యునానీ

వికీపీడియా నుండి
(యునానీ వైద్యం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
యునానీ పుస్తక టైటిల్ పేజీ

యునానీ (Unani) అన్న మాట "అయోనియా" అన్న గ్రీకు మాట లోంచి వచ్చింది. 'అయోనియా' గ్రీకు దేశానికి మరొక పేరు. యునానీ వైద్యం గ్రీకు దేశంలో రెండవ శతాబ్దంలో పుట్టింది. కాని దీని ప్రచారంలోకి తీసుకు వచ్చినది తొమ్మిదవ శతాబ్దపు పారశీక వైద్యుడు హకీమ్ బిన్ సీనా (అవిసెన్నా). హకీం అంటేనే వైద్యుడు. ప్రస్తుతం ఇది గ్రీకు దేశం లోనూ కాదు, పారశీక దేశం లోనూ కాదు కానీ భారతదేశంలో బహుళ ప్రచారంలో ఉంది. గ్రీస్ దేశాన్ని సెంట్రల్ ఆసియా లోని ఇతర ప్రాంతాలన్ని 'యునాన్' అని పిలిచేవి. ఈ వైద్య ప్రక్రియ గ్రీస్ లో మొదలైంది కాబట్టి దీన్ని యునాని వైద్యం అనేవాళ్ళు. మాయలూ, మంత్రాల నుండి వైద్యాన్ని వేరు చేసి ఒక శాస్త్రంగా చెప్పిన 'హిప్పొక్రెటస్' (క్రీ.పూ377-460) ఈ యునాని వైద్య ప్రక్రియకు పితామహుడు. ఈ వైద్య ప్రక్రియను ఈజిప్టు, సిరియా, ఇరాక్, పర్షియా, భారత్, చైనా దేశాల్లోని మేధావులు తమ ప్రక్రియలు జోడించి మరింత సుసంపన్నం చేసాక, అరబ్బులు ప్రత్యేకంగా దీన్ని అభివృద్ధి చేసారు. అందువల్ల దీన్ని గ్రీకో-అరబ్ మెడిసిన్ అంటారు. ఈవైద్య ప్రక్రియ భారత్ కు వచ్చాక ఇక్కడి రాజవంశస్తులు అయిన ఖిల్జీలు, తుగ్లక్‌లు, మొఘల్ చక్రవర్తులూ ఆదరించారు. రాజ వంశాల ఆదరణతో 17 వ శతాబ్దం వరకూ యునానీ వైద్యం అభివృద్ధి చెందినా, బ్రిటిష్ వారి పాలనలో దీనికి పూర్తిగా ఆదరణ తక్కువయింది.

సిద్ధాంతాలు

[మార్చు]

మనిషిలో నాలుగు విధాలైన ద్రవాలుంటాయి. ఖూన్ (రక్తం), బల్గం (తెమడ లేదా కఫం), సఫ్రా (ఎల్లో బైల్), సౌదా (బ్లాక్ బైల్). ఈ నాలుగు రకాల ద్రవాల మధ్య సమన్వయం ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లేనని యునాని వైద్యం చెబుతుంది. ఈ నాలుగు ద్రవాలను హ్యూమర్స్ అంటారు కాబట్టి దీన్ని హ్యూమరల్ థియరీ అంటారు. పై నాలుగు ద్రవాలు సమన్వయంగా ఉండటానికి ఓ శక్తి (వైటల్ ఫోర్స్) తోడ్పడుతుంది. శరీరానికి అవసరపడే ఆ శక్తిని ఖువ్వతే ముదబ్బిరే బదన్ అంటారు. ఈ శక్తికి విఘాతం కలిగినా మనిషిలో హ్యూమరల్ ద్రవాల సమన్వయం దెబ్బతిన్నా, ఆ వ్యక్తికి జబ్బు వస్తుంది. ఇక్కడ మరో సిద్దాంతము కూడా ఉంది. మనిషిలోని ఈ నాలుగు ద్రవాలకు వేరు వేరు స్వభావాలుంటాయి. రక్తం వేడిగా ఉంటుంది, తెమడ చల్లగా ఉంటుంది, సఫ్రా (పైత్య రసం) వేడిగా పోడిగా ఉంటుంది, సౌదా (బ్లాక్ బైల్) చల్లగా ఉంటుంది. ఈద్రవాల స్వభావాన్ని బట్టి వ్యక్తుల స్వభావాలు వేరుగా ఉంటాయి. దాన్ని బట్టే సైనసైటిస్, న్యుమోనియా వంటి చల్లటి స్వభావం గల జబ్బులు, మూల శంక, టైఫాయిడ్ వంటి వేడి స్వభావమున్న జబ్బులు వస్తాయి. ఈ సిద్ధాంతాన్ని టెంపర్మేంట్ థియరీ అంటారు. 'హ్యూమరల్ థియరీ', 'ఇమ్యూనిటీ థియరీ', 'టెంపర్ మెంటల్ థియరీ' ఆధారంగా జబ్బు లక్షణాలపై వ్యతిరేకంగా పనిచేసి రోగాన్ని మూలాలనుండి పెరికి వేస్తుందీ 'యునానీ వైద్యం' అంటారు .

