దుర్రూషెహ్వార్ సుల్తాన్
దుర్రూషెహ్వార్ సుల్తాన్ | |||||
---|---|---|---|---|---|
బేరార్ యువరాణి, ఉస్మానియా సామ్రాజ్యపు పట్టపు యువరాణి | |||||
జననం | ఛమ్లికా ప్యాలెస్, ఉష్కుదార్, కాన్స్టాంటినోపుల్, ఉస్మానియా సామ్రాజ్యం (ప్రస్తుత ఇస్తాంబుల్, తుర్కియే) | 1914 జనవరి 26||||
మరణం | 2006 ఫిబ్రవరి 7 లండన్, ఇంగ్లాండు | (వయసు 92)||||
Burial | బ్రూక్‌వుడ్ స్మశానవాటిక | ||||
Spouse | |||||
వంశము | |||||
| |||||
రాజవంశము | ఉస్మానియా సామ్రాజ్యం (జన్మతః) అసఫ్‌జాహీ వంశం (పెళ్లి ద్వారా) | ||||
తండ్రి | రెండవ అబ్దుల్‌మజీద్ | ||||
తల్లి | మెహిస్తీ హనమ్ | ||||
మతం | సున్నీ ఇస్లాం |
హతిజే హైరియే అయ్‌షే దుర్రూషెహ్వార్ సుల్తాన్ (Hatice Hayriye Ayşe Dürrüşehvar Sultan) (ఒట్టోమన్ టర్కిష్: خدیجه خیریه عائشه درشهوار سلطان, "గౌరవప్రదమైన మహిళ", "ఆశీర్వదించబడినది", "అంగనామణి", "రాజయోగ్యమైన ముత్యం"), వివాహం తరువాత దుర్రూషెహ్వార్ దుర్దానా బేగం సాహిబా, బెరార్ యువరాణి (26 జనవరి 1914 - 7 ఫిబ్రవరి 2006) ఒట్టోమన్ యువరాణి, ఒట్టోమన్ సామ్రాజ్య సింహాసనానికి చివరి వారసుడు, ఒట్టోమన్ ఖిలాఫత్ యొక్క చివరి ఖలీఫా, రెండవ అబ్దుల్‌మజీద్ యొక్క ఏకైక కుమార్తె.[1][2][3]
ప్రారంభ జీవితం
[మార్చు]ఒట్టోమన్ ఖిలాఫత్ చివరి దశలో ఉన్నకాలంలో, ఇస్తాంబుల్ నగరంలోని ఉష్కుదార్ ప్రాంతంలో ఉన్న చమ్లికా ప్యాలెస్లో 26 జనవరి 1914 న దుర్రూషెహ్వార్ సుల్తాన్ జన్మించింది.[4] ఆమె తండ్రి భవిష్యత్తు ఖలీఫా రెండవ అబ్దుల్ మజీద్, సుల్తాన్ అబ్దుల్‌అజీజ్, హేరానిడిల్ కదీన్ కుమారుడు. ఆమె తల్లి మెహిస్తీ హనమ్, హసిమాఫ్ అకల్స్బా, సఫియే హనమ్‌ల కుమార్తె. ఆమెకు తన తండ్రి మొదటి భార్య నుండి షెహజాదే ఒమర్ ఫరూక్ అనే సవతి సోదరుడు కూడా ఉన్నాడు.[1][4]
1924 మార్చిలో రాజ కుటుంబం బహిష్కరణ పాలైనప్పుడు, దుర్రూషెహ్వార్, ఆమె కుటుంబంతో పాటు ఫ్రాన్స్‌లోని నీస్‌లో స్థిరపడ్డారు. పదవీచ్యుతుడైన పాలకుడితో స్నేహపూర్వకంగా ఉన్న బ్రిటిష్ రెడ్ క్రెసెంట్ సొసైటీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం పాలకులు, ఆస్తినంతా పోగొట్టుకున్న ఖలీఫాకు సహాయం చేయమని విజ్ఞప్తి చేసింది. మౌలానా షౌకత్ అలీ, ఆయన సోదరుడు మౌలానా మొహమ్మద్ అలీల చేత ఒప్పించబడి, భారతదేశంలోని హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన చివరి నిజాం, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (ఏడవ అసఫ్ జా), పదవీచ్యుతుడైన ఖలీఫాకు మూడు వందల పౌండ్ల జీవితకాల నెలవారీ పెన్షన్, ఆ కుటుంబంలోని అనేక మంది వ్యక్తులకు భత్యాలు పంపాలని నిర్ణయించుకున్నాడు.[5]
