దార అప్పలనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దార అప్పలనారాయణ
జననందార అప్పలనారాయణ
జూలై 1, 1930
విజయనగరం జిల్లా, గజపతినగరం మండలం కోడిదేవుపల్లి
మరణంమే 28, 1997
ఇతర పేర్లుకుమ్మరి మాస్టారు
'హాస్య నటనాధురీణ' బిరుదాంకితుడు
వృత్తి1947-49 మధ్యలో హయ్యర్ గ్రేడ్ ఉపాధ్యాయుడు
1950-56 మధ్య అధ్యాపకునిగా ఉద్యోగం
ప్రసిద్ధిబుర్రకథ కళాకారుడు
మతంహిందూ
తండ్రిఅప్పలస్వామి
తల్లిచంద్రమ్మ

కుమ్మరి మాస్టారు బుర్రకథ చెప్పడంలో ప్రసిద్ధిచెందిన కళాకారుడు. ఇతని అసలు పేరు దార అప్పలనారాయణ (జూలై 1, 1930 - మే 28, 1997)

జననం[మార్చు]

ఈయన జూలై 1, 1930 సంవత్సరంలో విజయనగరం జిల్లా, గజపతినగరం మండలం కోడిదేవుపల్లిలో అప్పలస్వామి, చంద్రమ్మ దంపతులకు జన్మించాడు.

ఈయన ఎనిమిదవ తరగతి వరకు స్వగ్రామంలోనే చదివాడు. 1947-49 మధ్యలో హయ్యర్ గ్రేడ్ ఉపాధ్యాయునిగా శిక్షణ పొంది, 1950-56 మధ్య అధ్యాపకునిగా ఉద్యోగం చేశాడు. ఉపాధ్యాయ శిక్షణ కాలంలో ప్రధానోపాధ్యాయులు గండికోట శ్రీరామమూర్తి ప్రోత్సాహంతో ముట్నూరి సూర్యనారాయణ దగ్గర బుర్రకథలో శిక్షణ పొందాడు. ఈయన తొలికథ 'స్వతంత్ర పోరాటం'. తొలికాలంలో నాటకాలలో పాత్రపోషణ చేస్తుండేవాడు. 'అభ్యుదయ కళామండలి'ని స్థాపించాడు. దీని ద్వారా అందించిన తొలి కానుక 'మల్లీశ్వరి'. ఈయన కథల ప్రత్యేత వంతగా స్త్రీ కళాకారిణిని పరిచయం చేయడం, హాస్యానికి పట్టం కట్టడం. కొన్ని సందర్భాల్లో గుమ్మెట, జముకు, డప్పు, ఢమరుకం, కంజీరా, డికీరా లాంటి దేశవాళీ సంగీతవాద్యాలను వినియోగిస్తూ కథ నడిపేవాడు. ఎక్కువగా 'రామరాజ్యం', 'బాలనాగమ్మ', 'ఆంధ్రకేసరి', 'బొబ్బిలి యుద్ధం' వంటి కథాంశాలు ప్రదర్శించేవాడు.

1964 లో శృంగవరపు కోటలో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి సమక్షాన 'చైనా భూతం' ప్రదర్శించాడు. 1975 లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా బుర్రకథను ప్రదర్శించాడు. 1984 లో మహానాడులో 'రామరాజ్యం' బుర్రకథను రక్తికట్టించి, అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు అభినందనలు అందుకున్నాడు. ఈయన కథాగానం గ్రామఫోన్ రికార్డులుగా కూడా విడుదలైంది. 'లాల్ బహదూర్ శాస్త్రి', 'కొళాయి-లడాయి', 'ఎన్నికలు కామిక్' వంటి కథలు ఈ రికార్డులో ఉన్నాయి.

1967 లో తెలుగు సినిమా రంగంలో కాలుపెట్టి, కాంభోజరాజు కథ, కన్యకా పరమేశ్వరి కథ, రైతుబిడ్డ, శభాష్ పాపన్న చిత్రాల్లో బుర్రకథ కళాకరునిగానే కనిపించి, వినిపించాడు. ఆకాశవాణి, దూరదర్శన్ లలో వివిధసమయాలలో కథాగానం చేశాడు.

ఈయన 'హాస్య నటనాధురీణ' బిరుదాంకితుడు. 1966 లో భీమవరం త్యాగరాజు ఆరాధనోత్సవాలలో స్వర్ణ సింహతలాటాలు, కరకంకణాలు బహుమతిగా పొందాడు. 1988 జూన్ 27న ఆంధ్ర విశ్వకళాపరిషత్ ఆధ్వర్యంలో 'కళాప్రపూర్ణ' గౌరవం అందుకున్నాడు.

ఈయన మే 28, 1997 సంవత్సరంలో పరమపదించాడు.