తూర్పు గోదావరి జిల్లా
తూర్పు గోదావరి జిల్లా | |
---|---|
దేశం | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
ప్రాంతం | కోస్తా |
ప్రధాన కార్యాలయం | రాజమహేంద్రవరం |
విస్తీర్ణం | |
• Total | 2,561 కి.మీ2 (989 చ. మై) |
జనాభా (2011)[1] | |
• Total | 18,32,300 |
• జనసాంద్రత | 720/కి.మీ2 (1,900/చ. మై.) |
భాషలు | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 0 ( ) |
Website | https://eastgodavari.nic.in/te/ |
తూర్పు గోదావరి జిల్లా, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా. రాజమహేంద్రవరం దీని ముఖ్యపట్టణం. 2022 లో జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా, దీనిలో కొన్ని ప్రాంతాలు కొత్తగా ఏర్పడిన కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో చేర్చగా, గతంలో పశ్చిమ గోదావరి జిల్లా లోని కొన్ని ప్రాంతాలను ఈ జిల్లాలో కలిపారు. గోదావరి తీరంలో పలు ఆలయాలు, ధవళేశ్వరం ఆనకట్ట,ధవళేశ్వరం లోని కాటన్ ప్రదర్శనశాల,, కడియం లోని పూలతోటలు జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యాటక ప్రాంతాలైన పాపి కొండలు మొదలగు ప్రాంతాల విహారయాత్రలకు జిల్లా రాజధాని రాజమండ్రి ఒక ముఖ్య కేంద్రం.
జిల్లా చరిత్ర
[మార్చు]ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చరిత్ర ఆనవాళ్లు సా.శ.350 నుండి లభిస్తున్నాయి. తొలిగా, మౌర్యులు, నందులు పరిపాలించగా, 5 వశతాబ్దంలో విష్ణుకుండినులు పాలించారు. 7 వశతాబ్దంలో తూర్పు చాళుక్యుల పరిపాలనలో దాక్షరామంలో భీమారామం ఆలయ నిర్మాణం జరిగింది. ఆ తరువాత చాళుక్య చోళులు, వెలనాటి చోడులు, కాకతీయలు, ఢిల్లీ సుల్తానులు, విజయనగర రాజులు, కళింగ రాజులు, రెడ్డి రాజులు,గజపతులు, గోల్కొండ రాజులు, నిజాం పాలించిన పిదప బ్రిటీషు వారి పాలనలోకి వచ్చింది.
ఈ జిల్లా బ్రిటిష్ అధీనంలోకి వచ్చే ముందు జమిందారుల ప్రాముఖ్యత అధికంగా ఉండేది. రంప, తోటపల్లి, జమ్మిచావడి, జద్దంగి, పెద్దాపురం, పిఠాపురం, కోట, రామచంద్రపురం జమిందారీలు కొన్ని ముఖ్యమైనవి.[2]
1852లో సర్ ఆర్ధర్ కాటన్ ఆధ్వర్యంలో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం పూర్తయింది. దీనితో జిల్లాలో వరి, చెరకు విస్తారంగా సాగయింది. 20 సంవత్సరాలలో జిల్లా జనాభా మూడింతలయ్యింది. విశాఖ, గంజా తదితర ప్రాంతాల ప్రజలు వలస వచ్చారు.[3]
1947 - 2014
[మార్చు]1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మద్రాస్ ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా అవతరించింది. ఈ జిల్లా 1953లో తెలుగు భాష మాట్లాడే జిల్లాలతో ఏర్పడ్డ కొత్త ఆంధ్ర రాష్ట్రంలో భాగమైంది. ఆ తరువాత 1956 లో తెలంగాణ ప్రాంతంలో తెలుగు మాట్లాడే జిల్లాలతో కలిసి ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమైంది. 2014 లో తెలంగాణ విభజన తర్వాత, అవశేష ఆంధ్రప్రదేశ్ లో కొనసాగింది.
2001 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 59 మండలాలు ఉన్నాయి. జివో నంబరు 31 ద్వారా రౌతులపూడి మండలం అనే కొత్త మండలాన్ని 44 గ్రామాలతో ఏర్పరచారు. శంఖవరం మండలం నుండి 12 గ్రామాలు, కోటనందూరు మండలం నుండి 31 గ్రామాలు, తుని మండలం నుండి ఒక గ్రామాన్ని విడదీసి ఈకొత్త మండలాన్ని ఏర్పరచారు. దీనితో మొత్తం 60 మండలాలు అయ్యాయి.
