Jump to content

ధర్మపత్ని (1941 సినిమా)

వికీపీడియా నుండి

ధర్మపత్ని(1969 సినిమా) కూడా చూడండి.

ధర్మపత్ని
(1941 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.పుల్లయ్య
కథ వి.ఎస్.ఖండేకర్
తారాగణం భానుమతి,
శాంతకుమారి,
ఉప్పులూరి హనుమంతరావు,
డి.హేమలతాదేవి,
కె.లక్ష్మీనరసింహారావు,
రామానుజాచారి,
ఆదినారాయణ,
పెద్దాపురం రాజు,
అక్కినేని నాగేశ్వరరావు
సంభాషణలు చక్రపాణి
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ధర్మపత్ని, 1941లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సుప్రసిద్ధ మరాఠీ రచయిత విష్ణు సఖారాం ఖండేర్కర్ రాసిన ఓ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.[1] పి.పుల్లయ్య దర్శకత్వంలో ఫేమస్‌ ఫిలింస్‌ పతాకాన ఈ' చిత్రాన్ని షిరాజ్‌ ఆలీ హకీం నిర్మించాడు. రామానుజాచారి హీరోగా నటించగా, పుల్లయ్య భార్య శాంతకుమారి ఈ చిత్రంలో హీరోయిన్‌.[2] కొల్హాపూర్‌లోని శాలిని సినీటోన్ స్టూడియోలో చిత్రీకరణ జరిపారు. అప్పటి ప్రఖ్యాత రంగస్థల నటుడు ఉప్పులూరి సంజీవరావు కుమారుడు హనుమంతరావు హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమా తర్వాత ఆయన 'భీష్మ ప్రతిజ్ఞ, 'వందేమాతరం' సినిమాల్లో మాత్రమే నటించి, ఆ తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి భీమవరంలో మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ ఉద్యోగంలో చేరారు.[3]

మొదట సంభాషణల రచయితగా విశ్వనాథ సత్యనారాయణ ఎంపికయ్యారు. కానీ ఆయన సంభాషణలు మరీ గ్రాంధికంగా ఉండటంతో శరత్‌చంద్ర ఛటర్జీ నవలల్ని తెలుగులో అనువదించిన చక్రపాణిని మాటల రచయితగా పరిచయం చేశారు. అదివరకు హిందీ, మరాఠీ సినిమాలకు పనిచేసిన అన్నాసాహెబ్ మైంకర్ సంగీతం సమకూర్చిన ఏకైక తెలుగు సినిమా ఇదే. అక్కినేని నాగేశ్వరరావు నటించిన తొలి సినిమా ఇదే. ఓ చిన్న పాత్రలో బాలనటుడిగా ఆయన కనిపించాడు.

కథాంశం

[మార్చు]
సినిమాలో భానుమతి పాడిన నిలు నిలుమా నీలవర్ణా పాట

రాధకు ఐదేళ్ల వయసున్నప్పుడు ఆమె తల్లి చనిపోతుంది. పోతూ పోతూ రాధని శ్రీదేవి అనే దేవదాసి చేతుల్లో పెడుతుంది. తాను దేవదాసి పని మానేసి మంచి జీవితం గడుపుతానని రాధ తల్లికి మాటిస్తుంది శ్రీదేవి. గృహిణికి ఉండాల్సిన లక్షణాల గురించి చిన్నపిల్ల రాధకు బోధిస్తుంది శ్రీదేవి. స్కూల్లో రాధ, మోహన్ స్నేహితులవుతారు. వారితో పాటు ఆ స్నేహం పెరిగి ప్రణయంగా మారుతుంది. ఆమెని గుడికి తీసుకెళ్లి దేవును ముందు రాధను తన 'ధర్మపత్ని'గా స్వీకరిస్తాడు మోహన్.

