మేఘనాథ వధ కావ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మైఖేల్ మధుసూధన దత్ 1861 లో బెంగాలీ భాషలో రచించిన ఇతిహాసం “మేఘనాథ వధ కావ్యం” (1919 నాటి ముద్రణ[[1]])

మేఘనాథ వధ (Bengali: মেঘনাদবধ কাব্য) మహాకవి మైఖేల్ మధుసూదన దత్ రాసిన ఒక బెంగాలీ కావ్యం. మైఖేల్ మధుసూదన దత్‌ రచనలలో అత్యంత ప్రసిద్ధి మరియు ప్రశంశలు పొందిన ఈ కావ్యం బెంగాలీ సాహిత్యంలోనే కాక భారతీయ సాహిత్యంలోనే ఒక మహాకావ్యంగా గుర్తించబడింది.[1] రామాయణం లోని రావణుని కుమారుడైన మేఘనాథుడు (ఇంద్రజిత్) పొందిన విషాదకర మరణాన్ని ఇతివృత్తాంతంగా స్వీకరించి ఇది రాయబడింది. ఈ కావ్యంలో కవి రాముడి పక్షం కాక రాక్షసుల పక్షం వహించి, మేఘనాధుని కథానాయకుడుగా చిత్రీకరిస్తూ కథను అపూర్వంగా కొనసాగిస్తాడు. ఇది 7 సర్గలు గల ఈ కావ్యం 1861 లో రచించబడింది.

ప్రేరణ[మార్చు]

మహాకవి మైఖేల్ మధుసూధన దత్

మహాకవి మైఖేల్ మధుసూధన దత్ రచనలలో వాల్మీకి, హోమర్ (Homer), వర్జిల్ (Virgil), డాంటే (Dante), టస్సో (Tasso), మిల్టన్ (Milton) మొదలగు కవుల ప్రభావం కనిపిస్తుంది.[2] మేఘనాథ వథ కావ్యంపై వాల్మీకి (రామాయణ కావ్యం), హోమర్ (ఇలియడ్ కావ్యం) కవుల ప్రభావం ఎక్కువగా వుంది. అయితే కవి వారిని గుడ్డిగా అనుకరించే ప్రయత్నం చేయలేదు.[3] మూల కథ రామాయణం లోనిదే అయినప్పటికీ అందులోని కొన్ని పాత్రలు ఇలియడ్ కావ్యంలోని పాత్రలను స్పురింపచేస్తాయి. ఉదాహరణకు ప్రమీల పాత్ర ఇలియడ్‌ కావ్యంలోని ఆంధ్రోమఖే (Andromakhe) మరియు క్లోరిందా (Clorinda) పాత్రలను గుర్తుకుతెస్తుంది. అలాగే శివ పార్వతుల పాత్రలు జియస్ (Zeus) మరియు హెరా (Hera) లను, దుర్గ పాత్ర ఆధేనా (Athena), స్కందుడు పాత్ర ఎరెస్ (Ares) ను స్పురింపచేస్తాయి.[3]

అదేవిధంగా మేఘనాథ వథ కావ్యంలోని కొన్ని సన్నివేశాలు ఇలియడ్ కావ్యంలోని ఘట్టాలను గుర్తుకు తెస్తాయి. ఉదాహరణకు మేఘనాథుని అంత్య సంస్కారాల సన్నివేశం, ఇలియడ్ కావ్యంలోని ప్రిన్స్ హెక్టర్ (Prince Hector) అంత్య సంస్కారాల సన్నివేశాన్ని స్పురింప చేస్తుంది.[3] మేఘనాథుని వధ అనంతరం రావణుని వైఖిరి పాత్రోక్లస్ (Paatroklos) చనిపోయిన అనంతరం అఖిల్లెస్ (Akhilleos) వైఖిరిని తలపిస్తుంది. అదేవిధంగా మేఘనాథుని వధించడం కోసం ఇంద్రుడు దేవదూత చిత్రరథుడి ద్వారా లక్ష్మణుడు దగ్గరకు దివ్యాస్త్రాలు పంపించే సన్నివేశం మాదిరిగానే ఇలియడ్ కావ్యంలో కూడా ప్రిన్స్ హెక్టర్‌ను వధించడం కోసం థెతిస్ (Thetis) దేవశిల్పి హెఫాయిస్తోస్ (Hephaistos) ద్వారా అఖిల్లెస్ దగ్గరకు దివ్యాస్త్రాలు పంపించే సన్నివేశం కూడా ఒకేలా వుంటాయి.[3]

