Jump to content

ముహమ్మద్ బిన్ తుగ్లక్

వికీపీడియా నుండి
(మహమ్మద్ బీన్ తుగ్లక్ నుండి దారిమార్పు చెందింది)
ముహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క తొగ్రా
ముహమ్మద్ బిన్ తుగ్లక్ నాటి నాణెం

ముహమ్మద్ ఫక్రుద్దీన్ జునా ఖాన్గా పిలువబడే ముహమ్మద్ బిన్ తుగ్లక్ (ఆంగ్లము Muhammad bin Tughlaq, అరబ్బీ: محمد بن تغلق) (c.1300–1351) ఢిల్లీ సుల్తాను, 1325 - 1351 ల మధ్య పరిపాలించాడు. గియాసుద్దీన్ తుగ్లక్ జ్యేష్ఠకుమారుడు. గియాసుద్దీన్ ఇతనిని, కాకతీయ వంశపు రాజైన ప్రతాపరుద్రుడు వరంగల్ ను నియంత్రించుటకు దక్కను ప్రాంతానికి పంపాడు. తండ్రి మరణాంతం, 1325 లో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు.

ముహమ్మద్ బిన్ తుగ్లక్, ఓ మహా పండితుడు, విద్వాంసుడు. ఇతనికి తర్కము, తత్వము, గణితము, ఖగోళ శాస్త్రము, భౌతిక శాస్త్రము లలో మంచి ప్రవేశముండేది. ఇతడు ఇస్లామీయ లిపీ కళాకృతులు క్షుణ్ణంగా తెలిసినవాడు. ఇతనికి వైద్యము, మాండలికాలలో మంచి పరిజ్ఞానం, నైపుణ్యం ఉండేది. [1]

ముహమ్మద్ బిన్ తుగ్లక్ ఆశ్చర్యజనక 'సకలకళా వల్లభాన్ని' కలిగివుండేవాడు. మధ్యయుగంలో ప్రగాఢముద్రవేయగలిగిన వ్యక్తిత్వాన్ని కలిగి వున్నాడు. దూరదృష్టి, ఆలోచనాపరుడు, రాబోయే యుగాలు, తరాల గూర్చి ఆలోచించగలిగే శక్తినీ గలిగినవాడు.[2]

రాజ్య సంక్రమణ

[మార్చు]

1324లో గియాసుద్దీన్ తుగ్లక్ లక్నౌతీపై దండయాత్రకు వెళుతూ, దేవగిరిలో ఉన్న రాకుమారుడు ఉలుఘ్‌ఖాన్ ను వెనక్కి రప్పించి తన తరుఫున రాజ్యవ్యవహారాలను చూసుకునేందుకు రాజప్రతినిధిగా ఢిల్లీలో నియమించి వెళ్ళాడు. 1325లో బెంగాల్ దండయాత్రనుండి తిరిగివస్తున్న గియాసుద్ధీన్ తుగ్లక్ ను ఆహ్వానించటానికి ఢిల్లీ శివార్లలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఒక పెద్ద ఎత్తైన వేదిక ఏర్పాటు చేశాడు. అయితే ఊరేగింపు జరిగేటప్పుడు ఏనుగు తగిలితే మొత్తం కూలేటట్లు దాని రూపకల్పన జరిగింది. వేదిక పథకం ప్రకారం గియాసుద్ధీన్ పై కూలి ఆయన మరణించడంతో మహమ్మద్ బిన్ తుగ్లక్‌కు రాజ్యం సంక్రమించింది. కాకతీయ ప్రతాపరుద్రుడి రాజ్యం అంతమైన తరువాత అదే దుర్జయ వంశీయుడైన ముసునూరి ప్రోలయ్య నాయుడితో గోదావరిలో జిల్లాలో జరిగిన యుద్దాల్లో ఘియాజుద్దీన్ తుగ్లక్ మరణించాడని అసలయిన వాస్తవంగా ఎక్కువ మంది చరిత్రకారులు చెపుతున్నారు. దీనికి కారణం తూర్పు పచ్చిమ గొదావరి జిల్లాలోని దేవాలయాలను ధ్వంశం చేస్తున్న తుగ్లక్ పై ఆగ్రహించిన ప్రోలభూపతి 75 మంది సామంతులను ఏకం చేసి కత్తిసాము, కర్రసాము, గుర్రపుస్వారి, గజ శిక్షణ తదితర అస్త్ర శస్త్ర విద్యాలను నేర్పి కాపుగాసి గొదావరి జిల్లాలోని డిల్లీ సుల్తానుల పై గెరిలా యుద్ద బేరితో విరుచుపడ్డాడు (విలస, గురుజ, అనితల్లి, పెంటపాడు శాసనాలు వీరు డిల్లీ సుల్తానులతో జరిపిన యుద్ధబేరిని తెలియ జేస్తాయి). మరో కథనం ప్రకారం తనయుడు ఒక చెక్క బాల్కనీ కట్టించి అది తండ్రిపై కూలేట్టు చేశాడని చెబుతారు. ఘియాసుద్దీన్ తుగ్లక్ గోదావరి జిల్లాలో జరిగిన యుద్దంలో ముసునూరి ప్రోలయ్య నాయుడు సంహరించి వుంటాడనేది అవగతం అవుతుంది దీనికి ప్రతీకారేచ్చగా బహ్మనీ సుల్తానులతో డిల్లీ సుల్తానులు చేతులు కలిపి ఇతడి తమ్ముడు కుమారుడు ముసునూరి వినాయకదేవుడిని సంహరించి ఉంటారు. ఇతడి తండ్రి ముసునూరి కాభానాయుండుని తెలింగ వాలి అని డిల్లీ సుల్తానుల ఆస్ధాన కవుల పేర్కొన్నారు అంతే కాకుండగా బుక్కరాయ ఇతడి బందు అని పేర్కొన్నారు. [3] ఈ ప్రమాదంలో తండ్రికి ప్రియ తనయుడు, వారసత్వంలో జునా ఖాన్ కంటే ముందుగా ఉన్న మహుమూద్ ఖాన్ కూడా మరణించాడు. ఆ తరువాత శిధిలాలని తొలగిస్తున్నప్పుడు గియాసుద్దీన్ శరీరము మహుమూద్ ఖాన్ పైన చేయూతనిచ్చి రక్షించే ప్రయత్నం చేసినట్టు కనిపించినట్టు తారీఖ్-ఎ-ఫిరూజ్‌షాహీలో సమకాలిక చరిత్రకారుడు జియావుద్దీన్ బరానీ ఉల్లేఖించాడు[4].

