పందిరి గురువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పందిరి గురువు
పందిరి గురువు
జననం1919
గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమృకోట గ్రామం
మరణంఏప్రిల్‌ 30, 1964
రెంటచింతల
మతంనాస్తికత్వం
భార్య / భర్తలక్ష్మమ్మ
పిల్లలుహుషార్‌, ఆంధ్రరాష్ట్రం, నాగార్జునసాగర్‌, అంబర్‌, నీమ్‌

పందిరి గురువు (1919-30-4-1964) పల్నాడులో ప్రముఖ సంఘ సంస్కర్త, హేతువాది, స్వాత్రంత్య సమరయోధుడు. సమసమాజస్థాపన కోసం పల్నాటి తాలూకాలో ఎన్నో విప్లవాత్మక ఉద్యమాలు నడిపారు.[1]

జననం[మార్చు]

రెంటచింతల మండలం తుమృకోట గ్రామంలో 1919 సంవత్సరంలో పందిరి ముత్తయ్య, రామమ్మ దంపతులకు వెంకట గురువులు జన్మించారు. వీరిది హిందూ మతంలోని ఉన్నత వైశ్యకుల కుటుంబం.

సంఘ సంస్కరణ[మార్చు]

తన 15వ ఏట నుండే అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజారంగంలో పనిచేయటం ప్రారంభించారు. తాను పుట్టిన కులంలో అనేక కట్టుబాట్లు ఉన్నా వాటిని త్యుజించి, కులమత రహిత సమాజం కొరకు పోరాడారు. 900 సంవత్సరాల క్రితం పల్నాటి వీరుడు బ్రహ్మనాయుడు మాచర్ల చెన్నకేశవాలయంలో దళితులకు ఆలయప్రవేశం కల్పించి, సహపంక్తి భోజనాలు పెట్టించాడు. నాటి బ్రహ్మన్నను స్ఫూర్తిగా తీసుకున్న గురువులు తన స్వగ్రామమైన తుమృకోటలోని రామాలయంలో హరిజనులకు ఆలయప్రవేశం కల్పించి, అన్ని కులాల వారికి సహపంక్తి భోజనాలు జరిపించారు. మంచినీటి బావి వద్దకు రాని కొన్ని కులాల వారిని గ్రామంలోని మంచినీటి బావివద్దకు రప్పించి నీటిని తోడుకొని తాగే అవకాశం కల్పించారు. ఆ బావిని నేటికి పందిరోళ్ల బావి అని పిలుస్తారు. తమృకోట పక్క గ్రామమైన గంగరాజుపల్లెలో మంచినీటి బావిని తవ్వించారు. స్వాత్రంత్య ఉద్యమంలో పాల్గొని మహాత్మా గాంధీ ఆశయాలను విస్తృతంగా గ్రామాలలో ప్రచారం చేశారు. మహాత్మాగాంధీ గ్రామీణ స్వయం ఉపాధి కొరకు, చేనేతను ప్రోత్సహించడానికి ఖాదీ ఉద్యమం చేపట్టారు. ఖాది ఉత్పత్తి చేయటానికి గాంధీ చరఖా ఒకే కుదురుతో రోజుకు ఒక హంక్‌ను ఉత్పత్తి చేస్తే అంబర్‌ చరఖా ఒకటి కంటే ఎక్కువ కుదురులతో ఎక్కువ హాంక్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రయోజం ఇక్కడి ప్రజలకు కలగాలని తుమృకోట గ్రామోదయ సమితి సభ్యులు గుండా వెంకటసుబ్బయ్యతో కలసి అంబర్‌ చరఖా ప్రదర్శన చేశారు.[2] దీని వలన కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్య పరిచారు. సర్వోదయ ట్రస్టు ద్వారా పల్నాడు తాలూకాలో అంబర్‌ చరఖా ప్రవేశపెట్టడంలో ప్రముఖ పాత్ర వహించారు. గ్రంథాలయ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. స్వాతంత్య్ర సత్యాగ్రహాల్లో పాల్గొని గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసేవారు. గుడి కన్నా బడి ముఖ్యమని స్వగ్రామంలో స్కూల్‌ ఏర్పాటులో ప్రముఖపాత్ర వహించారు.

