Jump to content

ప్రీవీ పర్సు

వికీపీడియా నుండి
లార్డ్ బ్లూమ్‌ఫీల్డ్ కీపర్‌గా, జార్జ్ IV పట్టాభిషేకంలో ప్రీవీ పర్స్ మోస్తున్నాడు.

భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, 1947 లో భారతదేశంలో చేరేందుకు, తరువాత 1949 లో విలీనం అయ్యేందుకూ సంస్థానాలతో భారతదేశం ఒప్పందాలు కుదుర్చుకుంది. అందులో భాగంగా పూర్వపు సంస్థానాల పాలకులకు, (రాజు లేదా అంతకంటే దిగువ) వారి కుటుంబాలకూ చేసిన చెల్లింపే ప్రీవీ పర్సు. ఈ ఒప్పందాలతో వారు తమ సంస్థానాలపై అన్ని పాలక హక్కులను కోల్పోయారు.

1971 లో జరిగిన 26 వ రాజ్యాంగ సవరణ వరకు ఈ ప్రీవీ పర్సులు కొనసాగాయి. ఈ సవరణతో కేంద్ర ప్రభుత్వం నుండి వారికి వస్తూ ఉన్న హక్కులు, భత్యాలూ అన్నీ నిలిచిపోయాయి. రెండేళ్ల పాటు జరిగిన న్యాయ పోరాటం తరువాత ఇవి అమల్లోకి వచ్చాయి.[1] అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, 1947 కి ముందు పాలక అధికారాలను కలిగి ఉన్న వ్యక్తుల కోసం ప్రీవీ పర్సులు జీవితాంతం కొనసాగించారు. [a]

చరిత్ర

[మార్చు]

బ్రిటిషు వారు బ్రిటిషు ఇండియాను విభజించి, భారతదేశం, పాకిస్తాన్ అనే రెండు దేశాలకు స్వాతంత్ర్యం ఇచ్చినప్పుడు, అప్పటికి ఉపఖండంలో మూడింట ఒక వంతుకు పైగా స్వదేశీ సంస్థానాల పరిధిలోనే ఉంది. వీటి పాలకులు భారత సామ్రాజ్యంలో వివిధ స్థానాలు, వివిధ హోదాల్లో ఉండేవారు. 1947 లో భారతదేశంలో 560 కి పైగా ఇటువంటి సంస్థానాలుండేవి. వీటిపై బ్రిటిషు వారికి ఆధిపత్యం ఉండేది గానీ, సార్వభౌమాధికారం లేదు. 1947 నాటికి ఉన్న 555 సంస్థానాల్లో స్వతంత్ర పూర్వ భారతదేశ విస్తీర్ణంలో 48%, దాని జనాభాలో 28% ఉండేది.[3] సైన్యసహకార ఒప్పందం వంటి ఒప్పందాల ద్వారా బ్రిటిషు వారికి వీటిపై పరోక్షంగా ఆధిపత్యం చెలాయించేవారు. తుపాకీ సెల్యూట్ల ప్రోటోకాల్ వ్యవస్థ ద్వారా సుమారు 120 ప్రధాన రాష్ట్రాల (పాకిస్తాన్ కూడా) ర్యాంకింగును నిర్ణయించారు. అయితే చాలావరకు చిన్న / చిన్న 'వందనం లేని రాష్ట్రాలే'. భారత స్వాతంత్ర్య చట్టం 1947 ద్వారా బ్రిటిషు రాచరికం తన ఆధిపత్యాన్ని వదులుకుంది. భారతదేశం, పాకిస్తాన్‌ లలో గాని లేదా పూర్తిగా స్వతంత్ర ఉండటానికి గానీ సంస్థానాల పాలకులకు ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చింది.[4] చాలా మంది భారత ప్రభుత్వంపై చాలా ఆధారపడ్డారు. ఎంతలా ఆధారపడ్డారంటే వారికి భారతదేశంలో చేరడం తప్ప వేరే వికల్పం ఏమీ లేదు. స్వాతంత్ర్యం వచ్చే నాటికి, చాలా ముస్లిమేతర సంస్థానాలు భారతదేశంలో చేరేందుకు సంతకం చేశాయి. కాని పాకిస్తాన్ లో చేరేందుకు ఒకటి మాత్రమే సంతకం చేసింది. బ్రిటిషు వారు భారతదేశం విడిచిపెట్టిన తరువాత కొన్ని సంస్థానాలు మాత్రమే పూర్తి స్వాతంత్ర్యం కావాలని కోరుకున్నాయి. వల్లభాయ్ పటేల్, విపి మీనన్ ల దౌత్యం కారణంగా, ట్రావెన్కోర్, భోపాల్, జోధ్పూర్ పాలకులు 1947 ఆగస్టు 15 లోపు ప్రవేశంపై సంతకం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా జమ్మూ-కాశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ అనే మూడు రాష్ట్రాలు ఊగిసలాడాయి గానీ అవి కూడా తరువాత విలీనం అయ్యాయి.

