ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చరిత్ర
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చరిత్ర ఆనవాళ్లు సా.శ.350 నుండి లభిస్తున్నాయి. తొలిగా, మౌర్యులు, నందులు పరిపాలించగా, 5 వశతాబ్దంలో విష్ణుకుండినులు పాలించారు. 7 వశతాబ్దంలో తూర్పు చాళుక్యుల పరిపాలనలో దాక్షరామంలో భీమారామం ఆలయ నిర్మాణం జరిగింది. ఆ తరువాత చాళుక్య చోళులు, వెలనాటి చోడులు, కాకతీయలు, ఢిల్లీ సుల్తానులు, విజయనగర రాజులు, కళింగ రాజులు, రెడ్డి రాజులు,గజపతులు, గోల్కొండ రాజులు, నిజాం పాలించిన పిదప బ్రిటీషు వారి పాలనలోకి వచ్చింది.
1953లో మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు భాష మాట్లాడే జిల్లాలతో కొత్తగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రంలో భాగమైంది. ఆ తరువాత అవిభక్త ఆంధ్రప్రదేశ్, తెలంగాణా విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్ లో భాగమైంది. పోలవరం ప్రాజెక్టుకొరకు ముంపు మండలాలను తెలంగాణా నుండి ఈ జిల్లాలో కలిపారు. 2022 జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా, రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గ పరిధితో జిల్లాపరిధిని సవరించుటకొరకు, దక్షిణంగా వున్న ప్రాంతాలు కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లాలలో, ఉత్తరంగా వున్న గిరిజన ప్రాంతాలను అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేర్చగా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉత్తర భాగంలో, గోదావరికి నదీతీరానికి పశ్చిమంగా వున్న కొన్ని ప్రాంతాలను ఈ జిల్లాలో కలిపారు.
తొలి హిందూరాజులు
[మార్చు]ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మిగిలిన దక్కన్ పీఠభూమిలాగా మౌర్యులు, నందుల చేత పాలించబడింది. మౌర్యసామ్రాజ్య పతనము తరువాత మూడవ శతాబ్దం ప్రముఖ కవి, రాజు అయిన హలచక్రవర్తి వరకు ఈ ప్రదేశం శాతవాహనుల చేత పాలించబడింది. త్రవ్వకాలలో లభించిన నాణ్యాలు ఆధారంగా గౌతమీపుత్ర శాతకర్ణి, వాసిష్టీ-పుత్ర పులుమాయి, యజ్ఞశ్రీ శాతకర్ణి పాలించినట్లు నిరూపితమైంది. సా.శ.350 లో పిష్టాపుర, అవాముఖ కాలంలో ఈ ప్రదేశం మీద సముద్రగుప్తుడు దండెత్తినట్లు ఆధారాలు ఉన్నాయి. సముద్రగుప్తుని దండయాత్ర తరువాత ఇక్కడ 375-500 వరకు మధరాకుల సామ్రాజ్యం పాలనసాగింది. వీరిలో మొదటి పాలకుడు మహారాజా శక్తివర్మ.
ఈ ప్రాంతం 5వ శతాబ్దంలో విక్రమ వర్మ కాలంలో విష్ణుకుండినుల హస్తగతం అయింది. విష్ణుకుండినుల సామ్రాజ్యం ఉమ్మడి విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల వరకు విస్తరించింది. ఇంద్రభట్టారకుడు విష్ణుకుండినుల సామ్రాజ్యం స్థాపించాడు. త్వరితంగా కళింగ సైన్యాల చేత ఓడింపబడ్డాడు. ఇంద్రభట్టారకుడు తరువాత మూడవ మాధవర్మ, మంచన్న భట్టారక పాలన కొనసాగింది. వీరు తమ సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించాలని ప్రయత్నించారు. ఈ వంశపు కడపటి చక్రవర్తి మూడవ మాధవర్మ.
