Jump to content

వందేమాతరం (1939 సినిమా)

వికీపీడియా నుండి
(మంగళసూత్రం (1939 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
వందేమాతరం
(1939 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎన్.రెడ్డి
నిర్మాణం బి.ఎన్.రెడ్డి,
మూలా నారాయణస్వామి
కథ బి.ఎన్.రెడ్డి
చిత్రానువాదం కె.రాంనాధ్
తారాగణం నాగయ్య,
కాంచనమాల,
కళ్యాణి,
దొరైస్వామి,
తాడంకి శేషమాంబ,
రాఘవన్‌,
గౌరీపతిశాస్త్రి,
సుబ్బారావు,
లక్ష్మీదేవి,
లింగమూర్తి,
కృష్ణ,
సాబు,
ఉషారాణి,
రాజేశ్వరి,
రామారావు,
అప్పలస్వామి,
వెంకటేశ్వర్లు
సంగీతం చిత్తూరు నాగయ్య
గీతరచన సముద్రాల సీనియర్
సంభాషణలు సముద్రాల సీనియర్
ఛాయాగ్రహణం కె.రాంనాధ్
కళ ఎ.కె.శేఖర్
కూర్పు టి.ఏ.ఎస్.మణి
నిర్మాణ సంస్థ వాహిని పిక్చర్స్
భాష తెలుగు

వందేమాతరం వాహినీ పిక్చర్స్ పతాకంపై, బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో చిత్తూరు నాగయ్య, కాంచనమాల తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన 1939నాటి తెలుగు సాంఘిక చలనచిత్రం.[1] ఈ చిత్రానికి మరో పేరు మంగళసూత్రం. సినిమాకు నిర్మాతలుగా మూలా నారాయణస్వామి, బి.ఎన్.రెడ్డి వ్యవహరించారు. బి.ఎన్.రెడ్డి రాసిన మంగళసూత్రం అనే అముద్రిత నవలికను సినిమాకు కథగా స్వీకరించారు. దానికి రామ్ నాథ్ స్క్రీన్ ప్లే రాసియిచ్చారు.
సినిమ కథాంశం ప్రకారం రఘు అనే యువకుడు తల్లిదండ్రులను కట్నం తీసుకోకుండా నిరోధించి జానకిని వివాహమాడతాడు. వాళ్ళకు ఓ కొడుకు పుడతాడు. కట్నం తేలేదని అత్తగారు జానికిని బాధలు పెడుతుంది. పట్టభద్రుడైన రఘు ఉద్యోగం కోసం పట్నం వెళ్ళి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అత్తగారి ఆరళ్ళు భరించలేని జానకి భర్తని వెతుక్కుంటూ పట్నం వస్తుంది. రఘుకు లాటరీలో రూ.50 వస్తాయి. సంతోషంగా వెనక్కి వస్తే భార్య ఎక్కడికో వెళ్ళిపోయిందని, మరో పెళ్ళి చేసుకొమ్మని తల్లి చెప్తుంది. పెళ్ళిచేసుకోవడం ఇష్టంలేక పట్టణం వచ్చి అతనితో చదివిన జయతో కలిసి ఓ ఫ్యాక్టరీ పెడతాడు. పూలమ్ముకుంటూ జానకి కొడుకును పెంచుకుంటూంటుంది. ముందు రఘు, జయలను చూసి అపార్థం చేసుకున్నా చివరకు నిజం తెలుసుకోవడంతో భార్యాభర్తలు ఒకటవుతారు.
చిత్తూరు నాగయ్య వందేమాతరం సినిమాలో కథానాయకునిగా నటించారు. ఇది ఆయనకు రెండవ సినిమా కాగా కథానాయకునిగా ఇదే మొదటి చిత్రం. జానకి పాత్రలో కాంచనమాల నటించగా, మరో కథానాయిక జయ పాత్రలో కళ్యాణి నటించారు. సినిమాకు ఛీఫ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా కె.వి.రెడ్డి, సహాయ దర్శకునిగా కమలాకర కామేశ్వరరావు పనిచేశారు. వందేమాతరం సినిమాకు సంగీత దర్శకునిగా కథానాయకుడు చిత్తూరు నాగయ్యనే తీసుకున్నారు. ఇది ఆయన సంగీత దర్శకత్వం వహించిన మొదటి సినిమా. పాటలు అన్నిటినీ సముద్రాల సీనియర్ రాశారు.
వందేమాతరం అని పేరుపెట్టినా సినిమాలో స్వాతంత్ర్యోద్యమానికి సంబంధించిన అంశాలు లేవు. సినిమాలోని ప్రధానాంశాలు నిరుద్యోగం, వరకట్న దురాచారం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి కూడా సినిమాలో ప్రస్తావనలు వచ్చాయి. సినిమా 1938లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఆంధ్ర ప్రాంతంలోని కొన్ని కేంద్రాల్లో రజతోత్సవాలు జరిగాయి. నేటి కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ విజయవంతంగా ప్రదర్శితమైంది. వందేమాతరం సినిమాతో దర్శకునిగా బి.ఎన్.రెడ్డికి, కథానాయికగా కాంచనమాలకు చాలా మంచి పేరు వచ్చింది.