నాస్తికత్వం[మార్చు]

ఒక ఏడాది వర్షాలు లేక తీవ్ర కరువు వచ్చింది. పశుగ్రాసం, నీరు లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో గురువులు నీరులేక ఎండిపోయిన గ్రామ చెరువులో కూర్చుని వర్షాల కొరకు దేవుడ్ని ప్రార్థిస్తూ దీక్ష చేపట్టారు. కొన్ని రోజులు గడిచినాయి. అయినా వర్షం కురవకపోవటంతో దేవుడు అనేవాడు లేడని, ప్రజలు ఆపదలో ఉన్నసమయంలో ఆయన ఎటువంటి సహాయం అందించలేడని, రక్షించలేడని భావించి నాస్తికుడిగా మారాడు. హిందూ సంప్రదాయాలకు విరుద్దంగా భార్య మెడలో తాళి, నుదిటిన బొట్టు, చేతులకు గాజులు, కాళ్లకు మెట్టెలు తీయించారు.

కమ్యూనిజం ప్రభావం[మార్చు]

తొలత గాంధేయవాది అయిన గురువులు తరువాత కమ్యూనిజం వైపు ఆకర్షితులైనారు. ఆ పార్టీతో కలసి పనిచేయకపోయిన తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న కమ్యూనిజం సిద్ధాంతాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పనిచేయటం ప్రారంభించారు. సోవియట్‌ భూమి, సోవియట్‌ సమీక్ష పత్రికలు వారి ఇంటికి వచ్చేవి. ఆపత్రికల్లో వచ్చిన విషయాలను తన ప్రచారాలకు అనుగుణంగా వాడుకునేవారు.

గ్రామ,కుల బహిష్కరణ[మార్చు]

అస్పృశ్యతా నిర్మూలనకు, మనుషులంతా ఒక్కటేనని సమాజంలో నెలకొనాలంటే నాస్తికవాదమే శరణ్యమని, కులమత రహిత సహాజమే ధ్యేయంగా ఉద్యమించారు. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను, మత జాఢ్యాన్ని తొలగించటానికి, ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టడం, సైకిలు పై తన అనుచరులతో గ్రామగ్రామాన తిరుగుతూ ప్రచారం చేయటం ద్వారా అగ్రవర్ణాలు, గ్రామ, మత పెద్దల ద్వేషానికి గురైనారు. దాంతో గ్రామస్థులు పాటు స్వకులస్తులు గురువులను గ్రామ, కుల బహిష్కరణ చేశారు. వాటిని లెక్కచేయకుండా సమాజ హితం కోసం అనేక పోరాటాలు చేశారు.

గోరాతో పరిచయం[మార్చు]

గ్రామ, కుల బహిష్కరణ సమయంలోనే గురువులకు ప్రముఖ నాస్తికవాద నేత, సంఘసంస్కర్త గోరాగా ప్రసిద్ధిచెందిన గోపరాజు రామచంద్రరావుతో పరిచయం ఏర్పిడిరది. ఆపరిచయంతో అప్పటి వరకు పల్నాడు తాలూకా వరకే ఉద్యమించిన గురువులు దేశరాష్ట్రస్థాయిలో తన గళాన్ని వినిపిస్తూ, అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. గోరాతో పాటు వారి సతీమణి సరస్వతి గోరాతో కలసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. గోరా, సరస్వతిగోరా, లవణం, సమరం తుమృకోటకు రప్పించారు. గోరా అధ్యక్షులుగా మేరుగు, లవణం, మల్లెల నాగయ్య, పందరి గురువులు, గొపరాజు సరస్వతి కార్యవర్గసభ్యులుగా ఒక కార్యవర్గం ఏర్పాటు చేసుకొని[3] అనేక ఉద్యమాలు చేశారు. నాస్తికత్వం, భూదాన ఉద్యమం, ఆర్థిక సమానత ఉద్యమం, పార్టీలు అడంబరాల వ్యతిరేకోద్యమంలో పాల్గొన్నారు. 1955 ఎన్నికలలో పార్టీ రాహిత్యం, నిరాడంబర సిద్ధాంతాల పై మాచెర్ల నియోజకవర్గం నుండి ఆంధ్ర శాసనసభకు పోటీ చేశారు. 1960 మార్చిలో హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభముందు పార్టీలు ఆడంబరాలకు వ్యతిరేకంగా గోరా జరిపిన సత్యాగ్రహంలో పాల్గొన్నారు. వినోబా భావే భూదానోద్యమ ప్రచారంలో భాగంగా దేశం నలుమూలలు పాదయాత్ర చేశాడు ఆ పాదయాత్రలో గురువులు పాల్గొన్నారు. గురువులు ఉన్నత కులంలో పుట్టినా ఆస్తీపాస్తులు లేవు. కుటుంబం గడవటానికి చాలా కష్టంగా ఉండేది. గోరా గారే కొంత నగదును సహాయంగా అందించేవారు.

