పెంచిన ప్రేమ
పెంచినప్రేమ (1963 తెలుగు సినిమా) | |
పెంచినప్రేమ | |
---|---|
దర్శకత్వం | కృష్ణన్ - పంజు |
నిర్మాణం | యర్రా అప్పారావు |
తారాగణం | భానుమతి షావుకారు జానకి హరనాథ్ ఎస్.వి.రంగారావు |
నిర్మాణ సంస్థ | శ్రీకృష్ణసాయి ఫిలిమ్స్ |
భాష | తెలుగు |
పెంచిన ప్రేమ శ్రీకృష్ణసాయి పతాకంపై యర్రా అప్పారావు నిర్మించిన తెలుగు డబ్బింగ్ సినిమా. ఈ సినిమా 1963, నవంబర్ 1న విడుదలయ్యింది. ఈ సినిమాకు తమిళ మాతృక అన్నై.
నటీనటులు
[మార్చు]- పి.భానుమతి
- ఎస్.వి. రంగారావు
- జానకి
- టి.ఎస్.ముత్తయ్య
- హరనాథ్
- సరస్వతి
- చంద్రబాబు
సాంకేతికవర్గం
[మార్చు]- కథ: నీహార్ రంజన్ గుప్తా
- మాటలు: అనిసెట్టి
- పాటలు: అనిసెట్టి
- సంగీతం: ఆర్. సుదర్శనం
- దర్శకత్వం: కృష్ణన్ - పంజు
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని గీతాలను అనిసెట్టి రచించగా, ఆర్.సుదర్శనం సంగీతం కూర్చాడు.[1]
క్ర.సం | పాట | గాయనీగాయకులు |
---|---|---|
1 | అతనికి అమ్మవు నీవేనా అవనిలొ న్యాయం ఇదియేనా | పి.భానుమతి |
2 | ఒకానొక ఊరిలో ఒకే ఒక లైలా | ఎల్.ఆర్.ఈశ్వరి, పిఠాపురం, వి.రఘురాం |
3 | ఓ బక్ బక్ బక్ బక్ బక్కుం బక్కుం పావురమా | పి.సుశీల |
4 | పసివారినే లాలించె తల్లి బ్రతుకు ధన్యం పావనమౌ | పి.భానుమతి |
5 | మెదడు ఉన్న మనుషులంతా పెద్దలుకాలేరు | పి.బి.శ్రీనివాస్ |
6 | చక్కని మిథిలా నగరంలో ఎవరిని జానకి ఆశించి | పి.బి.శ్రీనివాస్, పి.సుశీల |
కథ
[మార్చు]తనకు ఇక సంతాన ప్రాప్తి లేదని డాక్టరు ద్వారా తెలుసుకున్న సావిత్రి (భానుమతి) అమ్మా అని పిలిపించుకోవాలని తహతహలాడి పోతుంది. దైవికంగా ఒక సామాన్య వ్యక్తిని ప్రేమించి గర్భవతి అయిన చెల్లెలు సీత (షావుకారు జానకి) మూలంగా ఆమె కోరిక నెరవేరుతుంది. ఐతే సీత అంత సులభంగా తన బిడ్డను అక్కకు అప్పగించడానికి ఒప్పుకోదు. తన భర్త హామీగా నిలిచిన వ్యాపారం దెబ్బతినిపోగా అతనిని జైలు నుండి తప్పించడానికి శ్రీమంతురాలైన అక్క నుండి యాభైవేల రూపాయలు తీసుకుని తన కొడుకును అప్పగిస్తుంది. మళ్ళీ తన కొడుకు పేరు కూడా తలవనని దేవుని ముందు ప్రమాణం చేసి తన భర్త గురుస్వామి (టి.ఎస్.ముత్తయ్య)తో కలిసి రంగూన్ వెళ్లిపోతుంది. 20 సంవత్సరాల తర్వాత ప్రమాదంలో కుంటివాడైన భర్తతో తిరిగి మద్రాసు వస్తున్నట్టు సీత వ్రాసిన జాబు చదివి సావిత్రి తల్లడిల్లుతుంది. అసలు రహస్యం కుమారుడు చంద్రం (హరనాథ్)కు ఎక్కడ తెలుస్తుందో అనే అనుమానం, ఆందోళనలతో ఆమెలో తుఫాను రేగుతుంది. బిడ్డను కళ్ళతోనైనా చూస్తూ కాలంగ గడపవచ్చనే ఆశతో అంతదూరం నుండి వచ్చిన గురుస్వామి దంపతులు తమకు వేరే ఇంటి కాపురం ఏర్పాటు కావడం చూసి క్రుంగిపోతారు. చంద్రం తల్లిని కలుసుకోకుండా సావిత్రి కట్టుదిట్టం చేస్తుంది. ఆ బందిఖానాలోంచి బయటపడాలని ఆలోచిస్తున్న గురుస్వామి చంద్రం కారు క్రింద పడతాడు. చంద్రం తమ బిడ్డ అని తెలుసుకున్న తల్లిదండ్రులు ఉప్పొంగిపోతారు. చంద్రం ప్రేమ తల్లిదండ్రులవైపు ఎక్కడ తిరిగిపోతుందో అనే భయాందోళనలతో సావిత్రి చంద్రాన్ని తీసుకుని రామేశ్వరం వెళ్ళిపోతుంది. చంద్రం మేడ మీద నుండి పడి గాయపడ్డప్పుడు అతనికి ఇంటినుంచి పోతూ సీత వ్రాసిన జాబు కనిపిస్తుంది. చంద్రాన్ని మభ్యపెట్టడానికి సావిత్రి ప్రయత్నిస్తుండగా, ఆమె భర్త వేణు (ఎస్.వి.రంగారావు) అసలు సంగతిని బయటపెడతాడు. అది విన్న చంద్రానికి మతిపోతుంది. సావిత్రిని నీవు నాకు అమ్మకాదు పెద్దమ్మ అంటాడు. కట్లతోనే తన తల్లిదండ్రులను కలవడానికి బయలుదేరుతాడు. ఆఖరుకు వేణు ప్రోద్బలంతో సీత ఇంటికి వచ్చిన సావిత్రిని అమ్మా అని పిలువవలసిందిగా సీత కొడుకును ఆదేశిస్తుంది. చివరకు చంద్రం సావిత్రిని అమ్మా అని సంబోధిస్తాడు. సావిత్రి హృదయం కరిగి ఇతడు మన బిడ్డ అని సీతతో అనడంతో కథ సుఖాంతమౌతుంది[2].
ఇతర విశేషాలు
[మార్చు]- ఈ చిత్రం హిందిలో లాడ్‌లా పేరుతో 1966లో పునర్నించబడింది. ఏ.వి.యం. ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో భానుమతి పాత్రను నిరూపా రాయ్ పోషించింది.
- తమిళ మాతృక అన్నైలో నటనకు 1962లో భానుమతి ఉత్తమ తమిళనటి పురస్కారం లభించింది[2].
మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరు భాస్కరరావు. "పెంచిన ప్రేమ - 1963". ఘంటసాల గళామృతము. కొల్లూరు భాస్కరరావు. Archived from the original on 25 సెప్టెంబరు 2011. Retrieved 21 January 2020.
- ↑ 2.0 2.1 శ్రీపతి (3 November 1963). "చిత్రసమీక్ష - పెంచిన ప్రేమ". ఆంధ్రపత్రిక దినపత్రిక: 10. Retrieved 21 January 2020.[permanent dead link]