పొందూరు ఖద్దరు
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
పొందూరు ఖద్దరు... ఈ పేరు ప్రపంచంలో అందరికీ చిరపరిచితం. భారత ఖాదీ విఫణిలో పొందూరుది ఎప్పుడూ అగ్ర స్థానమే. ఇక్కడి కార్మికుల చేతి వేళ్ళ నుంచి జాలు వారే కళాత్మకత జనానికి కొత్త హుందాతనాన్నిస్తుంది. లేని దర్పాన్ని తెస్తుంది. రోటీ, కపడా ఔర్ మఖాన్. ఇవి మూడూ మనిషికి ప్రాథమిక అవసరాలు. సంఘంలో ఇప్పుడు ఏం తింటున్నాం? ఎక్కడ ఉంటున్నాం? అనే దానికి కాకుండా, ఎలా కనిపిస్తున్నాం అన్న దానికి ప్రాముఖ్యం పెరిగింది. వేష భాషలని బట్టే మనిషికి గౌరవ మర్యాదలు దొరుకుతున్నాయి. స్థాయి భేదాలని బట్టి మనిషి వేష ధారణ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది. మనిషి జంతువు నుంచి వేరు పడే సమయంలోనే ఆచ్చాదన గురించి ఆలోచించాడు. ఆకులు, తీగలు, మొలకు చుట్తుకొనే దశ నుంచి నార వస్త్రాలు, నూలు వస్త్రాలు స్థాయిని దాటుకుంటూ, మిల్లు వస్త్రాల వరకూ వచ్చాడు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులూ ఆ స్థాయి వ్యక్తులూ తమ హొదాని ప్రదర్శించు కోవటానికి ఖద్దరుని ఎంచుకుంటున్నారు. కవ్వం తిరిగే చోట, కదిరి ఆడే చోట అన్న వస్త్రాలకి లోటు ఉండదనేది నాటి పెద్దల మాట. స్వాతంత్ర్య పూర్వం నుంచి పొందూరులో కదిరి ఆడ్డం మొదలెట్తింది. ఖాధీ ఉత్పత్తి కుటీర పరిశ్రమగా విస్థరించిన పొందూరులో, స్వాతంత్ర్యానంతరం కూడా ఆ కార్మికుల జీవనప్రమాణాలు ఏమాత్రం మెరుగుపడ లేదు. పిట్టని కొట్ట పొయ్యిలోపెట్ట అన్నట్తుగానే సాగుతున్నాయి వారి జీవితాలు. ఇక్కడ ఖాదీ ఉత్పత్తిలో స్త్రీలదే ప్రధాన పాత్ర సూర్యోదయం నుంచీ చంద్రొదయం వరకూ వీళ్లు రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఉంటారు. గల్లీ నాయకుడి నుంచి ఢిల్లీ నాయకుడి వరకూ ప్రతి ఒక్కరూ పొందూరు ఖద్దరు అంటే మనసు పారేసుకుంటారు. మన రాష్ట్రానికి విశిష్ట అతిధిగా వచ్చిన ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్కి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పొందూరు ఖద్దర్‌నే అపురూప బహుమతిగా అందించింది. రాష్ట్రాలనేలే ముఖ్యమంత్రులే కాదు దేశాన్నే ఏలే ప్రధానమంత్రులు కూడా పొందూరు ఖద్దర్‌ని ఎంతో మక్కువగా ధరించేవారు. ధరిస్తున్నారు కూడా, తాము నేసిన దుస్తులతో అందరికీ అందాన్నీ హుందాతనాన్నీ, వెన్నెల వెలుగులనీ అందించే ఆ ఖాధీ కార్మికులు మాత్రం చీకటిమాటునే మగ్గిపోతున్నారు. భారత స్వాతంత్ర్యసంగ్రామంలో తేల్లవారి గుండెల్లో దడ పుట్టించిన అంశాలు...ఉప్పు, ఖాధీ.