వివాహం
[మార్చు]పదవీచ్యుత రాజవంశానికి చెందినప్పటికీ, యుక్త వయసులో దుర్రూషెహ్వార్ అందం చాలా మంది పెళ్లికి సిద్ధమైన వ్యక్తులను ఆకర్షించింది. ఈమెను పర్షియా షా, ఈజిప్టు రాజు మొదటి ఫువాద్ తమ వారసులు మొహమ్మద్ రెజా పహ్లవి, ఫరూక్‌లకు ఇచ్చి పెళ్లి చేయాలని కోరారు. వీరితో పాటు నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పెద్ద కుమారుడు, ఆయన వారసుడైన ప్రిన్స్ అజాం జా (1907-1970) కూడా ఆమెను కోరుకున్నాడు.[6] 1930లో, సుల్తాన్ అబ్దుల్ హమీద్ II, సలిహా నసియే హనమ్ల కుమారుడు షెహజాదే మెహ్మెద్ అబీద్ కూడా ఆమెను వివాహం చేసుకోవాలని కోరాడు.[7] అయితే, దుర్రూషెహ్వార్ ఇంకా చిన్నవయసులోనే ఉందన్న కారణంతో ఈ సంబంధాన్ని ఆమె తండ్రి నిరాకరించాడు. కానీ, వాస్తవానికి అబ్దుల్ మజీద్ అప్పటికే ఆమెకు నిజాం పెద్ద కుమారుడితో వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు.[8]
1931లో ఆమె తండ్రి, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (హైదరాబాద్ దక్కన్ 7వ నిజాం) పెద్ద కుమారుడు, హైదరాబాదు వారసుడు ఆజం జాతో ఆమె వివాహాన్ని ఏర్పాటు చేశాడు.[9] అయితే, ఆమె కన్యాశుల్కంగా యాభై వేల పౌండ్ల కట్నాన్ని అడిగారు. ఇది చాలా ఎక్కువని నిజాం భావించాడు. షౌకత్ అలీ మధ్యవర్తిత్వం వహించి, అదే కట్నంతో, నిజాం చిన్న కుమారుడైన మొహజ్జం జాకు మహ్పేకర్ హనమ్‌సుల్తాన్‌ను వధువుగా ఇవ్వాలని ప్రతిపాదించాడు. నిజాం ఈ ప్రతిపాదనకు వెంటనే అంగీకరించి, తన ఇద్దరు కుమారులను వివాహం చేసుకోవడానికి ఫ్రాన్స్‌కు పంపాడు. అయితే, సోదరులు ఫ్రాన్స్‌కు వచ్చినప్పుడు, షెహజాదే ఉస్మాన్ ఫువాద్, ఆయన భార్య కరిమే హనమ్, ఆయన సవతి సోదరి అదిలే సుల్తాన్ కలిసి,మొహజ్జం జాను కలవడానికి అదిలే కుమార్తె నీలోఫర్ హనమ్‌సుల్తాన్‌ను ఏర్పాటు చేశారు. నీలోఫర్ అందాన్ని చూసి, మొహజ్జం జా తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆ వెంటనే మహ్పేకర్‌తో తన నిశ్చితార్థాన్ని విరమించుకొని, నీలోఫర్‌ను వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు.[5]