ఇంతేగాక అనేక చోట్ల అలంకారాలు, వాక్యాలు సైతం యథాతదంగా ఇలియడ్ కావ్యం నుండి మేఘనాథ వధ కావ్యం లోనికి ప్రవహించాయి. ఈ విధంగా మేఘనాథ వధ కావ్యంపై హోమర్ (ఇలియడ్ కావ్యం) ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, గుడ్డిగా అనుకరించే ధోరణి మాత్రం కనపడదు. బెంగాలీ జాతీయతను రేకెత్తించే రీతిలో సాగిన కావ్య శైలి, కథాగమనంతో మేఘనాథ వధ కావ్యం అమర కావ్యమైంది. ఈ కావ్యంలో అపూర్వంగా చిత్రితమైన జాతీయత, ఉదాత్త పాత్రలు, విలువలు, కళాత్మకత లక్షణాలే దీనిని ఒక మహత్తర ఇతిహాస కావ్యంగా, యావత్ భారతీయ సాహిత్యంలో క్లాసిక్స్ సరసన సమున్నతంగా నిలబెట్టాయి.

స్థూల కథ[మార్చు]

మేఘనాథుడు రాక్షస రాజకులమణి రావణుని కుమారుడు. ఇంద్రజిత్‌గా ప్రసిద్ధుడు. రామాయణంలో ఇతడు విషాదకర మరణం పొందిన నాయకుడు. రామునితో యుద్ధం చేయడానికి సన్నద్దమవుతాడు. యుద్ధంలో విజయాన్ని కాంక్షిస్తూ, యుద్ధానికి బయలుదేరేముందు నికుంభిలలో యజ్ఞం తలపెడతాడు. అయితే తన పినతండ్రి విభీషణుడి ద్రోహ కారణంగా యజ్ఞ కార్యంలో శివుని పూజిస్తుండగా లక్షణుడిచే క్రూరంగా హతమార్చబడతాడు. యాగపూజలో వున్న తనను అందులోను నిరాయుధుడుగా వున్న సమయంలో పోరాడవద్దని మేఘనాధుడు వారిస్తున్నప్పటికి, పిరికిపందవలె వర్తించవద్దని గద్దిస్తున్నప్పటికీ, లక్షణుడు లక్ష్యపెట్టలేదు. అంతకుమునుపు రెండు సార్లు రామ లక్ష్మణులను ముప్పు తిప్పలు పెట్టిన ఈ దురదృష్టవంతుడైన కథానాయకుడు, ఈ అనుచితమైన పోరాటంలో మాత్రం తనను తాను రక్షించుకోలేకపోతాడు.

కావ్య విభాగాలు[మార్చు]

మేఘనాథ వధ 9 సర్గలు (అధ్యాయాలు) గల విషాదాంత కావ్యం. రావణుని పెద్ద కుమారుడు వీరబాహు మరణంతో ప్రారంభమై చివరకు ప్రమీల సహగమనంతో ముగుస్తుంది.
1వ సర్గ:అభిషేకం
2వ సర్గ:అస్త్ర లాభం
3వ సర్గ:సమావేశం
4వ సర్గ:అశోకవనం
5వ సర్గ:చొరవ
6వ సర్గ:మరణం
7వ సర్గ:శక్తినిర్భేద
8వ సర్గ:పాతాళలోకం
9వ సర్గ:సంస్కారాలు

తన కుమారుడు వీరబాహు యుద్ధంలో మరణించిన వార్త విని సభాశీనుడైన రావణుడు హతాశుడవుతాడు. ఎవరి భుజబలం విన్నంతనే అమరులు భయభ్రాంతులవుతారో అతని పైనా ఈ బికారి రాముడు కోదండమెత్తాడు అని నిటూరుస్తాడు. వారధి నిర్మాణంలో సహకరించిన వరుణిని సముద్ర దేవత ఆగ్రహిస్తుంది. తన కొడుకు మరణవార్త విన్న చిత్రాంగద (రావణుని రెండవ భార్య) సభాస్థలికి వచ్చి విలపిస్తుంది. చిత్రాంగద సభ నుండి నిష్క్రమించగానే రావణుడు యుద్ధానికి సన్నద్దమవుతాడు. రాక్షస సేన పదఘట్టనలతో భూమి కంపిస్తున్నది. సోదరుడు వీరబాహు మరణ వార్త విన్న మేఘనాథుడు తండ్రిని వారించి తానే యుద్ధానికి సన్నద్దమవుతాడు. జయజయధ్వనుల మధ్య కొడుకుని సేనాధిపతిగా అభిషేకిస్తాడు రావణుడు.[4]