భిన్న మత సంస్కృతీ సంప్రదాయాలున్న దేశ ప్రజలందరినీ ఏకొన్ముఖం చేసిన ఘనత ఖాధీకే దక్కుతుంది. గాంధీ పిలుపు మేరకి విదేశీ వస్తు బహిష్కరణ, వస్త్రదహనాలతో జాతీయోద్యమం పతాక స్థాయికి చేరుకొని ఖాధీ స్వదేశీ ఉద్యమంగా రూపుదిద్దుకొంది. అప్పటికే ఆంధ్రప్రాంతంలో వాడుకలో ఉన్న సన్న నూలు వస్త్రం గాంధీజీ దృష్టికి వచ్చింది. ఆ నేత నాణ్యతకి అబ్బురపడ్డ గాంధీజీ దాని తయారీ విధానం పరిశీలించి రమ్మని తన కుమారుడు దేవదాస్ గాంధీని పొందూరు పంపారు. ఆయన పొందూరులో తయారయ్యే సన్న ఖాధీ శ్రేష్టతనీ, నాణ్యతనీ, కార్మికుల నైపుణ్యాన్నీ పరిశీలించి గాంధీజీకి ఒక నివేదికని సమర్పించారు. ఆ నివేదికని వస్త్రాలని పరిశీలించిన గాంధీజీ పొందూరు ఖాధీ కళావైభవాన్ని ప్రశంసిస్తూ యంగ్ ఇండియా పత్రికలో ఓ వ్యాసం రాసారు. నాటి నుంచి వస్త్ర ప్రపంచంలో పొందూరు ఖాధీ పేరు మారు మ్రోగి పోయింది. 'ఖా' అంటే తిండి, 'ధీ' అంటే ఇచ్చేది. తిండిని పెట్టేది ఖాధీ అని ఒకప్పుడు అందరూ విశ్వశించేవారు. చేతితో వడికిన నూలుతో, చేమగ్గం మీద నేసిన వస్త్రాన్నే ఖద్దరు లేదా ఖాధీ అంటారు. సత్యం, అహింస భావాలపై నిర్మిత మైన ఆర్థిక సామాజిక వ్యవస్థకి కుటీర పరిశ్రమలు పునాదుల వంటివి. అందులో ఖాధీ గ్రహమండలంలో సూర్యుని వంటిది. రాజనీతిలో అహింసకి ఎంతటి స్థానం ఉందో అర్ధ శాస్త్రంలో ఖాధీకి అంతటి స్థానం ఉందని గాంధీజీ ఎప్పుడూ అనేవారట. దేశం మొత్తమ్మీద అత్యున్నత ప్రమాణాలు గల సన్న ఖాధీ కేవలం శ్రీకాకుళం జిల్లా పొందూరులో మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఈ సన్న ఖాధీకే 'నూరుకౌంట్' అని పేరు. ఇక్కడ మాత్రమే కొండప్రత్తిని ఉపయోగించి నూలు వడుకుతుంటారు. ఈ కొండ ప్రత్తి ద్వారానే నూరుకౌంట్ నూలు రాబట్టే వీలు ఉంటుంది. పొందూరులో స్త్రీల చేతికి చేరితే చాలు. తమ జన్మ ధన్యమయైనట్లు ప్రత్తి కాయలు పరవశించి పోతాయి. తమ కురులని సవరించుకున్నంత లలితంగా వారు ప్రత్తి కాయలోని ఒక్కో ప్రోగునీ తీస్తుంటే, అవి తమ అదృష్టానికి మురిసి పోతుంటాయి. పొందూరులో నూలు మగ్గానికి చేరే ముందు, ఎనిమిది ప్రాథమిక దశల్లో ప్రత్తి శుద్ధి అవుతుంది. 1. ఏరటం 2. నిడవటం 3. ఏకటం 4. పొల్లు తియ్యటం 5. మెత్త బరచటం 6. ఏకు చుట్టడం 7. వడకటం 8. చిలక చుట్టడం అనే ఈ ఎనిమిది దశల్లోనూ 1500 మంది మహిళాకార్మికులు నిరంతరం శ్రమిస్తుంటే, 200 మంది పురుషులు నేత నేయడంలో నిమగ్నమయ్యి ఉంటారు. ఈ పని ఏమంత కిట్టుబాటు కాక పోవడంతో పొందూరు యువత ఖాధీ తయారీలో పాలుపంచుకోవటానికి నిరాకరిస్తున్నారు. ఇదే పనిలో ఉన్నవారు కూడా ప్రత్యామ్నాయ మార్గాలని వెతుక్కుంటున్నారు. పొందూరు ఖద్దర్‌కి ఆ సొగసూ సోయగం ఒ చేప ద్వారా వస్తాయంటే ఎవరికీ నమ్మ శక్యం కాదు. కాని ముమ్మాటికి అది నిజం. వాలుగు చేప పై కింది దవడలని నాలుగు భాగాలుగా కోస్తారు. తరువాత వాటిని పెన్సిల్ సైజ్ కర్రలకి గట్టిగా కడ్తారు. వాటి సాయంతో ముడి ప్రత్తిని శుభ్రం చేస్తారు. మాయలఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు పొందూరు ఖాధీ నాణ్యత కిటుకంతా ఈ వాలుగు చేప పళ్లలోనె ఉంది. ఖాధీ తయారీకి అవసరమైన కొండ పత్తిలోని ఆకు పొల్లుని తొలగించి కొత్త ధగ ధగలని తెచ్చేది ఈ చేప పల్లే. అందుకే పొందూరు మహిళలు వీటిని ఏంతో అపురూపంగా దాచుకుంటారు. ఈ ఖాధీ తయరీలో ఎలాటి రసాయనాలని ఉపయెగించరు. అందువల్ల వీటిని ధరించడం వల్ల ఎలాటి అనరోగ్య సమస్యలు తలెత్తవు. ఓ సారి వీటి వాడకం