వివాహానికి ఒక రోజు ముందు, యువరాజులు లండన్ నుండి ఎక్స్‌ప్రెస్ రైలులో నీస్‌కు చేరుకుని, హోటల్ నెగ్రెస్కోలో బస చేశారు.[10][9] 1931 నవంబరు 12న, పదిహేడేళ్ల వయసులో, దుర్రూషెహ్వార్ నీస్‌లోని విల్లా కారబాసెల్లో ఆజం జాను వివాహం చేసుకున్నది. నిజాం చిన్న కుమారుడికి దుర్రూషెహ్వార్ బంధువు (కజిన్) నీలోఫర్‌తో వివాహం జరిగింది.[11] ఈ వివాహాన్ని అబ్దుల్ మజీద్ సవతి సోదరి ఎమీన్ సుల్తాన్ భర్త దమాద్ మెహ్మెద్ షెరీఫ్ పాషా నిర్వహించాడు.[12] భారతీయ యువరాజులు వివాహ స్థలానికి వచ్చినప్పుడు, స్థానిక వార్తాపత్రికలు భారతీయ యువరాజుల ఛాయాచిత్రాలతో నింపి, ఎ థౌజండ్ అండ్ వన్ నైట్స్ అండ్ ఎ ముస్లిం వెడ్డింగ్ వంటి శీర్షికలతో ప్రచురించాయి.[11] వివాహ సందర్భంగా, దుర్రూషెహ్వార్ తన అత్త నాజీమ్ సుల్తాన్ నుండి బహుమతిగా వజ్రాల కిరీటాన్ని అందుకున్నది. వివాహం తరువాత యువరాజులు తమ వధువులను, పరివారాన్ని వారు బస చేసిన హోటలుకు తీసుకెళ్లారు.[12] మతపరమైన వేడుక తరువాత, కొత్తగా వివాహం చేసుకున్న దంపతులు తమ పౌర వివాహాన్ని పూర్తి చేయడానికి బ్రిటిష్ కాన్సులేట్‌కు వెళ్లి, వారి వివాహోత్తర ఒప్పందాన్ని ధృవీకరించారు. దీని ప్రకారం, భర్త మరణించిన సందర్భంలో, లేదా భర్తతో విడాకులు తీసుకున్నప్పుడు, దుర్రూషెహ్వార్‌కు రెండు లక్షల డాలర్లు పరిహారం అందేట్లుగా ఒప్పందం చేసుకున్నారు.[13]
నీస్‌లో వేడుకల తరువాత, యువరాణులు, వారి భర్తలు 1931 డిసెంబర్ 12న వెనిస్ నుండి భారతదేశంలోని హైదరాబాద్లోని తమ మామ ఆస్థానానికి బయలుదేరారు.[5][12] నీలోఫర్, దుర్రూషెహ్వార్ తల్లులు కూడా ఒక ఫ్రెంచ్ మంత్రసాని తో కలిసి వారితో పాటు వెళ్లారు.[11] వారు సముద్రపు ఓడ పిల్స్నా ఎక్కారు. 1931లో లండన్లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై, మహాత్మా గాంధీ ఈ ఓడలోనే భారతదేశానికి తిరుగు ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ఓడలో యువరాణులను కలుసుకున్నాడని నివేదించబడింది. [14][15][16] దారిలో, వారికి చీరలు ఎలా ధరించాలో, నిజాం సమక్షంలో మెలగవలసిన పద్ధతి వంటి మర్యాదలు నేర్పించారు. బొంబాయిలో దిగిన తరువాత, వారు నిజాం ప్రైవేట్ రైలులో ఎక్కారు.[17] వారు హైదరాబాద్ చేరుకున్న తరువాత, 1932 జనవరి 4న చౌమహల్లా ప్యాలెస్లో విందు జరిగింది.[18] ఆ తర్వాత వారు తమ తమ ఇళ్లలో స్థిరపడ్డారు. దుర్రూషెహ్వార్, ఆజం జా హైదరాబాద్లోని బెల్లా విస్టాలో స్థిరపడ్డారు.[19]
