Jump to content

తక్లమకాన్ ఎడారి

వికీపీడియా నుండి
(తెక్లిమకాన్ ఎడారి నుండి దారిమార్పు చెందింది)
తక్లమకన్ ఎడారి
ఖండాంతర ఎడారి, శీతల ఎడారి, ఇసుక ఎడారి
తక్లమకన్ ఎడారి, వాయువ్య చైనా
పేరు వ్యుత్పత్తి: ఉయ్ఘర్ భాషలో “వెళ్ళడమే గాని తిరిగి రాలేని ప్రాంతం (Place of no return)” అనగా “ You can get into it but can never get out”
ఇతర పేర్లు: తక్లిమకన్ ఎడారి, తెక్లిమకన్ ఎడారి
దేశం  China
రాష్ట్రం షిన్జాంగ్–ఉయ్ఘర్ అటానమస్ ప్రాంతం
భోగోళిక ప్రాంతం తారిం బేసిన్
Borders on టియన్ షాన్ పర్వతాలు (ఉత్తరం)
కున్ లున్ పర్వతాలు (దక్షిణం)
గోబీ ఎడారి
పామీర్ పర్వతాలు (పడమర)
పొడవు 960 km (597 mi), తూర్పు-పడమరలుగా
Width 420 km (261 mi), ఉత్తర-దక్షిణాలుగా
వైశాల్యం 3,37,000 km2 (1,30,116 sq mi)
Biome Desert
Plant తామరిక్స్, నైట్రే పొదలు, రెల్లు, Turanga Poplar, Oleaster
Animal బాక్రియన్ ఒంటెలు, Gerbills, Jerboa
నదులు-ఉపనదులు తారిమ్, ఆక్సు, యార్కండ్, హోటాన్, కెరియా, ముజాత్, కైదు
ఓయాసిస్ నగరాలు కాష్గర్, ఆక్సు, తుర్ఫాన్, దన్ హాంగ్, యార్కండ్, ఖోటాన్, కెరియా, కార్ కాన్, కార్కిలిక్
అక్షాంశాలు 38°54′N, 82°12′E
శీతోష్ణస్థితి మండలం సమ శీతోష్ణ మండలం
శీతోష్ణస్థితి శీతల ఎడారి శీతోష్ణస్థితి (Cold Desert Climate)
శుష్క వాతావరణం
Cold and dry winters (శీతాకాలం)
Hot and dry summers (వేసవికాలం)
గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 50°C & (-) 40°C
వర్షపాతం ఏడాదికి 4 సెంటీ మీటర్ల కన్నా తక్కువ
ముఖ్య ఖనిజ వనరులు ఆయిల్, నేచురల్ గ్యాస్ నిక్షేపాలు
ప్రధాన ఎడారి రహదారులు Lunmin Cross Desert Highway
Taqie Desert Highway
Ahe Cross Desert Highway

తక్లమకాన్ ఎడారి చైనా దేశంలోని షిన్జాంగ్–ఉయ్ఘర్ (Xinjiang-Uyghur) అటానమస్ ప్రాంతపు నైరుతి భాగంలో విస్తరించిన ఇసుక ఎడారి. ఇది తారిమ్ నదీ పరీవాహక ప్రాంతంలో (Tarim Basin) లో విస్తరించి ఉంది. ఈ ఎడారి విస్తీర్ణంలో 85 శాతం కదిలే ఇసుక దిబ్బలు (Shifting Sand Dunes) ఆక్రమించి ఉన్నాయి. క్రమం తప్పకుండా తరలే ఇసుక దిబ్బలు ఈ ఎడారి యొక్క ఒక ప్రత్యేకత. ఉయ్ఘర్ భాషలో తక్లామకిన్ అనగా “వెళ్ళడమే గాని తిరిగి రాలేని ప్రాంతం (Place of no return)” అంటే “ You can get into it but can never get out”. అందుకే ఈ ఎడారిని “ మృత్యు సముద్రం (The Sea of death) గా, మృత్యు ఎడారిగా (The Desert of death) పిలుస్తారు. మూడు వైపులా పర్వతాలు, మరోవైపు గోబీ ఎడారి ని కలిగివున్న తక్లమకాన్ ఎడారి ఒకప్పుడు దుర్భేధ్యమైన ప్రాంతంగా పేరొందినప్పటికి, ఈ ఎడారిలో బయల్పడిన అపారమైన చమురు, సహజవాయు నిక్షేపాలు కారణంగా చైనా దేశానికి సహజ వనరుల పరంగా, ఆర్ధికంగా ఈ ఎడారి కీలక వ్యూహాత్మక ప్రాంతంగా మారింది.