లంకాపురి రాజ్యలక్ష్మి స్వర్గానికి వెళ్లి ఇంద్ర సభలో ఇంద్రజిత్తు రణయాత్రను వినిపిస్తుంది. మేఘనాథుడు నికుంభిల యజ్ఞం చేస్తే ఇక అతడిని జయించడం అసాధ్యం. దానితో శచీఇంద్రులు కైలాసం వెళ్లి శివునికి విన్నవిస్తారు. శివుడు మహామాయను ప్రసన్నం చేసుకోమని చెప్పడం జరుగుతుంది. స్వర్గం నుండి లభించిన దివ్యాస్త్రాలు అందుకొన్న ఇంద్రుడు దేవదూత చిత్రరథుడు ద్వారా వాటిని లక్ష్మణుడు వద్దకు పంపుతాడు.[4]

మహామాయ వర ప్రసాదంతో విభూషణుడిని వెంటబెట్టుకొని లక్ష్మణుడు అదృశ్యంగా నికుంభిల యజ్ఞాగారంలో ప్రవేశిస్తాడు. అక్కడ నిరాయుదుడిగా, ధ్యానంలో వున్న మేఘనాధుని వధిస్తాడు.

పుత్రశోకంతో కుమిలిపోయిన రావణుడు రాముని మీదకు దండెత్తి వస్తాడు. అతని శక్తి తగిలి లక్ష్మణుడు మూర్చిల్లుతాడు. రాముడు మాయాదేవి సాయంతో పాతాళలోకానికి వెళ్లి అక్కడ తన తండ్రి దశరథుడి చాయను చూడటం జరుగుతుంది. అతని వల్ల లక్ష్మణుడిని బ్రతికించుకొనే ఉపాయం గ్రహిస్తాడు. హనుమంతుడు సంజీవిని తేవడంతో లక్ష్మణుడు మేల్కొంటాడు. దానితో రావణుడు మరింత కృంగిపోతాడు. మేఘనాథుని అంత్యక్రియల కోసం రాముడిని ఏడు దినాలు యుద్ధ విరమణను కోరతాడు. సముద్రతీరంలో ఇంద్రజిత్ అంత్యక్రియలు ఘనంగా జరుగుతాయి. మేఘనాథుని ప్రియభార్య మహా సాధ్వి ప్రమీల సహగమనం చేస్తుంది.[4]

జరిగిన సంఘటనలతో కైలాసంలో శివుడు ఆగ్రహోదగ్నుడవుతాడు. అతని జటాజుటం వూగిపోతుంది. కంఠ సర్పాలు బుసలుకొడతాయి. ఫాలనేత్రం ప్రజ్వరిల్లుతుంది. త్రిపథగ సురనది జటాజూటంలో ఉప్పొంగి, పర్వత కందరాల వెల్లువై పారుతుంది. విశ్వం అతంకంతో కంపిస్తుంది. చివరకు అభయ పార్వతి సభయంతో ఘటించిన అంజలి బంధంతో శివుడు శాంతచిత్తుడవుతాడు.[5]

మేఘనాథునికి ఉత్తర క్రియలు జరిపి రాక్షసులు సజల నేత్రాలతో ఇళ్ళకు మరలుతారు. ఏడు పగళ్ళు, ఏడు రాత్రుళ్ళు ఏడ్చింది లంక.[5]

మేఘనాథ వధ కావ్యంలో నవ్యత[మార్చు]

మేఘనాథ వధ కావ్యంలో వస్తువు పరంగా, శైలి పరంగా కనిపించే నవ్యత అద్వితీయమైనది.[6]

వస్తువులో నవ్యత[మార్చు]

లక్ష్మణుడుచే అనుచితరీతిలో అధర్మంగా హతమార్చబడిన మేఘనాదుని కీర్తిస్తూ, రాక్షసుల దృక్కోణంతో ఈ కావ్యం రాయబడింది. సంస్కృత రామాయణంలోని కథతో పోలిస్తే మేఘనాథ వధ కావ్యంలో కథా నాయకుడు రాముడు కాదు. లక్ష్మణుడూ కాదు. మేఘనాదుడే కథా నాయకుడు.[3] అంతేగాక దీనిలో కథ యావత్తు రాముడి పక్షం కాకుండా రాక్షసుల పక్షం వహిస్తూ కొనసాగుతుంది.[3] రాక్షస రాజు రావణుని మహోన్నత పాలకుడిగా, అతని కుమారుడైన మేఘనాధుని దేశభక్తుడిగా, శౌర్యవంతుడిగా, యుద్ధవీరుడిగా, ఆదర్శ భర్తగా, లంకేయుల హితుడిగా చూపబడ్డాడు.[6]