ఆమె నిజాం నుండి దుర్దానా బేగం అనే బిరుదును అందుకుంది, ఆమె అధికారికంగా ది ప్రిన్సెస్ ఆఫ్ బేరార్ అనే బిరుదును కలిగి ఉంది.[20][21][22][23] ఆమె ఆజం జా కంటే పొడవుగా ఉండేది. నిజాం అది ఒక గొప్ప జోక్‌గా భావించాడు. పార్టీలలో వారి ఎత్తులో వ్యత్యాసాన్ని ఆయన క్రమం తప్పకుండా ఎత్తి చూపించేవాడు.[6] 1933 అక్టోబరు 6న, ఆమె తన పెద్ద కుమారుడు, నవాబ్ మీర్ బర్కత్ అలీ ఖాన్ ముకర్రమ్ జా బహదూర్, హైదరాబాదు భవిష్యత్ నిజాం అయిన అసఫ్ ఝాకు జన్మనిచ్చింది. ఆయన తరువాత నవాబ్ మీర్ కరామత్ అలీ ఖాన్, ముఫ్ఫఖమ్ జా బహదూర్, 27 ఫిబ్రవరి 1939న జన్మించాడు.[24] ఆమె తన భర్త యొక్క అనేక ఉంపుడుగత్తెల గురించి తెలిసినా, తను హుందాగా రాచరికంతో వ్యవహరించింది. అయితే, వారిద్దరి మధ్య విభేదాలు చివరికి 1954 లో వారి వివాహ పతనానికి దారితీసింది. విడాకుల తరువాత, దుర్రూషెహ్వార్ కొన్ని సంవత్సరాలు హైదరాబాద్లో ఉండి, తరువాత లండన్‌కు వెళ్లి స్థిరపడింది.[6] ఆమె తన "బెరార్ యువరాణి" బిరుదును మాత్రం అట్టేపెట్టుకుంది. ఆమె వివాహ సమయంలో భారతదేశంలో ఆమెతోపాటు నివసించిన ఆమె తల్లి, తిరిగి భర్తను చేరుకుంది.[6][5]
ప్రజా జీవితం
[మార్చు]అత్యంత గౌరవనీయమైన, బాగా చదువుకున్న మహిళగా, యువరాణి ఫ్రెంచ్, టర్కిష్, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో అనర్గళంగా మాట్లాడేది.[6] ఈమె చిత్రకారిణి, కవయిత్రి కూడా.[25] ఈమె తన పేరుతో హైదరాబాద్లోని యాకుత్‌పూరా, భాగే జహానారాలో జూనియర్ కళాశాలను, ఉస్మానియా జనరల్ ఆసుపత్రిని స్థాపించింది.[5][26] 1936 నవంబర్ 4న, హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయం మొదటి టెర్మినల్‌కు ఈమె శంకుస్థాపన చేసింది. ఈ సందర్భంగా ఈమెకు ఒక వెండి పేటికను అందజేశారు.[27][6] దుర్రూషెహ్వార్ 1939లో అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ప్రసిద్ధ అజ్మల్ ఖాన్ తిబ్బియా కళాశాల ఆసుపత్రిని కూడా ప్రారంభించింది.[5][26]
ఆమె కజిన్ నిలీఫర్‌తో కలిసి, దుర్రూషెహ్వార్ బాలికల విద్య, మహిళల హక్కులకై పాటుపడ్డారు. నిజాం తన కోడళ్లు ఇద్దరినీ అభిమానించేవాడు అందువళ్ల వీరికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడింది. నిజాం వీరిని తరచుగా "తన రాజభవనపు ఆభరణాలు" గా పరిచయం చేసేవాడు. టెన్నిస్, గుర్రపు స్వారీ వంటి క్రీడలలో పాల్గొనమని ఆయన వారిద్దరినీ ప్రోత్సహించాడు. వారు వారి ఆలోచనలను విస్తృతం చేసుకోవడానికి, పనిలోపనిగా తన మ్యూజియంల కోసం కళాకృతులను కూడా సేకరించడానికి ఆయన వీరిని ఐరోపా పర్యటనలకు పంపేవాడు." ఇద్దరు కజిన్స్ గొప్ప అందగత్తెలు, సోషలైట్లు, స్టైల్ ఐకాన్స్, అంతే గాక గొప్ప దాతలుగా గుర్తించబడ్డారు.