Coordinates: 40°23′43″N 49°52′56″E / 40.39528°N 49.88222°E / 40.39528; 49.88222

బాకు (నగరం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాకు
Bakı
అజర్‌బైజాన్ దేశ రాజధాని
బాకు నగరం (రాత్రి దృశ్యం)
బాకు నగరం (రాత్రి దృశ్యం)
Nickname(s): 
[సిటీ అఫ్ విండ్స్]
(Küləklər şəhəri)
బాకు is located in Azerbaijan
బాకు
బాకు
అజర్‌బైజాన్ పటంలో బాకు స్థానం
బాకు is located in Caucasus mountains
బాకు
బాకు
కాకసస్ పర్వతాల్లో బాకు స్థానం
Coordinates: 40°23′43″N 49°52′56″E / 40.39528°N 49.88222°E / 40.39528; 49.88222
దేశంఅజర్‌బైజాన్
ప్రాంతంఅబ్‌షెరోన్
Area
 • అజర్‌బైజాన్ దేశ రాజధాని2,140 km2 (830 sq mi)
Elevation
−28 మీ (−92 అ.)
Population
 (2020)[4]
 • అజర్‌బైజాన్ దేశ రాజధాని22,93,100[1]
 • Urban
31,25,000[3]
 • Metro
51,05,200
Demonymబాకూవియన్[5] (Bakılı)
Time zoneUTC+4 (AZT)
Postal code
AZ1000
Area code+994 12
Vehicle registration10, 90, 77
అధికారిక పేరుWalled City of Baku with the Shirvanshah's Palace and Maiden Tower
రకంCultural
క్రైటేరియాiv
గుర్తించిన తేదీ2000 (24th session)
రిఫరెన్సు సంఖ్య.958
Endangered2003–2009
State PartyAzerbaijan
RegionAsia

బాకు నగరం అజర్‌బైజాన్ దేశ రాజధాని. కాస్పియన్ సముద్ర తీరంలో వున్న ఈ పారిశ్రామిక నగరం, సముద్ర మట్టానికి  28 మీటర్లు దిగువన ఉంది. దేశంలోనే  అతి పెద్ద ఓడరేవూ, ఏకైక మెట్రోపోలిటిన్ సిటీ అయిన బాకు, అటు కాస్పియన్ సముద్ర తీరప్రాంతం లోగానీ, అలాగే ఇటు కాకసస్ పర్వత ప్రాంతంలోగానీ విస్తరించిన నగరాలన్నిటిలోకెల్లా అతి పెద్దదిగా ప్రసిద్ధి చెందింది. 2021 అంచనాల ప్రకారం ఈ నగర జనాభా 23,71,000. ఈ నగరం, అజర్‌బైజాన్ శాస్త్రీయ, సాంస్కృతిక, ఆర్థిక, పారిశ్రామిక కేంద్రంగా వుంది. ఇక్కడ నెలకొనివున్న కఠిన వాతావరణం, సంవత్సరం పొడుగునా వీచే ఉధృతమైన గాలుల కారణంగా ఈ నగరానికి "విండ్స్ నగరం" అనే పేరు స్థిరపడింది. ఈ నగరాన్ని బాకీ లేదా బాకే అని కూడా పిలుస్తారు.

బాకు ఆర్థిక వ్యవస్థకు మూలాధారం పెట్రోలియం. చమురు ఉత్పత్తిలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈ నగరం, ప్రపంచంలోని అతి పురాతన చమురు ఉత్పత్తి ప్రాంతంగా కూడా పేరుపొందింది. 20వ శతాబ్దం ప్రారంభం నాటికి బాకు చమురు క్షేత్రం ప్రపంచంలోనే అతిపెద్దది, ఒక విధంగా చెప్పాలంటే ఈ నగర చరిత్ర పెట్రోలియం అదృష్టంతో ముడిపడి ఉంది. ఇక్కడ జరిగిన చమురు విజృంభణ, ఈ నగరాభివృద్ధికి దోహదపడటమే కాక యావత్ దేశ రూపు రేఖలను సైతం మార్చివేసింది. చమురు ప్రాసెసింగ్‌తో పాటు, చమురు పరిశ్రమకు సంబంధించిన పరికరాల ఉత్పత్తికి ఈ నగరం ఒక పెద్ద కేంద్రం.

ఉనికి

[మార్చు]
అబ్షెరాన్ ద్వీపకల్పం (శాటిలైట్ చిత్రం)

బాకు నగరం కాస్పియన్ సముద్రపు పశ్చిమ తీరంలో వుంది. అబ్షెరాన్ ద్వీపకల్పానికి దక్షిణ తీరంలో, బాకు అఖాతం (Bay of Baku) ఒడ్డున ఈ నగరం విస్తరించింది. ఈ పారిశ్రామిక నగరం, సముద్ర మట్టానికి 28 మీటర్లు (92 అడుగులు) దిగువన వుండడం ఒక విశేషం. ప్రపంచ రాజధానులలో సముద్ర మట్టానికి అత్యంత దిగువన వున్న నగరం ఇదే. దీని తరువాత ఆమ్‌స్టర్ డామ్ నగరం, 12 అడుగుల దిగువతో రెండవ స్థానంలో వుంది. అంతేగాక సముద్ర మట్టానికి దిగువన వున్న నగరాలన్నిటిలోను బాకు నగరమే అతి పెద్దది. దీని భూభాగం మొత్తం 260 చదరపు కిలోమీటర్లలో (100 చదరపు మైళ్ళు) విస్తరించి వుంది. ఈ నగరం చుట్టూ కీరాకి, బోఖ్-బోగ్ఖా, లోక్‌బటన్ (Lok Batan) వంటి అనేక బురద అగ్నిపర్వతాలూ (Mud Volcanoes), బోయుక్షోర్, ఖోడాసన్ వంటి ఉప్పు నీటి సరస్సులూ ఆవరించి వున్నాయి.[7]

చరిత్ర

[మార్చు]
కోబుస్తాన్‌ శిలాశాసనం

ప్రపంచంలోని అతిపురాతన నగరాలలో బాకు ఒకటి. ఈ నగర ప్రాంతంలో పురాతన మానవ నివాసానికి సంబంధించిన ఆనవాళ్లు రాతి యుగంతో ముడిపడినట్లు తెలుస్తుంది. ఇక్కడ బేయిల్ (Bayil) సమీపంలో కాంస్య యుగపు రాతి శిల్పాలు లభించాయి. ఓల్డ్ సిటీ భూభాగంలో కాంస్యంతో చేయబడ్డ చిన్న చేప బొమ్మ కనుగొనబడింది. ఈ నగర పరిధి భూభాగంలో ఒకప్పుడు కాంస్య యుగానికి చెందిన మానవ ఆవాసాల ఉనికి విలసిల్లిందని ఇవి సూచిస్తాయి.[8] నార్దరన్ సమీపంలోని ఉమిద్ గయా వద్ద చరిత్రపూర్వ కాలానికి (prehistoric) చెందిన ఒక పురాతన నక్షత్రశాల (అబ్జర్వేటరీ) ఉంది. ఇక్కడి శిలపై ఒక ఆదిమ ఖగోళ పట్టికతో పాటు సూర్యుడు, వివిధ నక్షత్రరాశుల చిత్రాలు చెక్కబడ్డాయి.[9] ఇంకా ఇక్కడి పురావస్తు త్రవ్వకాలలో బాకు, దాని పరిసర భూ భాగాలలో చరిత్రపూర్వ కాలానికి చెందిన వివిధ మానవ ఆవాసాలు, స్థానిక దేవాలయాలు, విగ్రహాలతో పాటు అనేకానేక కళాఖండాలు బయటపడ్డాయి.