పరిపాలన

[మార్చు]

తుగ్లక్ భారత ద్వీపకల్పం లోని ప్రాంతాలను జయించి తన సామ్రాజ్య విస్తరణకు నడుంకట్టాడు. దక్షిణ ప్రాంతాలపై పట్టు కొరకు తన రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరి కి మార్చాడు. ఢిల్లీ నుండి 700 మైళ్ళ దూరాన దక్కను లోగల దేవగిరిని, దౌలతాబాదు గా పేరుమార్చి రాజధానిగా ప్రకటించాడు. తన ప్రభుత్వకార్యాలయాను మాత్రమే మార్చక, మొత్తం ప్రజానీకానికి దౌలతాబాదుకు మకాం మార్చాలని హుకుం జారీ చేశాడు. దౌలతాబాదులో ప్రజా సౌకర్యాలు కలుగజేయడంలో విఫలుడైనాడు. కనీస వసతులైన నీటి సరఫరా కూడా చేయలేకపోయాడు. కేవలం రెండేండ్లలో, తిరిగీ రాజధానిగా ఢిల్లీని ప్రకటించి, ప్రజలందరికీ తిరిగీ ఢిల్లీ చేరాలని ఆజ్ఞలు జారీచేశాడు. ఈ అసంబద్ధ నిర్ణయానికి బలై, వలసలతో ఎందరో జనం మరణించారు. ఈ రెండేళ్ళకాలం ఢిల్లీ "భూతాల నగరంగా" మారిందని చరిత్రకారులు చెబుతారు. ఉత్తర ఆఫ్రికా కు చెందిన యాత్రికుడు ఇబ్నె బతూతా ఇలా వ్రాశాడు : 'నేను ఢిల్లీలో ప్రవేశించినపుడు, అదో ఎడారిలా వున్నది'.

తుగ్లక్ భారతదేశంలోనే మొదటిసారిగా నాణెముల మారకవిధానాన్ని ప్రారంభించాడు, వీటిని చైనీయుల నమూనాల సహాయంతో ఇత్తడి లేదా రాగి నాణేలను విడుదల చేశాడు. మునుపు వున్న బంగారం, వెండి నాణేలను వెనక్కు తీసుకుని ఖజానా లో భద్రపరిచాడు. కానీ ప్రజలూ చతురులే, కొద్దిమంది మాత్రమే ఈ మార్పిడి చేసుకున్నారు, చాలామంది దొంగచాటుగా ఈ నాణేల ముద్రణ చేపట్టి ఖజానాకు ద్రోహం చేశారు. ఈ ఉపాయం విఫలమైనది, ఖజానాలో రాగి, ఇత్తడి నాణేలు సంవత్సరాల తరబడీ గుట్టలుగా పేరుకుపోయాయని చరిత్రకారులు చెబుతారు. తుగ్లక్ పర్షియా, చైనా పై దండయాత్ర సలపబోతున్నాడనే వార్త, ప్రజలలో వ్యాపించింది. ఇలాంటి విపరీత బుద్ధులతో తుగ్లక్, సమకాలీనులలో విమర్శలకు లోనయ్యాడు.

సింధ్ ప్రాంతంలో తన కార్యకలాపాలు కొనసాగిస్తున్న తరుణంలో తుగ్లక్ మార్చి 20, 1351 న సింధ్ ప్రాంతంలోని థట్టాలో మరణించాడు. ఈయన్ను తల్లి తండ్రులతో పాటు ఢిల్లీలోని గియాసుద్దీన్ సమాధి మందిరంలో ఖననం చేశారు. ఇతని వారసుడిగా ఫిరోజ్ షా తుగ్లక్ సింహాసనాన్ని అధిష్టించాడు.