తక్లమకాన్ ఎడారి ప్రత్యేకతలు

[మార్చు]
  • చైనా దేశంలో వున్న అతి పెద్ద ఎడారి. ప్రపంచంలోని అతి పెద్ద ఎడారులలో 16 వ స్థానం పొందింది. వేగంగా తరలే ఇసుక దిబ్బలు (shifting sand dunes) కలిగి వుండటం ఈ తక్లమకాన్ ఎడారి ఒక ప్రత్యేకతగా చెప్పవచ్చు. తరలే ఇసుక ఎడారి (Shifting Sand Desert) లతో పోలిస్తే ప్రపంచంలో రెండవ అతిపెద్ద తరలే ఇసుక ఎడారి గా గుర్తింపు పొందింది.
  • తక్లమకాన్ ఎడారి సమ శీతోష్ణ మండలం (Temperate zone) లో అందులోను ఖండాంతర్భాగంలో ఉనికిని కలిగివుంది. ఇక్కడి విలక్షణమైన శీతోష్ణస్థితిని ‘శీతల ఎడారి’ శీతోష్ణస్థితి (Cold Desert Climate) గా పేర్కొంటారు. శీతాకాలం చల్లగాను, పొడిగాను (Cold and Dry Winters) వుంటుంది. వేసవికాలం కొంచెం వేడిగాను, పొడిగాను (Hot and Dry Summers) వుంటుంది. హిమాలయాల వర్షఛాయా ప్రాంతంలో ఈ ఖండాంతర ఎడారి వుండటం వలన ఈ ఎడారి, భూమి మీద గల అత్యంత శుష్క ప్రాంతాలలో ఒకటిగా పేరుగాంచింది. దుర్భేధ్యమైన ఈ ఎడారిని మృత్యు ఎడారిగా (The Desert of death) వ్యవహరించేవారు.
  • మోల్చా (Molcha) నది ఈ ఎడారిలో ప్రవేశిస్తున్నప్పుడు వీవన ఆకారంలో (Fan shaped) ఏర్పరిచిన ఒండ్రు డెల్టా (Alluvial Delta) ప్రపంచంలోనే అతిపెద్ద ఒండ్రు డెల్టాగా గుర్తింపు పొందింది.
  • ప్రాచీన వాణిజ్య రహదారి అయిన సిల్క్ రూట్ (సిల్క్ రహదారి) ఈ ఎడారి ఉత్తర, దక్షిణ సరిహద్దుల గుండా పోతుంది. ఈ సిల్క్ రూట్ లో ప్రయాణించే వ్యాపారులకు ఆశ్రయం కలిగిస్తూ తూర్పున వున్న కాష్గర్ (Kashgar) నుండి పడమర వున్న దన్ హాంగ్ (Dunhuang) వరకూ ఎడారి అంచుల వెంబడి అనేక ఒయాసిస్ నగరాలు ఏర్పడి శతాబ్ధాల తరబడి గొప్ప చారిత్రిక, వాణిజ్య కేంద్రాలుగా విలసిల్లాయి.
  • పురావస్తు శాస్త్రవేత్తలు, అన్వేషకుల కృషి ఫలితంగా ఈ ఎడారిలో అంతరించిపోయిన ప్రాచీన నాగరికతా అవశేషాలు వెలుగులోనికి వచ్చాయి. ఎడారి మద్యన ఇసుక దిబ్బలలో పూడుకుపోయిన దాండన్ ఓలిక్ (Dandan Olik), లౌలాన్ (Loulan) వంటి అనేక ప్రాచీన నగరాల శిథిల ఆనవాళ్ళు కనుగొనబడ్డాయి. ఈ శిథిలాలలో లభ్యమైన పురావస్తు సంపదను బట్టి తొకేరియన్, పర్షియన్, గ్రీకు, భారతీయ, చైనీస్ ప్రజలతో ప్రభావితమైన ఒక ప్రాచీన బహుళ సాంస్కృతిక ఎడారి జనావాసాలు ఈ ఎడారి ప్రాంతంలో వికసించాయని సూచిస్తున్నాయి.
  • ఈ ఎడారి ఇసుకలో క్రీ.పూ. 2000 - 1800 కాలానికి చెందిన తొకేరియన్ ప్రజల మమ్మీలు (తారిమ్ మమ్మీలు) భద్రపరచబడిన స్థితిలో బయటపడ్డాయి. తొలి కంచు యుగం (Early Bronze Age) కు చెందిన ఈ తక్లమకాన్ ఎడారి మమ్మీలు ప్రాచీన ఆసియా ఖండపు నాగరికతలలో అంతుపట్టని రహస్యంగా మిగిలిపోయాయి. ఇప్పటివరకూ మనకు ప్రత్యక్షంగా లభ్యం అయిన అత్యంత ప్రాచీన జున్ను (cheese) అవశేషాలు ఈ మమ్మీల వద్దనే పదిలంగా దొరికాయి.
  • ఈ ఎడారిలో భూగర్భ జలాలతో పాటు ఆయిల్, నేచురల్ గ్యాస్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా తారిమ్ బేసిన్ లో 8 బిలియన్ల టన్నుల ఆయిల్, 10 ట్రిలియన్ల క్యూబిక్ మీటర్ల నేచురల్ గ్యాస్ నిక్షేపాలు వున్నట్లు అంచనా వేయబడింది. ఈ కారణంగానే చైనా దేశానికి తక్లమకాన్ ఎడారి ప్రధాన ఆర్థిక వ్యూహాత్మక స్థానంగా మారింది.
  • చైనా దేశం ఈ ఎడారికి అడ్డంగా ఉత్తర, దక్షిణ భూభాగాలను కలుపుతూ ప్రధాన ఎడారి రహదార్లను (Cross Desert Highway) నిర్మించింది. వీటిలో ఒకటైన లున్ మిన్ (Lunmin) ఎడారి రహదారి 522 కి.మీ. పొడవుతో ప్రపంచ ఎడారి రహదార్లలో అత్యంత పొడవైన రహదారిగా పేరుగాంచింది. ఈ రోడ్డును నిర్మాణం, నిర్వహణ దృష్ట్యా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రహదారిగా భావిస్తారు.

ఉనికి-విస్తరణ

[మార్చు]

తక్లమకాన్ ఇసుక ఎడారి వాయవ్య చైనాలోని షిన్జాంగ్–ఉయ్ఘర్ (Xinjiang-Uyghur) అటానమస్ ప్రాంతం లోని తారిం నదీ పరీవాహక ప్రాంతంలో (Tarim Basin) లో ప్రధానంగా ఉనికిని కలిగి ఉంది. ఈ ఎడారికి ఉత్తరాన్న టియన్ షాన్ (Tian Shan) పర్వతాలు, దక్షిణాన్న కునులున్ (Kunlun) పర్వతాలు, పశ్చిమాన్న పామీర్ (Pamir) పర్వతాలు, తూర్పున గోబీ ఎడారి సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పు-పడమరలుగా 960 కి.మీ., ఉత్తర-దక్షిణాలుగా 420 కి.మీ. వ్యాపించి, మొత్తం మీద 3,37,000 చ. కి.మీ. విస్తీర్ణంతో ప్రపంచంలోని అతి పెద్ద ఎడారులలో 16 వ స్థానం పొందింది. అయితే ‘తరలే ఇసుక ఎడారి (Shifting Sand Desert) లతో పోలిస్తే మాత్రం అరేబియా ద్వీపకల్పం లోని “రబ్ అల్ ఖలి” ఎడారి తరువాతి స్థానంలో నిలిచి తక్లమకాన్ ఎడారి ప్రపంచపు రెండవ అతిపెద్ద తరలే ఇసుక ఎడారిగా నిలుస్తుంది. మధ్య ఆసియాలో వున్న పెద్ద ఎడారిగాను, చైనా దేశంలో వున్న అతి పెద్ద ఎడారి గాను ఇది గుర్తింపు పొందింది. ఈ ఎడారి పడమర, దక్షిణ దిశలలో సముద్రమట్టం నుండి 1200-1500 మీ. ఎత్తులో, తూర్పు, ఉత్తర దిశలలో సముద్రమట్టం నుండి 800-1000 మీ. ఎత్తులో ఉంది.