చాళుక్యులు, చోళులు
[మార్చు]బాదామి చాళుక్యులకు చెందిన పులకేశి II, అతని సోదరుడు విష్ణువర్ధనుడు 7వ శతాబ్దంలో పిష్టాపురం రాజధానిగా ఈ ప్రాంతంపై అధిపత్యం వహించాడు. కుబ్జ విష్ణువర్ధనుడు స్థాపించిన తూర్పు చాళుక్య సామ్రాజ్యం పిష్టాపురం నుండి వేంగి, రాజమండ్రి వరకు విస్తరించింది. అనేక రాజులు పాలించిన కారణంగా వారి వంశస్థుల పాలనా చరిత్రలో స్పష్టత కొరవడింది. తొలి చాళుక్య చక్రవర్తి బీమా దాక్షారామంలో శివాలయం ఆలయనిర్మాణం చేసాడు. సా.శ. 973లో ఈ సామ్రాజ్యపు చక్రవర్తి అయిన ధనార్వుని పెదకల్లు (కర్నూలు జిల్లా) జాతచోడ భీమవప చంపి వేంగిని ఆక్రమించుకున్నాడు. ధనార్వుడి ఇద్దరు కుమారులైన మొదటి శక్తివర్మ, విమలవర్మ పారిపోయి మొదటి రాజరాజచోళుని సభలో ప్రవేశించి అతనిని ఆశ్రయించాడు. రాజరాజ చోళుడు ధనార్వుని కుమారుల తరపున వేంగి మీద దండెత్తి జాతచోడ భీమను చంపాడు. కల్యాణికి చెందిన పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన సత్యరాయునికి వేంగి ప్రాంతం మీద చాళుక్యుల ఆధిపత్యం నచ్చలేదు. ఆ కారణంగా చోళులు, చాళుక్యుల మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. సా.శ. 1075లో విజయాదిత్యుడి VII మరణం తరువాత తూర్పు చాళుక్య సామ్రాజ్యం ముగిసింది.
విజయాదిత్య VII శత్రువైన కులోత్తుంగచోళుడు I (రాజేంద్రచాళుక్యుడు) చోళుల తరఫున యుద్ధంచేసి చాళుక్య చోళుల సామ్రాజ్య స్థాపన చేసాడు. వేంగి రాజ్యంతో పాటు ఈ జిల్లా వారి సామ్రాజ్యంలో ఒక భాగం అయింది. జిల్లాలో అధిక భాగం చోళుల సామంతరాజైన వెలనాటి చోడుల ఆధిక్యతకు వశమైంది. చోళసామ్రాజ్యపు ప్రముఖ పాలకులలో కొందరు గొంకా I, రాజేంద్రచోడా II, రెండవ గొంకా II.
ఈ ప్రదేశాన్ని పడమటి చాళుక్యుడైన విక్రమచోడుడు VII ఆక్రమించుకుని కొంతకాలం ఆధిక్యత సాధించాడు. అయినా ఇది తిరిగి వెలనాటి చోడ, చాళుక్యుల వశమైంది. తరువాత వెలనాటి చోడులు తిరుగుబాటుదారులైన కోణాకు చెందిన హైహయులు, కాకతీయులకు చెందిన రెండవ గొంకా, రుద్రాలచేత అణచబడ్డారు.
కాకతీయులు ఢిల్లీ సుల్తానులు
[మార్చు]కాకతీయ చక్రవర్తి రెండవ ప్రోలా పశ్చిమ చాళుక్యుల నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. అప్పటి నుండి చాళుక్యచోళులకు ప్రతిద్వంది అయ్యాడు. అతను కుమారుడు రుద్రా రెండవ చాళుక్యచోళుని నుండి గోదావరి డెల్టాను బహుమతిగా పొందాడు. గోదావరి డెల్టా మీద రుద్రా ఆధిపత్యాన్ని వెలనాడు చోడాలు ఎదిరించారు. చాళుక్య చోళ వెలనాటి రాజైన రెండవ రాజేంద్ర చోడా అతను మంత్రి దేవన ప్రగ్గడ సైన్యాధ్యక్షతలో రుద్రా మీదకు దండయాత్రకు పంపించాడు. రుద్రా అతను కనిష్ఠ సోదరుడు మహాదేవా దేవగిరి యాదవులతో జరిగిన యుద్ధంలో మరణించిన తరువాత రాజ్యపాలన చేపట్టాడు. అతను కుమారుడు గణపతి కాకతీయ సింసానానికి తరువాత రాజయ్యాడు. గణపతి నెల్లూరు చోడుల సహాయంతో ఉత్తరంలోని కళింగ సైన్యాలను, మధురై పాండ్యులను, చోళులను ఓడించాడు. గణపతి కామము అతను కుమార్తె రుద్రమదేవి కాలం అంతా గోదావరి ప్రదేశమంతా కాకతీయుల ఆధిపత్యం కొనసాగింది. 1295లో ప్రతాప రుద్రుడు కాకతీయ సింహాసనం అధిష్ఠించినప్పటికీ ఢిల్లీ సుల్తానులతో అనేక పోరాటాలను ఎదుర్కొన్నాడు. 1323లో అతను ముహ్హమద్-బీన్-తుగ్లక్ చేతిలో ఓడిపోయిన తరువాత ఈ జిల్లా ఢిల్లీ సుల్తానుల ఆధిపత్యానికి చేరింది. వారు దక్షిణభారతదేశాన్ని అయిదు సంస్థానాలుగా విభజించి వాటికి గవర్నర్లను నియమించారు.
