నేల ఉసిరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నేల ఉసిరి
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
P. niruri
Binomial name
Phyllanthus niruri
Synonyms

Phyllanthus amarus

నేల ఉసిరి (లాటిన్ Phyllanthus niruri) ఒక ఔషధ మొక్క. ఇది ఫిలాంథేసి (Phyllanthaceae) కుటుంబానికి చెందినది. దీనిలో కాడ యొక్క రంగును బట్టి ఎరుపు, తెలుపు అని రెండు రకాలు.ఈ రెండు రకాల నేల ఉసిరి మొక్కల్లో తెలుపు మొక్కకు ప్రాధాన్యతనివ్వడం చాలా శ్రేయస్కరం.

పరిచయం[మార్చు]

చిన్న మొక్కల్నించి, మహావృక్షాల వరకూ అనేకానేక ప్రయోజనాలు, ఔషధగుణాలు ఉన్నవే ఉంటాయి తప్ప, పనికిరానిదంటూ ప్రకృతిలో తొంబై తొమ్మిది శాతం ఉండనేవుండదు. కానీ వాటిని వినియోగించుకోవడంలోనే మనం నిర్లక్ష్యం చేస్తున్నామన్నది అక్షర సత్యం.మన చుట్టూ పెరిగే చిన్న మొక్కల్ని పీకి పారేస్తూవుంటాం. అలాంటి కోవకి చెందినదే నేల ఉసిరి. ఇది కేవలం 60 సెంటీమీటర్ల ఎత్తువరకూ పెరిగే చిన్ని మొక్క. దీని శాస్త్రీయనామం ఫిల్లాంథస్‌ అమారస్‌. ఇది యుఫోర్బియేసి కుటుంబానికి చెందిన మొక్క. సమశీతోష్ణ మండలాల్లో విస్తారంగా పెరుగుతుంది. సంవత్సరం పొడవునా పెరిగే ఈ చెట్టు పత్రాలు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. పత్రాల కింది భాగంలో ఆకుపచ్చ తెలుపు కలిసిన రంగులో చిన్ని చిన్ని పువ్వులు పూస్తాయి. కాండము ఆకుపచ్చగా సన్నగా ఉండి నునుపుగా, మృదువుగా ఉంటుంది. దీనిలో విత్తనాలు పత్రాల కింది భాగంలో ఉండటం వల్ల దీనిని ఇంగ్లీషులో సీడ్‌ అండర్‌ లీఫ్‌ అనీ, స్టోన్‌ బ్రేకర్‌ అనీ అంటారు. ఇక ప్రాంతీయతని బట్టి అనేక భాషల్లో వివిధ పేర్లతో పిలుస్తుంటారు. స్పైయిన్‌లో చంకా పిడ్రా, క్వబ్రా పీడ్రా అనీ, మన భారతీయ భాషల్లో - బెంగాలీలో భూయామ్లా, సదాహజురమణి అనీ, హిందీలో భూయి ఆవ్ల, జంగ్లీ ఆవ్ల అనీ, తెలుగులో నేల ఉసిరి, నేల విరిక అనీ, తమిళంలో కీల నెల్లి, కిక్కాయ నెల్లి అనీ, మలయాళంలో కీఝర్‌ నెల్లి అనీ, మరాఠీలో భూయి ఆవ్ల అనీ, కన్నడంలో నెలనెల్లి, కీరునెల్లి అని, గుజరాతీలో భోన్యాన్‌వలి అనీ అంటారు. ఈ మొక్క దక్షిణ భారతదేశంలో కన్నా, ఉత్తర భాగాన ఎక్కువగా పెరుగుతుంది.

