ఆదరించడం, పండుగలను, పబ్బాలను సంప్రదాయానుసారంగా నిర్వహించడం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక్కడి వారు కొత్తవారిని అండీ, ఆయ్ అంటూ ఒక ప్రత్యేక శైలిలో ఆప్యాయంగా పలకరించడం చూడవచ్చు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
  2. 2.0 2.1 "జనగణన". Konaseema district. Retrieved 2022-07-23.
  3. 3.0 3.1 "కోనసీమకు ఆ పేరు ఎలా వచ్చింది?". BBC News తెలుగు. 2022-05-29. Retrieved 2022-10-14.
  4. "New Districts In AP: ఏపీలో కొత్త జిల్లాలివే.. గెజిట్ విడుదల". ETV Bharat News. Retrieved 2022-04-03.
  5. "పులివెందుల వాసులకు గుడ్ న్యూస్.. ఇక అధికారికంగా... జగన్ సర్కారు ఉత్తర్వులు". సమయం. 2022-06-29. Retrieved 2022-06-30.
  6. "District-wise Assembly-Constituencies". ceoandhra.nic.in.

వెలుపలి లింకులు

[మార్చు]