భౌగోళిక స్వరూపం (Physiography)

[మార్చు]

తక్లమకాన్ ఎడారి నైసర్గిక స్వరూపం ఏర్పడిన విధానాన్ని పలక విరూపణ సిద్ధాంతం (Plate Tectonic Theory) వివరిస్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారం, భూమికి చెందిన బాహ్య లితోస్పియర్ (ఆశ్మావరణం) పొర అనేక పలకలుగా విడిపోయింది. అలా విడిపోయిన పలకలు ఆస్థినో ఆవరణపు (asthenosphere) చిక్కని శిలా ద్రవంలో తేలుతూ వివిధ దిశలలో చలిస్తున్నాయి. ఇలా పలకలు కదులుతున్నప్పుడు రెండు పలకలు ఒకొక్కసారి ఒకదానికి మరొకటి ఎదురెదురుగా రావచ్చు. లేదా రెండూ ఒకదానికొకటి దూరంగా జరగవచ్చు. లేదా రెండు పలకలు ప్రక్క ప్రక్కన జారుతూ ప్రయాణించవచ్చు. ఇండియన్ ఖండ పలక, యూరేసియన్ ఖండ పలకతో డీ కొడుతున్నప్పుడు ఇండియన్ పలక యూరేసియన్ పలక క్రిందకు చొచ్చుకొని పోయి subduction జోన్ ఏర్పడుతుంది. దీని ఫలితంగా ఏర్పడిన నైసర్గిక ఏర్పాటులో భాగంగా హిమాలయాల వంటి ముడుత పర్వతాలు ఒకవైపు, వాటికి అవతలివైపున లోతైన డిప్రషన్ (depression) వంటి నైసర్గిక స్వరూపాలు ఆవిర్భవించడం జరిగింది.ఈ depression లోనే తారిం బేసిన్, తక్లమకాన్ ఎడారి ఏర్పడ్డాయి.

ఈ ఎడారి తారిం బేసిన్ కేంద్రభాగంలో విస్తరించి ఉంది. సమీప పర్వతాలనుండి ప్రవహించే నదులు ఈ తారిం నదికి ఆధారంగా ఉన్నాయి. సాధారణంగా తారిం బేసిన్ వాలు దక్షిణం నుంచి ఉత్తరానికి వుండటం చేత కున్ కున్ పర్వతాలులో పుట్టిన నదులు వాలు దిశలోనే ఈ ఎడారిలో ప్రవహిస్తున్నాయి. నదీ ప్రవాహాల వలన అవక్షేపితమైన వదులుగా వున్న ఒండ్రు నిక్షేపాలు ఈ ఎడారిలో అనేక వందల మీటర్ల మందంతో పేరుకుపోయి ఉన్నాయి. అయితే ఈ ఒండ్రు నిక్షేపాల పైన 300 మీ. ఎత్తు మందం వరకు గాలిచే నిక్షీపించబడిన ఇసుక పేరుకొని ఉంది. ప్రదానంగా హొటాన్, కెరియా నదీ లోయలు ఇప్పటికీ నిలిచే ఉన్నాయి. మిగిలిన లోతు లేని నదులు ఈ ఎడారి ఇసుక పొరలలో ఇంకిపోవడం వాళ్ళ వాటి లోయలు ఖాళీగా వుండి ఇసుకతో నింపబడి ఉన్నాయి.

తారిం బేసిన్ కు చెందిన ఒండ్రు నిక్షీపాలు, సమీప పర్వత పాదాల వద్ద ఏర్పడిన నిక్షీపితాలు మొదలైనవి క్రమేణా శిథిలం కావడం వల్ల ఇసుక ఏర్పడింది. ఈ ఇసుకరేణువులు గాలుల వలన ఒకచోట నుండి మారోచోటకి కొట్టుకొనిపోతూ ఈ ఎడారిలో ఇసుక దిబ్బలను ఏర్పరిచాయి. గాలిచే ప్రయాణించడం వల్ల ఏర్పడిన ఈ ఇసుక దిబ్బలను వాయుకృత ఇసుక దిబ్బలు (Eolian Sand Dunes) గా పేర్కొంటారు.