ముసునూరి నాయకర్లు, రెడ్లు, ఇతర హిందూరాజులు
[మార్చు]ఢిల్లీ సుల్తానులు ప్రాంతీయ ప్రముఖులైన ప్రొలయా ముసునూరి నాయకుల తెగల నిరంతర తిరుగుబాటును ఎదుర్కొన్నారు. అద్దంకి రెడ్లు, పిఠాపురం కొప్పుల తెలగాలు, రాచకొండ రేచర్ల వెలములు అతనుకు సహకరించారు. మునుసూరి కాపయ నాయకా తన బంధువులు అయిన అన్వొత నాయకా, ముమ్మడి నాయకా (కోరుకొండ)లను గోదావరీ ప్రదేశానికి గవర్నర్లుగా నియమించాడు. ముమ్మడి నాయకా కాపయ నాయకా మేనకోడలిని వివాహం చేసుకున్నాడు. 1388 వరకు ముమ్మడి నాయకా జీవించాడు. అతనుకు ముగ్గురు కుమారులు తరువాత 40 సంవత్సరాలు ఈ ప్రాంతం మీద ఆధిపత్యం వహించి కొండవీటి రెడ్లచేత అణిచివేయబడ్డారు. తరువాత కళింగరాజైన ఐదవ నరసింహదేవ ఈ ప్రదేశాన్ని జయించి పాలించాడు అయినా రాజమడ్రికి చెందిన అనవొత రెడ్డిచేత అది తిరిగిస్వాధీనపచుకోబడింది. అతను తరువాత అదే సామ్రాజ్యానికి చెందిన అనవేమరెడ్డి, కుమరగిరి ఈ ప్రాంతాన్ని పాలించారు.
కుమరగిరి రాచకొండకు చెందిన రాచెర్లులు, కళింగ రాజులతో అనేక యుద్ధాలు చేసాడు. అతను తన కుమారుడైన అనవోత వెంట సైన్యాధ్యక్షుడు కాటయ వేముని తూర్పు ప్రాంతాలను జయించడానికి పంపాడు. ఫలితంగా ఉత్తరంగా పలు ప్రాంతాలు సింహాచలం వరకు సామ్రాజ్యంలో చేరాయి. కొత్తగా లభించిన ప్రాంతం రెడ్డిరాజుల రాజ్యంలో చేరింది. అలాగే ఈ విభాగం ప్రత్యేకంగా తూర్పురాజ్యంగా పిలువబడింది. రాజకుమారుడు అనవోత రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని ఈ ప్రాంతాన్ని పాలించాడు. అతను 1395 వరకు పాలించిన తరువాత చిన్న వయసులోనే మరణించాడు. తరువాత సైన్యాధ్యక్షుడు, బావమరిది అయిన కాటయ వేమునికి అతను చేసిన సేవలకు గుర్తింపుగా రాజమహేంద్రవరం లభించింది. కాటయ వేమను కొండవీటి సింహాసనం నుండి పెదకోమటి వేమ బలవంతంగా త్రోసి వేసిన తరువాత కాటయవేమ రాజమహేంద్రవరానికి వెళ్ళాడు.
పెదకోమటి వేమ, కాటయ వేమను ఓడించబడిన తరువాత కాటయవేమకు ఎరువా సైన్యాధ్యక్షుడు అన్నదేవ చోడునితో యుద్ధం ఏర్పడింది. అతను రాజమహేంద్రవరం లోని చాలాభాగం ఆక్రమించుకోబడింది. ఎలాగైతేనే అతడు కాటయవేమతో తరమబడ్డాడు. కాటయవేమ అన్నదేవచోడునితో చేసిన ఒక యుద్ధంలో మరణించాడు. అతను మరణించిన తరువాత అల్లాడరెడ్డి కాతయవేమ కుమారుడిని రాజమహేంద్రవరం పాలకుడిగా చేసి తాను రాజప్రతినిధిగా ఈ ప్రాంతాన్ని పాలించాడు. అల్లాడరెడ్డి 1423 లో తనకు మరణం సంభవించే వరకు ఈ ప్రాంతాన్ని పాలించాడు. 1443లో విజయనగరం పాలకుడైన రెండవ దేవరాయ రాజు వీరభద్రుని ఓడించి ఈ రాజ్యాన్ని పాలించాడు.
