Jump to content

బూదాటి వెంకటేశ్వర్లు

వికీపీడియా నుండి
బూదాటి వెంకటేశ్వర్లు
జననంబూదాటి వెంకటేశ్వర్లు
(1964-08-08) 1964 ఆగస్టు 8 (వయసు: 61)
రాజాపేట గుంటూరుజిల్లా, ఆంధ్రప్రదేశ్
నివాస ప్రాంతంవారణాసి భారత దేశముIndia
వృత్తితెలుగు ఆచార్యులు
ఉద్యోగంబెనారస్ హిందూ విశ్వవిద్యాలయం
ప్రసిద్ధిఅధ్యాపకులుగా
మతంహిందూ
తండ్రిబూదాటి సుబ్రహ్మణ్యo
తల్లిబూదాటి అప్పమ్మ
వెబ్‌సైటు
http://profbudati.blogspot.in//

బూదాటి వెంకటేశ్వర్లు అధ్యాపకుడు, సాహిత్య విమర్శకుడు, భాషావ్యాకరణశాస్త్ర పండితుడు, కవి.[1] ఆయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులుగా పనిచేస్తున్నాడు.[2]

జీవిత విశేషాలు

బూదాటి వెంకటేశ్వర్లు గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం రాజాపేటలో బూదాటి సుబ్రహ్మణ్యం బూదాటి అప్పమ్మ దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్య రాజాపేటలో, హైస్కూల్ విద్య పురుషోత్తమ పట్టణంలో, కళాశాల విద్య గణపవరంలో చదువుకున్నాడు. ఎం.ఏ నాగార్జున విశ్వవిద్యాలయంలో చదివాడు. ఎం.ఏ లో రెండు బంగారు పతకాల్ని పొందాడు. నాగార్జున విశ్వవిద్యాలయం లోని తెలుగు శాఖలో మొట్ట మొదటగా యు.జి.సి వారు నిర్వహించే నెట్ పరిక్ష ఉత్తీర్ణుడై ఫెలోషిప్ (జెఆర్.ఎఫ్) పొందాడు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్తులో హరివంశము-ఎఱ్ఱన, సోమనల తులనాత్మక పరిశీలన అనే అంశంపై పరిశోధన చేసి, డాక్టరేట్ పొందాడు. ప్రతిష్టాత్మకమైన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి 2023లో డిలీట్ పొందాడు.

ఉద్యోగ జీవితం

బూదాటి వెంకటేశ్వర్లు మొదటగా ఒంగోలులోని SSN రెసిడెన్షియల్ కళాశాలలో తెలుగు సంస్కృత అధ్యాపకునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. ఆ తరువాత నరసరావుపేటలోని శ్రీమతి కాసు రాఘవమ్మ బ్రహ్మానంద రెడ్డి కళాశాలలో పనిచేసాడు. ఈటివి కొత్తగా ప్రారంభమైన కాలంలో స్టోరీ డిపార్టుమెంటులో రెండు సంవత్సరాలు పనిచేశాడు. 1998లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమీషన్ నిర్వహించిన పోటీ పరీక్షలో ఉత్తీర్ణుడై ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా ఎంపికయ్యారు. సత్తుపల్లి జలగం వెంగళ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోను, ఖమ్మం SR & GNR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనూ 2006 వరకు పనిచేశాడు. కుప్పం లోని ద్రావిడ విశ్వ విద్యాలయంలో 2006 నుంచి సహ ఆచార్యుడుగా, ఆచార్యుడుగా, తెలుగు శాఖ అధ్యక్షుడుగా పనిచేసాడు. 2016 నుంచి దేశంలోనే ప్రసిద్ధి చెందిన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేస్తున్నాడు. 2018 లో ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంవారి ఆహ్వానం మేరకు డిప్యుటేషన్ పై వెళ్ళి ఒక విద్యా సంవత్సరం పనిచేశాడు. 2022 జనవరి నుండి నుండి శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

హత్యా నేరం

బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో ఆచార్యుడిగా పనిచేస్తూ బూదాటి వెంకటేశ్వర్లు, ఆ విభాగాధిపతి యైన సి.ఎస్. రామచంద్ర మూర్తిపై హత్యాప్రయత్నం చేయించాడని వారణాసి పోలీసులు తేల్చారు.[3] రామచంద్రమూర్తిని తప్పిస్తే ఆ పదవిని తాను పొందవచ్చనే ఆలోచనతో అతను ఈ ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.[4]