ఔషధ గుణాలు[మార్చు]

ఈమొక్క మొత్తం ఉపయోగపడే ఔషధగుణాలు కలిగివుండటం విశేషం. అనేక రుగ్మతలకి, వ్యాధులకీ ఇది విస్తృతంగా వైద్య విధానంలో ఉపయోగపడుతోంది. మనుషుల్లో హెపటైటిస్‌-బి వైరస్‌ని అరికట్టడానికి ఈ ఔషధం ఉపయోగిస్తారు. బాక్టీరియా, ఫంగస్‌ల్ని కూడా అరికడుతుంది. అంతేకాక లివర్‌కి రక్షణగా, అతిసార వ్యాధిని నివారించడంలో, కాన్సర్‌, గర్భనిరోధక ఔషధంగా ఈ మొక్క వినియోగపడుతుంది. బ్రెజిల్‌, పెరూల్లో కిడ్నీలో రాళ్ళ నివారణకి ముఖ్య ఔషధంగా ఉపయోగిస్తారు. నేల ఉసిరి కాండం, వేర్లు, ఆకులు, పువ్వులు, కాయలు, ఈ చెట్టునుండి ఏర్పడే పాలు అన్నీ ఆయుర్వేద మందుల్లో వాడతారు. చలువకి, దాహార్తిని తీర్చడానికి, బ్రాంకైటీస్‌కి, కుష్టువ్యాధికి, మూత్ర సంబంధ వ్యాధులకి, ఉబ్బసానికి, తయారు చేసే మందుల్లో నేలఉసిరిని ఎక్కువగా వాడతారు. అంతేకాక యునానీ వైద్యపరంగా కూడా దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అల్సర్స్‌కి, దెబ్బలకి, తామర, గజ్జి నివారణకి వాడే యునానీ మందుల తయారీలో దీనిని వాడతారు. పచ్చకామెర్ల వ్యాధికి తాజాగా తీసిన దీని వేరు అత్యంత దివ్యౌషధంగా పనిచేస్తుంది. చర్మ సంబంధ వ్యాధులకి దీని ఆకులు నూరి కాస్త ఉపð కలిపి గాయాలకీ, దెబ్బలకీ, ఇతర చర్మం మీద ఏర్పడే మచ్చలకీ రాస్తే తక్షణ నివారణ ఉంటుంది. పాముకాటుకి విరుగుడుగా కూడా ఈ మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది. లివర్‌ వ్యాధులకి తయారుచేసే మందులలో, చివరికి లివ్‌-52లో కూడా దీనిని వినియోగిస్తారు. ఎడారి ప్రాంతవాసులు నేల ఉసిరి వేర్లు, భద్రమిశ్రగంధితో కలిపి ఒంటెలకి అరుగుదల పెరగడానికి ఔషధంగా వాడతారు. నేల ఉసిరి పేస్టును మజ్జిగతో కలిపి తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి. ఇక ఇందులో ఉండే రసాయనాల్ని లిగ్నన్స్‌ (ఫిలంథిన్‌, హైపోఫిలంథిన్‌) ఎంతో ఉపయోగపడుతున్నాయి. అలాగే ఇందులో ఉండే ఇతర పదార్థాలు ఆల్కాలాయిడ్స్‌, సెక్యూరినైన్‌, నార్‌-సెకూరినైన్‌, ఫిల్లంథిన్‌, ఆలో-సెక్యూరినాల్‌(వేర్లు), ఎంట్‌, నార్‌ సెకూరిన్‌ (మొత్తం మొక్క) లిగ్నన్స్‌, నిర్‌టెట్రాలిన్‌, డైబెంజైన్‌ బుట్రైల్‌ లాక్టోన్‌ (ఆకులు), గ్లైకోసైడ్‌- నిరునిన్‌ (మొక్క పైభాగం), నిరూరిసైడ్‌ (ఆకు), టానిన్స్‌-అమరిన్‌, ఫిలంథుసిన్‌ డి, అమరానిక యాసిడ్‌, రిఫండ్‌సినిక యాసిడ్‌, జెరనినిక యాసిడ్‌లు లభ్యమవుతాయి. అంత విలువలు ఉండబట్టే వ్యవసాయ రీతిలో ఉత్తరప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్‌, ఒడిషా, బెంగాల్‌ల్లో ఎక్కువగా పెంచుతున్నారు. - వి. సౌమ్య (Andharaprabha sunday magazine)

