పానగల్లు మ్యూజియం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పానగల్లు మ్యూజియం
పటం
Established1982
Locationపానగల్లు, నల్గొండ జిల్లా, తెలంగాణ, భారతదేశం
Coordinates17°4′49″N 79°15′11.8″E / 17.08028°N 79.253278°E / 17.08028; 79.253278

పానగల్లు మ్యూజియం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, పానగల్లు గ్రామంలో స్థాపించబడిన చారిత్రక మ్యూజియం. ఇది చారిత్రాత్మక ఛాయా సోమేశ్వర స్వామి ఆలయానికి సమీపంలోని పచ్చల సోమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉంది.[1][2] మ్యూజియంలో భద్రపరచబడిన కొన్ని పురాతన శివలింగాలు నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మాణ సమయంలో మునిగిపోయిన ఏలేశ్వరం అనే గ్రామం నుండి సేకరించబడ్డాయి.[3]

చరిత్ర

[మార్చు]

నల్గొండ కంటే పురాతనమైన పానగల్లు 9వ - 13వ శతాబ్దాల మధ్య అనేక రాజవంశాలకు రాజధానిగా ఉండేది. కాకతీయులతో సహా హిందూ గవర్నర్లు, వివిధ రాజవంశాల రాజులు పానగల్‌లో ప్రధాన ప్రజా మౌలిక సదుపాయాలను నిర్మించారు.[4] అంతటి చరిత్ర కలిగిన ఈ పానగల్లులో 3 ఎకరాల విస్తీర్నంలో ఉన్న ఈ మ్యూజియం 1982, ఫిబ్రవరి 13న స్థాపించబడింది. కాకతీయుల కాలంలో మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా నిలిచిన ఈ ప్రాంతం నల్గొండ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి దేవాలయాలు కాకతీయ పాలకుల ఆరాధ్య దేవుడు శివుని స్మారకార్థం నిర్మించబడ్డాయి. ఇందులో దాదాపు 640 కళా వస్తువులు, పురాతన వస్తువుల సేకరణ ఉంది. వాటిల్లో కొన్ని వస్తువులు ఓపెన్-ఎయిర్ గ్యాలరీలో, మరిన్ని వస్తువులు భవనం లోపల ఉన్నాయి. మ్యూజియం చుట్టూ పచ్చని చెట్లు, మ్యూజియం వెనకాల ఉదయ సముద్రం రిజర్వాయర్‌ ఉన్నాయి.

మ్యూజియంలో ఒక హీరో రాయి (వీరగల్లు)

సేకరణలు

[మార్చు]

ఇందులో అనేక శిల్పాలు, చరిత్రపూర్వ ఉపకరణాలు, నాణేలు (కుతుబ్‌షాహీ నిజాము నవాబులు, విజయ నగర రాజులు, మొఘల్‌ సామ్రాజ్య కాలం నాటి రాగి, సీసం, సిల్వర్‌ నాణేలు), కాంస్యాలు, పూసలు, ఆయుధాలు, కాకతీయులు, విష్ణుకుండినులు, కుతుబ్‌షాహీలు, నిజాము నవాబులు వేయించిన శిలా శాసనాలు, చెక్కించిన శిల్పాలు, వాడిన నాణేలు, వస్తువులు, కుత్‌బ్‌ షాహీ నిజాం కాలానికి సంబంధించిన వివిధ రకాలైన యుద్ధ సామగ్రి ఉన్నాయి. ఈ వస్తువులు వర్దమాన కోట, ఏలేశ్వరం, ఫణిగిరి, పానగల్‌లో జరిపిన త్రవ్వకాల నుండి, హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర మ్యూజియం సేకరించబడ్డాయి. ఇందులో చాలావరకు 2వ శతాబ్దం నుండి 18వ శతాబ్దానికి చెందినవి. ఈ మ్యూజియంలో 1వ శతాబ్దం నాటి ఇక్ష్వాకు వంశానికి చెందిన వివిధ హిందూ దేవతలు, దేవతల విగ్రహాలు, శిల్పాలు కూడా ఉన్నాయి.[5] సామాన్యశకం 2, 3 శతాబ్దాలకు చెందిన ఏలేశ్వరానికి సంబంధించి సున్నపు బొమ్మలు, గారా ప్రతిమలు, సాక్‌స్టోన్స్‌, రాతిశిల్పాలు మ్యూజియంలో ఉన్నాయి.