అంతేకాక వీచే గాలుల ప్రభావం వలన ఈ ఇసుక దిబ్బలు ఒకచోట నుండి మారోచోటకి క్రమంగా తరలిపోతుంటాయి. అందువలన ఈ ఇసుక దిబ్బలను ‘తరలే ఇసుక దిబ్బలు’ (Shifting Sand Dunes) గా పేర్కొంటారు. ఈ తక్లమకాన్ ఎడారి విస్తీర్ణంలో 85 శాతం తరలే ఇసుక దిబ్బలే ఆక్రమించి ఉన్నాయి. ఈ తరలిపోయే ఇసుక దిబ్బలు భారీ సైజులలో వుంటాయి. సాధారణంగా ఇవి అర్ధచంద్రాకారంలో ఏర్పడి సుమారుగా 20 నుంచి 200 మీ. ఎత్తును, 300 మీ. వరకూ వెడల్పును కలిగి వుంటాయి. ఎడారి దక్షిణ ప్రాంతంలో వీటి సాధారణ ఎత్తు 140 మీ. వరకూ కూడా వుంటాయి. అర్ధచంద్రాకారంలో ఏర్పడిన ఇసుక దిబ్బలను బార్కేన్లు (Barchan) లుగా వ్యవహరిస్తారు. కొన్ని నిడివిగా (longitudinal) వీచే గాలి దిశలో ఉత్తరం నుంచి దక్షిణంగా కూడా ఏర్పడతాయి. ఇలా నిడివిగా కిలోమీటర్ల పొడవునా ఏర్పడిన ఇసుక దిబ్బలను సైఫ్ (Seifs) లుగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా ఎడారి అంతర్భాగాలలో ఈ ఇసుక దిబ్బలు వివిధ ఆకృతులతో అనూహ్యంగా మారిపోతూ కనిపిస్తాయి. సాధారణంగా ఎడారులలో ‘తరలే ఇసుక దిబ్బలు’ సగటున సంవత్సరానికి 30-40 మీ. చొప్పున కదులుతుంటే, తక్లమకాన్ ఎడారిలో ఇసుక దిబ్బలు సగటున సంవత్సరానికి 150 మీ. చొప్పున కదలుతూ వుంటాయి. ఈ ‘తరలే ఇసుక దిబ్బలు’ క్రమంగా ముందు ముందుకు జరిగుతూ వుండడం వలన ఈ ఎడారి విస్తరించి ఈ ఎడారి అంచున వున్న ఒయాసిస్ నగరాలు అంతరించే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.

నదీ పారుదల వ్యవస్థ (Drainage)

[మార్చు]
తారిం బేసిన్ లోని తక్లమకన్ ఎడారి
తక్లమకన్ ఎడారిలో మోల్చా నది ఏర్పరిచిన అతిపెద్ద ఒండ్రు డెల్టా - NASA image

తక్లమకాన్ ఎడారి తారిం బేసిన్ లో విస్తరించడం వలన అనేక నదులు ఉపనదులు ఈ ఎడారి గుండా ప్రవహిస్తున్నాయి. ప్రధాన నది తారిమ్ (Tarim) కు ఉపనదులుగా యార్కండ్ (Yarkand), హోటాన్ (Hotan), కెరియా (Keriya), తొషికన్ (Toxikan), ఆక్సు (Aksu), ముజాత్ (Muzat), కైదు (Kaidu), కార్ కాన్ (Qarqan) మొదలైనవి ఈ ఎడారిలో ప్రవహిస్తున్నాయి.

సమీప పర్వతాలనుంచి వచ్చే నీరు ఈ ఎడారుల్లోని నదులకు ఆధారంగా వుంటాయి. ఉదాహరణకు సమీప కున్ లున్ పర్వతాల లోని హిమానీ నదాలు కరగడం వల్ల మంచు కరిగి హోటాన్, కెరియా నదులుగా ప్రవహిస్తున్నాయి. తారిం నదికి ప్రధానంగా (76 శాతం వరకూ) నీరు, ఒక్క ఆక్సు నది ద్వారా అందుతున్నాయి. ఈ ఎడారికి తూర్పు దిశలో లోప్ నర్ (Lop Nur) అనే చిత్తడి ప్ర్రాంతం ఉంది. ఇసుక దిబ్బల క్రింద వున్న భూగర్భ జల ప్రవాహం పశ్చిమ దిశ నుండి తూర్పు దిశలో వున్న ఈ లోప్ నర్ శుష్క బేసిన్ కు చేరుకొంటుంది.

వర్షపాతం అంతంత మాత్రం కావడం చేత, బాష్పోత్సేకపు రేటు అధికంగా వుండటం వల్ల లోతు లేని నదులన్నీ కొద్ది దూరం మాత్రమే ప్రవహించి ఈ ఎడారి ఇసుక పొరలలో ఇంకిపోవడం జరుగుతుంది. దీని ఫలితంగా వాటి లోయలు ఖాళీగా మిగిలిపోయి ఇసుకతో నిండిపోయాయి. ఉదాహరణకు కున్ కున్ పర్వతాలలో పుట్టిన నదులు 100 -200 కి.మీ.లు మాత్రమే ప్రయాణించి ఇసుకదిబ్బలలో ఇంకిపోతాయి. కేవలం హోటాన్ నది మాత్రమే వేసవిలో ఎడారి మధ్యభాగంవరకూ ప్రవహించి తారిం నదికి నీటిని అందచేయగలుగుతున్నది.

తక్లమకాన్ ఎడారి దక్షిణ అంచులలో గల కున్ లున్, అల్తున్ (Kunlun & Altun) పర్వత శ్రేణుల గుండా ప్రవహిస్తున్న మోల్చా (Molcha) నది, ఆ పర్వతాలను వదిలిపెట్టి ఈ ఎడారిలో ప్రవేశిస్తున్నప్పుడు వీవన ఆకారంలో (Fan shaped) ఒక విశాలమైన ఒండ్రు డెల్టా (Alluvial Delta) ను ఏర్పరుస్తుంది. ఎడారిలో విచ్చుకుంటున్నట్లున్న ఈ ఒండ్రు డెల్టా 56.6 కి.మీ. వెడల్పు, 61.3 కి.మీ. పొడవును కలిగివుండి ప్రపంచంలోనే అతిపెద్ద ఒండ్రు డెల్టాగా గుర్తింపు పొందింది.

శీతోష్ణస్థితి (Climate)

[మార్చు]

తక్లమకాన్ ఎడారి చుట్టూ గల పర్వతాలు చల్లని తేమ మేఘాలను తారిం బేసిన్ కి చేరకుండా అడ్డుకోవడం వలన, అదే సమయంలో తూర్పు నుంచి వచ్చే చల్లని తేమ వాయు రాశులు ఇక్కడకు చేరుకోనేలోగానే తమలోని తేమను పూర్తిగా పోగొట్టుకొని పొడిగా మారిపోతాయి. ఫలితంగా ఈ ఎడారి, భూమి మీద గల అత్యంత శుష్క ప్రాంతాలలో ఒకటిగా పేరుగాంచింది.