క్రీ.శ. 1వ శతాబ్దంలో రోమన్లు, కాకేసియన్ ప్రాంతంపై రెండు సార్లు దండయాత్రలు జరిపి చివరకు బాకు నగరానికి చేరుకోగలిగారు. దీనికి సంబంధించిన రోమన్ శిలాశాసనాలు (క్రీ.శ. 84-96 కాలం) నగరానికి సమీపంలో వున్న కోబుస్తాన్‌లో బయటపడ్డాయి. ఇవి బాకు నగరానికి సంబందించిన తొలి లిఖిత పూర్వక ఆధారాలుగా వున్నాయి.[10] క్రీ.శ. 1 వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ క్రైస్తవ ప్రబోధకుడు బార్తోలోమెవ్ (Apostle Bartholomew), బాకును అల్బానా గా గుర్తించాడు. స్థానిక చర్చి సంప్రదాయానుసారం ఇక్కడి ఓల్డ్ సిటీలోని మైడెన్ కోట బురుజు క్రిందనే బార్తోలోమెవ్ ఆత్మ బలిదానం జరిగిందని క్రైస్తవులు విశ్వసిస్తారు. క్రీ.శ. 5 వ శతాబ్దంలో పానియం కు చెందిన గ్రీకు చరిత్రకారుడు ప్రిస్కస్ (Priscus) పేర్కొన్న ప్రసిద్ధ 'బాకువియన్ మంటల' ప్రస్తావనలు బట్టి, బాకు పురాతన జొరాస్ట్రియన్ మతానికి కేంద్రంగా కూడా ఉండేదని భావిస్తారు. బాకు నగరంలో వెలుగు చూసిన ఎనిమిదవ శతాబ్దం నాటి అబ్బాసిడ్ నాణెం, ఈ నగరం 8 వ శతాబ్దానికి పూర్వం అరబ్ ఖలీఫాత్ లో భాగంగా ఉండేదని, ఆ తరువాత పర్షియన్ షిర్వాన్ షాల రాజ్యంలో భాగంగా మారిందని తెలుస్తుంది.

శిర్వాన్‌షా ల పాలన

[మార్చు]
రామనా టవర్

క్రీ.శ 8వ శతాబ్దంలో బాకు శిర్వాన్‌షాల రాజ్యంలో భాగంగా ఉండేది. శిర్వాన్‌షాలు అజర్‌బైజాన్‌ ప్రాంతాన్ని ఏలిన స్థానిక పర్షియన్ పాలకులు. వీరి పాలనలో ఈ నగరం, తొలుత ఖాజర్ల (Khazars) అనే అర్ధ సంచార టర్కిష్ జాతుల దాడులకు, ఆ తరువాత 10 వ శతాబ్దం నుండి రస్ (Rus) స్లోవిక్ జాతుల దాడులకు తరుచుగా గురయ్యేది. వీరి దాడుల్ని ఎదుర్కోవడానికి పన్నెండవ శతాబ్దంలో 21 వ శిర్వాన్‌షా అయిన అఖ్సితాన్-I, బాకులో ఒక శక్తివంతమైన నౌకాదళాన్ని నిర్మించాడు. ఫలితంగా 1170 లో రస్ జాతుల దాడిని విజయవంతంగా తిప్పికొట్టగలిగాడు. శిర్వాన్‌షాల రాజధాని షమాఖి (Shamakhi)లో వినాశకరమైన భూకంపం సంభవించడంతో 1191 లో రాజధాని బాకుకు మారింది.[11] మంగోల్ చక్రవర్తి హులాగు ఖాన్ (1231-1239) తన మూడవ మంగోల్ దండయాత్రలో బాకును ఆక్రమించాడు. నాటి మంగోలులకు నైరుతి భాగంలో వున్న బాకు శీతాకాలపు విడిదిగా ఉండేది. వెనిస్ యాత్రికుడైన మార్కో పోలో (1254-1324) బాకు తన సమీప తూర్పు దేశాలకు చేసే చమురు ఎగుమతుల గురించి రాశాడు.

సముద్రగర్భంలో మునిగిపోయిన సబయిల్ కోట నుండి వెలికితీసిన అవశేషాలు

శిర్వాన్‌షా రాజుల పాలనలో బాకు నగరం, దాని పరిసర అజర్‌బైజాన్‌ ప్రాంతాలు బాగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా క్రీ.శ. 12 నుంచి 14 వ శతాబ్దాల మధ్యకాలంలో బాకు, దాని పరిసర పట్టణాలలో భారీ కోటలు, బురుజులు నిర్మించబడ్డాయి. మెయిడెన్ టవర్, రామనా టవర్, నార్దరన్ కోట, షాగన్ కోట, మర్దకన్ కాజిల్, రౌండ్ కాజిల్ లతో పాటు బాకు అఖాతపు దీవిలోని ప్రసిద్ధ సబాయిల్ కోట కూడా ఈ కాలానికి చెందిన నిర్మాణాలు. ఈ కాలంలోనే బాకు నగర రక్షణ ప్రాకారాలు పునర్నిర్మితమై శక్తివంతంగా తీర్చదిద్దబడ్డాయి. అయితే దురదృష్టవశాత్తు పెరుగుతున్న కాస్పియన్ సముద్రమట్టాల కారణంగా సముద్రమట్టానికి దిగువన వున్న ఈ నగరంలో అధిక భాగం క్రమేణా సముద్రంలో మునిగిపోతూ వచ్చింది. పద్నాలుగో శతాబ్దం నాటి ప్రసిద్ధ కోట సబాయెల్ కాజల్ సైతం సముద్రగర్భంలో కలిసిపోయింది. 15, 16 శతాబ్దాల కాలంలో ఇరాన్ కేంద్రంగా పాలిస్తున్న కారా కొయున్లు రాజుల, అక్ కొయున్ల తెగల పాలనలోకి బాకు వచ్చింది. 16వ శతాబ్దం ప్రారంభంనాటికి బాకు నగరపు సిరి సంపదలు, దాని వ్యూహాత్మక స్థానం పొరుగున వున్న పెద్ద రాజ్యాల దృష్టిని ఆకర్షించింది. అక్ కొయున్లు పతనంతో బాకు నగరం ఇరాన్ లో కొత్తగా ఏర్పడిన సఫావిద్ వంశపు రాజుల అధీనంలోకి వెళ్ళిపోయింది.

సఫావిద్ షా శకం

[మార్చు]
అటాష్గా ఆలయ శిలా శాసనం

1501 లో సఫావిద్ రాజు షా ఇస్మాయిల్-I (1501-1524) బాకును ముట్టడించి స్వాధీనం చేసుకొన్నాడు. అయితే బాకును తన రాజ్యంలో కలుపుకోకుండా, శిర్వాన్‌షా లను సామంత రాజులుగా కొనసాగించాడు. అయితే అతని వారసుడు, రాజు తహ్మాస్ప్-I (1524-1576) మాత్రం శిర్వాన్‌షా లను అధికారం నుంచి తొలగించి, 1540 లో బాకును తన సఫావిద్ సామ్రాజ్యంలో పూర్తిగా విలీనం చేసాడు. ఆ విధంగా 9 వ శతాబ్దం నుండి బాకును పాలించిన శిర్వాన్‌షా రాజుల వంశం, సఫావిద్ పాలనలో అంతరించిపోయింది. ఇక అప్పటినుండి గులిస్తాన్ ఒప్పందం (1813) వరకు, బాకు నగరం సఫావిద్ సామ్రాజ్యంలోను, ఆ తదుపరి వచ్చిన ఇరానియన్ రాజవంశాల పాలనలో అంతర్భాగంగా కొనసాగింది. సఫావిద్ రాజవంశ పాలనలో బాకు నగరం రక్షణ పరంగా ఉన్నత స్థానంలో ఉండేది. దీని దుర్భేద్యమైన కోట గోడలను ఒకవైపున బలమైన సముద్ర కెరటాలు, మరోవైపున భూమార్గంలోని విస్తృతమైన కందక శ్రేణి సదా రక్షిస్తూ ఉండేవి. ఒట్టోమన్-సఫావిడ్ యుద్ధం (1578-1590) ఫలితంగా ఒట్టోమన్లు కొద్దికాలం బాకుపై నియంత్రణ సాధించగలిగారు. తిరిగి 1607 నాటికి, ఈ నగరం మళ్లీ ఇరానియన్ నియంత్రణలోకి వచ్చింది.[12] 1604 లో సఫావిద్ రాజు షా అబ్బాస్ ది గ్రేట్ (1588-1629) బాకు కోటను ధ్వంసం చేశాడు.