1987లో వర్ధమానుకోట వద్ద భారత పురావస్తు సర్వే అధికారులు జరిసిన త్రవ్వకాలలో శాతవాహన పాలనలో సా.శ. 1 వ శతాబ్దానికి చెందిన చారిత్రక బుద్ధుడి (6 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పు) విగ్రహం బయటపడింది. దానితోపాటు టెర్రకోట బీడ్‌లను కూడా దొరికాయి. అప్పటినుండి ఆ విగ్రహం ఈ మ్యూజియంలోనే ఉంది. 2006లో జరిగిన కాలచక్ర కార్యక్రమం కోసం విగ్రహాన్ని గుంటూరులోని అమరావతికి తరలించి, మరల 2009లో ఈ మ్యూజియంలో భద్రపరచారు.[6]

ఫ్లాట్ బాటమ్, డొమికల్ బాడీ, పొడవాటి మెడ కలిగిన బిదిరి వేర్ హుక్కా స్టాండ్ (17 సెం.మీ.ల ఎత్లు, 15 సెం.మీ.ల వెడల్పు) కూడా ఇందులో భద్రపరచబడింది.[7] మ్యూజియం కాంపౌండ్‌లో అతి ప్రాచీనమైన 13వ శతాబ్దానికి చెందిన విష్ణువు విగ్రహం, 12వ శతాబ్దానికి చెందిన భైరవుడు, వినాయకుడు, నాగప్రతిమలు, 11వ శతాబ్దానికి చెందిన నంది విగ్రహం, నృత్య కళాకారిణి, ఎలుక, వివిధ జంతువుల విగ్రహాలు, కాకతీయుల కళాతోరణం, 12వ శతాబ్దానికి చెందిన అతిపెద్దదైన ఎలుక విగ్రహం ఉన్నాయి.[8]

సందర్శన వివరాలు

[మార్చు]

ప్రతిరోజూ ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 వరకు సందర్శనకు అనుమతి ఉంటుంది. శుక్రవారం, పబ్లిక్ హాలిడేస్‌లో మ్యూజియం మూసివేయబడుతుంది.[9]

మూలాలు

[మార్చు]
  1. "Archived copy". Archived from the original on 2014-12-23. Retrieved 23 September 2021.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. "Archaeological Museum to Sri Chaya Someswara Temple". Archaeological Museum to Sri Chaya Someshwara Temple (in ఇంగ్లీష్). Retrieved 23 September 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. Department of Heritage Telangana, Museums. "District Museum of Panagal". www.heritage.telangana.gov.in. Archived from the original on 18 September 2021. Retrieved 23 September 2021.
  4. "Panagal, Nalgonda district". Google Arts & Culture. Retrieved 2021-09-23.[permanent dead link]
  5. తెలంగాణ ప్రభుత్వం, నల్గొండ జిల్లా. "చరిత్ర | నల్గొండ, తెలంగాణ ప్రభుత్వము | India". nalgonda.telangana.gov.in. Archived from the original on 25 మే 2021. Retrieved 23 September 2021.
  6. The New Indian Express, Andhra Pradesh (12 September 2009). "Panagal museum to get back its Buddha idol". Archived from the original on 23 September 2009. Retrieved 23 September 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 23 సెప్టెంబరు 2021 suggested (help)
  7. National Mission on Monuments and Antiquities, Antiquities. "District Archaeological Museum - Panagal ,Nalgonda". www.nmma.nic.in. Archived from the original on 23 September 2021. Retrieved 23 September 2021.
  8. నవ తెలంగాణ, రీతి (19 July 2017). "అద్భు‌త క‌ళాసంప‌ద పాన‌గ‌ల్ మ్యూ‌జియం". Archived from the original on 23 September 2021. Retrieved 23 September 2021.
  9. "District Museum, Panagal". map.sahapedia.org (in ఇంగ్లీష్). Retrieved 23 September 2021.