తక్లమకాన్ ఎడారి సమ శీతోష్ణ మండలం (Temperate zone) లో అందులోను ఖండాంతర్భాగంలో ఉంది. ఇక్కడి శీతోష్ణస్థితిని విశిష్టంగా ‘శీతల ఎడారి’ శీతోష్ణస్థితి (Cold Desert Climate) గా పేర్కొంటారు. శీతాకాలం చల్లగాను, పొడిగాను (Cold and Dry Winters) వుంటుంది. వేసవికాలం కొంచెం వేడిగాను, పొడిగాను (Hot and Dry Summers) వుంటుంది. అయితే ధ్రువప్రాంతపు ఎడారులు (ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాలు) తో పోలిస్తే సంవత్సరం పొడుగునా ఇక్కడ చల్లదనం వుండదు. కేవలం శీతాకాలంలోనే చల్లగా వుంటుంది. అదేవిధంగా వేసవిలో ఉప ఆయనరేఖా ఎడారులు (సహారా, అరేబియా, దార్ ఎడారులు మొదలైనవి) లతో పోలిస్తే ఇక్కడ వేసవి కాలంలో వేడి కాస్త తక్కువగానే వుంటుంది.

హిమాలయాల వర్శఛాయా ప్రాంతంలో ఈ ఎడారి వుండటం వలన ఇక్కడ ‘శీతల ఎడారి’ శీతోష్ణస్థితి వుంటుంది. ఖండాంతర్భాగంలో వుండటం వల్ల వార్షిక ఉష్ణోగ్రతా వ్యత్యాసం గరిష్ఠంగా 39 °C వరకు వుంటుంది. ఖండాంత ఎడారి కారణంగా పగటి పూట, రాత్రి పూట ఆకాశం నిర్మలంగా, మేఘరహితంగా వుంటూ దైనిక ఉష్ణోగ్రతా వ్యత్యాసం ఎక్కువగా వుంటుంది.

శీతాకాలం

[మార్చు]
ఎడారిలో మంచు పేరుకుపోయిన దృశ్యం -NASA

శీతాకాలం చల్లగాను, పొడిగాను (Cold and dry winters) వుంటుంది. అయితే ఈ శేతాకాలంలో ఉష్ణోగ్రతలు తరుచుగా మైనస్ డిగ్రీల సెంటీగ్రేడ్ కు పడిపోతాయి. జనవరి నెలలో సగటు ఉష్ణోగ్రత -10 °C. సైబీరియా నుండి వీచే అతి శీతల వాయు రాశుల ప్రభావ కారణంగా వలన ఈ ఎడారిలో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు ఒకొక్కప్పుడు కనిష్ఠంగా -20 °C వరకు కూడా పడిపోతుంటాయి. 2008 సంవత్సరంలో చైనాలో ఏర్పడిన శీతాకాలపు తుఫాన్ సందర్భంలో ఈ ఎడారి మొత్తం భూభాగం గడ్డకట్టుకు పోవడంమే కాక భూభాగం పైన 4 సెంటి మీటర్ల మందంలో ఒక మంచు పొర ఏర్పడి కనిష్ఠ ఉష్ణోగ్రతలు -32 °C కు నమోదయ్యాయి.

వేసవికాలం

[మార్చు]

వేసవికాలం కొంచెం వేడిగాను, పొడిగాను (Hot and Dry Summers) వుంటుంది. అయితే వేసవిలో ఉప ఆయనరేఖా ఎడారులతో పోలిస్తే మాత్రం ఇక్కడ వేడి కాస్త తక్కువగానే వుండి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 38 °C వరకూ చేరుకొంటాయి. జూలై నెలలో సగటు ఉష్ణోగ్రత 25 °C. అయితే తక్లమకాన్ ఎడారి సముద్ర తీరానికి అన్నివేపులా వేలాది కి.మీ. దూరంలో అనగా ఖండాంతర్భాగంలో వుండటం వల్ల వేసవిలో కూడా రాత్రి వేళల ఉష్ణోగ్రతలు పడిపోతూ అతి చల్లగా (cold summer nights) వుంటాయి.

అవపాతం (Precipitation)

[మార్చు]

ఈ ఎడారిప్రాంతం పొందే అవపాతం కన్నా బాష్పోత్సేకం ద్వారా పోగొట్టుకొనేదే కాస్త ఎక్కువగా వుండడం చేత ఈ ఎడారి ప్రాంతాన్ని ‘శీతల సెమీ శుష్క శీతోష్ణస్థితి ప్రాంతం’ (Cold semi-arid climate zone) గా పేర్కొంటారు. ఈ ఎడారిలో కురిసే అవపాతం అత్యంత తక్కువగా వుంటుంది. ఎడారి పశ్చిమ భాగంలో వార్షిక సగటు అవపాతం 4 సెంటీ మీటర్లు కాగా తూర్పు భాగంలో కేవలం 1 సెంటీ మీటరు మాత్రమే.