లక్షణాలు[మార్చు]

 • ఉద్వక్ర నిర్మాణంలో పెరిగే గుల్మం.
 • గురు అగ్రంతో దీర్ఘవృత్తాకారంలో హ్రస్వశాఖలపై అమరివున్న సరళ పత్రాలు.
 • పత్రగ్రీవాలలో నిశ్చిత సమూహాలుగా ఏర్పడిన చిన్న ఆకుపచ్చ పుష్పాలు.
 • గుండ్రటి విదారక ఫలాలు.

ప్రాంతీయ నామములు[మార్చు]

 • సంస్కృతం : భూమ్యామలకి, తామలకి, బహుపత్రా, బహుఫలా
 • హిందీ : భూయిఆమ్లా
 • బెంగాళీ : భూయీఆమ్లా
 • గుజరాతీ : బోయారలీ

ఉపయోగాలు[మార్చు]

నేల ఉసిరి మొక్క అన్ని భాగాలు ఔషధాలలో ఉపయోగిస్తారు.[1]

 • శరీరంపై కలిగే వాపు, అభిఘాతములలో నేల ఉసిరిని దంచి పైపూతగా రాయాలి
 • ఎముకలు విరిగినపుడు నేల ఉసిరిని ఉప్పుతో కలిపి దంచి ప్రయోగిస్తారు.
 • దీని వేరును బియ్యపు కలితో నూది వాపులలో, సెగగడ్డ పక్వము చెందినపుడు పైకి అంటించాలి.
 • ఉప్పుతో దంచి రసాన్ని తీసి లేపనము చేసిన దురదతో కూడిన చర్మ వ్యాధులు ఉపశమిస్తాయి.
 • నాలుక, నోరు, పెదవులు పాకము చెందినప్పుడు, నేల ఉసిరిని రాత్రి దంచి నీళ్లలో వేసి ఉదయం వడకట్టి ఆ నీటితో పలుమార్లు పుక్కిలించాలి.
 • దగ్గు, దమ్ములలో దీని రసాన్ని గాని, చూర్ణాన్ని గాని కషాయాన్ని గాని సేవించాలి.
 • కామెర్లలో దీన్ ఆకురసము ఒక టీ స్పూను కాని, దంచిన ముద్ద గచ్చకాయంత గాని, చూర్ణం చెంచాడు గాని 3 రోజులు సేవించాలు.
 • ఆకలిలేమి, అరుచి, దాహములలో కూడా నేల ఉసిరిని కడుపులోనికి తీసుకోవాలి.
 • దీని వేళ్ల రసాన్ని చక్కెరతో కలిపి సేవించిన లేదా నస్యము చేసిన ఎక్కిళ్లు ఉపశమిస్తాయి.
 • మూత్రవ్యాధులలో మూత్రము జారీ కావడానికి నేల ఉసిరి సమూలం దంచి తినిపించాలి.
 • స్త్రీలలో ఋతుస్రావమెక్కువగా ఉన్నప్పుడు తగ్గించడానికి, నేల ఉసిరి చూర్ణాన్ని బియ్యముతో కడుగుడు నీళ్లతో త్రాగించాలి.
 • దీని కషాయం సేవనతో దౌర్బల్యము, లివరు జబ్బులు, జ్వరాలు తగ్గిపోతాయి.

మూలాలు[మార్చు]

 1. నేల ఉసిరి, వాణిజ్య ప్రాముఖ్యత గల ఔషధ, సుగంధమొక్కలు, డా. కొండపల్లి నరసింహారెడ్డి, స్వామి రామానంద తీర్థ ప్రచురణలు, హైదరాబాద్, 2002, పేజీలు: 14-16.
"https://te.wikipedia.org/w/index.php?title=నేల_ఉసిరి&oldid=3603705" నుండి వెలికితీశారు