కొండవీడులో పెదకోమటి వేమ తరువాత రాచవేమ సింహాసనాధిష్టుడయ్యాడు. అతను పాలన చాలా క్రూరంగా ఉండేది. ఒడిషా నుండి గజపతులు, విజయనగర రాయలు దండెత్తినప్పుడు అతనుకు ప్రజల నుండి కొంత సహాయం లభిస్తుండేది. కపిలేశ్వర గజపతి రెడ్డిరాజులను అణచివేసి రాజమహేంద్రవరాన్ని తన రాజ్యంలో కలుపుకున్నాడు.
1470 కపిలేశ్వర గజపతి మరణించిన తరువాత అతను కుమారులైన హాంవీర, పురుషోత్తమా మధ్య రాజ్యం కొరకు యుద్ధం చేసారు. బహ్మనీల సహాయంతో హంవీర రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు అయినా అతను ఎక్కువ కాలం నిలువ లేదు. పురుషోత్తమ హంవీరను త్రోసి రాజమహేంద్రవరం మిగిలిన ప్రదేశాలను తిరిగి జయించాడు. కాని మూడవ మహమ్మద్ షా ఆధ్వర్యంలో సైన్యాలు రాజమహేంద్రవరానికి వచ్చాయి. ఈ యుద్ధం చివరకు శాంతి ఒప్పందంతో ముగిసింది. మూడవ మహమ్మద్ షా మరణించిన తరువాత పురుషోత్తమ గజపతి గోదావరీ, కృష్ణా పరీవాహక ప్రాంతమంతా దక్షిణంగా కొండవీటి వరకు బహ్మనీ సైన్యాలను పారద్రోలాడు. పురుషోత్తమ తరువాత అతను కుమారుడు ప్రతాపరుద్ర పాలనా పగ్గాలు చేపట్టాడు. విజయనగర సామ్రాజ్యాధినేతకృష్ణదేవరాయలు ఈ రాజ్యాన్ని లోబరుచుకుని తన సామంతరాజ్యం చేసుకున్నాడు. అయినా వారిరువురి నడుమ జరిగిన ఒప్పందం ప్రకారం ప్రతాపరుద్రుని కుమార్తెను కృష్ణదేవరాయలుకు ఇచ్చి వివాహం చేసాడు. అందుకు బదులుగా తాను జయించిన భూభాగాన్ని తిరిగి ఇచ్చాడు.
తరువాతి ముస్లిం రాజులు
[మార్చు]గోల్కొండ పాలకుడు కుతుబ్ షాహి రాజ్యంలో ఏర్పడిన అననుకూల పరిస్థితులను తనకూలంగా మలచుకుని సుల్తాన్ కులీ కుతుబ్ షాహి కోస్తా ప్రాంతం మీద దండయాత్రచేసి రాజమండ్రి, దాని పరిసర రాజ్యాలను కైవశం చేసుకున్నాడు. సుల్తాన్ కులీ కుతుబ్ షాహి హత్యచేయడిన తరువాత అతడి కుమారుడైన జమ్షిద్ కుతుబ్ షాహ్ తరువాత అతను మనుమడు సుభాన్‌కుతుబ్‌షాహ్సింహాసనం అధిష్టించాడు. అతడి పాలనా కాలంలో ఇబ్రహీం షితాబ్‌ఖాన్, విద్యాధర్ల నుండి సవాళ్ళను ఎదుర్కొన్నాడు. అబ్దుల్ హాసన్ తానాషా ఈ ప్రదేశానికి చివరి పాలకుడు అయ్యాడు. అతను 1672-1687 మధ్య పాలన సాగించాడు. ఈ కాలంలోనే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆధిపత్యంలోకి దక్షిణ భారతదేశం చేరింది. 1687 గోల్కొండ రాజ్యాన్ని ఔరంగజేబు జయించి స్వాధీనం చేసుకున్నాడు. అలాగే గోదావరి జిల్లా కూడా అతడి ఆధీనంలోకి వచ్చింది. అతడి సామ్రాజ్యంలోని 22 విభాగాలలో గోదావరి కూడా ఒకటి అయింది. ఔరంగజేబు ఈ సంస్థానాలను పాలించడానికి గవర్నర్లను నియమించాడు. మొఘల్ చక్రవర్తి ఫర్రుక్‌సియార్ దక్కన్ విభాగాన్ని పాలించడానికి నిజామ్- ఉల్ - ముల్క్ గా అసఫ్ జాను వైస్రాయ్ గా నియమించాడు. ముహామ్మద్ షా సమయంలో అసఫ్‌జా స్థానంలో హుస్సేన్ అలి ఖాన్ ఖాన్ నియమించబడ్డాడు, దక్కన్ లోని తీర ప్రాంతాలు ముబరిజ్‌ఖాన్ అధీనంలోకి వచ్చాయి. నిజాం షకర్‌ఖేరా యుద్ధంలో ముబరిజ్ ఖాన్ ను చంపి, దక్కన్ ప్రాంతాన్ని ఏకంచేసి స్వతంత్రంగా పాలించాడు.