[6] తన స్నేహితురాలు రాణి కుముదినీ దేవితో కలిసి దుర్రూషెహ్వార్ గుర్రాలపై స్వారీ చేసింది, కార్లు నడిపింది, టెన్నిస్ ఆడింది. ఆమె అందం, ఆకర్షణ, మర్యాద, వస్త్రధారణతో, ఆమె హైదరాబాదు ఉన్నత వర్గపు సామాజిక చిత్రాన్ని మార్చివేసింది.[5]
1935 మే 6న, ఆమె భర్తతో పాటు కింగ్ జార్జ్ V పాలన యొక్క ఇరవై ఐదవ స్మారక వేడుకకు హాజరయ్యింది.[28] 1937 మే 12న, వారు కింగ్ జార్జ్ VI, ఎలిజబెత్ రాణి పట్టాభిషేకానికి హాజరయ్యారు. అక్కడ ఆమె బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ సెసిల్ బీటన్ చేత ఫోటో తీయబడింది.[29] 1937 జూన్ 23న, కెన్సింగ్‌టన్లో కొత్త మసీదుకు శంకుస్థాపన చేయడానికి ఆమె తన భర్తతో కలిసి వెళ్ళి, రానెలాగ్ వద్ద భోపాల్ జట్టు రానెలాగ్ ఓపెన్ పోలో కప్పును గెలుచుకోవడాన్ని చూసింది.[30] బీటన్ 1944లో భారతదేశంలోని ఆమెను తన రాజభవనంలో, ఆ తరువాత 1965లో ఫ్రాన్స్‌లో ఆమె ఫోటోలు తీశాడు.[29] ఇండియన్ సివిల్ సర్వీసుకు చెందిన ఫిలిప్ మేసన్ ఆమెను వర్ణిస్తూ, "ఒక కమాండింగ్ వ్యక్తి, అందమైన ముఖకవళికలు, స్పష్టమైన ఛాయ, లేతగోధుమ వర్ణపు జుట్టుతో, ఎవరూ ఆమెను విస్మరించలేరు లేదా ఆమెను చిన్నచూపు చూడలేరు. ఆమెలో ఎల్లప్పుడూ నిర్వచించలేని రాజసం ఉట్టిపడుతుందని, విధి తలిస్తే ఆమె ప్రపంచంలోనే గొప్ప రాణులలో ఒకరిగా మిగిలిపోతుందని నాకు అనిపిస్తుంది" అని అన్నాడు.[31]
తరువాత జీవితం, మరణం
[మార్చు]ఆమె తన కుమారులు, యువరాజు ముకర్రమ్ జా, యువరాజు ముఫ్ఫకం జా, ఐరోపాలో సాధ్యమైనంత అత్యుత్తమమైన పాశ్చాత్య విద్యను పొందేలా చేసింది. తాను అనుకున్నట్లుగానే టర్కిష్ వధువులతో వివాహం చేసుకుంది. ముకర్రమ్ ఈటన్‌లో చదువుకున్నాడు. ఆ తర్వాత కాలంలో, తన తాత సలహా మేరకు హైదరాబాద్ సింహాసనానికి వారసుడిగా ప్రకటించబడ్డాడు. ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గౌరవ సహాయకుడిగా కూడా పనిచేశాడు.[5] దుర్రూషెహ్వార్ హైదరాబాద్ తిరిగి వచ్చిన ప్రతిసారీ, ఈమె పెద్ద ఎత్తున జనాలను ఆకర్షించింది.[6]
