తెనాలి రామకృష్ణుడు

వికీపీడియా నుండి
(తెనాలి రామకృష్ణకవి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తెనాలి రామకృష్ణుడు
జననం16వ శతాబ్దం
మరణంహంపి
ఇతర పేర్లుతెనాలి రామలింగ కవి
వృత్తికవీశ్వరులు
ప్రసిద్ధివికటకవి,
అష్టదిగ్గజాలలో ఒకరు
పదవి పేరుశ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి
పదవీ కాలం15వ శతాబ్దం
మతంశ్రౌత శైవం
తల్లిలక్ష్మమ్మ

తెనాలి రామకృష్ణుడు శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములోని కవీంద్రులు. స్మార్తం శాఖలోని నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అష్టదిగ్గజములలో సుప్రసిద్ధులు. ఈయనని తెనాలి రామలింగ కవి అని కూడా అంటారు. అవిభాజ్య విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఈయన ప్రముఖులు. తొలుత సాధారణ వ్యక్తి అయిన రామకృష్ణులు, కాళీమాత వర ప్రసాదం చేత కవీశ్వరులయ్యారు. గొప్ప కావ్యాలు విరచించారు. కానీ తెలుగు వారికి ఆయన ఎక్కువగా హాస్య కవిగానే పరిచయం. ఆయనకు వికటకవి అని బిరుదు ఉంది (ఇక్కడ, వికటత్వం అంటే ఉదారత అని అర్ధం కూడా వచ్చును). ఆయనపై ఎన్నో కథలు ఆంధ్ర దేశమంతా ప్రాచుర్యములో ఉన్నాయి.మొదట్లో రామకృష్ణుడి ఇంటి పేరు గార్లపాటి అని, తెనాలి నుండి వచ్చారు కనుక తరువాతి కాలంలో తెనాలి అయినది అని ఒక నానుడి. సత్తెనపల్లి మండలంలోని లక్కరాజుగార్లపాడు గ్రామానికి చెందిన గార్లపాటి రామయ్య, లక్ష్మాంబల సంతానం రామలింగయ్య. ఆయన తాత సుదక్షణా పరిణయం రాసిన అప్పన్న కవి. వీరికి ఇద్దరు సోదరులు వరరాఘవకవి, అన్నయ్య. రామకృష్ణుడి స్వస్థలం తెనాలి. ఇదే గ్రామాన్ని ఆయన అగ్రహారంగా పొందినాడు.[1] రామలింగయ్య తాత, ముత్తాతలు గార్లపాడు లోనే నివసించారు. ప్రస్తుతం గ్రామ బొడ్రాయి ప్రతిష్ఠించిన ప్రాంతంలోనే రామకృష్ణుల వారి ఇల్లు ఉండేదని గ్రామస్తుల నమ్మకం. సా.శ. 1514 నుంచి 1575 వరకు రామలింగయ్య జీవించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో మేనమామ తెనాలి అగ్రహారమైన తూములూరుకు తీసుకువెళ్లారు. అక్కడే వారి సంరక్షణలో విద్యాబుద్ధులు నేర్చుకున్నారు.

రచనలు

[మార్చు]
  1. ఉద్భటారాధ్య చరిత్ర
  2. ఘటికాచల మహాత్మ్యము
  3. పాండురంగ మహాత్మ్యము

ఉద్బటారాధ్య చరిత్ర ఉద్భటుడు అనే యతి గాథ. ఘటికాచల మహాత్మ్యము తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు మండలంలోని ఘటికాచల (ప్రస్తుతం షోళింగుర్) క్షేత్రంలో వెలసిన శ్రీ నరసింహ స్వామి వారిని స్తుతిస్తూ వ్రాసిన కావ్యం. పాండురంగ మహాత్మ్యము స్కాంద పురాణము లోని విఠ్ఠలుని మహాత్మ్యాలు, ఇతర పాండురంగ భక్తుల చరిత్రల సంపుటం.

అలభ్య రచనలు

[మార్చు]
  1. కందర్పకేతు విలాసము
  2. హరిలీలా విలాసము

ఇవి అలభ్య గ్రంథములు. జగ్గన గారి ప్రబంధ రత్నాకరము లోని కొన్ని పద్యాల వల్ల ఈ గ్రంథ వివరాలు తెలుస్తున్నాయి.