వాయు ప్రవాహాలు (Air Streams)

[మార్చు]
దుమ్ము మేఘాలతో ఆవరించబడిన తక్లమకన్ ఎడారి దృశ్యం - NASA image

వేసవి కాలంలో ఈ ఎడారి పశ్చిమ ప్రాంతంలో రెండు నిర్దిష్ట వాయు ప్రవాహాలు ఏర్పడతాయి. ఈ రెండు ప్రవాహాలు (ఉత్తర వాయు ప్రవాహం, వాయవ్య ప్రవాహం) ఎడారి కేంద్ర ప్రాంతంలో కలసిపోయి కెరియా నదీ ఉత్తర ప్రాంతంలో ఒక సంక్లిష్ట వాయు ప్రసరణ వ్యవస్థ (Complex Air Circulation System) ను ఏర్పరుస్తాయి. ఇది ఈ ఎడారిలో ఏర్పడే ఇసుకదిబ్బల ఆకృతులపై ప్రభావం చూపుతుంది. వసంత కాలం (Spring Season) ప్రవేశించడంతో అప్పటివరకు అతిశీతలంగా వున్న ఎడారి భూఉపరితలం క్రమేణా వెచ్చగా మారుతుంది. ఫలితంగా ఇసుక దిబ్బల నుండి ఊర్ధ్వముఖ దిశలో వాయు ప్రవాహాలు ఏర్పడతాయి. అదే సమయంలో ఈశాన్య వాయు ప్రవాహాలు శక్తివంతంగా మారడంతో ముఖ్యంగా బలమైన ఇసుక తూఫాన్లు ఎడారిలో సంభవిస్తాయి. ఈ ఇసుక తుఫాన్ల ధాటికి గాలిలో దుమ్ము 4 కి.మీ. ఎత్తు వరకూ లేస్తుంది. దీనికితోడు ఇతర దిశలనుండి వీచే గాలుల వల్ల వాతావరణంలో దుమ్ము మేఘాలు ఏర్పడి ఈ ఎడారి మొత్తాన్ని కప్పివేస్తాయి.

సహజ ఉద్భిజ సంపద

[మార్చు]

వృక్షజాలం

[మార్చు]

తక్లమకాన్ ఎడారిలో అవపాతం అతి తక్కువ కావడం వాళ్ళ వృక్ష సంపద అత్యంత పలుచగా విస్తరించి ఉంది. అయితే ఇసుక దిబ్బల మధ్య గల depressions లలో అందులోనూ భూగర్భజలం 3-5 మీ. లోతులో లభ్యమయ్యేచోట్ల మాత్రం తామరిక్స్ (Tamarix), నైట్రే పొదలు (Nitraria billardierei), రెల్లు (Reeds) మొదలగు ఎడారి వృక్ష జాతులు పెరుగుతాయి. ఎడారి అంచులలోను, నదీ లోయలు-ఇసుక దిబ్బలు కలిసే ప్రదేశాలలోను, నదీ డెల్టాల వద్ద మాత్రం కొంచెం ఎక్కువగా వృక్షజాలం కనిపిస్తుంది. ఇక్కడ పై మొక్కలకు అదనంగా తురంగ పోప్లర్ (Turanga Poplar), ఒలియస్టర్ (Oleaster), ఒంటె ముల్లు (Camel Thorn), Zygophyllaceae కుటుంబానికి చెందిన చెట్లు పెరుగుతాయి.

జంతుజాలం

[మార్చు]
బాక్ట్రియన్ ఒంటె

తక్లమకాన్ ఎడారి ఇసుకదిబ్బలలో కుందేళ్ళు, Gerbills (ఎడారి ఎలుకలు), Jerboa (గెంతే ఎడారి ఎలుక), దీర్ఘ చెవుల ముళ్ళపంది (Long Eared Hedgehog), అడవి పందులు (wild boars), ఆసియా అడవి గాడిదలు (asian wild asses), నక్కలు, తోడేళ్ళు మొదలైనవి కనిపిస్తాయి. బాక్రియన్ ఒంటెలు ఈ ఎడారివాతావరణంలో ప్రయాణానికి అనుకూలంగా వుంటాయి. Tarim Jay, Tufted Lark, గబ్బిలాలు మొదలైనవి ఈ ఎడారిలో సాధారణంగా కనిపించే పక్షులు.

పురావస్తు అన్వేషణలు

[మార్చు]

19 వ శతాబ్దం చివరివరకూ దుర్భేధ్యమైన తక్లమకాన్ ఎడారి అంతర్భాగాలలో మానవులు నివసించిన జాడే లేదని ప్రపంచం భావించింది. అయితే ఈ ఎడారిలో అంతరించిపోయిన ఒక ప్రాచీన నాగరికతా అవశేషాలను అన్వేషించి వెలుగులోనికి తెచ్చిన పురావస్తు శాస్త్రవేత్తలు, అన్వేషకులలో అతి ముఖ్యులు.

  • బ్రిటన్ కు చెందిన ఆరల్ స్టెయిన్ (Sir Marc Aurel Stein) (1862-1943)
  • జర్మనీకు చెందిన స్వాన్ హెడిన్ (Sven Anders Hedin) (1865-1952)
  • స్వీడన్ కు చెందిన వాన్ లీ కాక్ (Albert Von Le Coq) (1860-1930)
  • ఫ్రాన్స్ కు చెందిన పెళ్ళికాట్ (Paul Eugene Pellicot) (1878-1945)

తరువాతి కాలంలో రష్యాకు చెందిన నికోలాయ్ జెవలాస్కి (Nikolai Przhevalsky), అమెరికాకు చెందిన ఎల్స్ వర్త్ హంటింగ్టన్ (Ellsworth Huntington), జపాన్ కు చెందిన జూకొ తషిబానా (Zuicho Tachibana) లు ఈ ఎడారిలో పురావస్తు పరిశోధనలు చేసారు.

తారిం బేసిన్ లో లభ్యం అయిన ఒక మమ్మీ

వీరి పురావస్తు అన్వేషణల కృషి ఫలితంగా ఈ ఎడారి మద్యన ఇసుక దిబ్బలలో పూడుకుపోయిన దాండన్ ఓలిక్ (Dandan Olik), లౌలాన్ (Loulan), నియా (Niya), ఎండరె (Endere), రవాక్ (Rawak), కార్డంగ్ (Kardong), మిరాన్ (Miran) వంటి ప్రాచీన నగరాల శిథిల ఆనవాళ్ళు కనుగొనబడ్డాయి. ఈ శిథిలాలలో లభ్యమైన క్రీ. శ. 1000 కాలంనాటి పురావస్తు సంపద ఈ ఎడారి ప్రాంతంలో ప్రాచీన కాలంలో విలసిల్లిన పర్షియన్, గ్రీకు, భారతీయ, బౌద్ధ ప్రభావాన్ని సూచిస్తుంది. ఎడారి ఇసుకలో బయటపడిన క్రీ.పూ. 2000 - 1800 కాలానికి చెందిన సమాధులు, భద్రపరచబడిన మమ్మీలు ప్రాచీన ఆసియా ఖండపు నాగరికతలలో అంతుపట్టని రహస్యంగా మిగిలిపోయాయి.