ఆధునికయుగ తొలికాలం నుంచి బాకు అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా విలసిల్లింది. కీలక స్థానంలో వున్న ఈ నగరం, సఫావిద్ షా పాలనలో అభివృద్ధి చెందడంతో, వాణిజ్యం కూడా చురుకుగా సాగి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారులకు బాకు ఒక కేంద్ర బిందువుగా మారింది. దానితో ఈ నగరం సిరిసంపదలతో పోటెత్తింది. ముఖ్యంగా, భారత ఉపఖండానికి చెందిన వ్యాపారులు కూడా ఈ ప్రాంతంలో తమ తమ వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ భారతీయ వ్యాపారులు 17, 18వ శతాబ్దాల మధ్యకాలంలో బాకులో కాస్పియన్ సముద్రానికి పశ్చిమాన ఒక అటాష్గా ఆలయాన్ని సైతం నిర్మించారు. ఇక్కడి ఆలయ శిలాశాసనం సంస్కృతంలో శివుడిని పేర్కొంది. ఈ ఆలయాన్ని హిందూ, సిక్కు, జొరాస్ట్రియన్ ప్రార్థనా స్థలంగా ఉపయోగించడం జరిగింది.[13]

రష్యన్ దాడులు

[మార్చు]
అలెక్సీ బోగోలియుబోవ్ 1861లో చిత్రించిన బాకు తీరప్రాంతం

కాకేసియస్ ప్రాంతంపై పట్టు సాధించడానికి, కాస్పియన్ సముద్ర ప్రాంతంపై ఆధిపత్యం పొందటానికి రక్షణ పరంగాను, భారీ చమురు నిల్వల పరంగాను వ్యూహాత్మక కీలక స్థానంలో వున్న బాకు నగరంపై చేయి సాధించడం తప్పనిసరి కావడంతో రష్యన్లు బాకును అనేక సార్లు ముట్టడించారు. ఫలితంగా రష్యా-ఇరాన్ సామ్రాజ్యాల మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. 1723 లో ప్రారంభమైన ఈ రష్యన్ దాడులు 1806 లో పూర్తయ్యి చివరకు బాకు ఇరాన్ ఆధిపత్యం నుండి శాశ్వతంగా రష్యా ఆధీనంలోకి వెళ్లిపోయింది.

1722 లో ఇరాన్‌లో సఫావిడ్స్ తాత్కాలికంగా అధికారాన్ని కోల్పోయారు. రష్యా చక్రవర్తి పీటర్ ది గ్రేట్ ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని 1723 లో ఫిరంగులను ఉపయోగించి బాకుపై దాడి చేసి సఫావిద్ ల నుండి బాకును స్వాధీనం చేసుకొన్నాడు.[14] అయితే 1730 నాటికి, ఇరాన్ షా అయిన నాదిర్ షా (1698-1747) సాధిస్తున్న విజయ పరంపరలు చవిచూసిన రష్యన్‌లు ముందుచూపుతో 1735 లో ఇరాన్ తో గంజా ఒప్పందాన్ని కుదుర్చుకొని బాకు నగరం నుండి వైదొలిగారు. [15]1747 లో నాదర్ షా చక్రవర్తి మరణం తరువాత ఇరాన్ లో ఏర్పడిన అస్థిరతల నేపథ్యంలో వివిధ కాకేసియన్ ఖనేట్‌లు ఏర్పడ్డాయి. 1795 లో ఇరాన్ షా అఘా ముహమ్మద్ ఖాన్ కజార్ (1742-1797), జారిస్ట్ రష్యా విధానాలను వ్యతిరేకిస్తూ బాకు నగరాన్ని ఆక్రమించాడు. తిరిగి 1796 లో బాకు నగరం రష్యన్ దళాలకు లొంగిపోయింది. అయితే 1797 లో జార్ చక్రవర్తి ఆదేశాలపై అనూహ్యంగా జారిస్ట్ దళాలు బాకును విడిచిపెట్టవలసి వచ్చింది. తిరిగి బాకు నగరం మళ్లీ ఇరాన్‌లో భాగమైంది. రష్యన్ దళాలు మూడవ రూసో-పర్షియన్ యుద్ధం (1804-1813) సమయంలో బాకును మళ్లీ ముట్టడించడానికి ప్రయత్నించాయి. చివరగా బాకు నగరం, 1806 లో జనరల్ బుల్గాకోవ్ నేతృత్వంలోని రష్యన్ దళాలచే పునరాక్రమించబడింది.

రష్యా-ఇరాన్ సామ్రాజ్యాల మధ్య జరిగిన మూడవ రూసో-పర్షియన్ యుద్ధం (1804-13)లో ఓడిపోయిన ఇరాన్, గులిస్తాన్ ఒప్పందం (1813) ప్రకారం తన ఆధీనంలోని జార్జియా, అజర్ బైజాన్, అర్మేనియా తదితర కాకేసియన్ ప్రాంతాలను రష్యాకు వదులుకోవలసి వచ్చింది. ఈ విధంగా 1813 లో రష్యా-ఇరాన్ మధ్య కుదిరిన గులిస్తాన్ ఒప్పందం ప్రకారం బాకు శాశ్వతంగా రష్యన్ సామ్రాజ్యానికి ధారాదత్తం చేయబడింది. 1840 లో బాకు, రష్యన్ సామ్రాజ్యంలో ఒక పరిపాలనా ప్రాంతంగా మారిపోయింది.

మొదటి ప్రపంచ యుద్ధ కాలం

[మార్చు]

1917లో, అక్టోబర్ విప్లవం తరువాత బాకు ప్రాంతం, స్టెపాన్ షాహుమ్యాన్ నేతృత్వంలో వున్న బోల్షెవిక్ ల పాలనా నియంత్రణలోకి వచ్చింది. అయితే బోల్షెవిక్‌లు అక్కడ ప్రబలంగా వున్న సాయుధ అజర్‌బైజాన్ గ్రూప్ లను ఎదుర్కోవడానికి, తద్వారా బాకును పూర్తిగా నియంత్రించడానికి, అక్కడి నెలకొనివున్న భిన్న జాతుల మధ్య వైరుధ్యాలను ఉపయోగించుకున్నారు. 1918లో బాకు పరిసర ప్రాంతాలలో జాతి ఘర్షణలు రెచ్చగొట్టబడ్డాయి. దీన్ని అవకాశంగా తీసుకొని 1918 మార్చి నెలలో బోల్షెవిక్‌లు బాకు నగరంపై నియంత్రణ సాధించడానికి ప్రయత్నిస్తూ, ఆ మిషపై సాయుధ అజర్‌బైజాన్ సమూహాలను క్రూరంగా అణిచివేసారు. ఇది బాకులో అంతర్యుద్ధానికి దారి తీసింది. ఒక అంచనా ప్రకారం మార్చ్ డేస్ (march days) లో జరిగిన ఈ మారణకాండలో 3,000 నుంచి 12,000 వరకు అజర్‌బైజానీలు తమ సొంత రాజధాని బాకులో హతులయ్యారు. తదనంతరం మే 1918 లో మరో వర్గం గంజాలో అజర్‌బైజాన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ పేరుతో స్వాతంత్య్రాన్ని ప్రకటించింది. తద్వారా మొదటి ముస్లిం-మెజారిటీ ప్రజాస్వామ్య, లౌకిక గణతంత్రాన్ని స్థాపించింది.

1918 బాకు యుద్దానంతరం అజర్‌బైజాన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ సైన్యానికి చెందిన సైనికులు

ఆ తరువాత సెప్టెంబర్ 1918 నాటికి అజర్‌బైజాన్ దళాలు, నూరు పాషా నేతృత్వంలోని ఒట్టోమన్ సైన్యం మద్దతుతో, బోల్షెవిక్‌ల నుండి బాకును తిరిగి స్వాధీనం చేసుకొన్నాయి. లోగడ జరిగిన మార్చ్ డేస్ నాటి మారణకాండకు ప్రతీకారంగా అజర్‌బైజాన్ దళాలు ఒట్టోమన్ సైన్యం లోపాయకారి మద్దతుతో బాకులో నివసిస్తున్న అర్మేనియన్ జాతులవారిని సెప్టెంబర్ డేస్ (september days) లలో దోపిడీ చేసి సుమారు 10,000 నుంచి 30,000 వరకు అర్మేనియన్లను ఊచకోత కోశాయి. అజర్‌బైజాన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ కొత్త రాజధానిగా బాకు ప్రకటించబడింది. అయితే మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ (ఒట్టోమన్ సామ్రాజ్యం) ఓటమి పాలైంది. ముద్రోస్ యుద్ధ విరమణ సంధి ప్రకారం బాకు నుండి టర్కిష్ దళాలు వైదొలగాయి. వెంటనే బ్రిటిష్ దళాలతో జనరల్ థామ్సన్ బాకును స్వాధీనం చేసుకొని సైనిక పాలన కొనసాగించాడు. మొదటి ప్రపంచ యుద్ధం ముగియడానికి ముందు బ్రిటిష్ దళాలు కూడా బాకు నగరాన్ని వదిలి వెళ్ళిపోయాయి.

