Jump to content

భావరాజు వేంకట కృష్ణారావు

వికీపీడియా నుండి
(భావరాజు వెంకటకృష్ణారావు నుండి దారిమార్పు చెందింది)
భావరాజు వేంకట కృష్ణారావు
భావరాజు వెంకట కృష్ణారావు
జననం1895
రాజమండ్రి
మరణం1957
రాజమండ్రి
నివాస ప్రాంతంప్రధానంగా రాజమండ్రి కొద్దికాలం మద్రాసు, హైదరాబాదు
వృత్తిన్యాయవాది, దేవాదాయ కమీషనర్ (ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో), దేవాదాయ శాఖ ప్రత్యేకాధికారి (హైదారాబాదు రాజ్యంలో)
మతంహిందూ
తండ్రిభావరాజు బాపిరాజు పంతులు
తల్లిభావరాజు శ్యామలాంబ

భావరాజు వేంకట కృష్ణారావు ప్రఖ్యాత చరిత్రకారుడు, శాసన పరిశోధకుడు, రచయిత, న్యాయవాది. వెంకటకృష్ణారావు ఆంధ్రదేశీయేతిహాస పరిశోధక మండలికి వ్యవస్థాపక కార్యదర్శి. ఈ సంఘం వెలువరించిన పత్రికకు అనేక సంవత్సరాల పాటు సంపాదకత్వం వహించాడు. తూర్పు చాళుక్య చక్రవర్తి అయిన రాజరాజ నరేంద్రుని పట్టాభిషేకపు 900వ సంవత్సరీకపు ఉత్సవాలను నిర్వహించాడు. ఈ సందర్భంగా వెలువడించిన రాజరాజ నరేంద్రుని పట్టాభిషేక సంచికకు సంపాదకత్వం వహించాడు.[1]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

భావరాజు వేంకట కృష్ణారావు 1895లో రాజమహేంద్రవరం (రాజమండ్రి) లో జన్మించాడు. ఆయన తల్లి శ్యామలాంబ, తండ్రి బాపిరాజు పంతులు. భావరాజు బాపిరాజు పంతులు గ్రంథకర్తగా ప్రఖ్యాతి వహించాడు. ఆయన చిత్తబోధామృతమ్ అనే గ్రంథాన్ని రచించాడు. కృష్ణారావు ప్రాథమిక విద్యను కైకలూరులోను, ప్రాథమికోన్నత విద్యను బందరు నోబుల్ కాలేజీ హైస్కూలులోనూ అభ్యసించాడు. 1912లో సెకండరీ స్కూలు లీవింగ్ సర్టిఫికేట్ (ఎస్.ఎస్.ఎల్.సి.) పరీక్షలో ఉత్తీర్ణులయ్యాడు. పదిహేనేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు.

విశాఖపట్టణంలోని ఎ.వి.ఎన్. కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి, మద్రాసు (నేటి చెన్నై) లో బాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బి.ఎ.), బాచిలర్ ఆఫ్ లా (బి.ఎల్.) పట్టాలు పొందాడు. బి.ఎల్. డిగ్రీలో మద్రాసు విశ్వవిద్యాలయం మొత్తానికి రెండవ స్థానంలో నిలిచాడు. ఎర్లీ డైనాస్టీస్ ఆఫ్ ఆంధ్రా కంట్రీ అనే గ్రంథాన్ని రచించి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సమర్పించగా, విశ్వవిద్యాలయం ఎం.ఎ. పట్టా ప్రదానం చేసింది.[2]

వృత్తి

[మార్చు]

1920 నుంచి 1943 వరకు కృష్ణారావు రాజమహేంద్రవరంలో న్యాయవాదిగా పనిచేశాడు. 1943లో ఆయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో దేవాదాయ శాఖ కమీషనర్ ఉద్యోగం చేపట్టి 1948 వరకు ఆ పదవిలో పనిచేశాడు. 1948 నుంచి కొంతకాలం పాటు హైదరాబాదు రాజ్యంలో దేవాదాయ శాఖలో ప్రత్యేక అధికారిగా ఉద్యోగం చేశాడు. తరువాత రాజమహేంద్రవరం తిరిగివచ్చి న్యాయవాద వృత్తి చేస్తూనే 1957లో మరణించాడు.

