పరస్త్రీ గమనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పరదార అనగా పరభార్య ' నపరదారంగచ్ఛేత్ ' పరస్త్రీలను పొందరాదు. అని వేదము చెబుతోంది. పరస్త్రీల పొందు ఈ విధంగా వేదవిరుద్ధము, అధర్మము అయి వుండగా కామశాస్త్ర గ్రంథముల యందు ఆ పరస్త్రీని పొందడానికి, ఉపాయాలు చెప్పబడ్డాయి. అందుకే అవి నింద్యములయ్యాయి - అన్న వాడుక కూడ లోకంలో ఉన్నది. కాని ఈ విషయం వాస్తవం కాదు.

పరస్త్రీని పొందరాదనియే సర్వకామశాస్త్రములు ఘోషిస్తూన్నాయి. కాని ఒక్కొక్కప్పుడు కామం మిక్కిలి ప్రబలంగాఉండి తాను వాంఛించిన స్త్రీని - ఆమె పరస్త్రీయే కావచ్చు - పొందలేకపోతే తన తనువుకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ పరిస్థితి ఎక్కడనోకాని ఏర్పడదు. వెనుక ఒక ప్రకరణంలో మన్మధావస్తలు చెప్పబడ్డాయి. వానిలో చివరి అవస్థ మరణము. స్త్రీ పురుషులలో కామం పరస్పరం చూచుకోవడంతో ఆరంభం అవుతుంది. అవి క్రమంగా మెట్లెక్కినట్లు శరీరంలో విజృంభిస్తూ ఉంటుంది. దాని విజృంభణలో చివరిమెట్టు (పదవ అవస్థ) మరణం. కాని ఈలోగానే ఆ స్త్రీపురుషులకు సంగమం కలిగితే విజృంభిస్తూ ఉన్న ఆ కామం యొక్క ఆట అంతలో కట్టువడుతుంది. అతి మరి పైమెట్టుమీదకు ఎక్కజాలనిదగుతుంది. ఇలా కంటిచూపుతో ఆరంభమైన కామం, అభిలషించిన స్త్రీపురుషులకు సాంగత్యం ఏర్పడకపోయినా అన్నిమెట్లు ఎక్కజాలినంత బలంగా అందరియందు విజృంభించదు. ఎక్కడో, ఎప్పుడో అట్టి పరిస్థితి ఏర్పడుతుంది. అట్టిచోట తన శరీరాన్ని కాపాడుకోవడం కోసం పరస్త్రీ గమనాన్ని కామశాస్త్రాలు అంగీకరించాయంటే దానిలో దోషం లేదనిపిస్తుంది.

కానీ ఇది ఎవరికివారు ఆత్మపరీక్షచేసి చూచుకోవలసిన విషయము. "ఆ పరవనితను పోందకపోతే చచ్చిపోతాను" - అన్న భీతి పూర్తిగా ఏర్పడినట్లు తాను అంతరంగంలో పరిశుద్ధంగా భావించిననాడు మాత్రమే ప్రయత్నించవలసిన విషయమిది. ఇదైనా ఎందుకు అంగీకరింపబడ్డదంటే "శరీరమాద్యం ఖలుధర్మసాధనం" అన్నారు. ధర్మము యెంత గొప్పదైనా దానిని సాధించిపెట్టే సాధనాలలో మొదటిది శరీరము. అందుకే "ధర్మము, శరీరము" రెండింటిలో ఏది? అన్న ప్రశ్న యేర్పడినప్పుడు శరీరము వంకకే మొగ్గుచూపి ధర్మాన్ని కొంత చిన్నచూపు చూస్తే - అది అన్యాయం అనబడదు.

అందుచేతనే ప్రాణాపాయదశ యందు పరస్త్రీ గమనానికి కొంత అంగీకారం కామశాస్త్రాలలో కనుపిస్తుంది. తన ప్రాణము పోయినను పరస్త్రీని పొందడానికి అంగీకరించనివారున్ను ఉంటారు. అట్టివారు యుగానికి ఒక్కరు కూడ జన్మిస్తారో లేదో తెలియదు.వారు మహాత్ములు. ఇక పరవనితను పొందకపోతే ప్రాణం పోతుందన్న దశయందు మాత్రమే పరవనితాసక్తులయ్యేవారు ఉత్తములు. పరవనితను పొందకపోతే తన ప్రాణానికి కలిగే ముప్పు ఏమీ లేకపోయినా దుర్వాంఛాపూర్తికై కంటబడిన ప్రతికాంత కొరకు ప్రాకులాడేవారు అధములు. ఈవరుసలో ద్వితీయుల నుద్దేశించి మాత్రమే కామశాస్త్రములయందు పరదారాగమనము చెప్పబడ్డది.