సోవియట్ కాలం

[మార్చు]

అజర్‌బైజాన్ రిపబ్లిక్ స్వాతంత్య్రం (1918) బాకు చరిత్రలో ముఖ్యమైనదే అయినప్పటికీ ఒక స్వల్పకాలిక అధ్యాయంగా మాత్రమే నిలిచి పోయింది. 1920 ఏప్రిల్ 28 తేదీన, ఎర్ర సైన్యం బాకుపై దాడి చేసి, బోల్షెవిక్‌ పాలనను తిరిగి స్థాపించింది. సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ గా అజర్‌బైజాన్ ను ప్రకటించి, బాకును దాని రాజధానిగా చేసింది. సోవియట్ పాలనలో బాకు నగరం అనేక ప్రధాన మార్పుచేర్పులకు గురైంది. సోవియట్ యూనియన్‌లో బాకు ప్రధాన చమురు నగరమైంది. సోవియట్ యూనియన్ ఈ కాస్పియన్ మహానగరపు ఆర్థిక ప్రాముఖ్యతను తనదైన శైలిలో వేగంగా అభివృద్ధి చేసింది. 1922 నుండి 1930 వరకు సోవియట్ యూనియన్ కాలంలో జరిగిన ప్రధాన వాణిజ్య ప్రదర్శనలలో బాకు, ఒక దానికి వేదిక అయింది. ఇది ఇరాన్, మధ్యప్రాచ్యానికి వాణిజ్య వారధిగా కొనసాగింది.

బాకు, చమురు క్షేత్రాలతో, వ్యూహాత్మకంగా కీలక స్థానంలో ఉన్నందువల్ల, రెండవ ప్రపంచ యుద్ధ కాలం (1939-45) లో అక్ష రాజ్యాలు (జర్మనీ, ఇటలీ, జపాన్) బాకు పై దృష్టి సారించాయి. ముఖ్యంగా 1942లో నాజీ జర్మనీ సోవియెట్ యూనియన్ పై జరిపిన దండయాత్రలో బాకు పై అదుపు కోసం ప్రయత్నించింది. వాస్తవానికి, బాకు చమురు క్షేత్రాలను స్వాధీనం చేసుకోవడం అనే ప్రాథమిక లక్ష్యంతో ఆపరేషన్ ఎడెల్వీస్ ను ఆరంభించిన జర్మన్ నాజీ సైన్యం 1942 నవంబర్ లో బాకు వైపుకు చొచ్చుకొనిపోయి, బాకుకు వాయువ్యంగా కేవలం 530 కిలోమీటర్ల సమీపంలోనికి చేరుకోగలిగింది. అయితే సోవియట్ తన ఆపరేషన్ లిటిల్ సాటర్న్ లో భాగంగా 1942 డిసెంబర్ లో నాజీలను అక్కడినుండి తరిమివేసి తద్వారా బాకు చమురుక్షేత్రాలను కాపాడుకోగలిగింది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం కూడా పెట్రోలియం, గ్యాస్ నిక్షేపాలను రికార్డు స్థాయిలలో వెలికితీయడంవలన బాకు నగరం అటు పారిశ్రామికీకరణలోనూ, ఇటు వాణిజ్య రంగంలోనూ శరవేగంతో అభివృద్ధిని సాధించింది. అచిరకాలంలోనే చమురు వాణిజ్యానికి అంతర్జాతీయ నగరంగా పేరుపొందింది. 1991 లో సోవియట్ యూనియన్ రద్దు తర్వాత, బాకులో పెద్ద ఎత్తున పునర్నిర్మాణ ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. [16]

పెట్రోలియం వెలికితీత

[మార్చు]
బీబీ-హేబత్ వద్ద చమురు బావిని చేతితో తవ్వుతున్న చమురు కార్మికులు

బాకులో పెట్రోలియం ఉనికి గురించిన ఆధారాలు క్రీ.శ. ఎనిమిదవ శతాబ్దం నుండి లభిస్తున్నాయి. పదవ శతాబ్దంలో అరేబియన్ యాత్రికుడు మారుడీ (Marudee), ఇక్కడ తెలుపు, నలుపు రంగులలో వున్న నూనెలు సహజసిద్ధంగా సేకరించబడుతున్నాయని తెలియచేసాడు. పదిహేనవ శతాబ్దం నాటికే ఇక్కడ చేతితో తవ్విన ఉపరితల బావుల నుండి నూనెను సేకరించి దీపాలకోసం ఉపయోగించడం జరిగేది. 1594 లోనే బాకులో మొదటి చమురు బావిని తవ్వారు. 1636 లో జర్మన్ దౌత్యవేత్త, యాత్రికుడైన ఆడమ్ ఒలెయరీ ఎల్ష్లెగర్ (Adam Oleary Elshleger, 1603-71) ఇచ్చిన వివరణ ప్రకారం బాకులో 30 చమురు బావుల ఉన్నాయని, వాటిలో కొన్ని గుషర్లు అని తెలుస్తున్నాయి. అంటే 1636 నాటికి, బాకులో చమురు క్షేత్రాలు కనీసం 30 కి తక్కువ లేవు. 1683 లో పర్షియా లోని స్వీడిష్ రాయబార కార్యాలయ కార్యదర్శి ఎంగెల్బర్ట్ కెంఫర్ (Engelbert Kaempfer) బాకు చమురు పరిశ్రమ గురించి పశ్చిమ దేశాలకు తొలిసారి వివరణాత్మకంగా తెలియచేసాడు. బాకులో నిజమైన చమురు అభివృద్ధి 1840 ల తరువాతనే ప్రారంభం అయ్యింది.

ప్రపంచంలోని మొట్టమొదటి చమురు బావి (oil-well) 1846 లో, బాకు నగరంలోని బీబీ-హేబాత్ (Bibi-Heybat) వద్ద డ్రిల్లింగ్ చేయబడింది. 1853 లో బాకుకు చెందిన జవాద్ మెలికోవ్ (Javad Melikiants), ఇక్కడే ప్రపంచంలో మొట్టమొదటి పారాఫిన్ ఫ్యాక్టరీని నిర్మించాడు. 1859 లో షమాఖలో సంభవించిన వినాశకరమైన భూకంపం సంభవించిన తర్వాత బాకు ఒక అనధికార ప్రావిన్స్ కేంద్రంగా మారిపోయింది. 1861 లో బాకులో చమురు ఎగుమతులకోసం ఓడరేవు, కస్టమ్స్ హౌస్‌ని నిర్మించడానికి మధ్యయుగపు సముద్రతీర కోటలు కూల్చివేయబడ్డాయి. 1863 లో జవాద్ మెలికోవ్, బాకులో మొదటి కిరోసిన్ ఫ్యాక్టరీని నిర్మించాడు. 1883 నాటికి ఇటువంటి ఫ్యాక్టరీలు బాకులో 200 వరకు వెలిశాయి.

1871 లో, మిర్జోయేవ్ అనే ఆయిల్ లీజుదారుడు చమురు వెలికితీతకై మొదటి చెక్కతో చేసిన ఆయిల్ డెరిక్‌ను నిర్మించాడు. డ్రిల్లింగ్, బాలన్సింగ్, పంపింగ్ లాంటి ప్రక్రియలన్నీ ఆదిమ పద్ధతులలో మానవ ప్రమేయంతోనే నిర్వహించి ఆయిల్ ను వెలికి తీశారు. రష్యన్ సామ్రాజ్య పాలకులు బాకు దాని పరిసర చమురు నిల్వల భూములను, ప్రైవేట్ పెట్టుబడిదారులకు వేలం వేసినతరువాత, 1872 లో బాకులో పెద్ద ఎత్తున చమురు అన్వేషణ ప్రారంభమైంది.