చరిత్ర పరిశోధన

[మార్చు]

శాసన పరిశోధన, చరిత్రరచన వంటి విభాగాలపై ప్రత్యేక ఆసక్తి కలిగిన కృష్ణారావు, 1922లో రాజమహేంద్రవరంలో ఇతర ప్రముఖ చరిత్రకారులు చిలుకూరి వీరభద్రరావు, డా.చిలుకూరి నారాయణరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మలతో కలిసి ఆంధ్రదేశీయేతిహాస పరిశోధక మండలిని స్థాపించాడు. ఈ మండలి నిర్వహించిన త్రైమాసిక పత్రిక జర్నల్ ఆఫ్ ది ఆంధ్ర హిస్టారికల్ రీసెర్చి సొసైటీలో అనేకమంది చరిత్ర పరిశోధకులు, సాహితేవేత్తలు, భాషాశాస్త్రజ్ఞులు, లలిత కళాకోవిదులు వివిధ చారిత్రికాంశాలపై వ్యాసాలు రాశారు. శాసనములు, రాజుల చరిత్రలు, ప్రసిద్ధ చారిత్రిక స్థలాలు, పురావస్తు శాస్త్రం, దేవాలయ వాస్తు, నాణేలు, తెలుగు సాహిత్యం తదితర అంశాలకు సంబంధించిన ఎన్నో పరిశోధన వ్యాసాలు ఈ పత్రికలో ప్రకటించారు. ఈ పత్రికకు కొంతకాలం పాటు వేంకట కృష్ణారావు సంపాదకత్వం వహించాడు. ఈ పత్రికలో భావరాజు సంపాదకత్వంలో రాజరాజ నరేంద్ర పట్టాభిషేక సంచిక వెలువడింది. పరిశోధకమండలి ప్రథమ కార్యదర్శిగా కృష్ణారావు పనిచేశాడు. ఆయన అధ్వర్యంలో పరిశోధకమండలి వారు రాజరాజనరేంద్రుని నవమ శతవార్షికోత్సవ పట్టాభిషేక మహోత్సవాన్ని రాజమహేంద్రవరంలో వైభవంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే మండలి పత్రికలో ఆయన సంపాదకత్వంలో పట్టాభిషేక ప్రత్యేక సంచిక వెలువడింది.[3]

1938లో న్యాయవాదిగా పనిచేస్తుండగానే ఆంగ్లంలో ఈయన పేరొందిన చారిత్రక రచన "హిస్టరీ ఆఫ్ ఎర్లీ డైనాస్టీ‌స్ ఆఫ్ ఆంధ్రదేశ 200-625 ఏ.డి."ని ప్రచురించాడు. ఈ గ్రంథంలో శాతవాహనుల పతనం నుండి తూర్పు చాళుక్యులు రాజ్యానికి వచ్చేవరకు ఆంధ్రదేశాన్ని ఏలిన ఆనేక చిన్న చిన్న రాజవంశాల గురించి క్షుణ్ణంగా చర్చించాడు. దీనికి తరువాయి భాగంగా "హిస్టరీ ఆఫ్ ఈస్ట్రన్ చాళుక్యాస్ ఆఫ్ వేంగీ (ఏ.డి. 610-1210)" వ్రాశాడు. దీన్ని ఈయన మరణానంతరం 1957లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ ప్రచురించింది. ఆంధ్రచరిత్రలో ఒక కీలకమైన శకంపై ఇది ప్రధానమైన రచన. ఆంధ్రచరిత్రలో అనేక విషయాలపై వెంకటకృష్ణారావు తెలుగులో ఏకాంకికలు వ్రాశాడు. అందులో రాజరాజ నరేంద్రుడు, ప్రాచీన ఆంధ్ర నౌకా జీవనం, ఆంధ్రదేశము - విదేశీ యాత్రికులు ముఖ్యమైనవి.

ఈయన చరిత్రకారుడే కాక కథా రచయిత కూడా. చారిత్రక కథా వస్తువులతో ఈయన వ్రాసిన కథలు భారతి, ప్రబుద్ధాంధ్ర వంటి తెలుగు పత్రికలలో ప్రచురించబడినవి. కృష్ణారావు గొప్ప చారిత్రిక పరిశోధకుడు. రాజరాజనరేంద్రుడు గూర్చి, ప్రాచీనాంధ్రుల నౌకాయానం విషయమై, ఆంధ్రదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుల గురించి, సా.శ.200-625 మధ్య కాలంలో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజవంశాల గురించి ఆయన ప్రామాణికమైన పరిశోధనలు చేశాడు. ఆయన మరణించే ముందు కూడా తూర్పు చాళుక్య రాజులపై పరిశోధన చేశాడు. ఆయన చారిత్రిక పరిశోధన ప్రాముఖ్యత గురించి వ్యాఖ్యానిస్తూ డా.వి.వి.కృష్ణశాస్త్రి, "ఆంధ్రదేశ చరిత్ర వ్రాయబూనిన ప్రతివారు మూలస్తంభాల వంటి భావరాజువారి గ్రంథాలను పఠించకపోతే ఆ రచనలు అసంపూర్ణంగానే పరిగణింపబడతాయి" అని అన్నాడు. [4]