ఒప్పందం ప్రకారం సంస్థానాలు తమ రక్షణ, సమాచార ప్రసారం, విదేశీ సంబంధాలను మాత్రమే భారతదేశానికి అప్పజెప్పాల్సి ఉంది. ఈ సంస్థానాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రవేశపెట్టారు. 1949 లో వాటిని భారతదేశంలో పూర్తిగా విలీనం చేసి కొత్త రాష్ట్రాలను ఏర్పరచారు..ఆ విధంగా ట్రావెన్కోర్, కొచ్చిన్ లు భారతదేశంలో విలీనమై, తిరు-కొచ్చి అనే కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాయి. 1947 లో రాజ కుటుంబాలు తమ ప్రీవీ పర్సుగా పెద్ద మొత్తంలో డబ్బును ఉంచుకోవటానికి అనుమతించినప్పటికీ, 1949 లో రాష్ట్రాల ఆదాయాలను పూర్తిగా భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో, పాలకులకు వారి కుటుంబాలకూ భారత ప్రభుత్వమే ప్రీవీ పర్సులు ఇచ్చేది. రాష్ట్ర ఆదాయం, బ్రిటిషు వారి క్రింద ఉండగా అది సెల్యూట్ రాజ్యంగా ఉండేదా లేదా, రాజవంశం యొక్క ప్రాచీనత వంటి అనేక అంశాలను బట్టి ఈ పర్సును నిర్ణయించేవారు.[5] కపుర్తాలాకు చెందిన దేవాన్ జర్మాని దాస్ ఇలా అంటాడు:

ఆ విధంగా పాలకులు తమ సార్వభౌమత్వాన్ని వదులుకున్నారు. బదులుగా వారు ప్రీవీ పర్సులు, ఇతర సౌకర్యాలూ అందుకున్నారు

1949 లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 291 నిర్వచించినట్లుగా, ప్రీవీ పర్స్ అనేది మాజీ రాచరిక పాలకులకూ వారి వారసులకూ హామీ ఇచ్చే స్థిరమైన, పన్ను రహిత మొత్తం. ఈ మొత్తం పూర్వ పాలక కుటుంబాల ఖర్చులన్నిటినీ భరించటానికి ఉద్దేశించారు. వీటిలో మతపరమైన కార్యక్రమాలకు, ఇతర వేడుకలకూ అయ్యే ఖర్చులు కలిసి ఉన్నాయి. వీటిని భారత కన్సాలిడేటెడ్ ఫండ్‌ నుండి చెల్లిస్తారు.[6] స్వాతంత్ర్యం తరువాత భారతదేశం ప్రీవీ పర్సు చెల్లింపులు ప్రభుత్వ వ్యయంలో గణనీయమైన భాగంగా ఉండేవి.

గ్రహీతలు, మొత్తాలు

[మార్చు]

ప్రీవీ పర్సులు అనేక కారకాలపై ఆధారపడి నిర్ణయించారు. పూర్వపు సంస్థానాలకు చెందిన మైనర్ జమీందార్లకు అంతకు ముందు తమ సంస్థానాల్లో పొందిన కొద్దిపాటి భత్యాలనే కొనసాగించారు. 565 సంస్థానాలకు, ప్రీవీ పర్సులు సంవత్సరానికి రూ. 5,000 నుండి కొన్ని లక్షల వరకూ ఉండేవి. 102 సంస్థానాధీశులకు రూ 1 లక్షకు మించి ఉండేవి. 11 తప్ప మిగతా సంస్థానాలన్నిటికీ ఇది 2 లక్షల లోపే ఉండేది. కేవలం ఆరు సంస్థానాలకు మాత్రమే 10 లక్షలకు పైబడిన ప్రీవీ పర్సులు ఉండేవి. అవి: హైదరాబాదు, మైసూరు, ట్రావెన్కోర్, బరోడా, జైపూర్, పాటియాలా. కొన్ని సంస్థానాలకు, కొన్ని మొత్తాలు హామీ ఇచ్చినప్పటికీ, 1960 లలో ప్రతి ద్రవ్యోల్బణ సంక్షోభం కారణంగా దీన్ని తగ్గించారు. అందువల్లనే తొలుత రూ 42,85,714 ప్రీవీ పర్సు అందుకున్న హైదరాబాదు కొన్ని సంవత్సరాల తరువాత రూ 20,00,000 కు మాత్రమే హామీ పొందింది. సంస్థానాధీశుల కుటుంబాల్లో వారసత్వం చేతులు మారే కొద్దీ భారత ప్రభుత్వం భత్యాలను తగ్గిస్తూ పోయింది.[7]

రద్దు

[మార్చు]