1944లో, తన తండ్రి అంత్యక్రియలకు సహాయం కోరుతూ, అప్పటికే భారతదేశం నుండి ఐరోపాకు తిరిగి వెళ్ళిన నిలోఫర్‌కు ఫోన్ చేసింది. తన తండ్రి మృతదేహాన్ని ఇస్తాంబుల్లో ఖననం చేయడానికి ఆమె అనేక ప్రయత్నాలు చేసింది, కానీ టర్కీ ప్రభుత్వం నుండి అనుమతి పొందలేకపోయింది. ఆయన టర్కీలో లేదా హైదరాబాద్లో ఖననం చేయాలన్న కోరికను బ్రతికుండగా వ్యక్తం చేశాడు. నిలోఫర్ తన స్నేహితులలో ఒకరు, నిజాం ప్రభుత్వంలో మాజీ అధికారైన మాలిక్ గులాం ముహమ్మద్‌కు ఈ విషయమై ఫోన్ చేసింది. మాలిక్ గులాం ముహమ్మద్, ఆ సమయంలో పాకిస్తాన్ గవర్నర్ జనరల్‌గా ఉన్నాడు. ఆయన సౌదీ అరేబియా రాజు సౌద్ బిన్ అబ్దుల్‌అజీజ్ అల్ సౌద్‌కు ఈ అభ్యర్థనను తెలియజేశాడు. సౌదీ అరేబియా రాజు అభ్యర్థనను మంజూరు చేయడానికి అంగీకరించాడు. తత్ఫలితంగా, దుర్రూషెహ్వార్ తండ్రి చివరకు సౌదీ అరేబియాలో అల్-బకీలో ఖననం చేయబడ్డాడు.[32]
1983లో, ఆమె తన కుమారుడు ముకర్రమ్ జా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని దుర్రూషెహ్వార్ చిల్డ్రన్స్ & జనరల్ హాస్పిటల్‌ను కట్టించడానికి విరాళమిచ్చింది.[33] 1990లో, ఆమె, ఆమె కుమారుడు ముఫ్ఫకం జా, ఆయన భార్య ఎసిన్, హైదరాబాద్ స్థాపన యొక్క 400వ సంవత్సరం జ్ఞాపకార్థంగా లండన్లో ఏర్పాటు చేసిన డర్బన్ విందుకు భారత, పాకిస్తాన్ హైకమిషనర్లతో కలిసి హాజరయ్యారు.[34]
ఈమె చివరిసారిగా 2004లో హైదరాబాద్ సందర్శించి, 2006 ఫిబ్రవరి 7న లండన్లో మరణించింది.[5][35] ఈమె మరణించే సమయంలో ఇద్దరు కుమారులు ఈమె పక్కనే ఉన్నారు.[6] ఆమె బ్రూక్‌వుడ్ స్మశానవాటికలో ఖననం చేయబడింది. [36][37] తుర్కియే రిపబ్లిక్ ప్రకటించిన తరువాత తన కుటుంబ సభ్యుల పట్ల టర్కీ ప్రభుత్వపు వైఖరి పట్ల ఆమె కలత చెందింది. 1944లో ఇస్తాంబుల్లో తన తండ్రిని ఖననం చేయడానికి టర్కిష్ ప్రభుత్వం నిరాకరించడంతో, ఉస్మానియా సామ్రాజ్యపు రాజ కుటుంబంలో సభ్యురాలైనప్పటికీ, ఆమె టర్కీలో ఖననం చేయడానికి నిరాకరించింది.
ఆమె మరణించినప్పుడు, టెలిగ్రాఫ్ ఆంగ్ల పత్రిక ఇలా వ్రాసింది: "ఆక్స్‌ఫర్డ్‌షైర్లో ఒక స్నేహితురాలితో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఒక సందర్భం వచ్చింది. అందులో యువరాణి మార్గరెట్ కూడా అతిథిగా పాల్గొన్నది. వాతావరణం ప్రతికూలంగా ఉంది. ఇద్దరు యువరాణులను లెబనాన్ దేవదారు మొక్కలను నాటడానికి ఆహ్వానించారు. యువరాణి మార్గరెట్ చివరికి అయిష్టంగానే మొక్కలను నాటడానికి ఒప్పుకుంది. బేరార్ యువరాణి మాత్రం తన ఆచారబద్ధమైన నిశ్శబ్ద గౌరవంతో తన విధిని నిర్వర్తించింది. నేడు యువరాణి మార్గరెట్ చెట్టు కష్టపడుతుండగా, బేరార్ యువరాణి నాటిన చెట్టు మాత్రం వర్ధిల్లుతున్నది".
