Jump to content

బోయని పొన్నినాయుడు

వికీపీడియా నుండి

రాయలు విజయనగరములోని గుడులలో పూజలు చేసి సైన్యముతో బయలుదేరాడు. ఈ సేనకు ఐదు కిలోమీటర్ల ముందు గూఢచారులు తరలివెళ్ళారు. దారిలోని పరిస్థితులు సైన్యానికి ఎప్పటికప్పుడు తెలిచేయటం వారి పని. చారులకు రక్షణగా రెండువేలమంది రౌతులు ధనుర్బాణాలతో వెళ్ళారు. సైన్యానికి కావలిసిన వస్తువులు అమ్మటానికి వేలమంది వర్తకులు కూడా ఉన్నారు. అందరితో కలుపుకొని 7,36,000 మంది సైన్యము, 32,600 గుర్రాలు, 550 ఏనుగులు ఉన్నాయి.[1] ఆ కోలాహలము చూస్తుంటే ఒక పట్టణమే తరలివెళ్ళుతున్నదా అన్న అనుమానము వస్తుంది.

అందరికీ ముందుగా పెమ్మసాని రామలింగ నాయుడు అను ముఖ్యసేనాధిపతి ఉన్నాడు. ఇతనికి కమ్మ నాయకుడనే పేరు కూడా ఉంది. రామలింగనితోబాటు 30,000 కాల్బలము (ధనుస్సులు, ఈటెలు, బల్లెములు, కత్తులు, డాలులు, తుపాకులతో), వేయి గుర్రాలు, ఏనుగులు ఉన్నాయి. రామలింగని వెనుక తమతమ బలగాలతో బోయని పొన్నినాయుడు, బోయ నరసనాయుడు, బోయ నాయని గండనాయుడు, బోయ గుజ్జుల వీరనాయుడు, తిమ్మప్ప నాయకుడు, అడపా నాయకుడు, కుమార వీరయ్య, గండ రాయలు (విజయనగర పట్టణ రక్షకుడు) ఉన్నారు. వీరితోబాటు మహావీరులగు రాణా జగదేవు, రాచూరి రామినాయుడు, హండె మల్లరాయ, బోయ రామప్పనాయుడు, సాళువ నాయుడు, తిప్పరసు, అయ్యప్ప నాయుడు, కొటికము విశ్వనాథ నాయుడు, చెవ్వప్ప నాయుడు, అక్కప్ప నాయుడు, బోయ కృష్ణప్పనాయుడు, వెలిగోటి యాచమ నాయుడు, కన్నడ బసవప్ప నాయుడు, సాళువ మేకరాజు, మట్ల అనంత రాజు, బొమ్మిరెడ్డి నాగరెడ్డి, బసవ రెడ్డి, విఠలప్ప నాయుడు, వీరమ రాజు ఉన్నారు.

  సైనికులందరివద్ద తగు ఆయుధాలున్నాయి. డాలులు ఎంతపెద్దవంటే ఒంటిని కాపాడుకొనుటకు వేరే కవచము అవసరము లేదు. గుర్రాలకు, ఏనుగులకు రంగురంగుల గుడ్డలు తొడిగారు. ఏనుగులపైనున్న హౌడాలు ఏంతపెద్దవంటే వాటిలో నలుగురు సైనికులు చొప్పున రెండువైపుల యుద్ధము చేయవచ్చు. ఏనుగుల దంతాలకు పొడవాటి కత్తులు వేలాడదీశారు. పలు ఫిరంగులుకూడ ఉన్నాయి. ఇరవైవేలమంది చాకలివారు, వేశ్యలుకూడ తరలివెళ్ళారు. రాయలుకు దగ్గరలో ముందువైపున, నీరునింపిన తోలుతిత్తులతో పన్నెండు వేలమంది సేవకులు సైనికులకు నీరందించుటకు ఉన్నారు. ఈవిధముగా రాయలు మల్లయ్యబండ (ప్రస్తుత మలియాబాదు) అను ఊరు చేరి గుడారము వేసాడు. ఇది రాయచూరికి 5 కి.మీ. దూరములో ఉంది. రాజుగారి గుడారము చుట్టూ ముళ్ళతోకూడిన కంప వేసిరి. సైన్యము విశ్రాంతి తీసుకొనుటకు ఆదేశములిచ్చారు

తదుపరి, సైన్యం రాయచూరి కోట దగ్గరకు చేరింది. కోట తూర్పువైపున గుడారాలు వేసి ముట్టడి మొదలుపెట్టారు. కొంతసేపటికి 1,40,000 సైన్యముతో (రౌతులు, కాల్బలము) ఆదిల్ షా కృష్ణా నది ఉత్తరపు ఒడ్డుకి వచ్చాడని రాయలుకు వార్త అందింది. కొద్దిరోజుల విరామం తర్వాత షా, నదిని దాటి రాయచూరి కోటకు తొమ్మిది మైళ్ళ దూరములో గుడారము వేశాడు. ఇది నదికి ఇదు మైళ్ళ దూరము.

పోర్చుగీసు చరిత్రకారుడు న్యూనెజ్ రాయలు శిబిరాన్ని ఇలా వర్ణించాడు.

"యుద్ధశిబిరములో ఏవస్తువుకూ కొదవలేదు. ఏదికావాలన్నా దొరుకుతుంది. కళాకారులు, స్వర్ణకారులు నగరములోనున్నంత హడావిడిగా ఉన్నారు. అన్నిరకముల రత్నాలు, వజ్రములు, ఆభరణాలు వగైరా అమ్మకానికి ఉన్నాయి. తెలియనివారు అచట యుద్ధము జరగబోతున్నదని ఊహించలేరు. సంపదతో అలరారుతున్న పెద్ద నగరములో ఉన్నారని అనుకుంటారు".
  1. GOPAL, M. H. (1956). THE HISTORY OF VIJAYANAGAR EMPIRE VOL.1. POPULAR PRAKASHAN,BOMBAY. p. 136.