1748లో నిజామ్ ఉల్ ముల్క్ మరణానంతరం అతను కుమారుడు నాసిర్‌జంగ్, మనుమడు ముజాఫర్‌జంగ్ మధ్య సింహాసనం కొరకు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటిష్, ఫ్రెంచ్ చెరి ఒక వైపు చేరారు. ఫ్రెంచ్ జనరల్ బుస్సీ, ముజాఫర్ జంగ్ మరణానంతరం సలాబత్ జంగ్ను రాజును చేశారు. ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ బుస్సీని భారతదేశం దక్షిణ ప్రాంతానికి పోయిన కొద్ది కాలంలోనే విజయనగర రాజు పసుపతి ఆనందగజపతి రాజా ఆంగ్లేయులకు ఉత్తర సర్కారుల (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, ఒడిషా) ను ఆక్రమించుకొనమని ఆహ్వానం పంపాడు. ఫ్రెంచ్, ఆంగ్లేయుల మధ్య చెలరేగిన ఈ కలహాలు చివరకు ఫ్రెంచ్ వారు ఓడిపోవటంతో ముగిసాయి. ఫ్రెంచ్ ఆధిపత్యం వదులుకుంటూ తమ దక్కన్ ఆధిక్యానికి గుత్రుగా యానాంను మాత్రమే తమ స్వాధీనంలో వుంచుకొన్నది.
సలాబాత్ జంగ్ తరువాత పరిపాలించిన నిజామ్ అలి ఖాన్ రాజమండ్రి, చికాకోల్ (ప్రస్తుతం శ్రీకాకుళం) లను హాసన్ అలి ఖాన్‌కు గుత్తకు ఇచ్చాడు. లార్డ్ క్లైవ్ ఉత్తర సర్కారుల మీద ఆధిపత్యం కొరకు 1765 ఆగస్టులో మొఘల్ చక్రవర్తి షాహ్ అలామ్ తో చర్చలు జరిపి అంగీకారాన్ని పొందాడు. కొండపల్లి కోటను ఆక్రమించిన బ్రిటిష్ ప్రభుత్వం అవసర సమయాలలో సైన్యాలను నడిపించడానికి జనరల్ సిల్లౌడ్ ను మచిలీపట్నానికి పంపింది. నిజామ్ కూడా చురుకుగా యుద్ధప్రయత్నాలను చేపట్టాడు. కాని 1766 నవంబరు 12 న జరిగిన ఒప్పందం కారణంగా నిజాంకు బ్రిటీష్ వారికి మధ్య యుద్ధం ఆగిపోయింది. 1778 మార్చి ఒకటిన జరిగిన రెండవ ఒప్పందంలో నిజామ్ ప్రభుత్వం షాహ్ ఆలమ్ చేత ఇవ్వబడిన అధికారాన్ని తెలుసుకుంది. బదులుగా సంవత్సారానికి 50,000లను తీసుకోవడానికి స్నేహపూరిత ఒప్పందం జరిగింది. 1823 నాటికి ఈ ప్రాంతం మీద అధికారం నిజామ్ నుండి బ్రిటిష్ ప్రభుత్వానికి మారి మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక భాగం అయింది
ఈ జిల్లా బ్రిటిష్ అధీనంలోకి వచ్చే ముందు జమిందారుల ప్రాముఖ్యత అధికంగా ఉండేది. జమీందారులైన రంప, తోటపల్లి, జమ్మిచావడి, జద్దంగి, పెద్దాపురం, పిఠాపురం, కోట, రామచంద్రపురం మొదలైనవి ప్రదేశంలో ప్రధానమైనవి.[1]
బ్రిటీషు హయాంలో అభివృద్ధి
[మార్చు]1852లో సర్ ఆర్ధర్ కాటన్ ఆధ్వర్యంలో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం పూర్తయింది. దీనితో జిల్లాలో వరి, చెరకు విస్తారంగా సాగయింది. 20 సంవత్సరాలలో జిల్లా జనాభా మూడింతలయ్యింది. విశాఖ, గంజా తదితర ప్రాంతాల ప్రజలు వలస వచ్చారు.[2]
1947 - 2014
[మార్చు]1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మద్రాస్ ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా అవతరించింది. ఈ జిల్లా 1953లో తెలుగు భాష మాట్లాడే జిల్లాలతో ఏర్పడ్డ కొత్త ఆంధ్ర రాష్ట్రంలో భాగమైంది. ఆ తరువాత 1956 లో తెలంగాణ ప్రాంతంలో తెలుగు మాట్లాడే జిల్లాలతో కలిసి ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమైంది. 2014 లో తెలంగాణ విభజన తర్వాత, అవశేష ఆంధ్రప్రదేశ్ లో కొనసాగింది.