రచనలు

  1. కరదీపిక 1988
  2. మువ్వల సవ్వడి 1992
  3. సౌదామినీలు 1999
  4. ఆనందశాఖి 2006
  5. తెలుగు బోధన సమస్యలు - పరిష్కారాలు 2006
  6. ఆధునిక భాషాబోధన సందర్భం - చిన్నయసూరి 2009
  7. విజయ విలాసము 2010
  8. సర్పయాగము 2010
  9. కరదీపిక (అలంకారాలు) 2011
  10. నీతి సీసశతకవ్యాఖ్య (తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు) 2011
  11. తెలుగు ప్రశ్నోత్తర కౌముది 2011
  12. భారతీయ గ్రంథ ప్రరిష్కరణ పద్ధతులు 2012 (S.M.కత్రే పుస్తకానికి అనువాదం )
  13. తెలుగు సాహిత్య సౌందర్య మీమాంస 2012
  14. తెలుగు సాహిత్య ప్రక్రియలు - ధోరణులు 2012
  15. ఎర్రన్న కవితాతత్త్వము 2012
  16. లోనారసి (వ్యాస సంకలనం) 2013
  17. చిన్నప్ప రెడ్డి కథ (వీరగాధ పరిశోధన) 2013
  18. అలంకార చంద్రిక 2013
  19. సంప్రదాయ తెలుగు వ్యాకరణాలు 2014
  20. ఆనంద కందళి (సాహిత్య వ్యాస సంకలనం) 2016
  21. భాగవతం (చతుర్థ స్కంధవ్యాఖ్య) 2016
  22. సువర్ణ సౌరభం (వ్యాస సంకలనం) – 2017
  23. చామీకరం (వ్యాస సంకలనం) – 2019
  24. గాంధీ శతక౦ (మంగిపూడి) - వ్యాఖ్యానం – 2019
  25. క్రీస్తు చరిత్ర (గుర్రం జాషువ) - వ్యాఖ్యానం (గుర్రం జాషువా) – 2022
  26. నిరుద్ధ భారతం (మంగిపూడి) - వ్యాఖ్యానం - 2022
  27. అంతరాలోకనం (సాహిత్య వ్యాసాలు) - 2023[5]
  28. మనుచరిత్రము (అల్లసాని పెద్దన) – వ్యాఖ్యానం -2024
  29. సాహిత్యంలో పాత్ర సృజన పద్దతులు 2024

పురస్కారాలు

  • 2024లో సాహిత్య విమర్శ విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం - కీర్తి పురస్కారం (2022)[6]
  • 2023లో ఆంధ్రప్రదేశ ప్రభుత్వంవారి గిడుగు భాషా పురస్కారం
  • 2023లో 'సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ, వరంగల్' ద్వారా 'సహృదయ సాహిత్య పురస్కారం'
  • 2022లో మాడభూషి సాహిత్య కళాపరిషత్ వారి సాహిత్య పురస్కారం
  • 2020లో 'నాగభైరవ కళాపీఠం, ఒంగోలు' వారిచే 'నాగభైరవ అవార్డు'
  • 2014లో 'తెలుగు శాఖ, మద్రాసు విశ్వవిద్యాలయం' ద్వారా 'లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు'

మూలాలు

  1. "'Telugu Panduga' at Dravidian varsity".
  2. "Faculty - Banaras Hindu University, Varanasi, India". bhu.ac.in. Retrieved 2025-08-16.
  3. "బీహెచ్‌యూ తెలుగు విభాగాధిపతి హత్యాయత్నంలో ప్రధాన కుట్రదారు తెలుగు ఆచార్యుడే". ఈనాడు. Archived from the original on 2025-08-16. Retrieved 2025-08-16.
  4. "బెనారస్ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యుడిపై హత్యాయత్నం". ఆంధ్రజ్యోతి. 2025-08-14. Archived from the original on 2025-08-16. Retrieved 2025-08-16.
  5. ABN (2023-01-25). "Budati Venkateswarlu: ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు రచించిన 'అంతరాలోకనం' ఆవిష్కరణ". Andhrajyothy Telugu News. Retrieved 2025-08-16.
  6. "తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రదానం". EENADU. 2024-03-21. Archived from the original on 2024-03-20. Retrieved 2024-03-21.

బాహ్య లింకులు