కథాంశం

[మార్చు]

గ్రామీణ రైతు కుటుంబానికి చెందిన రఘు (నాగయ్య) పట్టభద్రుడు. తల్లిదండ్రుల కట్నం ఆశను ఎదిరించి అతను జానకి (కాంచనమాల)ని వివాహమాడతాడు. కాపురానికి వచ్చిన జానకిని అత్తగారు (శేషమాంబ) అడుగడుగునా ఆరడి పెడుతుంటుంది. నోరులేని మావగారు నిస్సహాయంగా చూస్తుంటాడు. పేదరాలైన జానకి అన్నీ భరిస్తుంటుంది. అత్తింట ఆమెకు భర్త ప్రేమే సాంత్వన. ఆ దంపతులకు కొడుకు పుడతాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రఘుకు ఓ పట్టాన ఉద్యోగం దొరకదు. చివరికి అతను ఉద్యోగాన్వేషణలో బస్తీ బయలుదేరి వెడతాడు. అక్కడ మోసానికి గురవుతాడు. ఇక్కడ జానకికి అత్తగారి ఆరడి ఎక్కువ అవుతుంది. భర్తను వెదుక్కుంటూ కొడుకుతో ఆమె కూడా బస్తీ బయలుదేరి వెడుతుంది. ఉద్యోగాన్వేషణలో వున్న రఘు ఒకరోజు లాటరీ టిక్కెట్టు కొంటాడు. ఆ టిక్కెట్టుకు యాభై వేల బహుమతి వస్తుంది. సంతోషంగా ఇంటికి వెళ్ళిన రఘుకు తల్లి జానకి ఎటో వెళ్ళిపోయిందని లేనిపోనివన్నీ కల్పించి చెబుతుంది. మరో పెళ్ళి చేసుకోమంటుంది. తిరస్కరించిన రఘు పుట్టెడు దుఃఖంతో బస్తీ తిరిగివస్తాడు. సహాధ్యాయి జయ (కళ్యాణి) తో కలిసి అక్కడ ఫ్యాక్టరీ పెట్టి తనలాంటి నిరుద్యోగులు చాలామందికి ఉపాధి కల్పిస్తాడు. తన గురించి, జయ గురించి జనం రకరకాలుగా చెప్పుకుంటున్నా పట్టించుకోడు. బస్తీ చేరిన జానకి పూలదండలు కట్టి కొడుకుతో అమ్మిస్తుంటుంది. ఆ పిల్లవాడి రఘు, జయలను ఆకట్టుకుంటాడు. అయితే, రఘుకు అతను తన కొడుకని మాత్రం తెలియదు. అనుకోకుండా ఒకరోజు జయ, రఘులను చూసిన జానకి అపార్థం చేసుకుంటుంది. వాళ్ళమధ్యనుంచి తను తప్పుకోవాలని అనుకుంటుంది. చివరికి అపార్థాలు తొలిగి అంతా ఒకటవుతారు.