అతి త్వరలోనే, స్విస్, బ్రిటిష్, ఫ్రెంచ్, బెల్జియన్, జర్మన్, స్వీడిష్, అమెరికన్ పెట్టుబడిదారులు బాకులో పెద్ద ఎత్తున వాలిపోయారు. 1873 లో స్వీడిష్ పెట్టుబడిదారులైన రాబర్ట్ నోబెల్, 1882 లో ఫ్రెంచి పెట్టుబడిదారులైన రోత్‌చైల్డ్స్‌ బ్రదర్స్ రాకతో బాకులో ఆయిల్ పరిశ్రమ ఆధునికంగా అభివృద్ధి చెందింది. 1873 లో రాబర్ట్ నోబెల్, బాకులో నోబెల్ బ్రదర్స్ పెట్రోలియం ప్రొడక్షన్ కంపెనీ స్థాపించారు. వారు 1877 లో రష్యా దేశపు మొట్టమొదటి ఆయిల్ పైప్‌లైన్ వ్యవస్థ, పంపింగ్ స్టేషన్లు, స్టోరేజ్ డిపోలు, రైల్వే ట్యాంక్ కార్లు లతో పాటు ఆయిల్ సముద్ర ట్యాంకర్ ల వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. తత్ఫలితంగా 1880 లలో బాకు సమీపంలో బ్లాక్ సిటీ అనే పేరుతొ ఒక పెద్ద పారిశ్రామిక చమురు వాడ (ఇండస్ట్రియల్ ఆయిల్ బెల్ట్) వెలిసి వృద్ధి చెందింది.

చమురు ఉత్పత్తి స్థాయి

[మార్చు]

1890 ల నుండి, బాకు రష్యన్ సామ్రాజ్యపు చమురు ఉత్పత్తిలో 95 శాతం, ప్రపంచ చమురు ఉత్పత్తిలో సగానికి పైగా ఒక్క బాకు నగరం నుండే లభ్యమైంది. 20 వ శతాబ్దం ప్రారంభంలో, బాకు ప్రపంచవ్యాప్తంగా చమురు ఉత్పత్తి చేసే ప్రముఖ నగరంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించబడే చమురులో సగం ఒక్క బాకు నగరంలోనే సేకరించబడింది. [17] 1898 -1901 సంవత్సరాల మధ్య, బాకు అమెరికా దేశం కంటే ఎక్కువ చమురును ఉత్పత్తి చేసింది. 1901 నాటికి, బాకు ప్రపంచంలోని చమురులో సగానికి పైగా ఉత్పత్తి చేసింది. [18] అంటే రోజుకు 11 మిలియన్ టన్నులు లేదా 2,12,000 బారెళ్ళ (33,700 క్యూబిక్ మీటర్లు) చొప్పున చమురును ఉత్పత్తి చేయగలిగింది. ఆ విధంగా మొత్తం రష్యన్ చమురులో 55% ఉత్పత్తి చేసింది. ఇదంతా బాకులోని కేవలం 6 చదరపు మైళ్ల దూరంలో విస్తరించిన ఆయిల్ క్షేత్రం నుండి జరగడం విశేషం. ఈ విధంగా 20 వ శతాబ్దం ప్రారంభంలో, అజర్‌బైజాన్ ప్రపంచవ్యాప్తంగా చమురు ఉత్పత్తి చేసే ప్రముఖ దేశంగా మారిందంటే దానికి ఏకైక కారణం బాకులో లభ్యమైన ముడిచమురు. సోవియెట్ కాలంలో 1964-1968లో, బాకులో చమురు వెలికితీత సంవత్సరానికి 21 మిలియన్ టన్నుల స్థాయికి పెరిగింది. 1981 లో, రికార్డు స్థాయిలో 15 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ బాకులో సేకరించబడింది.

బాకు-ప్రధాన ఆయిల్ క్షేత్రాలు

[మార్చు]

ప్రధాన చమురు ఉత్పత్తి ప్రాంతాలు సబుంచీ, సురఖానీ, బీబీ-హేబాట్ వద్ద బాకు సమీపంలో ఉన్నాయి. 20 వ శతాబ్దం ప్రారంభం వరకు, సబుంచి ఆయిల్ క్షేత్రం బాకు నూనెలో 35% ఉత్పత్తి చేసింది. బీబీ-హేబాట్ ఆయిల్ క్షేత్రం 28% ఉత్పత్తి చేసింది, తరువాత రోమనీ, బాలఖని ఆయిల్ క్షేత్రాలు ముఖ్యమైనవి. ఇవన్నీ ఆన్‌షోర్ ఆయిల్ ఫీల్డ్ లు. ఇరవయ్యవ శతాబ్దం చివరలో, ఆన్‌షోర్ పెట్రోలియం ఉత్పత్తి చాలా వరకు తగ్గిపోయింది. అయితే పెట్రోలియం డ్రిల్లింగ్ ఆఫ్‌షోర్‌కు విస్తరించింది.

బాకు సమీపంలోని ఆఫ్‌షోర్‌ (Offshore) ఆయిల్ ఫీల్డ్ లలో అజేరి (Azeri) ముఖ్యమైనది. అజెరి–చిరాగ్–గునష్లీ (Azeri–Chirag–Gunashli) బాకు కు 120 కిలోమీటర్ల దూరంలో కాస్పియన్ సముద్రంలో విస్తరించివున్న అతి పెద్ద ఆఫ్‌షోర్‌ ఆయిల్ ఫీల్డ్ సముదాయం. ఈ ఒక్క ఆయిల్ ఫీల్డ్ సముదాయంలోనే 16 బిలియన్ బ్యారెల్స్ (250 కోట్ల క్యూబిక్ మీటర్ల)కు పైగా ఆయిల్ నిక్షేపాలు ఉన్నట్లు అంచనా. ఇతర ఆఫ్‌షోర్‌ ఆయిల్ ఫీల్డ్ లలో ముఖ్యమైనవి కరబాక్, బాహర్ క్షేత్రాలు. షా డెనిజ్ (Shah Deniz) అజర్‌బైజాన్‌లో అత్యధికంగా ఉత్పత్తి చేసే నేచురల్ గ్యాస్ ఫీల్డ్. ఇది బాకు నుండి 70 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో వుంది. దాని వార్షిక ఉత్పత్తి 9 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్. దాని తరువాత నఖ్చివన్ గ్యాస్ క్షేత్రం ముఖ్యమైనది. మొత్తం మీద ఈ ఆఫ్‌షోర్‌ ఆయిల్ అండ్ గ్యాస్ క్షేత్రాలన్నీ బాకు నగరానికి 30 నుండి 120 కిలోమీటర్ల దూరం లోపులోనే కాస్పియన్ సముద్రంలో విస్తరించి వున్నాయి.

2006 నుండి అజెరి-చిరాగ్-గునేష్లి చమురు క్షేత్రం నుండి ఉత్పత్తి అయ్యే చమురును బాకు-టిబిలిసి-సెహాన్ పైప్‌లైన్ (Baku-Tbilisi-Ceyhan pipeline) ద్వారా బాకు నుండి మధ్యధరా సముద్రానికి రవాణా చేస్తున్నారు. 1760 కిలోమీటర్ల పొడవైన ఈ పైప్ లైన్ మూడు దేశాల (అజర్‌బైజాన్, జార్జియా, టర్కీ) గుండా పోతుంది. ఈ పైప్ లైన్ ద్వారా పెట్రోలియం, బాకుకు సమీపంలో వున్న సంగచల్ టెర్మినల్ నుండి జార్జియా రాజధాని టిబిలిసి మీదుగా టర్కీ దేశపు ఆగ్నేయ మధ్యధరా తీరంలోని సెహాన్ నౌకాశ్రయానికి పంపింగ్ చేయబడుతుంది.