2014 - 2022
[మార్చు]తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం ఖమ్మం జిల్లాకు చెందిన భద్రాచలం (రామాలయమున్న భద్రాచలం రెవెను గ్రామం మినహా), చింతూరు, వరరామచంద్రాపురం, కూనవరం అనే 4 మండలాలు ఈ జిల్లాలో కలిసినవి. మొదట్లో ఈ 4 ముంపు మండలాలను రంపచోడవరం రెవెన్యూ డివిజనులో ఉంచినప్పటికీ, 2015లో ఎటపాక రెవెన్యూ డివిజను ఏర్పాటుచేస్తున్నప్పడు అందులోకి మార్చబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసిన భద్రాచలం గ్రామీణ మండలాన్ని నెల్లిపాక మండల కేంద్రంగా చేస్తూ గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎటపాకను రెవెన్యూ డివిజన్ కేంద్రంగానే కాక రెవెన్యూ మండలంగా మార్చబడటంతో, ఇక నెల్లిపాక మండలానికి బదులుగా ఎటపాక మండలంగా గుర్తించబడటం జరిగింది.[4]
పై మార్పుల ఫలితంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏడు రెవెన్యూ డివిజన్లు, మండలాలు 64, మండల ప్రజా పరిషత్తులు 57, పంచాయితీలు 1,012,మునిసిపాలిటీలు, కార్పొరేషనులు 9, పట్టణాలు 14, గ్రామాలు 1379 వుండేవి. రెవెన్యూ డివిజన్లు: 1.కాకినాడ 2.పెద్దాపురం 3.అమలాపురం 4.రాజమహేంద్రవరం 5.రంపచోడవరం 6. రామచంద్రపురం 7.ఏటపాక.
2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణ
[మార్చు]2022 జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా, రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గ పరిధితో జిల్లాపరిధిని సవరించుటకొరకు, దక్షిణంగా వున్న ప్రాంతాలు కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లాలలో, ఉత్తరంగా వున్న గిరిజన ప్రాంతాలను అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేర్చగా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉత్తర భాగంలో, గోదావరికి నదీతీరానికి పశ్చిమంగా వున్న కొన్ని ప్రాంతాలను ఈ జిల్లాలో కలిపారు. 2022 వరకు కాకినాడ జిల్లా రాజధానిగా వుండగా, సవరించిన జిల్లాకు రాజమహేంద్రవరం రాజధాని అయ్యింది.[1]
భౌగోళిక స్వరూపం
[మార్చు]2022లో జిల్లా పరిధి సవరించిన తరువాత జిల్లా వైశాల్యం 2,561 చ.కి.మీ (989 చ. మై).[1]
తూర్పు గోదావరి జిల్లాకు ఉత్తరాన ఏలూరు జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా,, తూర్పున కాకినాడ జిల్లా, దక్షిణాన పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లా, పశ్చిమాన ఏలూరు జిల్లా,పశ్చిమ గోదావరి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. గోదావరి, పంపా, తాండవ, ఏలేరులు జిల్లాలో ప్రవహిస్తున్న ప్రముఖ నదులు.
వాతావరణం
[మార్చు]ఉమ్మడి జిల్లాలో ఈశాన్య ఋతుపవనాలు, నైరుతీ ఋతుపవనాల కారణంగా జూన్ నుండి అక్టోబరు వరకు వర్షాలు కురుస్తుంటాయి. ఈ జిల్లా పశ్చిమ కొండ ప్రాంతాలలో సుమారు 140 సెంటిమీటర్లు, ఉత్తర కోస్తా ప్రాంతంలో సరాసరి వర్షపాతం 100 సెంటిమీటర్లు ఉంటుంది. ఏడాది పొడుగునా వాతావరణం సాధారణంగా ఉంటుంది. ఏప్రిల్ నుండి జూన్ వరకు మాత్రం ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెంటీగ్రేడు వరకు పెరుగుతాయి. జిల్లా లోని సాధారణ వర్షపాతం - 1280.0 మి మీ. సగానికి పైగా వర్షపాతం నైరుతి ఋతుపవనాల వలన కలగగా మిగిలినది ఈశాన్య ఋతుపవనాల వలన కలుగుతుంది.
