పతంజలి ఆయుర్వేద సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పతంజలి ఆయుర్వేద సంస్థ

పతంజలి ఆయుర్వేద సంస్థ అతి తక్కువ కాలంలో రూ.10వేల కోట్ల టర్నోవర్‌ సాధించిన భారతీయ ఎఫ్‌ఎమ్‌సీజీ రంగ సంస్థగా రికార్డు సృష్టించింది. దశాబ్దాల చరిత్ర కలిగిన సంస్థల్ని వెనక్కి నెట్టి అత్యంత ప్రభావశీల సంస్థల జాబితాలో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌ల తరువాత నాలుగో స్థానంలో నిలిచింది.[1]

ప్రారంభం[మార్చు]

పతంజలి ఆయుర్వేద సంస్థను 1995లో హరిద్వార్‌లోని కన్‌కల్‌ ప్రాంతంలో తన స్నేహితుడు బాలకృష్ణతో కలిసి దివ్య ఫార్మసీ అనే చిన్న ఔషధ దుకాణంతో రామ్‌దేవ్‌ ప్రారంభించారు. యోగా, ఆయుర్వేదం... ఈ రెండు రంగాల అభివృద్ధికి సాయపడటాన్ని గురువు బల్‌దేవ్‌ తనపైన పెట్టిన బాధ్యతగా రామ్‌దేవ్‌ భావించేవారు. యోగా గురువుగా అప్పటికే స్థానికంగా రామ్‌దేవ్‌కు మంచి పేరొచ్చింది. ఆయన స్నేహితుడు బాలకృష్ణకు ఆయుర్వేదంపైన తిరుగులేని పట్టుంది. ఇద్దరూ చిన్నప్పుడు ఒకే ఆశ్రమంలో పెరిగారు. తరవాత హిమాలయాలకూ కలిసే ప్రయాణమయ్యారు. అక్కడ రామ్‌దేవ్‌ యోగా సాధనలో నిమగ్నమైతే, బాలకృష్ణ ఆయుర్వేదంలో నైపుణ్యం సాధించారు.

విశేషాలు[మార్చు]

  • రూ.10,561 కోట్లు: 2016-17 ఆర్థిక సంవత్సరంలో పతంజలి ఆదాయం
  • 47000: దేశవ్యాప్తంగా ఉన్న పతంజలి రిటైల్‌ స్టోర్లు
  • 1000+ : సంస్థ ఉత్పత్తుల సంఖ్య
  • 1500+ : సంస్థకి ముడిసరుకుని అందిస్తున్న రైతులు
  • 1000 ఎకరాలు: హరిద్వార్‌లోని పతంజలి ప్రధాన కార్యాలయ ప్రాంగణ వైశాల్యం
  • 200: కొత్త ఉత్పత్తుల తయారీ కోసం పరిశోధనలు చేసే శాస్త్రవేత్తల సంఖ్య
  • 30: హరిద్వార్‌లో పతంజలి ప్రాంగణంలో ఉన్న ఫ్యాక్టరీలు
  • 10: పతంజలి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్న దేశాలు

ఉత్పతులు[మార్చు]

సబ్బులూ, షాంపులూ, పేస్టులూ, టాయిలెట్‌ క్లీనర్లూ, నిత్యావసరాలూ, పిల్లల ఆహారం. ఇలా ఐదేళ్లలో యాభై నుంచి ఏకంగా వెయ్యికి పైగా ఉత్పత్తులను తీసుకొచ్చే స్థాయికి పతంజలి విస్తరించింది. ప్రత్యేక స్టోర్లు ఉండటంతో ఒక వస్తువు కొనడానికి వచ్చేవాళ్లు నాలుగైదు వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం ఉండేది. తమ నూడుల్స్‌ పూర్తిగా సహజ సిద్ధ పదార్థాలతో తయారయ్యాయని విస్తృతంగా ప్రచారం చేస్తూ ‘పతంజలి నూడుల్స్‌’ ని విడుదల చేసి వేగంగా వినియోగదార్ల ఆదరణ పొందడంలో సఫలమైంది. ప్రత్యేక స్టోర్లూ, అతి వేగంగా దూసుకొస్తున్న ఉత్పత్తుల సంఖ్యా, సందర్భానికి తగ్గ మార్కెటింగ్‌ వ్యూహాలూ. సంస్థ ఎదుగుదలకు కారణాలు.

వాటా[మార్చు]

ఆచార్య బాలకృష్ణ ‘పతంజలి’లో 94శాతం వాటా ఆయనదే. సంస్థ ముఖచిత్రం రామ్‌దేవ్‌ అయితే, దాని చోదక శక్తి బాలకృష్ణ. ముప్ఫయ్యేళ్లుగా రామ్‌దేవ్‌కి సన్నిహితుడిగా ఉంటున్న బాలకృష్ణకి ఆయుర్వేద విద్యలో అద్భుతమైన నైపుణ్యం ఉంది. కాలక్రమంలో మరుగునపడిన ఎన్నో ఆయుర్వేద సూత్రాలను ఆయన వెలికి తీసి వాటి ఆధారంగా తిరిగి ఆ ఔషధాలను తయారు చేశారన్న పేరుంది. తొలిదశలో సంస్థ తీసుకొచ్చిన ఔషధాలూ, ఉత్పత్తులన్నీ ఆయన సృష్టే. ప్రచారం చేసేది రామ్‌దేవ్‌ అయినా దాని వెనకుండే వ్యూహకర్త బాలకృష్ణే. ప్రయోగశాల నుంచి బయటికొచ్చిన ప్రొడక్ట్‌ని ఆమోదించి, దాన్ని ప్యాక్‌ చేసి మార్కెట్‌కి తరలించేవరకూ ప్రతి పనీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతుంది. ‘పతంజలి ఆయుర్వేద్‌’కు ఎండీగా ఉన్న ఆయన, మరో 34 అనుబంధ సంస్థలకూ అధినేత.

లక్ష్యం[మార్చు]

రాబోయే 5-10ఏళ్ల కాలానికి లక్ష కోట్లు అమ్మకాలు రామ్‌దేవ్‌, బాలకృష్ణలు పెట్టుకున్న లక్ష్యమిది. మొత్తంగా దేశంలో ఏటా అమ్ముడయ్యే ‘ప్యాకేజ్డ్‌ ప్రొడక్ట్స్‌’ విలువలో ఇది మూడో వంతు.

మూలాలు[మార్చు]

  1. పతంజలి ఆయుర్వేద సంస్థ. "పతంజలి రామ్‌దేవ్‌ విసిరిన రాకెట్టు!". ఈనాడు. Archived from the original on 18 సెప్టెంబరు 2017. Retrieved 14 September 2017.