Jump to content

బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు

వికీపీడియా నుండి
(బెల్లంకొండ రామరాయశాస్త్రి నుండి దారిమార్పు చెందింది)
బెల్లంకొండ సుబ్బారావు
బెల్లంకొండ రామరాయ కవీంద్రులు
జననంబెల్లంకొండ రామారావు
1875, డిసెంబరు 28
గుంటూరు జిల్లా పమిడిపాడు
మరణం1914, అక్టోబరు 27
ప్రసిద్ధిప్రఖ్యాత కవి

బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు, ప్రముఖ పండితులు, కవి శిఖామణి. ఇతడు గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలం లోని పమిడిపాడు గ్రామంలో యువ నామ సంవత్సరం మార్గశిర అమావాస్య నాడు (డిసెంబరు 28, 1875) జన్మించారు. వీరి 39 సంవత్సరాల జీవితంలో సుమారు 148 గ్రంథాలను రచించారు. వానిలో అష్టకములు, స్తుతులు, అష్టోత్తర శతనామ స్తోత్రాలు, సహస్రనామ స్తోత్రాలు, గద్య స్తోత్రాలు, దండకాలు, శతకాలు, కావ్యాలు, వ్యాఖ్యాన, వ్యాకరణ, వేదాంత గ్రంథాలు మొదలైన అనేక వాజ్మయ ప్రక్రియలు చోటుచేసుకున్నాయి.

జీవిత విశేషాలు

[మార్చు]

వీరి తండ్రి మోహన్ రావు, తల్లి హనుమాంబ. వీరిది నియోగి బ్రాహ్మణ కుటుంబం. వీరి పూర్వులు దొండపాడు, గుంటగర్లపాడు అను రెండు అగ్రహారములకేకాక 84 గ్రామములకు ఆధిపత్యము కలిగియుండిరి. వీరందరును దాతలు, శ్రోత్రియులు, నిత్యాన్నదాతలు, విద్యాదాతలు. ఈ వంశములో స్త్రీలు సంస్కృత పాండిత్యము కలిగియుండిరి.శ్రీ రామరాయకవికి ఐదవ సంవత్సరము వచ్చునాటికే తండ్రి దివంగతుడు అయినారు. వీరి పినతండ్రి కేశవరావుగారు శ్రీరామరావు కుపనయనము గావించి కొంత ప్రాధమిక విద్యనేర్పించి తరువాత ఆంగ్ల విద్యాభ్యాసము కొరకు గుంటూరులో ఒక ఉన్నత పాఠశాలలో ప్రవేశపెట్టెను.సంస్కృత సాహిత్యమునకు అద్వైత సాహిత్యమునకు అపారమైన సేవ చేయవలసి యుండిన శ్రీ రామరావుకు ఆంగ్లవిద్య వలదని తలచెను కాబోలు ఆయనకు నిత్యము శరీరావస్థత కలుగుచుండెను.విసిగిపోయిన కేశవరావు శ్రీ రామరావును పమిడిపాడులో బెల్లంకొండ సీతారామయ్యగారి వద్ద సంస్కృత విద్యనభ్యసించుటకు ప్రవేశపెట్టెను.అందరికి ఆశ్చర్యపరుచునట్లు సంస్కృత విద్యాభ్యాసముతో శ్రీ రామరావుకు స్వస్థత చేకూరెను.బాల్యము నుండి శ్రీ రామరావు అసమాన ప్రజ్ఞాశాలి. తమ పురోహితులవద్ద కొంత వైదిక విద్యను నేర్చుకొని ఉత్తమ విద్యాప్రాప్తికొరకు తమ ఇంటివద్దనున్న ప్రాచీన హయగ్రీవ సాలగ్రామమునకు భక్తి శ్రద్ధలతో నిత్యము అర్చించుచుండెను.ఒకనాడు హయగ్రీవుడు ఒక వృద్ధబ్రాహ్మణ రూపమున స్వప్నములో శ్రీ రామరావుకు సాక్షాత్కరించి హయగ్రీవమంత్ర ముపదేసించి ఆ మంత్రమునకు అవసరమగు కవచము, మాల, పంజరము, యంత్రము మొదలగువాటిని సమీపమునున్న దమ్మాలపాడు గ్రామములో వైభానస రత్నమాచార్యులవద్ద లభించునని చెప్పి అంతర్ధానమాయెనట.శ్రీ రామరావు గారు దమ్మాలపాటికేగి రత్నమాచార్యుల నుండి హయగ్రీవ మంత్రాంగములగు కవచ, పంజరాదులను సంపాదించుకొని శాస్త్ర విధి అనుసరించి అక్సరలక్షలు జపించి మంత్రమునకు పునశ్చహ్రణము గావించుకొనిరి.తత్ఫలితముగా వారికసాధారణ మేధ, ధారణశక్తి, కవిత్వము లభించెను.తనయొందు పొగి పొరలు భక్తి భవమునకు కవిత్వము తోడుగా రమావల్లభరాయ స్తోత్రము, రమావల్లభరాయ శతకము మొదలగు స్తోత్రములను తమ 16వ యేట రచించిరి. తమ పదునారువ సంవత్సరమునకే "రుక్మిణీపరిణయ చంపూ" "రమాపరిణయ చంపూ" కందర్పదర్ప విలాస భాణము" మొదలగు కావ్యములను రచించిరి. అటుపై తన 19వ సం.న నెల్లూరు వాస్తవ్యులు సింగరాజు వేంకటరమణయ్యగారి ద్వితీయ పుత్రిక ఆదిలక్ష్మమ్మతో వివాహము జరిగెను.వీరికి సంతానము కలుగలేదు.చాలామంది విద్యార్ధులకు అన్నము పెట్టి చదువు చెప్పించి విద్యాసేవ చేసిరి.

