రాపాక ఏకాంబరాచార్యులు
రాపాక ఏకాంబరాచార్యులు | |
---|---|
జననం | తూర్పుగోదావరి జిల్లా, కాజులూరు మండలం, పల్లిపాలెం గ్రామం | 1940 సెప్టెంబరు 9
మరణం | 2020 ఆగస్టు 16 హైదరాబాదు | (వయసు 79)
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రచయిత, విశ్రాంత ప్రభుత్వోద్యోగి |
ప్రసిద్ధి | సాహితీ సుత్రామ |
భార్య / భర్త | రుక్మిణి |
పిల్లలు | వెంకటరామగోపాల్, రఘురాం, సత్యనారాయణమూర్తి, కనకమ్మ |
తండ్రి | రామస్వామి |
తల్లి | గున్నమ్మ |
రాపాక ఏకాంబరాచార్యులు[1] 37 సంవత్సరాలు ఉద్యోగం చేసి పదవీ విరమణ తరువాత రచనావ్యాసంగం చేపట్టాడు.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]రాపాక ఏకాంబరాచార్యులు తూర్పుగోదావరిజిల్లా, కాజులూరు మండలం, పల్లిపాలెం గ్రామంలో 1940, సెప్టెంబరు 9వ తేదీన విశ్వబ్రాహ్మణ కుటుంబంలో గున్నమ్మ, రామస్వామి దంపతులకు జన్మించాడు. ఇతడు ప్రాథమిక విద్య పల్లిపాలెంలో అభ్యసించి కోలంక గ్రామంలోని దంతులూరి వెంకటరాయపరాజు హైస్కూలులో చేరాడు. 1956లో ఎస్.ఎస్.ఎల్.సి పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. తరువాత పశ్చిమగోదావరిజిల్లా, నరసాపురంలో ఇంటర్మీడియెట్ నర్సాపూర్ కాలేజీ (ఇప్పటి వై.యన్.కాలేజి) లో చదివి అదే కాలేజీలో 1958-60 మధ్య బి.ఎ.చదివాడు. వాల్తేరులోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1960-62 సంవత్సరాల మధ్య పురావస్తు శాస్రం, చరిత్ర, రాజనీతి ప్రధాన అంశాలుగా స్వీకరించి ఎం.ఏ. పట్టా యూనివర్సిటీ ఫస్ట్‌గా ఉత్తీర్ణుడయ్యాడు.
ఉద్యోగం
[మార్చు]ఇతడు చదువు ముగించిన తరువాత 1962లో విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్. గవర్నమెంట్ కళాశాలలో చారిత్రోపన్యాసకుడిగా చేరి ఒక సంవత్సరం పనిచేశాడు. తరువాత కాకినాడలోని పిఠాపురం రాజా ప్రభుత్వకళాశాలలో 1963-74 మధ్య, కర్నూలు సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో 1974-76ల మధ్య, రాజమండ్రి ప్రభుత్వకళాశాలలో 1977 జూలై వరకు పనిచేశాడు. తరువాత రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి గ్రూప్ 1 పరీక్షలు పాసై సహకారశాఖలో డిప్యుటీ రిజిస్ట్రార్‌గా నియమింపబడ్డాడు. 1979 నుండి భీమవరం, కొవ్వూరు, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి, హైదరాబాదులలో వివిధ హోదాలలో పనిచేసి 1998లో జాయింట్ రిజిస్ట్రారుగా పదవీ విరమణ గావించాడు.
కుటుంబం
[మార్చు]ఇతనికి 1963, ఫిబ్రవరి 27వ తేదీన రుక్మిణితో వివాహం జరిగింది. వీరికి రాపాక వెంకటరామగోపాల్, రాపాక రఘురాం, రాపాక సత్యనారాయణమూర్తి అనే కుమారులు రాపాక కనకమ్మ అనే కుమార్తె జన్మించారు. వీరిలో రఘురాం డిగ్రీ చదువుతూ మరణించగా మిగిలిన వారు ప్రస్తుతం ప్రభుత్వోద్యోగాలు చేస్తూ జీవితంలో స్థిరపడ్డారు.