వారసత్వం
[మార్చు]దుర్రూషెహ్వార్ "నిశ్శబ్ద శక్తి" బోధించినందుకు గాను చిరస్మరణీయురాలు. హైదరాబాద్లో అనేక ప్రసూతి యూనిట్లు, పాఠశాలలు, కళాశాలలు, ఔషధశాలలు, ఆసుపత్రులను స్థాపించినందుకుగాను ఈమె గుర్తుండిపోతుంది.[38]
గౌరవము
[మార్చు]- ఆర్డర్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ఉస్మాన్[39]
ఇష్యూ
[మార్చు]పేరు. | జననం. | మరణం. | గమనికలు |
---|---|---|---|
ముకర్రమ్ జా | 6 అక్టోబర్ 1933 | 15 జనవరి 2023 [40] | ఐదుసార్లు వివాహం చేసుకున్నాడు. ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు |
ముఫ్ఫఖం జా | 27 ఫిబ్రవరి 1939 | జీవిస్తున్నాడు | ఒకసారి వివాహం. ఇద్దరు కుమారులు ఉన్నారు |
మూలాలు
[మార్చు]- ↑ The Prescriber. 1946. p. 62.
- ↑ The Feudatory and zemindari India. 1946. p. 241.
- ↑ Sacheverell Sitwell (1953). Truffle Hunt with Sacheverell Sitwell. Hale. p. 86.
- ↑ 4.0 4.1 Adra, Jamil (2005). Genealogy of the Imperial Ottoman Family 2005. pp. 37-38.
- ↑ 5.0 5.1 5.2 5.3 5.4 5.5 5.6 5.7 5.8 Seshan, K S S (2018-10-30). "The progressive princess of Hyderabad". The Hindu. Retrieved 2021-02-19.
- ↑ 6.0 6.1 6.2 6.3 6.4 6.5 6.6 6.7 6.8 Khan, Elisabeth (2020-04-16). "Ottoman Princesses in India (3). Princess Durru Shehvar, daughter of the…". Medium. Retrieved 2021-02-19.
- ↑ Yılmaz Öztuna (2008). II. Abdülhamîd: zamânı ve şahsiyeti. Kubbealti Publishing. pp. 238–39. ISBN 978-97564-446-27.
- ↑ "Saraydan Seyyar Satıcılîğa: Şehzâde Âbid Efendi". www.erkembugraekinci.com. 19 June 2013. Retrieved 26 March 2021.
- ↑ 9.0 9.1 Bardakçı 2017, p. 125.
- ↑ Bardakçı 2017, p. 124.
- ↑ 11.0 11.1 11.2 Bardakçı 2017, p. 123.
- ↑ 12.0 12.1 12.2 Bardakçı 2017, p. 126.
- ↑ Bardakçı 2017, pp. 126–127.
- ↑ Garari, Kaniza (2019-09-30). "Did Mahatma Gandhi meet Princess Niloufer on ship? Panel looks for clues". Deccan Chronicle. Retrieved 2021-02-19.
- ↑ Garari, Kaniza (2019-10-01). "Hyderabad: Mahatma Gandhi did meet Niloufer, Durrushehvar on ship". Deccan Chronicle. Retrieved 2021-02-19.
- ↑ Acharya, Arvind (2016-01-17). "Revealed: Mahatma Gandhi had big impact on Princess Niloufer". Deccan Chronicle. Retrieved 2021-02-19.
- ↑ "A short biography of Princess Niloufer - The Siasat Daily". The Siasat Daily - Archive. 2017-01-03. Retrieved 2021-02-19.
- ↑ Khan, Ali (2019-10-09). "Social landscape of Hyderabad changed by the entry of Princesses". The Siasat Daily. Retrieved 2021-02-20.
- ↑ Nanisetti, Serish (2019-05-01). "Academic Staff College of India (ASCI) in Hyderabad was cocooned in luxury a century ago, as Bella Vista palace". The Hindu. Retrieved 2021-02-20.
- ↑ All-India Trade Directory and Who's who. 1942. p. 255.