రచనా రంగం

[మార్చు]

రచయితగా భావరాజు వేంకట కృష్ణారావు పలు చరిత్ర గ్రంథాలు, నాటకాలు రచించారు. వాటిలో ప్రముఖమైనవి:

  1. ప్రాచీనాంధ్ర నౌకాజీవనము
  2. రాజరాజ నరేంద్రుడు
  3. ఆంధ్రదేశము విదేశ యాత్రికులు[5]
  4. ఎర్లీ డైనస్టీస్ ఆఫ్ ఆంధ్రా కంట్రీ (ఎ.డి.200-625)
  5. అప్పాజీ (నాటకం)
  6. శ్రీనాథుని యింట విందు (నాటకం)
  7. హిస్టరీ ఆఫ్ ది ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వేంగీ (ఎ.డి.610-1210)

ఆయన నూరుకు పైగా వ్యాసాలు రాశాడు. భారతి, ప్రబుద్ధాంధ్ర, ఆంధ్రపత్రిక ఉగాది సంచిక, జయంతి, శారద, కిన్నెర, తదితర తెలుగు పత్రికల్లోనూ; చరిత్ర, శాసనాలకు సంబంధించిన ఎపిగ్రాఫియా ఇండికా, జర్నల్ ఆఫ్ ది ఆంధ్రా హిస్టారికల్ రీసెర్చ్ సొసైటీ, జర్నల్ ఆఫ్ ది బీహార్ అండ్ ఒడిషా రీసెర్చ్ సొసైటీ వంటి ఆంగ్లపత్రికల్లోనూ భావరాజు వేంకట కృష్ణారావు రాసిన పలు వ్యాసాలు ప్రకటించారు. ఆయా వ్యాసాల్లో చరిత్ర, శాసనాలు, కథలు, నాటకాలు, మతం, దేవాలయాలు, ప్రముఖుల జీవితాలు, ఆంధ్రోద్యమం, ప్రాచీన నగరాలు, పురావస్తు పరిశోధన వంటి అంశాల గురించి లోతైన విషయాలు ప్రస్తావించాడు.

ఇతర రంగాలు

[మార్చు]

కృష్ణారావు మంచి వక్త. ఆయన చారిత్రికాంశాలపై ఆంగ్లంలోనూ, తెలుగులోనూ అనర్గళంగా ఉపన్యసించి సభాసదులను ఆకట్టుకునేవాడు. ఆయన నాటక, సంగీత, చిత్రలేఖనాల పట్ల ఆసక్తితో ఆయా కళాకారులను ప్రోత్సహించేవారు. ఎం.ఎ. విద్యార్థులకు పరీక్షాధికారిగా వ్యవహరించేవాడు.

మూలాలు

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
  1. Encyclopaedia of Indian Literature: sasay to zorgot edited by Mohan Lal
  2. ప్రాచీనాంధ్ర నౌకాజీవనము 2003 ముద్రణలో రాపాక ఏకాంబరాచార్యులు సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకులు శ్రీ భావరాజు వేంకట కృష్ణారావుశీర్షికన రాసిన వ్యాసం
  3. ప్రాచీనాంధ్ర నౌకాజీవనము(2003 ముద్రణ)లో రాపాక ఏకాంబరాచార్యులు రాసిన ఆంధ్రదేశీయేతిహాస పరిశోధక మండలి వ్యాసం
  4. ప్రాచీనాంధ్ర నౌకాజీవనము(2003 ముద్రణ)కు డా.వి.వి.కృష్ణశాస్త్రి రాసిన ముందుమాట
  5. వేంకట కృష్ణారావు, భావరాజు (1926). ఆంధ్రదేశము విదేశ యాత్రికులు. భావరాజు వేంకటకృష్ణారావు. Retrieved 2020-07-13.