పరదారాగమనము కామశాస్త్రాలలో చెప్పబడుటలో మరొక ప్రధానోద్దేశము స్వభార్యారక్షణము, తాను పరస్త్రీ కొరకు ప్రయత్నించకపోయినా పరుడెవలో దుష్టుడు తన భార్యపై కన్నువైచి ప్రయత్నించవచ్చు. వానియొక్క యత్నస్వరూపం తెలిస్తే ఆదియందే తాను జాగ్రత్త పడడానికి వీలు. ఆయత్న స్వరూపము తెలియాలి అంటే పరదారాగమన విధులెట్టివో తాను తెలిసికొనాలి కదా ! అట్టి తెలివిడి అందరకు కలిగించుటకే శాస్త్రములలో పరదారగమనం చెప్పబడ్డది. ఈదృష్టితో చూస్తే పరదారగమన మన్న విషయం ధర్మానికి ఎంత రక్షాకవచమై ఉన్నదో, కామశాస్త్రగ్రంథాలలో దీని స్థానం ఎంత ఉన్నతమో వెల్లడి అవుతుంది.

అదీకాక ఇతర శాస్త్రాలవలెనే ఈశాస్త్రముకూడ ఋషులచే ప్రవచించబడినదే కాని యెవరో సాధారణులు చెప్పినది కాదు. అందుచే ఈవిషయమును అగౌరవపరచుట అవివేకము. ప్రాణాపాయస్థితిలో ప్రాణరక్షణకు, స్వభార్యాశీల రక్షణకు ఉపయోగించే పరస్త్రీగమన విధానాలు ఈ ప్రకరణంలో తెలుపబడుతున్నాయి.


పరవనితా భేదాలు

స్త్రీలు అయత్నసాధ్యలు, సాధ్యలు, అసాధ్యలు అని మూడు రకాలుగా ఉన్నారు. ఏ ప్రయత్నము అక్కరలేకయే సులభంగా పరపురుషునకు వశమయ్యే స్త్రీలు ఆయత్నసాధ్యలు. వీరినే సులభసాధ్యలు అని కూడ అంటారు. కొంత ప్రయత్నంతో పరపురుషునికి లొంగివచ్చే స్త్రీలు సాధ్యలు. వీరిని ప్రయత్నసాధ్యలు అనికూడ అంటారు. ఎంత ప్రయత్నించినా లొంగని వనితలు అసాధ్యలు అనబడతారు. ఈ అసాధ్యల విషయంలో తన క్షేమం కోరుకునే వాడెవడూ యెట్టి ప్రయత్నము చేయకూడదు. ఇక తప్పనిసరి అయిన వేళ ఎవరైనా ప్రయత్నిస్తే ' చావుతప్పి కన్నులొట్టబోయి నదన్న ' సామెతగా వారు చేజిక్కుతారేమోకాని ఆపదరహితంగా అరచేతిలోనికి వచ్చి వ్రాలడం అన్నది జరుగదు.

ఈ విధంగా వనితలు మూడు రకాలుగా ఉన్నందున పురుషుడు తానుకోరే స్త్రీ వీరిలో ఏరకానికి చెందినదో తెలిసికొనడం అవసరం. అందుచే మూడు రకాలుగా ఉన్న ఈవనితల లక్షణాలు చెప్పబడుతున్నాయి.

హిందూ పురాణాలలో

  • రామాయణంలో రావణుడు పరమ పతివ్రతయైన సీతాదేవిని చెరపట్టి తన వంశ వినాశానికి కారణం అయినది పరస్త్రీ గమనానికి ఇతిహాసాల్లోని చక్కని ఉదాహరణగా చెప్పవచ్చును.
  • భారతంలోని విరాటపర్వంలో కీచకుడు అజ్ఞాతవాసంలోనున్న పాండవపత్ని ద్రౌపదిని వాంచించి సర్వనాశనం చెంది తమ్ములతో సహా గతించాడు.