పోతుగంటి పోశెట్టి
పోతుగంటి పోశెట్టి భారత స్వాతంత్ర్య సమరయోధులు. ఆదిలాబాద్ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నాయకుల్లో అగ్రభాగాన నిలబడే నాయకుల్లో ఆయన ఒకరు.
జీవిత విశేషాలు
[మార్చు]ఆదిలాబాద్ పట్టణంలో మధ్య తరగతి కుటుంబానికి చెందిన పోతుగంటి ఆశన్న, గంగమ్మ దంపతులకు జన్మించిన ఆయన కమ్యూనిస్టు పార్టీ పోరాటాల పట్ల విద్యార్థి దశలోనే ఆకర్షితులై రాంకిషన్ శాస్త్రి, దాజీ శంకర్ లతో కలసి 1947లో నిర్వహించిన "ఆకలియాత్ర" లో పాల్గొన్నారు. నైజాం దుష్టపాలనకు వ్యతిరేకంగా కట్టుబానిసత్వం, వెట్టిచాకిరి, కౌలుదారి విధానాలకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగసిపడిన తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర నిర్వహించారు. ఆ సమయంలో ఎదురైన అనేక కష్టాలను సైతం లెక్కచేయని ధైర్యశాలి. ఫలితంగా అనేక ఇబ్బందులకు గురవడమే కాక అష్టకష్టాలు అనుభవించారు. అయినా పార్టీ పిలుపు మేరకు మొక్కవోని పట్టుదలతో పోరాటాన్ని కొనసాగించారు. పార్టీపై నిషేధం ఉండటంతో తిర్యాణి, మంగి వంటి అటవీ ప్రాంతాల్లో దళాలను ఏర్పాటుచేసుకుని ఆ ప్రాంతంలో దొరల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించారు. మూడేళ్లకు పైగా జైలు జీవితం అనుభవించారు. 1950లో జైలు నుండి విడుదలయ్యాక పార్టీ ఆదేశాలమేరకు బెల్లంపల్లిలో స్థిరపడ్డారు.
రాజకీయ జీవితం
[మార్చు]మహ్మద్ ఖాసీం బస్తీలోని అప్పటి జాగీర్దారైన మహ్మద్ ఖాసిం గారు పోశెట్టి గారిపై అభిమానంతో తనకు సంబంధించిన ఇంటిని స్వంతానికి తీసుకొమ్మని చౌకగా ఇవ్వగా దానిని పార్టీ కార్యక్రమాల నిర్వహణకు కార్యాలయంగా ఏర్పాటుచేశారు. ఆ కార్యాలయమే నేటికీ కొనసాగుతూ పార్టీ శాశ్వత కార్యాలయంగా స్థిరపడిపోయింది. బెల్లంపల్లి పట్టణ సిపిఐ కార్యదర్శిగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారు. అనేక మంది యువకులను చేరదీసి అన్ని విధాల తర్ఫీదు ఇచ్చి, పార్టీ బలోపేతం కావడంలోనూ, ఉద్యమాలు నిర్వహించడంలోనూ పాటుబడ్డారు.
1951-52లో చాలా మంది నాయకులు రహస్యంగానూ, జైళ్లలోనూ ఉన్న సమయంలో ఆయన కమూనిస్టు పార్టీ కార్యదర్శిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే 1951 నుండి 53 వరకు ఎఐటియుసి అనుబంధ సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బ్రాంచి కార్యదర్శిగా కూడా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి, ఈ ప్రాంత కార్మికుల అభిమానాన్ని చూరగొన్నారు. తరువాత ఆయన కుమారస్వామికి యూనియన్ భాద్యతలు అప్పగించి బెల్లంపల్లితో పాటు పరిసర ప్రాంత గ్రామాల్లోని యువకులను చేరదీసి ఎ.ఐ.వై.ఎఫ్ ను బలోపేతం చేయడం ద్వారా పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేసారు.
1959 లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో చాకెపల్లి గ్రామ సర్పంచుగా ఎన్నికైంది మొదలు వరుసగా 4 సార్లు అంటే 20 సంవత్సరాలు ప్రజాభిమానం కారణంగా అదే పదవిలో పోటీలేకుండా కొనసాగారు. అదే సమయంలో ఆసిఫాబాద్ సమితికి ఉపాధ్యక్షులుగా మూడు పర్యాయాలు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఆయన చేపట్టిన పలు ప్రజా ఉపయోగకరమైన పనులను చూసి, జనం 1981లో సమితి అధ్యక్ష పదవికి జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎన్నుకున్నారు. ఆయనను వరించిన అన్ని పదవుల్లోనూ తన బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించి, ప్రజా ప్రతినిధికి పర్యాయపదంగా చరిత్ర పుటల్లో చోటు తక్కించుకొన్నారు.
1965లో బి.గంగారాం బెల్లంపల్లి రావడంతో ఇక్కడి యూనియన్ కార్యకలాపాలలో ఆయనను బాధ్యులుగా చేయడంలో మందమర్రి, రామకృష్ణాపూర్ తదితర బ్రాంచిల బాధ్యతను జె.కుమార స్వామి చూసేవారు. గుండ మల్లేష్, చిప్ప నర్సయ్య, కొండికొప్పుల రాజలింగు, భాషు, పోచాగౌడ్ల తో పాటు మరెంతో మంది యువకులను పార్టీలోకి తీసుకురావడంలో ఆయన ప్రోత్సాహం ఎంతగానో ఉంది. 1981లో చండ్రువెల్లి సర్పంచ్ గా చిప్ప నర్సయ్య ఎన్నికతో, అనంతరం 1983లో జరిగిన ఎమ్మలే ఎన్నికల్లో ఆసిఫాబాద్ ఎమ్మెలే స్థానం గెలుకోవడంలో ఆయన ఈ సమితిలో ప్రజలకు చేసిన పలు మంచి పనుల ఫలితమే అన్నది జగమెరిగిన సత్యం
అస్తమయం
[మార్చు]ఆయన సెప్టెంబరు 19 1981 న హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రిలో మరణించారు.