జనగణన వివరాలు
[మార్చు]2011 జనాభాగణాంకాలను అనుసరించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసంఖ్య 5,151,549. ఇది సంయుక్త అరబ్ ఎమిరేట్‌కు జనసంఖ్యకు సమానం లేక కొలరాడో రాష్ట్ర జనాభాకు సమానం. భారతదేశంలో జనసంఖ్యలో జిల్లా 19వ స్థానంలో ఉంది. అలాగే అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది. జిల్లా జనసాంద్రత 1 కిలోమీటరుకు 477. 2001-2011 మధ్య జనసాంద్రత పెరుగుదల 5.1%. 2001-2011 కాలంలో అక్షరాస్యత 65.48% నుండి 71.35% నికి పెరిగింది, స్త్రీ:పురుషుల నిష్పత్తి 993 నుండి 1005 కు పెరిగింది, 6 సంవత్సరాల కంటే చిన్న పిల్లల సంఖ్య 12.5% నుండి 9.56%కు తగ్గింది. ఆరు సంవత్సరాలకంటె చిన్నపిల్లల లింగ నిష్పత్తి 978 నుండి 969 కి తగ్గింది.[2]
2022 లో జిల్లా పరిధి సవరించిన తరువాత, 2011 జనగణన ప్రకారం జనాభా 18.323లక్షలు.[1]
పాలనా వ్వవస్ధ
[మార్చు]రెవెన్యూ డివిజన్లు
[మార్చు]2022 ఏప్రిల్ 4 తరువాత జిల్లాలో రాజమండ్రి, కొవ్వూరు రెవెన్యూ డివిజన్లున్నాయి.
మండలాలు
[మార్చు]
నగరాలు, పట్టణాలు
[మార్చు]గ్రామాలు
[మార్చు]19 మండలాల పరిధిలో 271 గ్రామాలున్నాయి.[5]
రాజకీయ విభాగాలు
[మార్చు]జిల్లా పరిధిలో రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం ఉంది.
శాసనసభ నియోజకవర్గాలు
[మార్చు]- అనపర్తి: ఇది తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలలో విస్తరించివుంది.
- కొవ్వూరు
- గోపాలపురం (SC): ఇది తూర్పు గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలలో విస్తరించివుంది.
- నిడదవోలు
- రాజమండ్రి గ్రామీణ
- రాజమండ్రి సిటీ
- రాజానగరం
రవాణా వ్యవస్థ
[మార్చు]చెన్నై, కోల్‌కతా లను కలిపే జాతీయ రహదారి 16, రైల్వే లైనులు జిల్లా గుండా పోతున్నాయి. రాజమండ్రి - కొవ్వూరును అనుసంధానిస్తూ పొడవైన రహదారి, రైలు వంతెన ఉంది. జిల్లా కేంద్రానికి 15 కి.మీ.ల దూరంలో మధురపూడి వద్ద రాజమండ్రి విమానాశ్రయం ఉంది.
విద్యా సౌకర్యాలు
[మార్చు]జిల్లా రాజధాని రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం భారత స్వాతంత్ర్యం రాక ముందే స్త్రీలకు ప్రత్యేక కళాశాలలు ప్రారంభించాడు.
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం: దీని శాఖ రాజమండ్రిలో ఉంది. 1989 సంవత్సరంలో కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాక్షేత్రం ఇందులో విలీనం చేయబడింది.
- ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం: దీనిని 2006లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
- కందుకూరి వీరేశ లింగం విద్యాసంస్థలు -శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా జూనియర్, డిగ్రీ, పి.జి కళాశాల, యస్.కే.వి.టి ఉన్నత ఆంగ్ల బోధనా పాఠశాల,యస్.కే.వి.టి ఉన్నత తెలుగు బోధనా పాఠశాల, యస్.కే.వి.టి జూనియర్ కళాశాల,యస్.కే.వి.టి డిగ్రీ & పి.జి కళాశాల
- ప్రభుత్వ కళాశాల (రాజమహేంద్రవరం): ఈ కళాశాల 1857లో స్థాపించబడింది. దీనికి మొదటి ప్రిన్సిపాల్ గా "మెట్కాఫ్" అనే ఆంగ్లేయుడు పనిచేశాడు. ఈయన పేరుతోనే విద్యార్థుల వసతి గృహం (మెట్కాఫ్ హాస్టల్) ఇప్పటికీ నడుస్తున్నది. అడివి బాపిరాజు ఇక్కడ చదువుకున్నాడు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇక్కడ ఈ కళాశాలలో ముఖ్యాధ్యాపకులుగా పనిచేశాడు.
- గౌతమీ గ్రంథాలయం: గౌతమీ గ్రంథాలయం అనబడేది వాసురయ గ్రంధ్రాలయం, రత్నకవి గ్రంథాలయాల సముదాయం. వాసురయ గ్రంధ్రాలయం వాసుదేవ సుబ్బారాయడు చేత, రత్నకవి గ్రంధ్రాలయం కొక్కొండ వేంకటరత్నం చేత స్థాపించబడ్డాయి. గౌతమీ గ్రంథాలయం పేరు 1898లో ఇవ్వబడింది, 1920 సంవత్సరంలో పేరు రిజిష్టరు చేయబడింది.
