ద్రాక్షారామ భీమేశ్వరాలయం
ద్రాక్షారామ భీమేశ్వరాలయం | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 16°47′N 82°04′E / 16.79°N 82.06°E |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కోనసీమ జిల్లా |
ప్రదేశం | అంతర్వేది |
ద్రాక్షారామ భీమేశ్వరాలయం, కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలం, ద్రాక్షారామం గ్రామంలో, గోదావరి నది తూర్పు ఒడ్డున ఉంది. [1]ఈ ఆలయం పంచారామాలలో ఒకటి. [2] ఈ ఆలయం కారణంగా ద్రాక్షారామం ప్రముఖ పుణ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ద్రాక్షారామం కాకినాడ నుండి 28 కిమీ, రాజమండ్రి నుండి 50 కిమీ, అమలాపురం నుండి 25 కిమీ దూరంలో ఉంది. ఈ ఆలయం కారణంగా ద్రాక్షారామ అని వాడుకలో పిలుస్తారు. దీని అర్థం "ద్రాక్షారామం" అంటే దక్ష ప్రజాపతి నివాసం. దక్ష ప్రజాపతి శివుని మామ, 'సతి' పార్వతీ తండ్రి, శివుని ఆధ్యాత్మిక జీవిత భాగస్వామి. ఇది 'స్కంద పురాణం'లో వివరించబడింది.[3] [4]ద్రాక్షారామం ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు.ఈ ఆలయం శివ పంచారామాలలో ఒకటి, 18 శక్తి పీఠాలలో ఒకటి. కనుక ఇది శివ క్షేత్రంగానూ, శక్తి క్షేత్రంగానూ ప్రసిద్ధి చెందింది.[5]
క్షేత్ర ప్రాముఖ్యత
[మార్చు]ఈ ప్రదేశం పేరు, ఈ ప్రదేశంలో శివుని ఉనికి గురించి ఆసక్తికరమైన పురాణంప్రకారం , తారకాసుర వధ సమయంలో, తారకాసురుని కంఠంలో ఉన్న శివలింగం ఐదు ముక్కలుగా విరిగిపోయి, ఒక ముక్క ఇక్కడ పడిందని. ఆ తర్వాత దీనికి ద్రాక్షారామం అనే పేరు వచ్చిందని కథనం. ఒక మెట్ల మార్గం గర్భగుడి పై స్థాయికి చేరుకుంటుంది, ఇక్కడ భీమేశ్వర స్వామి పై భాగాన్ని చూడవచ్చు. ద్రాక్షారామంలోని శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. తెల్లవారుజామున లేత సూర్యకాంతి శివలింగంపై పడుతుంది. శివలింగం స్ఫటిక ఆకృతిలో ఉంటుంది. శివలింగం పైభాగంలో నల్లటి చారలు మనకు కనిపిస్తాయి. శివుడు అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు వేటగాడి వేషంలో ఉన్నప్పుడు ధరించిన పులి చర్మానికి సంబంధించిన గుర్తులని భక్తులు నమ్మకం.[6]
మాణిక్యాంబా దేవి శక్తి పీఠం
[మార్చు]ద్రాక్షారామ భీమేశ్వరాలయ ప్రాకారంలో ఈశాన్యంలో అష్టాదశ శక్తి పీఠాలలో 12వ శక్తిపీఠం మాణిక్యాంబ ఆలయం కొలువై ఉంది.
అలయ చరిత్ర
[మార్చు]ఈ ఆలయాన్ని సాశ. 7, 8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది. ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. దేవేరి శ్రీ మాణిక్యంబా అమ్మవారు యావత్భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12 వ శక్తిపీఠంగా వెలసింది.తెలుగుకు ఆ పేరు త్రిలింగ అన్న పదం నుంచి ఏర్పడిందని కొందరి భావన. ఆ త్రిలింగమనే పదం ఏర్పడేందుకు కారణమైన క్షేత్ర త్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన రెండు క్షేత్రాలలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం కాగా, మరొకటి శ్రీశైలం.[7] త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్తాదశ శక్తిపీఠాలలో ద్వాదశ పీఠంగా, దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా ద్రాక్షారామానికి ప్రశస్తి ఉంది. శిల్ప కళాభిరామమై, శాసనాల భాండాగారమై ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయం ఒప్పారుతోంది.
శాతవాహన రాజైన హాలుని కాలానికే ఈ ఆలయం ఉన్నట్లు లీలావతీ గ్రంథం అన్న ప్రాకృతభాషా కావ్యంలో పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని, సామర్లకోట లోని భీమేశ్వరాలయాన్ని కూడా చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని చెబుతారు. అందుకే ఈ రెండు గుడులు ఒకే రీతిగా ఉండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయికూడ ఒకటేరకంగా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని గురించిన ప్రశంస శ్రీనాథకవి భీమేశ్వర పురాణంలో వివరించాడు. దుష్యంతుడు, భరతుడు, నలుడు, నహషుడు ఈ స్వామిని అర్చించారని వ్రాశాడు. తిట్టుకవిగా ప్రసిద్ధి నందిన వేములవాడ భీమకవి "ఘనుడన్ వేములవాడ వంశజుడ, ద్రాక్షారామ భీమేశునందనుడన్.... " అని చెప్పుకొన్నాడు.
శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, పంచారామాల్లో ఒకటిగా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రాన్ని గురించి శ్రీనాథ కవి సార్వభౌముడు తన కావ్యాల్లో పేర్కొన్నాడు. ఇక్కడి స్వామివారిని అభిషేకించడానికి సప్తఋషులు కలిసి గోదావరిని తీసుకు వచ్చారనీ పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. అందువలన అంతర్వాహినిగా ప్రవహించే ఈ గోదావరిని సప్త గోదావరి' అని పిలుస్తూ వుంటారు. ఇక్కడి పంచలోహ విగ్రహాలు తామ్ర మూర్తులు 8 వ శతాబ్దం నుంచి ఉన్నవిగా భావిస్తున్నారు.[5]
అష్ట లింగాలు
[మార్చు]ఈ భీమేశ్వరుడికి ఎనిమిది దిక్కులలోను ఎనిమిది శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడని విశ్వసించబడుతుంది. వీటిని అష్టలింగములు లేదా అష్ట సోమేశ్వరములు అంటారు. తూర్పున కోలంక, పడమర వెంటూరు, 'దక్షిణాన కోటిపల్లి ఉత్తరాన వెల్ల ఆగ్నేయంలో దంగేరు. నైరుతిలో కోరుమిల్లి వాయువ్యంలో సోమేశ్వరం ఈశాన్యాన పెనుమళ్ళ ప్రాంతాలలో ఈ అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఈ భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇంద్రేశ్వర, యజ్ఞేశ్వర, సిద్దేశ్వర, యోగీశ్వర, యమేశ్వర, కాళేశ్వర వీరభద్రేశ్వర లింగాలు దర్శనమిస్తాయి. ఇక తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశగా ఉన్న ఒక్కో గాలి గోపురాన్ని ఒక్కో అమ్మవారు పర్యవేక్షిస్తున్నట్టు స్థలపురాణం వివరిస్తుంది.
ప్రత్వేక ఉత్సవాలు
[మార్చు]- ప్రతీ ఏకాదశీ పర్వదినములలో ఏకాంతసేవ, పవళింపుసేవ
- ప్రతీ మాసశివరాత్రి పర్వదినములలో గ్రామోత్సవం
- ప్రతీ కార్తీక పూర్ణిమతో కూడిన క్రృత్తికా నక్షత్రం రోజున జ్వాలాతోరణ మహోత్సవం
- ప్రతీ మార్గశిర శుద్ధ చతుర్ధశి రోజున శ్రీ స్వామివార్ల జన్మ దినోత్సవం
- ప్రతీ ధనుర్మాసంలోనూ క్షేత్రపాలకులు అయిన శ్రీ లక్ష్మీ సమేత శ్రీ నారాయణ స్వామి వార్లకు ధనుర్మాస పూజలు
- ప్రతీ మాఘశుద్ధ ఏకాదశీ ( భీష్మ ఏకాదశి ) రోజున శ్రీ స్వామి వారి, అమ్మవార్లకు దివ్య కల్యాణ మహోత్సవం
- ప్రతీ మహాశివరాత్రి పర్వదినాలలో శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.
- శరన్నవరాత్రులు (దేవీనవరాత్రులు) - ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు జరుగుతాయి
- కార్తీక మాసం ప్రత్యేక ఉత్సవాలు - జ్వాలాతోరణం (కార్తీక పున్నమి నాడు)
- సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవం- మార్గశిరశుద్ధ షష్ఠి నాడు
వసతి, అన్నదానం
[మార్చు]యాత్రీకుల సౌకర్యార్ధం ఇచ్చట పైండా వారిచే నిర్మించబడిన అన్నదానసత్రం ఉంది. దేవస్థానం వారి యాత్రికుల వసతి గృహం, ఆలయానికి 1/2 కి.మీ దూరంలో ఆర్.టి.సి బస్టాండుకు దగ్గర కోటిపల్లి రోడ్డులో ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ https://tms.ap.gov.in/bmsdrm/cnt/about-temple
- ↑ "Panchamukha : పంచముఖుని పంచారామాలు | Pancharamas of Panchamukha mvs". web.archive.org. 2023-02-18. Archived from the original on 2023-02-18. Retrieved 2023-02-18.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "LORD BHIMESWARA SWAMI TEMPLE, DRAKSHARAMA | Welcome to East Godavari District Web Portal | India". Retrieved 2023-01-24.
- ↑ "ద్రాక్షారామం ..నిటలాక్షుని వైభవం". EENADU. Retrieved 2023-02-04.
- ↑ 5.0 5.1 "LORD BHIMESWARA SWAMI TEMPLE, DRAKSHARAMA | Welcome to East Godavari District Web Portal | India". Retrieved 2023-02-04.
- ↑ India, Famous Temples in (2017-11-24). "Draksharamam Bhimeswara Swamy Temple". Retrieved 2023-02-04.
- ↑ వెంకట లక్ష్మణరావు, కొమర్రాజు (1910). "త్రిలింగము నుండి తెలుగు పుట్టెనా? లేక తెలుగు నుండి త్రిలింగము పుట్టెనా?". ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక: 81. Archived from the original on 28 September 2017.