గోదావరి మండలము నుండి పురిఘల్లు రామశాస్త్రి, సుబ్రహ్మణ్యశాస్త్రి అను సోదరులు గద్వాల సంస్థానమునకు వెళ్ళుచు పమిడిపాటు చేరి శ్రీరామారావు గారి కోరికపై వ్యాకరణ తర్కశాస్త్రములను బోధించిరి.గురు దక్షిణగా చంపూ భాగవతమునకు "మంధర" అను వ్యాఖ్యను వ్రాసి ఇచ్చిరి.భయంకర రంగాచార్యుల అను శ్రీవైష్ణవ గురువులు తో విభేధము వలన ఆయన వైష్ణవ సంప్రదాయమును తిరస్కరించి స్మార్త బ్రాహ్మణ సాంప్రదాయమును అనిసరించి విభూతి, రుద్రాక్షలు ధరించుచు అప్పటినుంచి విశిష్టాద్వైతమును విభేదించుచు శంకర అద్వైతమును పోషించిచు అనేక విధమైన గ్రంధములను రచించిరి. తమ శిష్యుడగు రాళ్ళభండి నరశింహశాస్త్రి కోరికపై శ్రీ శంకరరామానుజాచార్యుల గీతభాష్యములను రెంటిని చదివి శ్రీరామానుజ గీతాభాష్యము శృతి, స్మృతి ప్రమాణ విరుద్ధమని నిరూపించుచు మూడు మాసములు పాఠప్రవచనము గావించిరి. ఇదే "భగవద్గీతాభాష్యార్క ప్రకాశిక" అను గ్రంధముగా వెలయించిరి.

నిరంతర గ్రంధ రచనానిరతులు, బ్రహ్మచింతా నిమగ్నుడునగు శ్రీరామారావు బాల్యమునందుండి అజీర్ణవ్యాధితో బాధపడుచుండిరి. దానికితోడు మధుమేహ వ్యాధి మరింత పీడించసాగెను. తమ కిష్టములేకున్నను బంధు మిత్ర, శిష్యగణ నిర్బంధముచే చికిత్స కొరకు మద్రాసులోని సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులగు పండిత డి.గోపాలాచార్యుల వారి కడగేగిరి. కొంతకాలము మానసిక పరిశ్రమకు తావిచ్చు గ్రంధ రచనము మానుకొనినచో వ్యాధి చికిత్స చేయగలమని చెప్పగా శ్రీరామారావు గారు దానికి అంగీకరింపక చికిత్సను తిరస్కరించి స్వగ్రామమునకు మరలిరి.దినదినమునకు వ్యాధి ముదురుటచే తనకు అంత్యకాలము ఆపన్నమైనదని గ్రహించిరి.బంధు మిత్రాదులు, భార్య బలవంత పెట్టుటచే దత్తపుత్రుని స్వీకరించిరి. చివరకు మధుమేహ వ్యాధి ముదరగా ఆనంద సంవత్సర కార్తీక శుద్ధ నవమి (27-10-1914) నాడు శ్రీరామారావుగారు అస్తమించిరి.