శీతోష్ణస్థితి

[మార్చు]

బాకు వాతావరణాన్ని వెచ్చని వేసవి (warm summer), అతి చల్లని, పొడి శీతాకాలాల (very cold, dry winters)తో కూడిన ఖండాంతర ప్రభావ శీతోష్ణస్థితిగా చెప్పవచ్చు. వేసవిలో బాకులో శీతోష్ణస్థితి వేడిగాను, తేమగాను ((hot and humid) ఉంటుంది. శీతాకాలంలో చల్లగా, తడిగా (cool and wet) ఉంటుంది. ఇక్కడి శీతోష్ణస్థితిని సమశీతోష్ణ పాక్షిక-శుష్క (temperate semi-arid) గా కూడా పేర్కొంటారు. కొప్పెన్ వర్గీకరణలో ఈ శీతోష్ణస్థితిని BSk తో సూచిస్తారు. శీతాకాలంలో, ధృవ వాయు రాశులు (Polar air masses) ఏర్పడిన సందర్భాలలో ఈ నగరంలో గాలి తుఫానులు ఏడాది పొడుగునా బలంగా వీస్తాయి. ఇక్కడ విలక్షణంగా వీచే చల్లని ఉత్తర గాలులను ఖజ్రీ అని, దక్షిణ వెచ్చని గాలులను గిలావర్ అని పిలుస్తారు. వేసవిలో వీచే ఖజ్రీ గాలులు బాకుకు కావలిసినంత చల్లదనాన్ని చేకూరుస్తాయి. ఉత్తర, దక్షిణ దిశల నుంచి బయలుదేరే ఈ రెండు పవనాలు (ఖజ్రీ, గిలావర్ ) ఒకదానికొకటి ప్రత్యమ్నాయంగా, సంవత్సరం పొడుగునా, అన్ని సీజన్లలోనూ నగరంలో ఉదృతంగా వీస్తూ వుండటంవలన బాకుకి విండ్ సిటీ అనే పేరు వచ్చింది.

వెచ్చని వేసవి, చల్లని ఆర్ద్ర శీతాకాలం, ఏడాది పొడవునా వీసే బలమైన పవనాలు మొదలైన లక్షణాలు ఇక్కడ వుప్పటికీ, ఇలాంటి వాతావరణ లక్షణాలు గల ఇతర అనేక ప్రాంతాల వలె కాకుండా, బాకులో వేసవి వేడి తగు మోతాదు లోనే ఉంటుంది. సూర్యరశ్మి కూడా ఎక్కువసేపు ఉండదు. వార్షిక సగటు చూస్తే ఇక్కడ సూర్యరశ్మి సగటున రోజుకి 6.6 గంటలు మాత్రమే లభ్యమవుతుంది. ఋతువుల వారీగా చూస్తే - శీతాకాలంలో సూర్యరశ్మి తరుచుగా కనిపించదు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సూర్యరశ్మి రోజుకి కేవలం 3-4 గంటలు మించి ఉండదు. వేసవిలో జూన్, జులై ఆగష్టు నెలలలో మాత్రం సూర్యరశ్మి పూర్తిగా అంటే రోజుకి 12 గంటలు లభ్యమవుతుంది. దీనికి కారణం బాకు ఉత్తర అక్షాంశం లో కాస్పియన్ సముద్రం ఒడ్డున ఉన్న ఒక ద్వీపకల్పంలో వుంటటమే. నిజానికి బాకుతో పాటు అబ్షెరాన్ ద్వీపకల్పం యావత్తూ శుష్క ప్రాంతం. ఇక్కడ వర్షపాతం సంవత్సరానికి 20 సెం.మీ కంటే తక్కువగా ఉంటుంది. అజర్‌బైజాన్‌లో నైరుతి బాకు ప్రాంతం అత్యంత శుష్క ప్రాంతం. ఇక్కడ వర్షపాతం సంవత్సరానికి 15 సెంటీ మీటర్లు (ఆరు అంగుళాలు) మించి ఉండదు.

వేసవిలో సుదీర్ఘమైన సూర్యరశ్మి, ఆరోగ్యకరమైన పొడి వాతావరణంలు ఉండటంతో, వేసవిలో విహారయాత్రలకు బాకు అనువుగా ఉంటుంది. ఈ నగరం, సోవియట్ కాలంలో, ఒక చక్కని పర్యాటక ప్రదేశంగా విలసిల్లింది. పర్యాటకులు ఇక్కడి సుందరమైన బీచ్‌లను ఆస్వాదిస్తూ, కాస్పియన్ సముద్రానికి అభిముఖంగా ఉన్న స్పా కాంప్లెక్స్‌లలో విశ్రాంతి తీసుకొనేవారు. అయితే ఈ పారిశ్రామిక నగరం, 2008 నాటికి ప్రపంచంలోని అత్యంత కలుషితమైన నగరాలలో ఒకటిగా మిగిలిపోయింది.

సగటు నెల ఉష్ణోగ్రతలు జనవరిలో 1°C (33.8° F), జూలైలో 28°C (82.4° F) గా ఉంటాయి.[19]

జూలై, ఆగస్టు నెలల్లో రోజువారీ సగటు ఉష్ణోగ్రత సగటున 26.4°C. ఆ సీజన్‌లో చాలా తక్కువ వర్షపాతం ఉంటుంది. వర్షపాతంలో ఎక్కువ భాగం, వేసవిలో కాకుండా ఇతర ఋతువులలో సంభవిస్తుంది, అయితే ఈ ఋతువుల్లో ఏదీ ప్రత్యేకంగా ఆర్ద్రంగా ఉండదు.

శీతాకాలం చల్లగా, అప్పుడప్పుడు తడిగా ఉంటుంది, జనవరి, ఫిబ్రవరిలో రోజువారీ సగటు ఉష్ణోగ్రత సగటున 4.3°C ఉంటుంది. ఈ సీజన్లో లో మంచు చాలా అరుదుగా కురుస్తుంది. శీతాకాలంలో వీచే ఖజ్రీ చల్లని గాలులు, ధృవ వాయురాశితో కలిసినపుడు మాత్రం ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి ఫలితంగా తీవ్రమైన చలి అనుభూతి కలుగుతుంది. అటువంటి పరిస్థితులలో తీరంలోని ఉష్ణోగ్రతలు అరుదుగా గడ్డకట్టే స్థాయికి కూడా పడిపోతాయి. శీతాకాలపు మంచు తుఫానులు అప్పుడప్పుడు ఉంటాయి. మంచు సాధారణంగా ప్రతి హిమపాతం తర్వాత కొన్ని రోజులలో కరుగుతుంది.

శీతోష్ణస్థితి డేటా - బాకు
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 6.6
(43.9)
6.3
(43.3)
9.8
(49.6)
16.4
(61.5)
22.1
(71.8)
27.3
(81.1)
30.6
(87.1)
29.7
(85.5)
25.6
(78.1)
19.6
(67.3)
13.5
(56.3)
9.7
(49.5)
18.1
(64.6)
రోజువారీ సగటు °C (°F) 4.4
(39.9)
4.2
(39.6)
7.0
(44.6)
12.9
(55.2)
18.5
(65.3)
23.5
(74.3)
26.4
(79.5)
26.3
(79.3)
22.5
(72.5)
16.6
(61.9)
11.2
(52.2)
7.3
(45.1)
15.1
(59.2)
సగటు అల్ప °C (°F) 2.1
(35.8)
2.0
(35.6)
4.2
(39.6)
9.4
(48.9)
14.9
(58.8)
19.7
(67.5)
22.2
(72.0)
22.9
(73.2)
19.4
(66.9)
13.6
(56.5)
8.8
(47.8)
4.8
(40.6)
12.0
(53.6)
సగటు అవపాతం mm (inches) 21
(0.8)
20
(0.8)
21
(0.8)
18
(0.7)
18
(0.7)
8
(0.3)
2
(0.1)
6
(0.2)
15
(0.6)
25
(1.0)
30
(1.2)
26
(1.0)
210
(8.3)
సగటు అవపాతపు రోజులు 6 6 5 4 3 2 1 2 2 6 6 6 49
సగటు మంచు కురిసే రోజులు (≥ 1 cm) 4 3 0 0 0 0 0 0 0 0 0 3 10
Mean monthly sunshine hours 89.9 89.0 124.0 195.0 257.3 294.0 313.1 282.1 222.0 145.7 93.0 102.3 2,207.4
Source 1: World Meteorological Organisation (UN),[20] Hong Kong Observatory[21] for data of sunshine hours
Source 2: Meoweather (Snowy days)[22]

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]

బాకు ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం పెట్రోలియం. అజర్‌బైజాన్ రోజుకు 800,000 బారెల్స్ చమురు, 1 బిసిఎమ్ గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుంది. బాకు సమీపంలో కాస్పియన్ సముద్రంలో గల ఆఫ్‌షోర్‌ క్షేత్రాలైన అజెరి-చిరాగ్-గునేష్లి కాంప్లెక్స్ ఆయిల్ ఫీల్డ్, షా డెనిజ్ గ్యాస్ ఫీల్డ్ లను అభివృద్ధి చేయడంతోనూ, సంగచల్ టెర్మినల్ ను విస్తరించడంతోను బాకు చమురు ఆర్థిక వ్యవస్థ ఇరవై ఒకటవ శతాబ్దం తొలినాళ్లలో మరింతగా పుంజుకుంది. బాకులోని ముఖ్య పరిశ్రమలన్నీ చమురు పరిశ్రమకు సంబందించిన వివిధ పరికరాలను ఉత్పత్తి చేస్తాయి. నగరంలో గల చమురేతర పరిశ్రమలలో మెటల్ వర్కింగ్, షిప్ బిల్డింగ్, రిపేర్ పరిశ్రమలు, ఎలక్ట్రికల్ మెషినరీల తయారీ, రసాయనాలు, నిర్మాణ సామగ్రి ఉత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ముఖ్యమైనవి.

