Jump to content

మాకినేని బసవపున్నయ్య

వికీపీడియా నుండి

మాకినేని బసవపున్నయ్య (1914 -1992) రాజ్య సభ సభ్యునిగా, సి.పి.ఐ. (మార్కిస్ట్) అగ్ర నాయకుడిగా

మాకినేని బసవపున్నయ్య
జననం1914 డిసెంబర్ 14
గుంటూరు జిల్లా తూర్పుపాలెం (చెరుకుపల్లి)
మరణం1992 ఏప్రిల్ 12
పదవి పేరురాజ్య సభ సభ్యులు
పదవీ కాలం1952 - 1966
రాజకీయ పార్టీభారతీయ కమ్యునిస్ట్ పార్టీ (మార్కిస్ట్)

మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం అవిశ్రాంతంగా పోరాడిన కమ్యూనిస్ట్ యోధుడు. తెలంగాణా రైతాంగ పోరాటములో ప్రముఖ పాత్ర వహించాడు.

జననం

[మార్చు]

ఈయన గుంటూరు జిల్లా తూర్పుపాలెం (చెరుకుపల్లి)లో 1914, డిసెంబరు 14 న మాకినేని వెంకటప్పయ్య దంపతులకు జన్మించాడు. రేపల్లె, మచిలీ పట్నంలో చదివి ఆ తరువాత 1936 లోగుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో బి.ఎ చదివాడు.

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

1930లో స్వాతంత్ర్య పోరాటములో పాలు పంచుకొని, కాంగ్రెస్ నాయకత్వము ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపు చేయడంతో అసంతృప్తి చెంది 1934 లో కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు. గుంటూరు జిల్లా పార్టీ ఆర్గనైజర్ గా 1934-40 కాలంలో పనిచేశాడు. 1936లో జరిగిన విద్యార్థిసంఘం సంస్థాపక మహాసభలో జతీయ స్థాయి ఉప కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 1940 వరకు ఆంధ్ర రాష్ట్ర విద్యార్థిసంఘం కార్యదర్శిగా విద్యార్థిఉద్యమం నడిపాడు. అదే సంవత్సరం గుంటూరు జిల్లా పార్టీ కార్యదర్శి బాధ్యత స్వీకరించాడు. 1943లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 1948లో కలకత్తాలో జరిగిన సి.పి.ఐ ద్వితీయ మహాసభలో కేంద్ర కమిటీకి ఎన్నికయ్యాడు. ఆ తరువాత 1950లో పొలిట్ బ్యూరోకి ఎన్నికయ్యాడు. ఆ స్థానంలో 40 సంవత్సరాలు కొనసాగాడు[1].

మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడాడు. తెలంగాణా రైతాంగ పోరాటములో ప్రముఖ పాత్ర వహించాడు. సుందరయ్య లాంటి నాయకులతో కలిసి తెలంగాణా సాయుధ పోరాటములో పాల్గొన్నాడు. 1957లో జరిగిన ప్రపంచ కమ్యూనిస్ట్ పార్టీల మహాసభలలో మావొసేతుంగ్, లీషావ్ చీ, చౌ ఎన్ లై లతో చర్చలు జరిపాడు. కమ్యూనిస్ట్ సిద్ధాంతము పట్ల నిబద్ధతతో బాటు ప్రగాఢమైన దేశభక్తి కలవాడు.

కమ్యూనిస్ట్ పార్టీ చీలిక

[మార్చు]

భారతదేశములో విప్లవ సాధనకు అనుసరించవలిసిన వ్యూహం గురించి కమ్యూనిస్ట్ పార్టీలో చర్చ మొదలు పెట్టాడు. ఈ చర్చ చివరకు 1964లో సి.పి.ఐ (యం) ఆవిర్భావానికి దారి తీసింది. ఈ సందర్భములో బసవపున్నయ్య సోవియట్ కమ్యూనిస్ట్ నాయకులమాలటొవ్, సుస్లోవ్, మాలెంకోవ్ లతో చర్చలు జరిపాడు.

చైనాతో యుద్ధం సందర్భముగా కాంగ్రెస్ ప్రభుత్వము రెండు సార్లు జైలులో పెట్టింది. బసవపున్నయ్య ఆనాడు చెప్పిన అంశాలను చాలాకాలము తరువాత భారత పాలక వర్గాలు అంగీకరించాయి.

సి.పి.ఐ (యం) అధికార పత్రిక పీపుల్స్ డెమోక్రసీ సంపాదకునిగా 14 సంవత్సరాలు పనిచేశాడు. అనేక రచనలు చేసారు.

రాజ్య సభ సభ్యుడు

[మార్చు]

రాజ్యసభ సభ్యునిగా ఆంధ్ర ప్రదేశ్ నుండి 1952 ఏప్రియల్ 3 నుంచి 1966 ఏప్రిల్ 2 వరకు పని చేసారు. సభలో పీడిత ప్రజా సమస్యలపై పోరాటం చేశాడు.

మరణం

[మార్చు]

బసవపున్నయ్య ఢిల్లీలోని తన నివాసములో 1992, ఏప్రిల్ 12 న మరణించాడు.

వీరి పేరుతో 2016 లో విజయవాడలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం నిర్మించారు,

మూలాలు

[మార్చు]
  1. గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట. 32