సామ్రాజ్య పతనం

[మార్చు]

తుగ్లక్ తన పరిపాలనా అంతాన్ని చూశాడు. తన పరిపాలనా కాల ఆఖరి సంవత్సరాలలో, దక్కను ప్రాంతంలో స్వతంత్ర రాజ్యాల ఆవిర్భావన చూశాడు, దక్షిణ భారతములో ముసునూరి వంశీయుల రాజ్యం చాలాబలముగా మిగతా అని రాజ్యాలకు రక్షణ కవచముగా అయినది. ఉదాహరణకు ముసునూరి కాపయ్య నాయుడి సాయంతో బహమనీ రాజ్యం హసన్ గంగూ చే స్థాపింపబడినది. [5]

నాణెముల ప్రయోగాలు

[మార్చు]

ముహమ్మద్ బిన్ తుగ్లక్, నాణెముల ప్రయోగాలకు ప్రసిద్ధి. బంగారు, వెండి నాణేలకు బదులుగా రాగి, ఇత్తడి నాణేలను విడుదల చేశాడు. దీనిలోగల లొసుగులు తెలిసిన ప్రజలు, బంగారు, వెండి నాణేలు తమదగ్గరే వుంచుకొని, రాగి, ఇత్తడి నాణేలు స్వంతంగా తయారుచేసుకొని, చెలామణీ చేసుకోసాగారు. దీనివలన సుల్తాను ఖజానాకు గండి పడింది. ఈ నాణేలపై లిపీకళాకృతులూ నాణ్యవంతముగా లేనందున దొంగచాటుగా నాణేలు తయారుచేసేవారికి తమపని సులభతరమైనది. ఈ విధానము విజయవంతము కాకపోయిననూ, నాణెములు, మారక విధానము పటిష్ఠమైనది. ఇతనికి చరిత్రలో మంచిపేరే తెచ్చి పెట్టింది. ఇతని బంగారు దీనారు లో 202 గింజల (గురుగింజ) బరువూ, 172 గింజల బరువులూ గలవు. వెండి నాణెంలో 144 గురుగింజల బరువూ తూగేవి. ఏడేండ్ల తరువాత, ఈ విధానాన్ని రద్దు పరచాడు, కారణం ప్రజలనుండి సరైన సహకారం లభించక పోవడమే.

ఇతని నాణెములపై కలిమా ముద్రించివుండేది. ఇదేగాక, అల్లాహ్ మార్గంలో యోధుడు అనీ, నలుగురు రాషిదూన్ ఖలీఫాలు అయిన అబూబక్ర్, ఉమర్, ఉస్మాన్, అలీ ల పేర్లు ముద్రింపబడి యుండేవి. తన నాణేలను, ఢిల్లీ, లక్నో, దారుల్ ఇస్లాం, సుల్తాన్ పూర్, తుగ్లక్ పూర్, దౌలతాబాదు, ముల్క్-ఎ-తిలంగ్ (తెలంగాణా) లలో ముద్రించేవాడు. ఇంతవరకూ 30 రకాల బిల్లన్ నాణేల గూర్చి తెలిసింది.

చిత్రమాలిక

[మార్చు]


మీడియాలో తుగ్లక్

[మార్చు]

తుగ్లక్ అనీ, పిచ్చి తుగ్లక్ అనీ, తెలుగు సినిమాలలో సైతం, ఇతడి పేరు ఒక తరంలో మారుమ్రోగింది.

  • మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే టైటిల్ తో 1972 లో, బి.వి.ప్రసాద్ దర్శకత్వంలో ఒక తెలుగు సినిమా వచ్చింది. ప్రధాన పాత్రను నాగభూషణం పోషించాడు. [6] [7]
  • ముహమ్మద్ బిన్ తుగ్లక్ ఒక సామాజిక-రాజకీయ నాటకం, చో రామస్వామి 1968 లో రచించి ప్రదర్శించాడు.
  • గిరీష్ కర్నాడ్ 1972 లో పదమూడు దృశ్యాలు గల ఓ డ్రామా వ్రాశాడు, దీనిలో ప్రధాన పాత్ర ముహమ్మద్ బిన్ తుగ్లక్. [8]

మూలాలు

[మార్చు]
  1. Barani, Zia-ud-Din. Tarikh-I-firuz Shahi.
  2. Lane Poole, Stanley (1903). Medieval India under Mohammedan Rule. G.P Putnam's Sons.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-05-12. Retrieved 2008-07-12.
  4. Studies in Medieval Indian Architecture By R. Nath పేజీ.22 [1]
  5. Verma, D. C. History of Bijapur (New Delhi: Kumar Brothers, 1974) p. 1
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2014-09-25.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-02. Retrieved 2014-09-25.
  8. Karnad, Girish Raghunath (1972) Tughlaq: a play in thirteen scenes Oxford University Press, Delhi, OCLC 1250554

బయటి లింకులు

[మార్చు]

నోట్స్

[మార్చు]