పురావస్తు అన్వేషణలలో భాగంగా ఈ ఎడారి ఇసుక దిబ్బలలో సమాధి చేసిన సుమారు 4000 సంవత్సరాల నాటి (క్రీ.పూ. 1800 కు చెందిన) “తొకేరియన్” (Tocharian) ప్రజల మమ్మీలు దొరికాయి. తక్లమకాన్ ఎడారి శుష్క వాతావరణం కారణంగా క్షార ధర్మం గల ఇసుకనేలలో పూడ్చబడిన ఈ మమ్మీలు చిరకాలం పాడవకుండా భద్రంగా పదిలపరిచిన స్థితిలో ఉన్నాయి. వీటిని తారిమ్ మమ్మీలు (Tarim Mummies) లేదా తక్లమకన్ మమ్మీలుగా, లేదా తొకేరియన్ మమ్మీలుగా వ్యవహరిస్తారు.

ప్రాచీన నాగరికత

[మార్చు]
సా.శ.. 4 వ శతాబ్దంలో ఎడారి అంచులలో ఏర్పడిన ఎడారి ఓయాసిస్ నగరాలు
మిరాన్ ఎడారి నగరంలో బయల్పడిన పురాతన బౌద్ధ స్థూపం

ఈ తక్లమకాన్ ఎడారిలో లభ్యం అయిన తారిమ్ మమ్మీలును ఆధారంగా చేసుకొని క్రీ. పూ. 2000 ప్రాంతంలో తారిం బేసిన్ లోని ఒయాసిస్ నగరాలలోను, ఎడారి మద్యలో వున్న నగరాలలోను "తొకేరియన్” (Tocharian) ప్రజలు నివసించారని వెల్లడైంది. వీరు తొలి కంచు యుగం (Early Bronze Age) కు చెందినవారు. రాగి రంగు జుత్తు, యూరోపేయన్ ముఖకవళికలు కలిగివున్న వీరు కకేసియన్ (Caucasian race) తెగకు చెందిన ప్రజలుగా, తొకేరియన్ భాష మాట్లడేవారుగా గుర్తించబడ్డారు. వీరి నాగరికత అంతరించిన తరువాతి కాలంలో ఈ ఒయాసిస్ నగరాలు తుర్కిష్ (Turkish) ప్రజల ఆవాసాలుగా మారాయి.

మద్యధరా సముద్రం నుండి తూర్పు- దక్షిణ చైనాలను కలిపే ప్రాచీన వాణిజ్య రహదారి అయిన సిల్క్ రూట్ (సిల్క్ రహదారి) ఈ ఎడారి ఉత్తర, దక్షిణ సరిహద్దుల గుండా పోతుంది. ఈ సిల్క్ రూట్ లో ప్రయాణించే వ్యాపారులకు ఆశ్రయం కలిగిస్తూ తూర్పున వున్న కాష్గర్ (Kashgar) నుండి పడమర వున్న దన్ హాంగ్ (Dunhuang) వరకూ ఎడారి అంచుల వెంబడి అనేక ఒయాసిస్ నగరాలు ఏర్పడి గొప్ప వాణిజ్య కేంద్రాలుగా విలసిల్లాయి.

  • ఎడారి ఉత్తర సరిహద్దు అంచులలో వున్న ఒయాసిస్ నగరాలు: కాష్గర్ (Kashgar), ఆక్సు (Aksu), కూచా (Kucha), తుర్ఫాన్ (Turfan), హమీ (Hami), లౌలాన్ (Loulan), దన్ హాంగ్ (Dunhuang) మొదలగునవి
  • ఎడారి దక్షిణ సరిహద్దు అంచులలో వున్న ఒయాసిస్ నగరాలు: కాష్గర్ (Kashgar), యార్కండ్ (Yarkand), ఖోటాన్ (Khotan), కెరియా (Keria), నియా (Niya), కార్ కాన్ (Qarkan), కార్కిలిక్ (Qarkilik), మిరాన్ (Miran), దన్ హాంగ్ (Dunhuang) మొదలగునవి.

మద్య ఆసియా లోని సిల్క్ రూట్ (Silk Road) పై ఆధిపత్యం నెలకొల్పే ప్రయత్నంలో హాన్ (Han) రాజవంశం కాలంలో చైనా దేశం ఈ ఒయాసిస్ నగరాలపై ప్రాబల్యం పొందింది. అదే కోవలో తుర్కిష్, మంగోల్, టిబెట్ ప్రజలు కూడా ఈ నగరాలను పాలించారు. ప్రస్తుతం తుర్కిష్ (Turkish) జాతి ప్రజలు ఈ ఒయాసిస్ నగరాలలో నివసిస్తున్నారు.

కుమారజీవుడు వంటి గొప్ప బౌద్ధ సన్యాసులు, హుయాన్ త్సాంగ్ (యువాన్ చాంగ్- Xuanzang), మార్కోపోలో వంటి సుప్రసిద్ధ యాత్రికులు ఈ ఎడారి గుండా ప్రయాణించారు. ఒక విధంగా ఈ తక్లమకాన్ ఎడారి ప్రాంతం తొకేరియన్, పర్షియన్, గ్రీకు, భారతీయ, చైనీస్ ప్రజలతో ప్రభావితమైన ఒక ప్రాచీన బహుళ సాంస్కృతిక ఎడారి జనావాసాలు విలసిల్లడాన్ని తెలియచేస్తుంది.