ఓ దేవదాసి కూతురితో తన కొడుకు తిరుగుతున్నాడనే సంగతి విలన్ ఆనందరావు ద్వారా మోహన్ తండ్రికి తెలుస్తుంది. సంపన్న కుటుంబానికి చెందిన ఉమ అనే అమ్మాయిని పెళ్ళి చేసుకోవాల్సిందిగా కొడుకు మీద ఆయన ఒత్తిడి తెస్తాడు. పెళ్లయ్యాక తన పట్ల మోహన్ అనాసక్తిగా ఉండటానికి రాధ పట్ల అతనికున్న ప్రేమేనని తెలుసుకున్న ఉమ అతన్ని విడిచి వెళ్తుంది. ఆనందరావు ట్రాప్ నుంచి ఉమను కాపాడుతుంది అతని వల్ల అప్పటికే మోసపోయిన లీల.

లీలను హత్యచేసి ఆ నేరం మోహన్ మీద పడేట్లు చేస్తాడు ఆనందరావు. మోహన్‌ని రక్షించడానికి అతను నిరపరాధి అని చెప్పే ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పిన ఆనందరావు వద్దకు వెళ్లడానికి నిశ్చయించుకుంటుంది రాధ. చివరకు నిజం బయటపడి మోహన్ జైలునుంచి విడుదలవుతాడు. అతని తల్లిదండ్రులు రాధను చేరదీస్తారు. తన తప్పు తెలుసుకుని తిరిగి మోహన్ వద్దకు చేరుకుంటుంది ఉమ.

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

సినిమా స్క్రిప్టు రాసే సమయంలో మొదట ఒక వ్యక్తిని రచయితగా పెట్టుకుని రాయించుకున్నారు. అయితే వారు రాసిన సంభాషణలు దర్శకుడు పుల్లయ్యకు తృప్తికలిగించలేదు. ఇంకొక రచయిత కోసం వెతుకులాట ప్రారంభించి ప్రొడక్షన్ ఇన్ ఛార్జి బి.ఎస్.రామారావు తెనాలి నుంచి చక్రపాణిని తీసుకువచ్చారు. ఈ సినిమా తర్వాత చక్రపాణి వాహినీ సంస్థలో రచయితగానూ, తర్వాత బి.నాగిరెడ్డితో కలిసి విజయా ప్రొడక్షన్స్ ఏర్పరిచి నిర్మాతగానూ మారారు.[4]

తారాగణం

[మార్చు]
  • శాంతకుమారి (రాధ),
  • ఉప్పులూరి హనుమంతరావు (మోహన్),
  • భానుమతి (ఉమ),
  • రాళ్లబండి కుటుంబరావు (ఆనందరావు),
  • బేబీ లక్ష్మి (బాల రాధ),
  • మాస్టర్ కుమార్ (బాల మోహన్),
  • పెద్దాపురం రాజు (శ్రీదేవి),
  • చలపతిరావు,
  • అక్కినేని నాగేశ్వరరావు,
  • ఆదినారాయణయ్య,
  • నారీమణి,
  • సుశీల.
  • లీలావతి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ: వి.ఎస్. ఖండేకర్
  • మాటలు: చక్రపాణి
  • పాటలు: దైతా గోపాలం
  • సంగీతం: అన్నాసాహెబ్ మైంకర్
  • ఛాయాగ్రహణం: ఎస్.కె. పాయ్
  • కూర్పు: బాబూరావ్ బరోద్కర్
  • కళ: హెచ్.ఎస్. గంగ్ నాయక్
  • నిర్మాత, దర్శకుడు: పి. పుల్లయ్య
  • బేనర్: ఫేమస్ ఫిలిమ్స్
  • విడుదల తేది: 10 జనవరి

మూలాలు

[మార్చు]
  1. DHARMAPATHNI (1941) - m. l. narasimham - The Hindu September 4, 2011
  2. ఊపందుకున్న సాంఘిక చిత్రాల నిర్మాణం - ఆంధ్రప్రభ సెప్టెంబరు 2, 2010[permanent dead link]
  3. అలనాటి ఆణిముత్యం: ధర్మపత్ని (1941) - ఇండియా గ్లిట్జ్
  4. బి., నాగిరెడ్డి (మార్చి 2009). జ్ఞాపకాల పందిరి. చెన్నై: బి.విశ్వనాథ రెడ్డి.