సాహితీ వ్యాసంగం
[మార్చు]ఇతనికి అవధాన సాహిత్యం పట్ల మక్కువ ఉంది. రాష్ట్రంలో జరిగిన పలు అవధానాలకు పృచ్ఛకునిగానో, అధ్యక్షునిగానో, సంధానకర్తగానో వ్యవహరించాడు. ఆంధ్రుల కళాకౌశలములు అవధానములు, అర్థశతాబ్దిలో అవధాన వికాసము, స్వాతంత్ర్యసమూపార్జనానంతరం అవధాన వికాసము మొదలైన వ్యాసాలు వ్రాశాడు. 150 మంది అవధానులను పత్రికలలో వ్యాసాలరూపంలో పరిచయం చేశాడు. కాకినాడలోని సాహిత్యలహరి అనే సంస్థకు ప్రధాన కార్యదర్శిగా, ఆంధ్ర పద్యకవితాసదస్సు జంటనగరాల శాఖకు అధ్యక్షుడిగా, డా||సి.వి.సుబ్బన్న శతావధాని కళాపీఠానికి అధ్యక్షుడిగా, హైదరాబాద్ ఆర్కియలాజికల్ సొసైటీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. అనేక గ్రంథాలకు పీఠికలు, ముందుమాటలు వ్రాశాడు. అనేక పత్రికలలో గ్రంథసమీక్షలు చేశాడు. రేడియో, దూరదర్శన్‌లలో సాహిత్య ప్రసంగాలు చేశాడు. తిరుమల బ్రహ్మోత్సవాలలో దూరదర్శన్ నుండి ప్రత్యక్ష వ్యాఖ్యానం చేశాడు. భువన విజయం, త్రైలోక్యవిజయం, ఇంద్రసభ వంటి సాహిత్యరూపకాలలో శ్రీకృష్ణదేవరాయలు, వీరభద్రారెడ్డి, ఇంద్రుడు వంటి పాత్రలను ధరించాడు. నండూరి రామకృష్ణమాచార్య రచించిన Kalidasa and His Times, తాటి జగన్నాథం రచించిన సుమిత్రశతకము, ఆశావాది ప్రకాశరావు వ్రాసిన దీవనసేసలు అనే గ్రంథాలకు కృతిభర్తగా వ్యవహరించాడు. అనేక కవిసమ్మేళనాలలో పాల్గొని తన కవితలను వినిపించాడు.
రచనలు
[మార్చు]ఇతడు ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, వార్త, ఈనాడు, సూర్య, ఆంధ్రప్రదేశ్, మూసీ వంటి దిన, వార, మాస పత్రికలలోనూ, Modern Review, New Swatantra Times, Triveni, Bhavans Journal, A.P.Times మొదలైన ఆంగ్ల పత్రికలలోనూ సుమారు 400 వ్యాసాలు ప్రకటించాడు. వీటిలో సుప్రసిద్ధ అవధానులు, పత్రికా సంపాదకులు, సుప్రసిద్ధ చరిత్రకారులు మొదలైన వ్యాసాలు ధారావాహికంగా వెలువడ్డాయి.
ఇతడు చేసిన కృషిలో ఎన్నదగినది విశ్వబ్రాహ్మణ సర్వస్వము అనే గ్రంథం. సుమారు 800 పేజీలు ఉన్న ఈ బృహద్గ్రంథంలో విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన 594 మంది ప్రముఖుల జీవిత విశేషాలను, వారు సాధించిన విజయాలను వివరించాడు. 16 శతాబ్దం నుండి నేటివరకు విశ్వబ్రాహ్మణులకు సంబంధించి ఎంతో విలువైన సమాచారం ఈ పుస్తకంలో లభిస్తుంది.