ఖనిజ వనరులు - ఆర్ధికాభివృద్ధి

[మార్చు]

ఈ ఎడారిలో భూగర్భ జలాలతో పాటు ఆయిల్, నేచురల్ గ్యాస్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా తారిమ్ బేసిన్ లో 8 బిలియన్ల టన్నుల ఆయిల్, 10 ట్రిలియన్ల క్యూబిక్ మీటర్ల నేచురల్ గ్యాస్ నిక్షేపాలు వున్నట్లు అంచనా వేయబడింది. కనుక చైనా దేశానికి తక్లమకాన్ ఎడారి ప్రధాన ఆర్థిక వ్యూహాత్మక స్థానంగా మారింది. తక్లమకాన్ ఎడారి నుండి షాంగై నగరానికి గ్యాస్ పైప్ లైన్ ను నిర్మించింది. అదేవిధంగా ఈ ఎడారి ఉత్తర అంచులోనున్న “కోర్ల – లుంటాయ్ – ఆక్సు” ఓయాసిస్ నగరాలను కలిపే పారిశ్రామిక ప్రాంతం (Korla-Luntai-Aksu Belt) లోగల చమురు క్షేత్రాలను వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయడానికి భారీ పెట్రో కాంప్లెక్స్ (Petro Complex) లను నెలకొల్పింది. ఈ ఎడారిలోని భారీ ఖనిజవనరులను వెలికితీయడానికి రవాణా సదుపాయాలను మెరుగుపరచాల్సిన ఆవశ్యకతను గుర్తించిన చైనా దేశం ఈ ఎడారికి అడ్డంగా ఉత్తర, దక్షిణ భూభాగాలను కలుపుతూ మూడు ప్రధాన ఎడారి రహదార్లను (Cross Desert Highway) నిర్మించింది.

అదే సమయంలో చైనా ఈ ఎడారిలో బంజరు భూములను సాగులోనికి తీసుకొనివస్తూ వాటిని ప్రత్తి, వరి పంటలు పండే ప్రాంతాలుగా క్రమేణా మారుస్తున్నది. వీటివలన ఈ ఎడారి ప్రాంతంలో నగరీకరణం, రవాణా సదుపాయాలు పెరిగి సామాజిక, పారిశ్రామిక వృద్ధికి అవకాశం పెరిగింది. ఫలితంగా ఈ ఎడారిలో వేగవంతమైన ఆర్థిక విస్తరణ (Rapid Economic Expansion) సాధించబడుతున్నది.

ఎడారి రహదార్లు

[మార్చు]

దుర్భేద్యమైన ఈ ఎడారికి అడ్డంగా ఉత్తర, దక్షిణ ప్రాంతాలను అనుసందానిస్తూ, మూడు ప్రధాన ఎడారి రహదార్లు (Cross Desert Highway) నిర్మించడం ద్వారా చైనా దేశం ఈ ఎడారి సహజ భౌగోళిక అడ్డంకులను అధిగమించింది.

తక్లమకాన్ ఎడారి రహదారి

1) లున్ మిన్ ఎడారి రహదారి (Lunmin Cross Desert Highway) : తక్లమకాన్ ఎడారి దక్షిణాన్న వున్న ‘మిన్ ఫెంగ్’ నగరాన్ని ఉత్తరాన్న వున్న ‘లుంటాయ్’ నగరాన్ని కలుపుతూ నిర్మించిన ఈ ఎడారి రహదారి 1995 లో పూర్తయ్యింది. 522 కి.మీ. పొడవైన ఈ రహదారి ప్రపంచ ఎడారి రహదార్లలో అత్యంత పొడవైన రహదారిగా పేరుగాంచింది. ఈ రోడ్డు కిరువైపులా sand dune fixers ఏర్పాటు చేయడం, రోడ్డును పరిశుభ్రం చేసే శాశ్వత వ్యవస్థలను ఏర్పాటు చేయడం వలన ఈ రోడ్డు నిర్మాణం, నిర్వహణ దృష్ట్యా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రహదారిగా భావిస్తారు.

2) తాకీ ఎడారి రహదారి (Taqie Desert Highway) : లున్ మిన్ ఎడారి రహదారి మీద గల తజోంగ్ (Tazhong) చమురు క్షేత్రాన్ని, ఎడారి దక్షిణభాగంలో గల ‘కీమో’ నగరాన్ని (కార్ కాన్ రాజధాని) కలుపుతూ నిర్మించిన ఒక రహదారి శాఖ . 2002 లో పూర్తయిన ఈ రహదారి పొడవు 156 కి.మీ.

3) అహె ఎడారి రహదారి (Ahe Cross Desert Highway) : అదే విధంగా ఈ ఎడారి దక్షిణాన్న వున్న ‘హోటాన్’ నగరాన్ని ఉత్తరాన్న వున్న ‘అరల్’ నగరాన్ని కలుపుతూ నిర్మించిన ఈ ఎడారి రహదారి 2007 లో పూర్తయ్యింది. ఇది ఆక్సు (Aksu) ప్రధాన నగరం వరకూ విస్తరించబడింది. 424 కి.మీ. పొడవైన ఈ రహదారి హోటాన్ నదిని అనుసరిస్తూ సమాంతరంగా సాగుతుంది. ఇది యూఫ్రటీసు పోప్లర్ (Euphrates Poplar) అడవుల గుండా పోతుంది.

తరిలిపోయే ఇసుక దిబ్బల ప్రభావాన్ని అరికట్టడానికి సహజ అడ్డంకులుగా calligonum వంటి మొక్కలను ఈ రహదార్లకు ఇరువైపులా నాటడమే కాకుండా, ఈ రహదార్లకు ఇరువేపులా గ్రీన్ కారిడార్ ను ఏర్పరిచి tamarix, Saxual, రెల్లు జాతి మొక్కలను విస్తృతంగా పెంచారు. ఈ గ్రీన్ కారిడార్లు ఎడారిలో క్రమేణా క్రొత్త జంతుజాలానికి ఆవాసంగా మారి కొత్త పర్యావరణ వ్యవస్థ (Ecosystem) ను ఏర్పరిచింది.

మూలాలు

[మార్చు]

ముఖ్యమైన ఎడారులు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]