రవాణా సదుపాయాలు

[మార్చు]
బాకు మెట్రో రైల్

బాకు నగరానికి హేదర్ అలీయేవ్ (Heydar Aliyev) అంతర్జాతీయ విమానాశ్రయం, బాకు మెట్రో రైల్ లు రవాణా సేవలు అందిస్తున్నాయి. బాకు ఓడరేవు నుండి కాస్పియన్ సముద్రం మీదుగా తుర్క్‌మెనిస్తాన్‌లోని తుర్క్‌మెన్‌బాషి (గతంలో క్రాస్నోవోడ్స్క్), ఇరాన్‌లోని బందర్ అంజలి, బందర్ నౌషర్‌ పోర్టులకు లకు రెగ్యులర్ గా నౌకా రవాణాసదుపాయం వుంది.

జనాభా-తెగలు-మతం

[మార్చు]
13వ శతాబ్దపు బీబీ-హేబత్ మసీదు. ఈ మసీదు ఇస్లామిక్ ప్రవక్త ముహమ్మద్ వంశస్థుని సమాధిపై నిర్మించబడింది

2021 అంచనాల ప్రకారం బాకు నగర జనాభా 23,71,000. ప్రజల్లో 90 శాతం మంది అజర్‌బైజాన్ జాతులు. మిగిలిన 10 శాతంలో అర్మేనియన్, రష్యన్, యూదు ప్రజలున్నారు. ఇక్కడి ప్రజలు అధికారిక భాష అజర్‌బైజాని తో పాటు రష్యన్ భాషలో కూడా వ్యవహరిస్తారు. మతరీత్యా చూస్తే-బాకు నగర జనాభాలో అత్యధికులుగా ముస్లింలు 94 శాతంతో (ఎక్కువ శాతం షియా ముస్లింలు) ఉన్నప్పటికీ అజర్‌బైజాన్ రాజ్యాంగం, పౌరులకు మత స్వేచ్ఛను ప్రసాదించింది. జాతీయ మతం లేదని నొక్కి వక్కాణించింది. ప్రజలలో దాదాపు నాలుగు శాతం మంది క్రైస్తవులుగా (మెజారిటీ రష్యన్ ఆర్థోడాక్స్ చర్చి, జార్జియన్ ఆర్థోడాక్స్ చర్చి, మోలోకన్స్) వున్నారు.

వాస్తు నిర్మాణ శైలి

[మార్చు]
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన మైడెన్ టవర్ (12వ శతాబ్దం) బాకు నగర చిహ్నంగా గుర్తించబడింది

బాకు నగరపు వాస్తుశిల్పం ఏ ఒక్క నిర్దిష్ట నిర్మాణ శైలికో పరిమితమై లేదు. ఈ నగర వాస్తు శైలి కాలానుగుణంగా మారుతూ వస్తున్నది. ఓల్డ్ సిటీ కేంద్రం నుండి ఆధునిక నగరం, విశాలమైన ఓడరేవు ప్రాంగణం వరకు చాలా వైవిధ్యభరితమైన వాస్తు నిర్మాణ శైలులను కలిగి ఉంది. ఓల్డ్ సిటీ లోని మసూద్ ఇబ్న్ దావూద్ యొక్క 12వ శతాబ్దపు మైడెన్ టవర్ నిర్మాణంతో ఇస్లామిక్ వాస్తు శైలి వృద్ధిచెంది కాల క్రమేణా, యురోపియన్ వాస్తు శైలిని, జారిస్ట్ రష్యన్ వాస్తు శైలిని, సోవియట్ నిర్మాణ శైలిని, పోస్ట్ మాడర్న్ ఆర్కిటెక్చర్ వంటి కొత్త శైలులను తనలో ఇముడ్చుకొంటూ కాలానుగుణంగా అభివృద్ధి చెందుతూ వస్తున్నది.

ఓల్డ్ సిటీ లోని మైడెన్ టవర్ నిర్మాణం, శిర్వాన్‌షా రాజభవనం, జుమా మసీదు, బీబీ-హేబాత్ (Bibi-Heybat) మసీదు మొదలైనవి ఇస్లామిక్ వాస్తు శైలిని ప్రతిబింబిస్తాయి. ఓల్డ్ బాకులో 12వ శతాబ్దంలో నిర్మించబడిన మైడెన్ టవర్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగాను, బాకు నగర చిహ్నంగాను గుర్తించబడింది. బాకు యొక్క పాత నగరాన్ని బాకు కుడ్య నగరం (Walled City of Baku) అని కూడా పిలుస్తారు. 1806లో రష్యన్ ఆక్రమణ తర్వాత బలోపేతం చేయబడిన మధ్యయుగపు రక్షణ కుడ్యాలు, కోట బురుజులు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. ఇరుకైన సందులతోను, పురాతన భవన సముదాయాలతోను, శిర్వాన్‌షా ప్యాలెస్‌, జుమా మసీదు వంటి చారిత్రిక కట్టడాలతోను నిండిన ఈ పాత బాకు కేంద్రం ప్రాచీన వాస్తు శైలిలో విలక్షణమైనది, సుందరమైనది.

20వ శతాబ్దం ఆరంభంలో ఇక్కడి వాస్తు శైలిని యూరోపియన్ వాస్తు నిర్మాణ శైలి గొప్పగా ప్రభావితం చేసింది. ఇక్కడ యూరోపియన్ విశిష్ట శైలిలో అనేక కట్టడాలు, భవనాలు నిర్మించబడ్డాయి. ఇది రష్యన్ ఇంపీరియల్ యుగంలోని విద్యా సంస్థలు, భవనాల ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. బాకులో యూరోపియన్ శైలిలో నిర్మించిన తొలి రష్యన్ కట్టడాలతో ఫౌంటైన్స్ స్క్వేర్ భవనాలు (1891) ముఖ్యమైనవి. రష్యన్ ఇంపీరియల్ యుగంలో నిర్మించబడ్డ మరి కొన్ని ఇతర ముఖ్య కట్టడాలు - సయ్యద్ మీర్బాబాయేవ్ ప్యాలెస్ (1895) ఫ్రెంచ్ పునరుజ్జీవన వాస్తు శైలిలో వుంది. డి బోర్ ప్యాలెస్ (1895) బరోక్ ఆర్కిటెక్చర్ (ఇటలీ) శైలిలో నిర్మించబడింది. అజర్‌బైజాన్ స్టేట్ అకడమిక్ ఫిల్హార్మోనిక్ హాల్ (1910) యొక్క శైలి, ఇటాలియన్ & జర్మన్ వాస్తు శైలుల సమ్మేళనంగా కనిపిస్తుంది. ప్యాలెస్ ఆఫ్ హ్యాపీనెస్ (1912) గోథిక్ శైలిలోను, ఇస్మాయిలియే ప్యాలెస్ (1913) వెనీస్ గోతిక్ శైలితోనూ నిర్మించబడ్డాయి.