- ↑ Theo La Touche (1946). India's Premier Ruling Prince: A Rapid Sketch of the Man and His Work. Thacker. pp. 52, 66.
- ↑ Philip Mason (1978). A Shaft of Sunlight: Memories of a Varied Life. Vikas Publishing House. p. 203. ISBN 978-0-233-96955-8.
- ↑ R. Swarupa Rani (2003). Women's Associations in Telangana. Booklinks Corporation. p. 58. ISBN 978-81-85194-71-4.
- ↑ "Tribute to eldest daughter-in-law of Nizam VII Princess Durru Shehvar". The Siasat Daily - Archive. 2019-01-26. Retrieved 2021-02-19.
- ↑ "Princess Dürrühsehvar, Princess of Berar; Caliph Abdulmecid Khan II of Turkey; Nawab Azam Jah, Prince of Berar". Portrait. Retrieved 2021-03-10.
- ↑ 26.0 26.1 Ashraf, Md Umar (2018-12-21). "Princess Durru Shehvar :- A Turkish princes married to an Indian prince". Heritage Times. Retrieved 2021-02-20.
- ↑ "Display of Asaf Jahi dynasty priceless objects reveals its contributions to Hyderabad". India Today. 2013-01-10. Retrieved 2021-02-20.
- ↑ Bardakçı 2017, p. 155.
- ↑ 29.0 29.1 Genç, Kaya (2015-05-30). "Portraits of Princess Dürrüşehvar and many others at Cecil Beaton exhibition". Daily Sabah. Retrieved 2021-02-20.
- ↑ "Mary Evans The Princess of Berar 10651934". maryevans.com. 1937-06-23. Retrieved 2021-02-20.
- ↑ "Princess Dürrühsehvar of Berar". 11 February 2006 – via www.telegraph.co.uk.
- ↑ Moin, Ather (2019-01-04). "Hyderabad: Niloufer helped in Caliph's burial in Madina". Deccan Chronicle. Archived from the original on 4 January 2019. Retrieved 2021-02-19.
- ↑ M.a.khan; Mohd. Akbar Ali Khan (1999). Hospital Management. APH Publishing. p. 217. ISBN 978-81-7648-060-4.
- ↑ Karen Isaksen Leonard (2007). Locating Home: India's Hyderabadis Abroad. Stanford University Press. p. 97. ISBN 978-0-8047-5442-2.
- ↑ Bardakçı 2017, p. xiv.
- ↑ Peter Clark (2010). Istanbul: A Cultural and Literary History. Signal Books. p. 223. ISBN 978-1-904955-76-4.
- ↑ Yunus Ayata (2007). Dergi semasında bir yıldız: Utarid. Salkımsöğüt Yayınları. p. 62. ISBN 978-975-6122-54-9.
- ↑ Poddar, Abhishek; Gaskell, Nathaniel; Pramod Kumar, K. G; Museum of Art & Photography (Bangalore, India) (2015). "Palanpur". Maharanis: women of royal India (in English). Ahmedabad. pp. 42–43. ISBN 978-93-85360-06-0. OCLC 932267190.
{{cite book}}
: CS1 maint: location missing publisher (link) CS1 maint: unrecognized language (link) - ↑ Salnâme-i Devlet-i Âliyye-i Osmanîyye, 1333-1334 Sene-i Maliye, 68. Sene. Hilal Matbaası. 1918. pp. 74–75.
- ↑ Quint, The (2023-01-15). "Mukarram Jah, Eighth Nizam of Hyderabad, Passes Away". TheQuint (in ఇంగ్లీష్). Retrieved 2023-08-02.
వనరులు
[మార్చు]- Bardakçı, Murat (2017). Neslişah: The Last Ottoman Princess. Oxford University Press. ISBN 978-9-774-16837-6.
బయటి లింకులు
[మార్చు]- "Goodbye, sweet princess - India's great beauties before the pageant came in". www.telegraphindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-10-21.
- "Durrushehvar, the resolute princess: How the Ottoman dynasty heir brought style, reform to Nizam's Hyderabad". Firstpost (in ఇంగ్లీష్). 2020-01-26. Retrieved 2023-10-21.