ప్రీవీ పర్సులను, టైటిల్స్ యొక్క అధికారిక గుర్తింపులనూ రద్దు చేయాలన్న తీర్మానాన్ని మొదట 1970 లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా లోక్‌సభ ఆమోదించింది. కాని రాజ్యసభలో అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గింది. 149 వోట్లు అనుకూలంగాను, 75 వ్యతిరేకంగానూ వచ్చాయి.[8]

సెప్టెంబరు 6, 1970 న, భారత రాష్ట్రపతి మాజీ సంస్థానాధీశులకు సంబంధించి ఒక సంక్షిప్త ఉత్తర్వును జారీ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 (22) ప్రకారం తనకు ఉన్న అధికారాన్ని వినియోగించుకుంటూ, అధ్యక్షుడు జారీ చేసిన ఈ ఉత్తర్వు తేదీ నుండి సంస్థానాల పాలకులందరినీ పాలకులుగా గుర్తించడం ఆగిపోయింది. దీని ఫలితంగా పాలకులు అందుకున్న ప్రీవీ పర్సులు వెంటనే ఆగిపోయాయి. వారి వ్యక్తిగత అధికారాలను నిలిపివేసింది. ఆదేశాలను ప్రశ్నిస్తూ కొందరు పాలకులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. సుప్రీంకోర్టు పాలకులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.[9]

1971 లో మళ్ళీ పార్లమెంటు ముందు ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. 1971 లో భారత రాజ్యాంగానికి 26 వ సవరణగా రెండు సభలూ విజయవంతంగా ఆమోదించాయి.[1] పౌరులందరికీ సమాన హక్కులుండాలనీ, ప్రభుత్వ ఆదాయ లోటును తగ్గించాల్సిన అవసరం ఉందనీ చెబుతూ అందుకనే వీటిని రద్దు చేయాలని అప్పట్లో ప్రధాని ఇందిరా గాంధీ వాదించింది.

ఈ సవరణ ఇప్పటికే ఉన్న హోదాలను తొలగించింది:[10]

"1971 రాజ్యాంగ చట్టం (26 వ సవరణ) కు ముందు యువరాజుగా గాని, ప్రభువుగా గాని, పాలకుడుగా రాష్ట్రపతి గుర్తింపు పొందిన వ్యక్తి, లేదా పలకుడి వారసుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి, ఈ సవరణ అమల్లోకి వచ్చాక, ఆ వ్యక్తి ఆ పాలకుడు లేదా వారసుడి గుర్తింపును కోల్పోతారు".

ప్రీవీ పర్సులను రద్దు చేయడాన్ని చాలా మంది మాజీ సంస్థానాధీశులు నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. ప్రధానంగా 1971 లోక్సభ ఎన్నికలలో పోటీ చేసి ఆ ప్రచారంలో భాగంగా ఈ రద్దును నిరసించారు. వారిలో చాలా మంది భారీ తేడాతో ఓడిపోయారు. వీరిలో గుర్గావ్ నుండి పోటీ చేసిన మన్సూర్ ఆలీ ఖాన్ పటౌడీ కూడా ఉన్నాడు. మన్సూర్ విశాల హర్యానా పార్టీ అభ్యర్థిగా పోటీ పడ్డాడు. కాని ముఖాముఖీ పోటీలో కేవలం 5% ఓట్లు మాత్రమే పొందాడు.[11] అయితే ఆ లోక్‌సభ ఎన్నికల్లో విజయ రాజే సింధియా, ఆమె కుమారుడు మాధవ్ రావు సింధియాలు గెలిచారు.

గమనికలు

[మార్చు]
  1. HH Maharani Sethu Lakshmi Bayi’s allowance was reinstated after a prolonged legal battle until her death in 1985.[2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Twenty Sixth Amendment". Indiacode.nic.in. 28 December 1971. Retrieved 19 November 2011.
  2. Dr. Lakshmi Raghunandan. At the turn of the Tide, the Life and Times of Maharani Sethu Lakshmi Bayi, the Last Queen of Travancore.
  3. "Who betrayed Sardar Patel?".
  4. Ishtiaq Ahmed (1998). State, Nation and Ethnicity in Contemporary South Asia. London & New York. p. 99.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  5. Jarmani Dass. Maharaja.
  6. "Privy Purses to Rulers - Reduction Effected in Certain Cases" (PDF).
  7. "Maharaja" by Jarmani Dass, page 424-435
  8. "H. H. Maharajadhiraja Madhav Rao vs Union of India on 15 December 1970". Indian Kanoon. Retrieved 16 October 2012.
  9. "H. H. Maharajadhiraja Madhav Rao ... vs Union of India on 15 December 1970".
  10. "The Constitution of India (26th Amendment) Act 1971". The Gazette of India. December 29, 1971.
  11. "Cricketers in Politics". Archived from the original on 2009-06-09. Retrieved 2020-05-15.