పడాల రామారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పడాల రామారెడ్డి ప్రముఖ న్యాయవాది. న్యాయశాస్త్రపు గ్రంథాల రచయిత.

భారతదేశ రాజ్యాంగాన్ని తన వ్యాఖ్యానంతో తెలుగులో ప్రజలకు చేరవేసిన వ్యక్తి పడాల రామారెడ్డి. న్యాయవాద వృత్తి పరిభాషా పదాలకు అర్థాలను వివరించే 'శాసనిక నిఘంటువు'ని రెండు భాగాలుగా తీసుకొచ్చారాయన. న్యాయశాస్త్రానికి సంబంధించి ఆయన మొత్తం 150 గ్రంథాలను రచించడమే కాక 'లా', ఎం.బి.ఎ., ఎం.సి.ఎ. కళాశాలలకు అధిపతి.

రామారెడ్డి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గరున్న పిట్టల వేమవరం గ్రామం. ఈయన 1929 మార్చి 25న పుట్టారు. పుట్టిన ఎనిమిదేళ్ల లోపే అమ్మా, నాన్నల్ని పోగొట్టుకున్నారు. ఐదుగురు అన్నదమ్ములు. కాకినాడ పిఠాపురం మహారాజా వారి అనాథ శరణాలయంలో చేరి చదువుకున్నారు. కాకినాడలోనే పైడా రామకృష్ణయ్య జమిందారు సత్రంలో ఉండి ఎస్.ఎస్.ఎల్.సి., ఇంటర్మీడియట్లు ప్యాసయ్యారు. చెన్నపట్నం లా కాలేజీలో చేరారు. ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసంపొట్టి శ్రీరాములు కంటే ముందు విశాఖపట్నం రైల్వేలో పనిచేసే అమృతరావు అనే డ్రైవర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి, మద్రాసు సచివాలయం ముందు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహారదీక్ష చేస్తుండేవాడట. కూర్చుని కూర్చుని శ్రీరాములుగారి కాళ్ల వాసిపోతే రామారెడ్డి నూనెతో తరచూ ఆయన కాళ్లను మర్దనా చేసేవాడట. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక గుంటూరు హైకోర్టులో ఎల్‌.డి.సి. ఉద్యోగం దొరికింది. యుడిసిగా, ట్రాన్స్‌లేటర్‌గా పదోన్నతి లభించింది. 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడి హైకోర్టు హైదరాబాదుకు తరలి వచ్చినప్పుడు లైబ్రేరియన్‌గా ప్రమోషన్ వచ్చింది.

1959లో పోలారెడ్డి వేమారెడ్డి కూతురు పద్మావతితో కావలిలో వివాహం జరిగింది. తన తల్లి జ్ఞాపకాలతో 'పడాల మంగమ్మ' సంక్షిప్త జీవిత చరిత్రను రాశారు. ఆయన రాసిన తెలుగు పుస్తకాల్లో మండల జిల్లా ప్రజాపరిషత్ కోడ్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ లా మాన్యువల్, గ్రామ పంచాయితీలా మాన్యువల్, క్రిమినల్ లా మాన్యువల్, భారత రాజ్యాంగానికి వ్యాఖ్యానం వగైరాలున్నాయి. డ్రాఫ్టింగ్ ఆఫ్ డీడ్స్ అండ్ డాక్యుమెంట్స్, అడ్వకేట్స్ ప్రాక్టీస్, సివిల్ సర్వీస్ కోడ్, పెన్షన్ కోడ్ వంటివి ఇంగ్లీషులోనూ రాశారు. 1988లో 'పడాల రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ' స్థాపించి, ఈ సంస్థకు అనుబంధంగా ఎల్లారెడ్డిగూడ అమీర్‌పేట్, హైదరాబాద్ లో 'పడాల రామారెడ్డి లా కాలేజీ'ని ప్రారంభించారు.

మూలాలు[మార్చు]