మోగులూరి సోమాచారి
ఈ పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీ. |
మోగులూరి సోమాచారి సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ప్రతిఘటన సీనియర్ నాయకులు. పీడీత ప్రజల విముక్తి కోసం నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం చేయాలని జీవితాంతం అలుపెరుగని పోరాటం చేశారు[1] కమ్యూనిస్టు యోధుడు చండ్రపుల్లా రెడ్డి నేతృత్వంలో సుదీర్ఘకాలం జరిగిన ప్రజా పోరాటాల్ని మిళితం చేస్తూ ఆయన ఆత్మకథను రాశారు.[2]
జీవిత విశేషాలు[మార్చు]
ఆయన 1922 మే 22 న కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతంలోని పల్లెర్లమూడి గ్రామంలో చాయమ్మ (చిట్టమ్మ), భద్రయ్య దంపతులకు జన్మించారు. ఆస్తి లేని కుటుంబం. రెక్కల కష్టంతో జీవించే బతుకులవి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే కాని డొక్క నిండని బడుగుజీవుల ఆత్మకథ సోమాచారి జీవితం. ఇలాంటి పేదరికం నుంచి ఎదిగిన వ్యక్తిలో సహజంగా ఉండే కసే సోమాచారిని విప్లవ రాజకీయాల వైపు మళ్ళించింది. ఆయనను ఉద్యమకారునిగా మార్చింది. ఈ సమాజంలో నేటికీ కోట్లాది మంది పడుతున్న కష్టాలు, కన్నీళ్లకు దర్పణంగా సోమాచారి జీవితముంది. అందుకే సోమాచారి ఆత్మకథ అంటే పేదోళ్ల ఆత్మకథ.[3]
సోమాచారి జీవితమంతా పోరాటాలతోటే గడిచిపోయింది. చిన్నప్పటి బాల్యమంతా కష్టాలతోటే మొదలైంది. చదువుకోవలసిన బాల్యంలో చెరుకు తయారుచేసే పనిలోకి వెళ్లాడు. తండ్రిలేని కుటుంబంలో తల్లికి ఆసరాగా నిలుస్తూ కులవృత్తి అయిన కంసాలి పని నేర్చుకున్నాడు. ఆభరణాలను తయారుచేశాడు. కూలి పనులకు పోయాడు. పట్టెడన్నం కోసం పడరాని పాట్లు పడ్డాడు. బ్రతుకు తెరువుకోసం ఆయనపడ్డ కష్టాలు అన్నీ యిన్నీ కావు. సామర్లకోటలో షుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగస్తునిగా పనిచేశాడు. "మాభూమి" నాటకాన్ని చూశాడు. "లోకం తీరు" నాటకంలో నటించాడు. సోమాచారి మంచి నటుడు. సోమాచారి అనేక నాటకాలలో పాత్రధారుడు. బహుమతులను కూడా గెలుచుకున్నాడు.
ఆయన సాధారణ విశ్వబ్రాహ్మణ కుటుంబం నుంచి ఎదిగివచ్చి విశ్వ కుటుంబం కోసం నిలిచి పోరాడాడు. సమ సమాజం కావాలని ఎర్ర జెండా చేతపట్టాడు. తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, నండూరు ప్రసాదరావు, మాకినేని బసవపున్నయ్య, మోటూరు హనుమంతరావు, తమ్మిన పోతరాజు, నెక్కలపూడి రామారావు, మానికొండ సుబ్బారావు, గుంటూరు బాపనయ్య, ఎ.వి.కె.ప్రసాద్, మానికొండ సూర్యావతి, పర్చా సత్యనారాయణ తదితరులతో కలిసి జైలు జీవితాన్ని, ఉద్యమ జీవితాన్ని గడిపాడు. అడవి ఉద్యమానికి, మైదాన ఉద్యమానికి మధ్యవర్తిగా నిలిచాడు. సికింద్రాబాద్ కుట్రకేసులో ఇరికించబడ్డాడు. అడవుల్లో తిరిగాడు. మన్యం పోరాటం దారుల్లో దీర్ఘకాలిక సాయుధ పోరాట జెండాను ఎగురవేస్తూ ముందుకు సాగాడు. గిరిజనులతో కలిసి పోడు ఉద్యమంలో పాల్గొన్నాడు. 8సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించాడు.[3]
ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నాటి కాలం(1938)లో ఆయన సామర్లకోటలో ఒక పార్టీ కార్యకర్తగా నిలిచాడు. ఆ రోజుల్లో సామర్లకోట పార్టీ కార్యదర్శిగా పనిచేశాడు. 1955లో జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను గెలిపించటంలో ఆయన కృషి ఎంతో ఉంది. సీపీఐ నుంచి సీపీఎం చీలిపోయిన తర్వాత 1967 అసెంబ్లీ ఎన్నికలలో సామర్లకోట నియోజకవర్గం నుంచి మార్క్సిస్టు పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు.[4] అయినా తానెంచుకున్న పోరు మార్గాన్ని జీవితంలో విడవకుండా ఉన్నాడు. ఆయన పేదల పక్షాన నిలిచాడు. నోరులేని వారికి అండగా ఉన్నాడు. సోమాచారి చండ్రపుల్లారెడ్డి నేతృత్వంలోని సీపీఐఎంఎల్ పార్టీలో కొనసాగాడు.
మరణం[మార్చు]
ఆయన 2016 జూన్ 6న తుది శ్వాస విడిచారు.
మూలాలు[మార్చు]
- ↑ మోగులూరి సోమాచారి మృతికి న్యూడెమోక్రసీ సంతాపం
- ↑ "యోధుడి జీవితమే విప్లవాల ఆత్మకథ". Archived from the original on 2016-03-22. Retrieved 2016-06-07.
- ↑ 3.0 3.1 "సామర్లకోట సామ్యవాద యోధుడు". జూలూరు గౌరీశంకర్ కవి, సీనియర్ జర్నలిస్ట్. Andhra Jyothi. 7 June 2016. Retrieved 7 June 2016.
- ↑ యోధుని జీవితమే విప్లవాల ఆత్మకథ