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

రోహిణీ పిక్చర్స్ పతాకంపై బి.ఎన్.రెడ్డి, హెచ్.ఎం.రెడ్డి 1938లో గృహలక్ష్మి నిర్మించారు. ఆ సినిమా తర్వాత వారిద్దరికీ నడుమ వివాదాలు తలెత్తడంతో బి.ఎన్.రెడ్డి రోహిణీ పిక్చర్స్ నుంచి బయటకు వచ్చేశారు. మళ్ళీ సినిమా రంగంలోనే కొనసాగేందుకు ఆయన తమ్ముడు బి.నాగిరెడ్డి, కథానాయకుడు చిత్తూరు నాగయ్య వంటివారి ఒప్పించడంతో వాహిని సంస్థను స్థాపించారు.[2] వాహిని పతాకం మీద బి.యెన్.రెడ్డి తీసిన మొదటి సినిమా ఇది. బి.ఎన్.రెడ్డి మద్రాసులో చదువుతున్నప్పుడు తరచుగా స్వగ్రామం కొత్తపల్లి వెళ్ళివస్తూండేవారు. ఆ గ్రామంలోని ఉన్నత కుటుంబంలో జరిగిన సంఘటనలు ఆధారంగా బి.ఎన్.రెడ్డి గతంలో రాసిన మంగళసూత్రం అనే నవలిక రాశారు. సినిమా కోసం కథను అన్వేషిస్తున్నప్పుడు తాను రాసిన నవలికనే చూపించగా రచయిత రామ్ నాథ్ దానికి స్క్రీన్ ప్లే రాశారు.[3] సినిమాకు స్వాతంత్ర్య పోరాటంతో ఏ సంబంధం లేకపోయినా వందేమాతరం అన్న పేరు బావుంటుందన్న ఉద్దేశంతో పెట్టారు. అయితే అవి బ్రిటీష్ పరిపాలిస్తున్న రోజులు కావడంతో సినిమాకు సెన్సార్ వద్ద ఏదైనా ఇబ్బంది ఉంటుందేమోనని మంగళసూత్రం అన్న పేరును కూడా పెట్టారు.[4]

నటీనటుల ఎంపిక

[మార్చు]

సినిమాలో హీరోహీరోయిన్లుగా చిత్తూరు నాగయ్య, కళ్యాణి, కాంచనమాల తదితరులు నటించారు. కె.వి.రెడ్డి ఈ సినిమాలో హీరో కాలేజీ సహాధ్యాయిగా చిన్న వేషం కూడా వేశారు. ఇది చిత్తూరు నాగయ్యకు రెండవ సినిమా కాగా కథానాయకునిగా తొలి చిత్రం.[3] సినిమాకు మొదట అందరూ సినిమాల్లో చేసినవాళ్ళనే ఎంచుకున్నారు. బి.ఎన్.రెడ్డి నియమం ప్రకారం కనీసం ఒక్కరైనా కొత్తవారికి అవకాశం ఇవ్వాలి. ఆ ఉద్దేశంతోనే తెనాలిలో టీచింగ్ వృత్తిలో ఉన్న సీతారావమ్మను తీసుకువచ్చి, ఆమెకు కళ్యాణి అని పేరుమార్చి సినిమాలో రెండవ కథానాయిక పాత్రకు తీసుకున్నారు.[4]

పాత్రలు - పాత్రధారులు

[మార్చు]
  • రఘు - చిత్తూరు వి. నాగయ్య
  • జానకి - కాంచనమాల
  • రామయ్య - దొరైస్వామి
  • పార్వతమ్మ - శేషమాంబ
  • వెంకయ్య - యం.సి.రాఘవన్
  • డాక్టరు - ముదిగొండ లింగమూర్తి
  • గోపాలం - గౌరీపతిశాస్త్రి
  • ఆనంద్ 1 - ఉషారాణి
  • ఆనంద్ 2 - మాస్టర్ కృష్ణ
  • కాంతం - లక్ష్మీదేవి
  • పుల్లయ్య - జి.సుబ్బారావు
  • జయలక్ష్మి - కళ్యాణి
  • రాజబహద్దూర్ - కృష్ణమూర్తి

చిత్రీకరణ

[మార్చు]

కె.వి.రెడ్డి ఈ సినిమాకు చీఫ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా, కమలాకర కామేశ్వరరావు ఈ సినిమాకు సహాయ దర్శకునిగా పనిచేశారు.వీళ్ళిద్దరూ సినిమా చిత్రీకరణలో చాలా సహకరించారు. బి.ఎన్.రెడ్డి అనుకున్నది అనుకున్నట్టుగా తీసేందుకు చాలా శ్రమించేవారు. ఆ క్రమంలో అనుకున్న ఎఫెక్ట్ తీసుకురావడానికి నటీనటులు చాలా కష్టపడాల్సివచ్చేది. ఈ సినిమాలో కాంచనమాల బరువైన సన్నివేశాల్లో నటించాల్సివచ్చినప్పుడు బి.ఎన్.రెడ్డి అనుకున్నట్టు నటించేందుకు చాలా ఇబ్బందిపడేవారు.[3]