2001 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 59 మండలాలు ఉన్నాయి. జివో నంబరు 31 ద్వారా రౌతులపూడి అనే కొత్త మండలాన్ని 44 గ్రామాలతో ఏర్పరచారు. శంఖవరం నుండి 12 గ్రామాలు, కోటనందూరు నుండి 31 గ్రామాలు, తుని నుండి ఒక గ్రామాన్ని విడదీసి ఈకొత్త మండలాన్ని ఏర్పరచారు. దీనితో మొత్తం 60 మండలాలు అయ్యాయి.
2014 - 2022
[మార్చు]తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం ఖమ్మం జిల్లాకు చెందిన భద్రాచలం (రామాలయమున్న భద్రాచలం రెవెను గ్రామం మినహా), చింతూరు, వరరామచంద్రాపురం, కూనవరం అనే 4 మండలాలు ఈ జిల్లాలో కలిసినవి. మొదట్లో ఈ 4 ముంపు మండలాలను రంపచోడవరం రెవెన్యూ డివిజనులో ఉంచినప్పటికీ, 2015లో ఎటపాక రెవెన్యూ డివిజను ఏర్పాటుచేస్తున్నప్పడు అందులోకి మార్చబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసిన భద్రాచలం గ్రామీణ మండలాన్ని నెల్లిపాక మండల కేంద్రంగా చేస్తూ గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎటపాకను రెవెన్యూ డివిజన్ కేంద్రంగానే కాక రెవెన్యూ మండలంగా మార్చబడటంతో, ఇక నెల్లిపాక మండలానికి బదులుగా ఎటపాక మండలంగా గుర్తించబడటం జరిగింది.[3]
పై మార్పుల ఫలితంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏడు రెవెన్యూ డివిజన్లు, మండలాలు 64, మండల ప్రజా పరిషత్తులు 57, పంచాయితీలు 1,012,మునిసిపాలిటీలు, కార్పొరేషనులు 9, పట్టణాలు 14, గ్రామాలు 1379 వుండేవి. రెవెన్యూ డివిజన్లు: 1.కాకినాడ 2.పెద్దాపురం 3.అమలాపురం 4.రాజమహేంద్రవరం 5.రంపచోడవరం 6. రామచంద్రపురం 7.ఏటపాక.
2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణ
[మార్చు]2022 జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా, రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గ పరిధితో జిల్లాపరిధిని సవరించుటకొరకు, దక్షిణంగా వున్న ప్రాంతాలు కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లాలలో, ఉత్తరంగా వున్న గిరిజన ప్రాంతాలను అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేర్చగా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉత్తర భాగంలో, గోదావరికి నదీతీరానికి పశ్చిమంగా వున్న కొన్ని ప్రాంతాలను ఈ జిల్లాలో కలిపారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ SERIES-29 PART XII-A Census of India 2011, EAST GODAVARI DISTRICT, DISTRICT CENSUS HANDBOOK VILLAGE AND TOWN DIRECTORY. Director of Census operations, Andhra Pradesh. 2014. pp. 20–24.
- ↑ "తూర్పు గోదావరి జిల్లా చరిత్ర". ఈనాడు. Archived from the original on 2012-06-21.
- ↑ "డివిజన్ కేంద్రంగా ఎటపాక". web.archive.org. 2016-06-27. Archived from the original on 2016-06-27. Retrieved 2019-12-27.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.