సి.టి.ఆర్.ఐ
[మార్చు]సెంట్రల్ టొబాకో రీసర్చ్ ఇన్సిట్యూట్ (CTRI): ఇక్కడ పొగాకు, ఇతర అన్ని రకముల మొక్కలకు సంబంధించిన ప్రయోగములు జరుపుతారు. దీనిని 1947లో స్థాపించారు. పొగాకు సాగు విధానము మొట్టమొదట 1605 వ సంవత్సరములో పోర్ఛుగీసు దేశమునుండి మన దేశానికి వ్యాపించింది.
ఆర్ధిక స్థితి గతులు
[మార్చు]గోదావరి డెల్టాలో అధికభాగం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే ఉన్నందున వ్యవసాయం, నీటిసంబంధిత వృత్తులు (అక్వా కల్చర్) జిల్లా ప్రజలకు ప్రధాన వృత్తులుగా ఉన్నాయి. ఇటీవల జరిపిన పరిశోధనల మూలంగా సహజవాయువు నిలువలు బయటపడడం వలన ఈ ప్రదేశం పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుంది. జిల్లాలో రెండు ఎరువుల కర్మాగారాలు, సహజ వాయువుతో తయారయ్యే విద్యుత్ వుత్పత్తి కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలున్నాయి. ప్రస్తుతం ఇది దేశంలో అతి పెద్ద చమురు, సహజవాయు ఉత్పత్తి కేంద్రంగా ఉంది.
పరిశ్రమలు
[మార్చు]పేరు పొందిన పరిశ్రమలలో కొన్ని:
- కాగితం పరిశ్రమలు: ఏ.పి.పేపర్ మిల్స్, కోస్టల్ పేపర్ మిల్స్, కడియం పేపరు మిల్లు
- విద్యుత్తు తయారీ: సహజవాయువు ఆధారిత విద్యుత్ కేంద్రం, విజ్జేశ్వరం
- మందుల పరిశ్రమలు
- ఆరోగ్యం కొరకు అదనపు పోషకాల తయారీ : హారిక్ల్స్ ఫ్యాక్టరీ
- పూల మార్కేట్, మొక్కల నర్సరీలు - కడియం
- సెరామిక్స్ టైల్స్
సంస్కృతి
[మార్చు]సంక్రాంతి ఉత్సవాలు
[మార్చు]సంక్రాంతి పండుగను ముఖ్యంగా మూడు రోజులు పాటు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగను ఒక వేడుకగా జరుపుకుంటారు. జిల్లాలో కొత్త అల్లుళ్లకు, బంధువులకు చక్కని మర్యాదలు చేసే సంప్రదాయం ఇక్కడ ఉంటుంది. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కోలాహలం సంప్రదాయ వస్త్రాలతో నృత్యాలతో పల్లెసీమలు సందడిగా ఉంటాయి.
పర్యాటక ఆకర్షణలు
[మార్చు]- ధవళేశ్వరం ఆనకట్ట
- కాటన్ ప్రదర్శనశాల, ధవళేశ్వరం
- పూలతోటలు, కడియం
- అష్ట సోమేశ్వరాలయాలు
- గోదావరి తీరంలో ఆలయాలు
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- కందుకూరి వీరేశలింగం పంతులు, కవి
- గంటి మోహనచంద్ర బాలయోగి, తొలి దళిత లోక్‌సభ స్పీకర్.
- రవితేజ, సినీ నటుడు
- ఆలీ, సినీ నటుడు
- దేవిశ్రీప్రసాద్, సంగీత కారుడు
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
- ↑ 2.0 2.1 SERIES-29 PART XII-A Census of India 2011, EAST GODAVARI DISTRICT, DISTRICT CENSUS HANDBOOK VILLAGE AND TOWN DIRECTORY. Director of Census operations, Andhra Pradesh. 2014. pp. 20–24.
- ↑ "తూర్పు గోదావరి జిల్లా చరిత్ర". ఈనాడు. Archived from the original on 2012-06-21.
- ↑ "డివిజన్ కేంద్రంగా ఎటపాక". web.archive.org. 2016-06-27. Archived from the original on 2016-06-27. Retrieved 2019-12-27.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "గ్రామాలు". తూర్పు గోదావరి జిల్లా. Retrieved 2022-07-20.
బయటి లింకులు
[మార్చు]- "East Godavari district on OpenStreetMap(OSM)". Retrieved 2022-07-21.