మొదలెడితే మరో బట్ట వైపు ఎవరూ కన్నెత్తి చూడలేరు. వీటిలో ఉండే సౌఖ్యం అలాటిది. వేసవిలో చల్లగానూ, శీతాకాలంలో వెచ్చగానూ ఉండడం. పొందూరు ఖాధీ సహజ ధర్మం. అందుకే పల్లె వాసులే కాకుండా పట్నం వాళ్ళూ దీని కోసం ఎగబడుతుంటారు. గాంధీ మనవరాలు తారాభట్టాచార్జీ కూడా పొందూరుని సందర్శించారు. ఖాధీని గంగానదిగా భావిస్తే పొందూరు ఖాధీని గంగానదికి జన్మ నిచ్చిన గంగోత్రిగా ఆమె అభివర్ణించారు. గాంధీయే ఖాధీ, ఖాధీయే గాంధీ అని అన్నారు. గాంధీజీ కలలు కన్న ఖాధీ భారతాన్ని నిజంచేయాలని పిలుపు నిచ్చారు. ఖాధీ అంటే కేవలం వస్త్రం మాత్రమే కాదని నిజాయితీకి, శుచికి సంకేతంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకున్న పొందూరు ఖాధీ కీర్తి కిరణాలు విదేశాల్లో కూడా ప్రసరిస్తున్నాయి. కెనడా, అమెరికా, జర్మనీ, డేన్మార్క్, నార్వే, స్వీడన్, జపాన్ వంటి దేశాల నుంచి వచ్చే పర్యాటక, ప్రతినిధి బృందాలు పొందూరుని సందర్శించి ప్రశంసలని కురిపించాయి. దేశంలో 2 వేలకి పైగా సర్టిఫైడ్ ఖాధీ సంస్థలున్నా ఎప్పటికీ చుక్కల్లో చంద్రుడిలా పొందూరు ఖాధీ మాత్రమే నిలుస్తుంది. తరతరాల సంస్కృతీ సాంప్రదాయలని నిలుపుకుందాంరా అని పిలుస్తున్నట్లుంటుంది. జన జీవన విధానానికి నిలువుటద్దంలా ఉన్న పొందూరు ఖాధీ పరిశ్రమ తన అస్థిత్వాన్ని కాపాడుకోవటానికి ఎన్నో సవాళ్ళని, సమస్యలని ఎదుర్కొంటోంది. పొందూరులో ప్రధానంగా రెండు రకాల ఖాధీ ఉత్పత్తి అవుతోంది. యంత్రాలమీద వడికే నూలుతో తయారయ్యే ముతకరకం ఖాధీ ఒక రకం. ఇది రెడ్ కాటన్‌తో తయారవుతుంది. రెండోది పూర్తిగా హేండ్ మేడ్ ఫైన్ ఖాధీ. ఈ ఫైన్ ఖాధీ ధర సామాన్యులకి అందుబాటులో ఉండదు. అయినా కొందామని ప్రయత్నించినా అది వెంటనే అయ్యే పని కాదు. ముందుగా ఆర్దర్ చేసుకుంటే మూడు నెలల తరువాత మన చేతికి వస్తుంది.
చరిత్ర పేజీలని తిరగేస్తే ఒకప్పుడు జమీందార్లు, సంస్థానాధీశులు పొందూరు ఖాధీకి చేయూత నివ్వగా ప్రస్తుతం ప్రభుత్వం నుండి ఆ సహాయం కొరవడింది. కొన్ని వందల ఏళ్ల పాటు అసంఘటిత రంగంలో సాగిన పొందూరు ఖాధీ పరిశ్రమ 1949లో సంఘటిత రంగంలో అడుగు పెట్తింది. అదే సంవత్సరం ఏప్రియల్ ఒకటో తేదీన ఆంధ్ర సన్న ఖాధీ సంఘంగా అవతరించింది. 1955 అక్టోబరు 13న ఈ సంఘానికి సర్వోదయ నాయకుడు ఆచార్యవినోబాభావే శంకుస్థాపన చేసారు. అప్పట్నుంచీ ఆంధ్ర సన్న ఖాధీ విశిష్టత దశదిశలా వ్యాపించింది. అయితే కర్ణుడి చావుకి కారణాలనేకం అన్నట్లు పొందూరు ఖాధీ మంద గమనానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. కొన్ని అసాంఘిక శక్తులు నకిలీ ఖాధీని, పొందూరు ఖాధీగా వినియోగదారులని నమ్మిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నకిళీల బెడదని నివారించాల్సిన బాధ్యత వినియోగదారులపైనే ఉంది. పది కాలాలపాటూ పొందూరు ఖాధీ చిరంజీవిగా వర్ధిల్లాలంటే దానికి ప్రభుత్వ ప్రోత్సాహం తప్పనిసరి. అదే జాతిపితకి అసలైన నివాళి అవుతుంది. అప్పుడే మనం గాంధీజీ వారసులమని చెప్పుకొనే అర్హతని సాధిస్తాం.