శైలిలో నవ్యత[మార్చు]

మేఘనాథ వధ సరికొత్త కావ్యభాషలో రాయబడింది. అప్పటికే ప్రచులితమై వున్న ప్రాచీన ఛందో బంధాలు చేదించి, వ్యాకరణ శృంఖలాలు తెంచి కొత్త కొత్త శబ్దాలు, కొత్త పద బంధాలను కవి సృషించాడు.[5] వంగ కవిత్వాన్ని స్వర తరంగ భంగీ ముద్రితం చేయడానికి కావలిసిన పదాలను సంస్కృత భాండారం నుండి కవి నిస్సంకోచంగా తన ఇష్టానుసారం దోచుకొన్నాడని రవీంద్రనాథ్ ఠాగూర్ పేర్కొన్నాడు.[1] మేఘనాథ వధ కావ్యం అమిత్రాక్షరి (Blank verses) ఛందస్సులో రాయబడింది.[5] బెంగాలి కవిత్వంలో ఈ అమిత్రాక్షరి ఛందస్సును తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత కూడా మైఖేల్ మధుసూధన దత్దే. సాంప్రదాయికంగా కనిపించే మంగళాచరణం కూడా ఈ కావ్యంలో కనిపించదు.[1]కావ్యంలో తన కవితాఝురిని ఉరకలతో పరుగులు పెట్టిస్తాడు. కథా స్రవంతి గంభీరంగా వీర, రౌద్ర, కరుణ రస పూరితంగా సాగుతుంది.

పాత్రల చిత్రీకరణ[మార్చు]

పాత్రల చిత్రణలో కవి అద్వితీయమైన కౌశలం ప్రదర్శిస్తాడు. సజీవమైన పాత్రలు ఈ కావ్యంలో సృజించబడ్డాయి. మేఘనాధుని నోట వీరోచితమైన భాషను పలికించాడు. కవి ఈ మహాకావ్యం ద్వారా 'ప్రమీల' వంటి అధ్బుత వీరాంగన పాత్రను బెంగాలీ భాషలోనే కాదు, భారతీయ సాహిత్యానికి ప్రసాదించాడు.[5] రావణుని పాత్రను మహోన్నతుడిగా, ధీరోదత్తునిగా తీర్చిదిద్దాడు. యువరాజు మేఘనాధుడు ఒక దేశభక్తుడిగా, ప్రేమాస్పదుడైన భర్తగా, శ్రద్దాతత్పరుడైన కుమారుడిగా, తన దేశస్థులకు స్నేహితుడిగా మహోన్నతంగా రాజసంతో కనిపిస్తాడు.

కావ్య ప్రశంశలు[మార్చు]

రామాయణ ఆధారిత కళాఖండాన్ని సృజించిన మైఖేల్ మధుసూదన్ దత్ ఆధునిక బెంగాలీ సాహిత్యంలో మొదటి ఇతిహాస కవిగా అవతరించాడు. ఈ కావ్యంతోనే మైఖేల్ మధుసూదన దత్ మహాకవిగా ప్రసిద్ధి పొందాడు. మేఘనాథ వధ కావ్యాన్ని ఆధునిక భారతీయ సాహిత్యంలో వెలువడిన మహత్తర రచనలలో ఒకటిగా విమర్శకులు కొనియాడారు.[2] ఈ కావ్యంపై బెంగాలీ సాహితీ దిగ్గజకవులు చేసిన కొన్ని వ్యాఖ్యలు.

వీటిని కూడా చూడండి[మార్చు]

ఇంద్రజిత్తు

రిఫరెన్సులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 Uttara Bharata Sahityamulu & 1979 p 114.
  2. 2.0 2.1 William Radice 2012.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 Uttara Bharata Sahityamulu & 1979 p 115.
  4. 4.0 4.1 4.2 Uttara Bharata Sahityamulu & 1979 p 116.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 Uttara Bharata Sahityamulu & 1979 p 117.
  6. 6.0 6.1 The Independent 2016.
  7. 7.0 7.1 7.2 srichinmoylibrary.