వారి మరణానంతరము బంధువుల నిరాదారణము, శిష్యుల అజాగ్రత వలన వారి ఆముద్రిత గ్రంధములలో కొన్ని నష్టము కాగా కొన్ని అన్యాక్రాంతములయినవి. మిగిలినవి విజయవాడలోని అడ్వొకేటు శ్రీ పాటిబండ సుందరరావుగారు అధీనములోని కొంతకాలమున్నవి. శ్రీరామారావు జీవితాకాలములో కొన్ని మాత్రమే ముద్రింపబడి ప్రకటింపబడినవి.అటుపై ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యులు నరసారావుపేట వాసి అగు శ్రీ కంతా వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి పలు విరాళములు సీకరించి కొన్ని సంస్కృత లిపిలోను మరికొన్ని తెలుగులోను ముద్రించిరి.

రచనలు

[మార్చు]
  • చంపూ భాగవతం
  • శ్రీ హయగ్రీవ నవరత్న స్తుతి
  • వివర్ణాది విష్ణు సహస్రనామ స్తోత్రము
  • సిద్ధాంత సింధువు
  • భాష్యార్క ప్రకాశిక
  • శరీరక చతుస్సూత్రీ విచారము
  • వేదాంత ముక్తావళి
  • శంకరాశంకర భాష్య విమర్శనము
  • శరద్రాత్రి
  • శ్రీ రమావల్లభరాయ శతకము
  • వేదాంత కౌస్తుభం (1918)
  • రుక్మిణీ పరిణయము
  • గరుడ సందేశము
  • హయగ్రీవ శతకము
  • కందర్ప విలాసము
  • కృష్ణలీలా తరంగిణి
  • కరిభూషణమ్
  • కామ మీమాంస
  • ధన వర్ణనమ్
  • ధర్మ ప్రశంసా
  • విద్యార్ధ విద్యోత:
  • శూద్ర ధర్మ దర్పణమ్
  • అద్వైతాన్యమత ఖండనమ్
  • అద్వైతామృతమ్
  • అద్వైత విజయః
  • వేదాంత నిశ్చయః
  • శంకరా శంకర భాష్య విమర్సః
  • సిద్ధాంత సిందుః (శ్రీ మధుసూదన సరస్వతి విరచిత సిద్దాంత బిందువునకు విపుల వ్యాఖ్య)
  • భగవద్గీతా భాష్యార్క ప్రకాశిక (శ్రీ శంకరవిరచిత గీతాభాష్యమునకు విపుల వ్యాఖ్య)
  • చిత్ర ప్రభోపోద్ఘాతః
  • త్రిమత సమ్మతమ్
  • సుమనో మనోరంజనమ్
  • రామాయణాభ్యుదయ హరికథా
  • శ్రీ వీరరాఘవస్తోత్రమ్
  • శివభుజంగ ప్రయాతమ్
  • శరద్రాత్రి (వ్యాకరణ గంధము-సిద్ధాంత కౌముదీ వ్యాఖ్యానము)
  • గుంజు గర్వ భంజనం (తిరుపతి వెంకట కవులతో విమర్శనా వ్యాసములు)
  • పంచానన పలాయనమ్

మూలాలు

[మార్చు]
  • బెల్లంకొండ రామరాయకవీంద్రుడు, రావి మోహనరావు, 150 వసంతాల వావిళ్ల వాజ్మయ వైజయంతి, పేజీలు 386-89.
  • బెల్లంకొండ రామరాయకవీంద్రుడు, ఒక గుంటూరు మండల వాసి, ఆంధ్రపత్రిక ఉగాది సంచిక, 1914, పేజీలు 177-179.

బయటి లింకులు

[మార్చు]