ఇతడి మరొక కృషి అవధాన సర్వస్వము. త్వరలో ప్రచురంపబడే ఈ గ్రంథంలో అవధాన విద్యకు సంబంధించిన ప్రతి సమాచారము పొందు పరిచారు. సుమారు 200 మంది అష్టావధానులు, శతావధానులు, సహస్రావధానుల గురించిన జీవిత విశేషాలు, వారి వారి అవధాన విశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
ముద్రిత గ్రంథాలు
[మార్చు]- భారతదేశ చరిత్ర - రెండవభాగము (సా.శ. 1526-1951) [ఆంధ్ర విశ్వవిద్యాలయం పాఠ్యగ్రంథం]
- కామాక్షీదేవీ వ్రతకల్పం
- గణితబ్రహ్మ - డా|| లక్కోజు సంజీవరాయశర్మ
- ప్రసంగ తరంగిణి
- సుప్రసిద్ధ చరిత్ర - శాసన పరిశోధకులు శ్రీ బి.ఎన్.శాస్త్రి
- మన ప్రముఖ పత్రికాసంపాదకులు
- హాస్యవల్లరి అప్రస్తుత ప్రసంగము
- వ్యాసకేదారము
- Eminent Editors
- కొప్పరపు సోదరకవులు ISBN 978-81-9100-813-5
- మల్లంపల్లి సోమశేఖరశర్మ ISBN 978-81-260-3043-7
- మహాకవులకు నీరాజనం
- ఆశుకవిత్వం-అవధానాలు
- విశ్వబ్రాహ్మణ సర్వస్వము - విశ్వబ్రాహ్మణ ప్రముఖులు (ప్రథమ భాగము) [2]
- అవధాన విద్యాసర్వస్వము
అముద్రిత గ్రంథాలు
[మార్చు]- సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకులు
- సుప్రసిద్ధ అవధానులు
- శ్రీ గానాల రామమూర్తి
- శతావధాని డోకూరి కోట్ల బాలబ్రహ్మాచారి జీవితం - అవధానాలు
- శ్రీ కొమ్మూరి బాలబ్రహ్మానందదాసు
- శ్రీ తిరుపతి వేంకటకవుల అవధానాలు
- పద్యకవిత్వం
- మానసికోల్లాసాన్ని ప్రసాదించే మహనీయ కళారూపాలు
- విద్వాన్ విశ్వం
- అర్థశతాబ్ది కాలంలో అవధాన వికాసం మొదలైనవి.
సంపాదకుడు
[మార్చు]- విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం హైదరాబాదు నుండి నడుపుతున్న ప్రణవ వేది మాసపత్రిక, ప్రబోధ తరంగిణి వార్షిక పత్రికలకు సంపాదకుడిగా ఉన్నాడు.
- విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం ప్రచురించిన స్వర్ణోత్సవసంచికకు సంపాదకత్వం వహించాడు.
- ఆశావాది ప్రకాశరావు సాహితీ స్వర్ణోత్సవ ప్రత్యేక సంచిక హిరణ్మయికి సంపాదకత్వం వహించాడు.
పురస్కారాలు, సత్కారాలు
[మార్చు]- పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంచే గౌరవ డి.లిట్ ప్రదానం
- చెన్నపురి తెలుగు విశ్వకర్మ సమాజము, మద్రాసు వారిచే సన్మానం
- ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వారు స్వర్ణపతక పురస్కారం - రెండు పర్యాయాలు
- గుర్రం జాషువా స్మారక పురస్కారం
- చీమకుర్తి శేషగిరిరావు స్మారక పురస్కారం
- శరన్మండలి సాహితీ పీఠం (రాజమండ్రి) పురస్కారం
- కందుకూరి రుద్రకవి సాహితీ పీఠం (తెనాలి) పురస్కారం
- దోమా వేంకటస్వామిగుప్త సాహితీ పీఠం పురస్కారం
- పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం
- వి.ఆర్.నార్ల స్మారక విశిష్ట సేవా అవార్డు
- నండూరి రామకృష్ణమాచార్య స్మారక పురస్కారం
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం
- బి.యన్.శాస్త్రి స్మారక పురస్కారం
- కవిత్రయ జయంతి పురస్కారం
- ఆంధ్రసారస్వత సమితి (మచిలీపట్నం) పురస్కారం
- పోతుల వీరభద్రరావు స్మారక పురస్కారం
- విశ్వబ్రాహ్మణ సర్వస్వం గ్రంథావిష్కరణ సందర్భంగా కనకాభిషేక, గండపెండేర, స్వర్ణకంకణ సత్కారాలు
బిరుదము
[మార్చు]- సాహితీ సుత్రామ
మూలాలు
[మార్చు]- ↑ రాపాక, వెంకటరామగోపాల్ (2012-09-01). విశ్వబ్రాహ్మణ సర్వస్వము ప్రథమభాగము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. iv–x.
- ↑ వాసిలి, వసంతకుమార్ (2012-11-11). "ఆసక్తికల వారికి విశ్వబ్రాహ్మణ సర్వస్వం". ఆంధ్రభూమి దినపత్రిక. Deccan Chronicle Holdigs Limited. Retrieved 7 February 2015.[permanent dead link]