శైలి

[మార్చు]

తెనాలి వారు ప్రబంధ శైలిని అనుసరించేవారు. ఇంకనూ వారి కవిత్వంలో హాస్యము, వ్యంగ్యము రంగరించబడి ఉంటాయి

చాటువులు

[మార్చు]

వీరు చాటువులు చెప్పడంలో బహు నేర్పరి.

అల్లసాని పెద్దన వారితో

[మార్చు]

ఒకమారు అల్లసాని పెద్దన వారు ఒక కవితలో "అమావాశ్యనిశి"ని ఛందస్సు కోసం "అమవసనిసి" అని వాడగా దానికి రామలింగకవి చెప్పిన అద్భుతమైన చాటువు,

ఎమి తిని సెపితివి కపితము
బెమ పడి వెరి పుఛ్చ కాయ మరి తిని సెపితో
ఉమెతకయలు తిని సెపితో
అమవస నిసి యనుచు నేడు అలసని పెదనా ||

ఇక్కడ "అలసని" అని హేళన చేస్తూ, అమవసనిసి అనేది స్వచ్ఛత లేని పదం అని కవీంద్రులు ఘాటుగానే సెలవిచ్చారు.

ధూర్జటి వారితో

[మార్చు]

ధూర్జటి వారిని స్తుతిస్తూ రాయలు :
స్తుతమతి యైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల కల్గెనీ
యతులిత మాధురీ మహిమ ?

దానికి రామకృష్ణుని చమత్కార సమాధానం:
హా తెలిసెన్! భువనైక మోహనో
ద్ధత సుకుమార వార వనితా జనతా ఘన తాప హారి సం
తత మధురాధరోద్గత సుధా రస ధారల గ్రోలుటం జుమీ !!

అంటూ ధూర్జటి వారి వేశ్యా సాంగత్యాన్ని ఎత్తి చూపారు.

కావలి తిమ్మడు

[మార్చు]

మరొకమారు వాకిటి కావలి తిమ్మడికి రాయలిచ్చిన పచ్చడాన్ని కాజేయటానికి ముగ్గురు ఇతర దిగ్గజాలతో పథకం వేసి
వాకిటి కావలి తిమ్మా !
ప్రాకటముగ సుకవివరుల పాలిటి సొమ్మా !
నీకిదె పద్యము కొమ్మా !
నాకీ పచ్చడమె చాలు నయముగ నిమ్మా !!

అంటూ చివరి పాదంతో పచ్చడం కొట్టేసాడు రామకృష్ణ కవి

భట్టు మూర్తి కవిత్వం గురించి అవహేళన చేస్తూ

[మార్చు]

చీపర బాపర తీగల చేపల బుట్టల్లినట్లు చెప్పెడి నీ యీ కాపు కవిత్వపు కూతలు బాపన కవి వరుని చెవికి ప్రమదంబిడునే !!

ప్రెగడరాజు నరస కవి వారి పరాభవం

[మార్చు]

ఒకమారు, ప్రెగడరాజు నరస కవి అనే ఒక ఉద్దండ పండితుడు రాయల వారి కొలువు సందర్శించి, వారికి ఒక క్లిష్ట సమస్య ఇచ్చారు. అదేమంటే, ఈ కొలువులో ఎవరైనా తను రాయలేనంత కఠినమైన చాటువు చెప్పగలరా అని. ఆ సమయములో రాయలు వారు మొదట అల్లసాని పెద్దన వారి వైపు చూసారట. అల్లసాని వారు కొంత సమయము తీసుకొంటుండగా, తెనాలి వారు అందుకొని పండితుల వారిని తికమక పెట్టేలా ఈ చాటువు వల్లించారట.
త్బృ....వ్వట బాబా తల పై
బు....వ్వట జాబిల్లి వల్వ బూదట చేదే
బువ్వట చూడగ హుళులు....
క్కవ్వట నరయంగ నట్టి హరునకు జేజే !!.

మూలాలు

[మార్చు]
  1. నూరేళ్ళ తెనాలి ఘనచరిత్ర, రచన బిళ్ళా జవహర్ బాబు, ముద్రణ 2010, పేజీ 21

బయటి లింకులు

[మార్చు]


అష్టదిగ్గజములు
అల్లసాని పెద్దన | నంది తిమ్మన | ధూర్జటి | మాదయ్యగారి మల్లన | అయ్యలరాజు రామభధ్రుడు | పింగళి సూరన | రామరాజభూషణుడు | తెనాలి రామకృష్ణుడు