ఇక్కడి భవన నిర్మాణంలో ఆధునికానంతర కాలపు (పోస్ట్ మాడర్న్) ఆర్కిటెక్చర్ 2000 సంవత్సరం ప్రారంభం నుండి కనిపిస్తుంది. ఆర్థికాభివృద్ధి వలన, కొత్త భవనాల కోసం అట్లాంట్ హౌస్ వంటి పాత భవనాలు ధ్వంసం చేయబడ్డాయి. పూర్తి గ్లాస్ షెల్‌లతో కూడిన భవనాలు నేడు నగరం చుట్టూరా కనిపిస్తాయి, వాటిలో సాకర్ (SOCAR) టవర్, ఫ్లేమ్ టవర్లు ప్రముఖమైనవి. ఇంటర్నేషనల్ ముఘం సెంటర్, అజర్‌బైజాన్ టవర్, హేదర్ అలియేవ్ కల్చరల్ సెంటర్, బాకు క్రిస్టల్ హాల్, బాకు వైట్ సిటీ, డెనిజ్ మాల్ వంటి భవనాలు పోస్ట్ మాడర్న్ వాస్తు శైలికి ప్రముఖ ఉదాహరణలు.

బాకు తన అసలు రూపంతో పాటు ఆధునిక రూపంతో అద్వితీయంగా పోటీపడుతూ 'పారిస్ ఆఫ్ ది ఈస్ట్'గా పేరు తెచ్చుకుంది. ప్రపంచ నగరాల దినోత్సవం సందర్భంగా 2019 అక్టోబర్ 31 న UNESCO గుర్తించిన ప్రపంచ సృజనాత్మక నగరాల విభాగంలో బాకు'డిజైన్ సిటీ'గా పేరు పొందింది.

సంస్కృతి-వారసత్వం

[మార్చు]
హేదర్ అలీయేవ్ సెంటర్
అజర్‌బైజాన్ స్టేట్ అకడమిక్ ఒపెరా, బ్యాలెట్ థియేటర్

బాకులో చక్కని థియేటర్స్, ఒపెరా, బ్యాలెట్ ఉన్నాయి. ఇక్కడి ప్రధాన సినిమా థియేటర్ "అజర్‌బైజాన్ సినిమా". నగరంలో అత్యంత అందమైన మ్యూజిక్ హాల్‌లలో అజర్‌బైజాన్ స్టేట్ అకడమిక్ ఒపెరా, బ్యాలెట్ థియేటర్ ఒకటి. అద్భుతమైన సౌండ్ సిస్టం ఎఫెక్ట్ లతో స్టేట్ ఫిల్హార్మోనిక్ హాల్ (The State Philharmonic Hall) తరచుగా ప్రదర్శనలను నిర్వహిస్తుంది.

కార్పెట్, అప్లైడ్ ఆర్ట్స్ మ్యూజియం, తివాచీ ప్రదర్శనలకు సంబందించినది. ఇది వివిధ కాలాలకు చెందిన, విభిన్న శైలులకు సంబందించిన తివాచీలను ముఖ్యంగా అజర్‌బైజాన్ తో పాటు ఇరాన్‌లోని అజెరి ప్రావిన్సుల నుండి సేకరించిన తివాచీలను ప్రదర్శిస్తుంది.

బాకులో గల అజర్‌బైజాన్ స్టేట్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, దేశంలోని అతి పెద్ద ఆర్ట్ మ్యూజియం. ఇది వివిధ ప్రాచ్య, పాశ్చాత్య దేశాల కళాఖండాలు కొలువైన భండాగారం. అద్భుతమైన ప్రదర్శన సామర్థ్యంగల ప్రధాన సంగీత కచేరీ వేదికలలో హేదర్ అలీయేవ్ ప్యాలెస్ (Heydar Aliyev Palace) ఒకటి.

బాకు-నగర ప్రముఖులు

[మార్చు]

బాకు నగరం శాస్త్ర, కళా, క్రీడలు తదితర రంగాలలో అనేక ప్రముఖ వ్యక్తులను ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రముఖ శాస్త్రవేత్తలైన సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ అధిపతి అయిన కెరిమ్ కెరిమోవ్ (Kerim Kerimov), 1962 లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి విజేత లెవ్ లాండౌ (Lev Landau), గణితంలో ఫజ్జి లాజిక్ (fuzzy logic) ఆవిష్కర్త లోట్ఫీ జాడే (Lotfi Zadeh), తత్వవేత్త మాక్స్ బ్లాక్ (Max Black), సంగీత విద్వాoసుడు, సెలిస్ట్ అయిన మిస్టిస్లావ్ రోస్ట్రోపోవిచ్ (Mstislav Rostropovich), ప్రపంచ ఛాంపియన్, చెస్ గ్రాండ్‌మాస్టర్ గ్యారీ కాస్పరోవ్ (Garri Kasparov) మొదలైన విశిష్ట వ్యక్తులు జన్మతః ఈ నగరానికి చెందినవారే.

దృశ్యమాలికలు

[మార్చు]

రిఫరెన్సులు

[మార్చు]
 • New World Encyclopedia.(2022)."Baku".

మూలాలు

[మార్చు]
 1. Samadov (www.anarsamadov.net), Anar. "Population". The State Statistical Committee of the Republic of Azerbaijan. Archived from the original on 27 August 2018. Retrieved 25 March 2020.
 2. "Administrative, density and territorial units and land size by economic regions of Azerbaijan Republic for January 1. 2007". Archived from the original on 24 November 2007. Retrieved 17 July 2009.
 3. Demographia: World Urban Areas Archived 5 ఆగస్టు 2011 at the Wayback Machine – Demographia, 2016
 4. "Population of Azerbaijan". stat.gov.az. State Statistics Committee. Archived from the original on 30 June 2020. Retrieved 22 February 2021.
 5. Thomas de Waal (2010). The Caucasus: An Introduction. Oxford University Press. p. 16. ISBN 978-0-19-975043-6.
 6. "Sub-national HDI – Area Database – Global Data Lab". hdi.globaldatalab.org (in ఇంగ్లీష్). Archived from the original on 23 September 2018. Retrieved 2018-09-13.
 7. New World Encyclopedia,
 8. Город Баку... Archived 19 మార్చి 2014 at the Wayback Machine Retrieved on 24 June 2006
 9. Ancient Observatory of Absheron. Gobustan, No 3 (1973)
 10. "Azerbaijan – Walled City of Baku with the Shirvanshah's Palace..." Archived from the original on 2 January 2008. Retrieved 14 October 2007.
 11. "Ичери Шехер": быть или не быть Retrieved on 25 June 2006 Archived 20 జూన్ 2008 at the Wayback Machine
 12. Dumper, Michael; Stanley, Bruce E (2007). Cities of the Middle East and North Africa. ABC-CLIO. ISBN 978-1-57607-919-5. Archived from the original on 28 May 2021. Retrieved 4 July 2020.
 13. Taleh Ziyadov (2012). Azerbaijan as a Regional Hub in Central Eurasia: Strategic Assessment of Euro-Asian Trade and Transportation. Taleh Ziyadov. pp. 94–. ISBN 978-9952-34-801-9. Archived from the original on 28 May 2021. Retrieved 16 August 2018.
 14. Shukiurov Kerim. "The Caucasus in the System of International Relations: The Turkmanchay Treaty was Signed 180 Years Ago". Cyberleninka. Archived from the original on 29 June 2015. Retrieved 30 June 2015.
 15. Mikaberidze, Alexander (2011). "Treaty of Ganja (1735)". In Mikaberidze, Alexander (ed.). Conflict and Conquest in the Islamic World: A Historical Encyclopedia. ABC-CLIO. p. 329. ISBN 978-1-59884-336-1.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
 16. "Money from oil changes the face of Azerbaijan". news.az. Archived from the original on 26 July 2011. Retrieved 22 July 2011.
 17. Aghazade, Emil (4 July 2005). "Азербайджан: сто лет надежд". BBC News. Archived from the original on 6 April 2012. Retrieved 12 May 2011.
 18. Troubled Waters: The Geopolitics of the Caspian Region. I.B. Tauris. 2003. p. 16. ISBN 978-0-85771-755-9. {{cite book}}: Cite uses deprecated parameter |authors= (help)
 19. New World Encyclopedia,
 20. "World Weather Information Service". Archived from the original on 18 March 2010. Retrieved 22 March 2010.
 21. "Climatological Information for Baku, Azerbaijan" Archived 19 జనవరి 2012 at the Wayback Machine – Hong Kong Observatory
 22. "Baku, Azerbaijan". Meoweather. Archived from the original on 16 August 2012. Retrieved 25 February 2013.