విడుదల

[మార్చు]

సెన్సార్

[మార్చు]

సినిమా సెన్సారుకు ముందు వందేమాతరం అన్న టైటిల్ తో సమస్య వస్తుందని భావించి సినిమాకు మరో పేరు కూడా పెట్టారు. అయితే సెన్సారు అధికారుల నుంచి వందేమాతరం అన్న పేరుకు ఏ సమస్యా రాకపోయినా మరో విషయంపై వచ్చింది. కథానాయకుడు రఘు సినిమాలో ఉద్యోగం దొరకలేదన్న నిర్వేదంతో తన డిగ్రీ సర్టిఫికెటున్న పటాన్ని నేలకేసి బద్దలుకొడతాడు. తరువాత ఉద్యోగం ఇక పూర్తిగా ఎండమావేనని తేలిపోవడంతో డిగ్రీ సర్టిఫికెట్ను చించి పోగులు పెడతాడు. సెన్సార్ బోర్డులో అప్పుడు శామ్యూల్ రంగనాథన్ అనే విద్యావేత్త వుండేవాడు. ఆయన ఈ రెండు సన్నివేశాల పట్లా తీవ్ర అభ్యంతరం చెప్పాడు. విశ్వవిద్యాలయ విద్యను ఇది అవమానించడమేనని వాదించారు. అయితే, కథానాయకుడు ఉద్యోగం దొరకని ఒకానొక దుర్భర పరిస్థితిలో తీవ్ర మానసిక వేదనకు గురై ఆ పనిచేశాడన్న తమ ఉద్దేశం తప్ప విశ్వవిద్యాలయాలను అవమానించడం ఎంత మాత్రం కాదని బి.ఎన్. వివరించడంతో ఆ సమస్య తప్పింది.

విడుదల, స్పందన

[మార్చు]

వందేమాతరం సినిమా 1939 ద్వితీయార్థంలో విడుదలయ్యింది. దక్షిణాది అంతటా విజయవంతంగా ప్రదర్శితమైంది. మంచి ఆర్థిక విజయాన్ని కూడా సాధించింది.[3] సినిమాను విద్యావంతులు, పండితులు ప్రశంసించారు. తెలుగునాట పలుచోట్ల రజతోత్సవాలు జరుపుకుంది. తమిళ, మలయాళ ప్రాంతాల్లోనూ, మైసూరు పరిసరాల్లోనూ విడుదలై విజయవంతంగా ప్రదర్శితమైంది.[4]

ప్రభావాలూ, థీమ్స్

[మార్చు]

వరకట్నం, నిరుద్యోగం సినిమాలోని ముఖ్యమైన అంశాలు. అలాగే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర వాంఛ కూడా కొన్ని సన్నివేశాల్లో పాత్రధారులచేత బలంగా చెప్పించారు. సినిమాకి పేరు వందేమాతరం అని పెట్టినా సినిమా కథాంశం దేశభక్తికి సంబంధించింది కాదు. సినిమాలో ఒకేఒకసారి వందేమాతరం ప్రస్తావన వస్తుంది. కథానాయకుడు లాటరీ టిక్కెట్టు కొన్నప్పుడు, అమ్మిన లాటరీ ఆయన ఏం పేరు రాసుకొమ్మంటావు అని అడుగుతాడు. అప్పుడు హీరో వందేమాతరం అని రాసుకో అంటాడు.[3][4]

సంగీతం

[మార్చు]

సముద్రాల రాఘవాచార్య మాటలు, పాటలు రాశారు. సంగీత బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్న అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు బి.యెన్ వెంటనే నాగయ్య పేరు సూచించారు. ఇది నాగయ్యకు సంగీత దర్శకునిగా మొదటి సినిమా. తెలుగు సినిమాలకు అప్పటికి ఇంకా ప్లేబ్యాక్ పద్ధతి ఇంకా రాలేదు. వందేమాతరం సినిమాలో నాగయ్య, కాంచనమాల, కళ్యాణి తమ పాటలు తామే పాడుకున్నారు. వందేమాతరం సినిమాలో దాదాపు ఇరవై పాటలున్నాయి. మూడు పద్యాలు కూడా ఉన్నాయి. కథానాయకుడు తన కాలేజీ మిత్రులతో కలిసి హంపి పిక్నిక్కు వెళ్ళినప్పుడూ అక్కడా ఆంధ్ర సామ్రాజ్యలక్ష్మి దీనావస్థను చూసి పాడే ’ఇట తెల్గు కవికోటి…’ అన్న పద్యం ఆ రోజుల్లో బాగా ప్రజాదరణ పొందింది.[3]


పాటల జాబితా

[మార్చు]

వందేమాతరం చిత్ర గీత రచయిత:సముద్రాల రాఘవాచార్య.