సంతానం[మార్చు]

గురువులు భార్య లక్ష్మమ్మలకు ఐదుగురు సంతానం. గోరా తన కుమారులకు వారు పుట్టినప్పటి ప్రపంచ, దేశ పరిస్థితులకు అద్ధంపడుతూ విలక్షణమైన పేర్లు పెట్టారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకున్న గురువులు కూడా తన సంతానికి అలాంటే పేర్లే పెట్టారు. మొదటి కుమారుడు పుట్టేసమయానికి అనేక ఉద్యమాల్లో చాలా చురగ్గా పాల్గొంటూ హుషార్‌గా ఉండేవారు అందుకు తన కుమారుడుకి హుషార్‌ అని, పల్నాడు ప్రాంతంలో అంబర్‌ చరఖా ప్రవేశ పెట్టె సమయంలో జన్మించిన కుమారుడుకి అంబర్‌ అని, ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు సమయంలో జన్మించిన కుమార్తెకు ఆంధ్రరాష్ట్రం అని, నాగార్జునసాగర్‌ శంఖుష్థాపన సమయంలో జన్మించిన కుమారుడుకు నాగార్జునసాగర్‌ అని, తాను చేస్తున్న వేపనూనె వ్యాపారానికి గుర్తుగా చివరి కుమారుడుకు నీమ్‌ అని విలక్షణ పేర్లు పెట్టారు.[4] వీరి సంతానంలో ఆంధ్రరాష్ట్రం మరణించగా మిగితావారు మాచర్ల, కంభంపాడు గ్రామాల్లో ఉన్నారు.

మరణం[మార్చు]

గురువులుకు క్షయ వ్యాధి సోకింది. వ్యాధితో బాధ పడుతున్నా లెక్కచేయక ప్రజాప్రయోజనాల కొరకు అనేక గ్రామంల్లో తిరుగుతూ ప్రజలను చైతన్య పరిచేవారు. వ్యాధి పట్ల నిర్లక్ష్యం వహించటంతో వ్యాధి తీవ్రమై రెంటచింతల మిషన్‌ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ 1964 ఏప్రిల్‌ 30వ తేదీ మధ్యాహ్నం మరణించారు. అప్పటికి వారి వయస్సు 45 సంవత్సరాలు. తుది శ్యాస వరకు తను నమ్మిన సిద్ధాంతాలు కొరకు పోరాటం చేసి చరిత్రలో నిలిచిపోయారు. గోరా కుడి భుజం గురువులు : లవణం గురువులు మరణ వార్త విని తీవ్ర సంతాపం తెలిపిన లవణం నాస్తిక కేంద్రం తరుపున సంతాపసందేశం పంపారు. అందులో ఇలా పేర్కొన్నారు. నా తల్లిదండ్రులు గోరా, సరస్వతిగోరా నేతృత్వంలో జరిగిన అనేక ఉద్యమాల్లో పందరి గురువులుతో కలసి నేనూ పాల్గొన్నాను. గోరాకి కుడి భుజంగా గురువులు పనిచేశారు. వారి మరణం సమాజ హితానికి, మా ఉద్యమాలకు తీవ్రనష్టమని, వారిని ఆదర్శంగా తీసుకొని కార్యకర్తలు పనిచేయాలని పేర్కొన్నారు.

మూలాలు[మార్చు]

  1. "ANDHRABHOOMI Volume no 4 issue no 227". 21 May 1964.
  2. "ANDHRAPATRIKA Volume no 44 issue no 342". 19 March 1958.
  3. Śrī Gōrā. Lāl Pablikēṣans. 1964.
  4. https://ia902603.us.archive.org/11/items/guntur-2023-04-30/Guntur_2023-04-30.pdf