పిల్లలమర్రి మ్యూజియం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిల్లలమర్రి మ్యూజియం
Established1976
Locationపిల్లలమర్రి, మహబూబ్ నగర్, తెలంగాణ, భారతదేశం

పిల్లలమర్రి మ్యూజియం తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ లోని పిల్లలమర్రి చెట్టు సమీపంలో ఉన్న మ్యూజియం.[1] రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తవ్వకాల్లో లభ్యమైన కమనీయ శిల్పాలను ఈ పురావస్తుశాఖ మ్యూజియంలో భద్రపరచారు.[2][3]

చరిత్ర

[మార్చు]

ఈ మ్యూజియాన్ని 1976, సెప్టెంబరు 18న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రారంభించాడు. ఇది ఒక ఎకరం విస్తీర్ణంలో ఏర్పాటుచేయబడింది. ప్రధాన భవనం చిన్నదిగా ఉండడంతో తరువాత మరొక భవనం నిర్మించబడింది. దీనికి జూరాల పెవిలియన్ అని పేరు పెట్టబడింది. 2019, జూన్ 12న తెలంగాణ ప్రభుత్వ పర్యాటక సాంస్కృతిక శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఈ నూతన భవనాన్ని ప్రారంభించాడు.[4]

సేకరణలు

[మార్చు]

వివిధ పురాతన కాలాల్లో పరిణామం చెందిన శిల్ప శైలిని, అప్పటి మానవులు ఉపయోగించిన వస్తు సామాగ్రిని ఈ మ్యూజియంలో పొందుపర్చారు. సా.శ.7 వ శతాబ్ది నుంచి 15 వ శతాబ్ది శిల్ప పరిణతిని చాటే అపురూప శిల్పాలున్నాయి. వీటిల్లో కొన్ని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పూడూర్, కల్వకోల్, గొల్లతగుడి, వడ్డెమాన్, గద్వాల, గోపల్‌దిన్నే, ఉప్పేరు. ఈర్లదిన్నె, బూత్‌పూర్‌ వంటి వివిధ ప్రాంతాల నుండి పేకరించబడ్డాయి. హిందూ, బౌద్ధ, జైన మత ధోరణులకు అద్దం పట్టే అనేక శిల్పాలున్నాయి. రెండు వేల సంవత్సరాల కాలం నాటి మధ్య రాతి యుగానికి చెందిన శిథిలమైన వస్తువులు షోకేసుల్లో భద్రపర్చారు. చాళుక్యుల కాలం నుంచి విజయనగర కాలం నాటి వరకు రూపుదిద్దుకున్న అనేక శిల్పాలున్నాయి.[5] ఇందులో జురాల ప్రాజెక్టు సమయమంలో మునిగిపోయిన ప్రాంతం, స్థానిక సంస్థానాలలో దొరికిన ఇతర వస్తువులు, చారిత్రక పూర్వపు రాతి పనిముట్లు, నాణేలు, కుండలు మొదలైన వస్తువులు ఉంటాయి. పూర్వీకులు జీవన విధానాన్ని ప్రతిబింబించే నాణెలు, ఉపయోగించిన మట్టి పాత్రలు, వాడిన బాకులు, కత్తులు, పూజించిన దేవతామూర్తుల రాతి విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి.

600 నుండి 1900 ఏళ్ళ నాటి రాతి విగ్రహాలు మట్టి పాత్రలు, కత్తులు కటారులు, పాత రాతి యుగపు గొడ్డళ్ళు, కొత్త రాతి యుగపు నూరుడురాళ్ళు, సూక్ష్మజాతి యుగపు పనిమట్లు, 19 వ శతాబ్దం నాటి సీతారామలక్ష్మణుల విగ్రహాలు, 17 వ శతాబ్దం నాటి విష్ణుమూర్తి, బూదేవి, శ్రీదేవి విగ్రహాలు, తూర్పు చాలక్యులు నాటి నాణాలు, నల్లరాతి బసవన్నలు, శివలింగాలు ఉన్నాయి.[6]

ఇతర వివరాలు

[మార్చు]

శ్రీశైలం ప్రాజెక్టులో భాగంగా కృష్ణానది తీరంలోని ఈర్లదిన్నె గ్రామం నీటమునగగా 1981లో అక్కడి రాజరాజేశ్వరీ దేవాలయంలోని విగ్రహాన్ని పిల్లలమర్రికి తీసుకువచ్చి, పురావస్తుశాఖ ఆధ్వర్యంలో 1983లో గర్భాలయం, అర్థమండపాలను తెల్లగ్రానైట్‌, మహమండపాలను నల్లగ్రానైట్‌తో దేవాలయాన్ని పునఃనిర్మించి, కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా ప్రతిష్ఠింపచేశారు.

సందర్శన వివరాలు

[మార్చు]

ప్రతిరోజూ ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 వరకు సందర్శనకు అనుమతి ఉంటుంది. శుక్రవారం, పబ్లిక్ హాలిడేస్‌లో మ్యూజియం మూసివేయబడుతుంది.

మూలాలు

[మార్చు]
  1. Department of Heritage Telangana, Museums. "District Museum, Pillalamarri". www.heritage.telangana.gov.in. Archived from the original on 19 July 2021. Retrieved 28 September 2021.
  2. Iyer, Lalita (2019-02-10). "Hyderabad: Pillalamarri tree lives on drips, 'quarantined'". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2019-02-10.
  3. "Science museum in Mahabubnagar soon". The Hindu. Chennai, India. 2007-12-11. Archived from the original on 2007-12-14.
  4. Department of Heritage Telangana, Events (12 June 2019). "Sri V. Srinivas Goud, Hon'ble Minister Inaugurates the District Museum at Pillalamarri, Mahabubnagar". www.heritage.telangana.gov.in. Archived from the original on 5 August 2020. Retrieved 28 September 2021.
  5. ఈనాడు దినపత్రిక మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్ పేజీ 8, తేది 27.09.1998
  6. నవతెలంగాణ, రీతి (24 September 2015). "చరిత్రను గుర్తుచేసే పిల్లలమర్రి మ్యూజియం | రీతి | www.NavaTelangana.com". NavaTelangana. Archived from the original on 28 September 2021. Retrieved 28 September 2021.