1.ఓ మురళీ ఓమురళీ మురారి నీదరిలేడా మురళి, రచన:సముద్రాల రాఘవాచార్య, గానం.కాంచనమాల, నాగయ్య

2.కరువు కాలముననక ఒకేగతి శ్రమించు, గానం.నాగయ్య

3.కాంతా నీ ముద్దుమొగము ఆహా,

4.చిరునగవు చూపరారా, గానం.కాంచనమాల

5.తరిపి వెన్నెలలోన చిరునవ్వేలా పూదావిలో మత్తుమందేలా, గానం.నాగయ్య

6.తల్లిని మించే దైవము వేరే దారుణీ లేదోయీ, గానం.కళ్యాణి బృందం

7.తూరుపు తెలతెలనాయే పోయేను చలిబడాయి , గానం.బృందం

8.దివ్య ఫలదాయి కాదా జీవితేశుని సేవా ఇహపర సుఖముల, గానం.కాంచనమాల

9.ధీన నిరుద్యోగి భాద మానెచ్చుడు సదయులే లేరా, గానం.నాగయ్య

10.ఫలమిదియా ప్రేమ జప పూజలకు , గానం.కళ్యాణి

11.పూలో పూలో పూలో కనికొనుడూ పూలు మల్లెమాల , గానం.మాస్టర్ కృష్ణ

12.పూల పరిమళము అందమువోలె విడక వెలిగేదమే, గానం.నాగయ్య, కాంచనమాల

13.బేలతనము పడినా ఫలమా విధి లిఖితము , గానం.మాస్టర్ సాబు, మాస్టర్ విఠల్

14.మాతా వినాం నహి దైవం గాయత్రి వినా నహి మంత్రం , గానం.నాగయ్య

15.మధురానగరిలో చల్లనమ్మ బోధు, గానం.నాగయ్య, కాంచనమాల

16.రఘుకుల రాముని ముఖాన వెన్నెల విరిసినది, గానం.బృందం

17.సుందరి మాలతి ఎందరి మనమిటు కరచి కులికేదవే, గానం.నాగయ్య, కాంచనమాల

18.స్వేచ్ఛా ఫధమూ చూపుము మాకోమాతా భారత భూమాత, గానం.కళ్యాణి బృందం

19.సుఖజీవన సుధానిదానా నీ మోముగనీ మురిసేరా, గానం.కాంచనమాల

20.నీ యడుగులే నమ్మినారా సామి నన్ను యీడనాడి పొయ్యేవా,

21.ప్రేమయే ధనము ప్రేమయే శాంతి ప్రేమయే భవ తారకము, గానం.నాగయ్య, కాంచనమాల

22.బ్రతుకు జగతి కృతిమౌగా సతి తొడిగ విడనివిరి,గానం. కాంచనమాల

23.ఇట తెల్గు కవికోటి నృపుల కైదండతో ఏనుగులెక్కి,(పద్యం) గానం.నాగయ్య .

మూలం

[మార్చు]
  1. "Vandemataram (1939)". Indiancine.ma. Retrieved 2021-04-05.
  2. బి., నాగిరెడ్డి (1 March 2009). జ్ఞాపకాల పందిరి. చెన్నై: బి.విశ్వనాథ రెడ్డి.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 పాటిబండ్ల, దక్షిణామూర్తి. "వందేమాతరం-తెలుగులో తొలితరం సాంఘిక చిత్రం". వందేమాతరం. Archived from the original on 16 March 2015. Retrieved 23 July 2015.
  4. 4.0 4.1 4.2 4.3 పాటిబండ్ల, దక్షిణామూర్తి (1 December 2006). కళాత్మక దర్శకుడు బి.యన్.రెడ్డి. హైదరాబాద్: క్రియేటివ్ లింక్స్. p. 25.

. 5.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]