మూస:భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు/పరిచయం
మార్చు |
భారత గణతంత్ర రాజ్యం నూట ఇరవై తొమ్మిది కోట్లకు పైగా జనాభాతో, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో రెండవది. వైశాల్యంలో ప్రపంచంలో ఏడవది. భారత దేశ ప్రాముఖ్యత గత రెండు దశాబ్దాలలో గణనీయంగా పెరిగింది. భారత ఆర్ధిక వ్యవస్థ యొక్క స్థూల జాతీయోత్పత్తి (పర్చేసింగ్ పవర్ పారిటీ) ప్రకారం నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచంలో అతివేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థలలో ఇది ఒకటి. ప్రపంచం లోనే అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యమైన భారతదేశం, ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశంగా ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఆవిర్భవించింది.
దక్షిణాసియాలో ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము కలిగి, భారత ఉపఖండములో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం, అనేక చారిత్రక వాణిజ్య రహదారుల పైన ఉన్నది. పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. శ్రీలంక, మాల్దీవులు, ఇండోనేషియా భారతదేశం దగ్గరలో గల ద్వీప-దేశాలు. భారతదేశం కొన్ని పురాతన నాగరికతలకు పుట్టినిల్లు. నాలుగు ముఖ్య ప్రపంచ మతాలకు (హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలు) జన్మనిచ్చింది. 1947లో స్వాతంత్ర్యం రావడానికి ముందు బ్రిటిషు సామ్రాజ్యంలో భాగంగా ఉండేది.