బండారు రామస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బండారు రామస్వామి (1893 - 1965) ప్రముఖ నాట్య కళాకారులు.[1]

జననం[మార్చు]

వీరు 1893లో గుంటూరులో జన్మించారు.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

వీరు 1906 సంవత్సరంలో "విబుధరంజని శృంగార హిందూ నాటక సమాజం" వారి పాండవ విజయం నాటకంలో అభిమన్యుని పాత్రతో ప్రప్రథమంగా నాటకరంగంలో ప్రవేశించారు. ఆ తర్వాత వారి సారంగధర, వేణీసంహారం మొదలైన నాటకాలలో నటించారు.

వీరు 1912లో పొత్తూరు హనుమంతరావు, పాదర్తి సోమయ్య నాయుడు, ప్రత్తి సుబ్రహ్మణ్యం మొదలగు వారితో "మూన్ థియేటర్" అనే సంస్థను స్థాపించి అనేక చారిత్రక, పౌరాణిక నాటకాలు ప్రదర్శించారు. వీరు గయోపాఖ్యానంలో గయుడు, బిల్హణీయంలో బిల్హణుడు, ప్రసన్నయాదవంలో శ్రీకృష్ణుడు, హరిశ్చంద్రలో హరిశ్చంద్రుడు, బొబ్బిలి యుద్ధంలో రంగారాయుడు, ప్రచండ చాణక్యంలో చాణక్యుడు, రాణీ సంయుక్తలో పృథ్వీరాజు మొదలైన ప్రముఖ నాయక పాత్రలు పోషించి గుంటూరు నాటక రంగంలో గొప్ప నటుడిగా పేరుపొందారు.

వీరి నాయకత్వంలో మూన్ థియేటర్ 1916లో రాజమండ్రిలో జరిగిన బొబ్బిలి యుద్ధం నాటకపోటీలలోను, గుంటూరులో జరిగిన ప్రసన్న యాదవం నాటకపోటీలోను ఉత్తమ ప్రదర్శన పురస్కారం పొందాయి. 1917లో బెజవాడలో జరిగిన పాదుషా పరాభవం నాటకంలోని రాజసింహ పాత్రపోషణకుగాను స్వర్ణ పతకం పొందారు. వీరు రచయితగా బందిఖానా, భక్త రామదాసు, కర్ణుని స్వామిభక్తి, దమయంతి మొదలైన ఏకపాత్రాభినయం రచనలను నిర్వహించారు.

మరణం[మార్చు]

వీరు 1965 ఏప్రిల్ 15 తేదీన 72వ ఏటషిర్డీ సాయిబాబా తెప్పోత్సవాలకు విజయవాడ వెళ్లి అకస్మాత్తుగా సంభవించిన కృష్ణానది పడవ ప్రమాదంలో మునిగిపోయి పరమపదించారు.

మూలాలు[మార్చు]

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.521.