వ్యాధి నిర్ధారణ

[మార్చు]

యునానీ వైద్యంలో ప్రధానంగా నాడీ (నబ్జ్) చూసి వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఆ తరువాత మూత్ర పరీక్ష (బవుల్), మల పరీక్ష (బరాజ్). రకరకాలైన యంత్ర పరీక్షలు లేకుండా కేవలం నాడీ, మూత్ర, మల పరీక్షల ఆధారంగా వ్యాధి నిర్ధారణ చేస్తారు.

చికిత్స విధానాలు

[మార్చు]

యునానీ వైద్యంలో నాలుగు రకాలుగా చికిత్స చేస్తారు.

  • మొదటిది : (ఇలాజ్ బిద్ తద్బీర్), అంటే ఎలాంటీ మందులు ఇవ్వకుండా కేవలం భౌతిక పరిస్థితుల మార్పు ద్వారా వైద్యం చేయడం.
  • రండవ రకం : (ఇలాజ్ బిల్ గిజా) ఇది ఆహారంతో చేస్తారు.
  • మూడవ రకం : మందులతో వైద్యంచేస్తారు. ఈ మందుల తయారీలో వనమూలికలు, జంతువుల నుండి సేకరించిన పదార్థాలు, ఖనిజాలు ఉపయోగిస్తారు.
  • నాలుగో రకం : (ఇలాజ్ బిల్ జరాహత్) అవసరమైనప్పుడు శస్త్ర చికిత్స. యునానీలో శస్త్ర చికిత్స ప్రవేశ పెట్టింది "రేజస్" కాబట్టి ఆయన్ను ఫాదర్ ఆఫ్ సర్జరీగా అభివర్ణిస్తారు.

ఈ వైద్యం హిపోక్రటీస్ ప్రవచించిన సూత్రాలపై ఆధారపడ్డ వైద్య శాస్త్రం. ఈ శాస్త్రం ప్రకారం మన శరీరంలో నాలుగు రసాలు (humors) ఉంటాయి: కఫం (phlegm), రక్తం (blood), పచ్చ పిత్తం (yellow bile), నల్ల పిత్తం (black bile). ఆ రోజుల్లో ఈ ప్రపంచం అంతా నాలుగు మూలకాలతో (భూమి, అగ్ని, జలం, గాలి) చెయ్యబడ్డాదన్న నమ్మకం కూడా ఉండేది. కనుక పైన చెప్పిన నాలుగు రసాలకీ, నాలుగు మూలకాలకీ చాల దగ్గర లంకె ఉంది. ఈ దృష్టితో చూస్తే యునానీకీ ఆయుర్వేదానికి దగ్గర పోలికలు ఉన్నాయి. ఆయుర్వేదానికీ హిందూ మతానికీ ఉన్న సంబంధం లాంటిదే యునానీకీ ఇస్లాంకీ ఉంది.

యునానీ మందులని తేనెతో రంగరించి పుచ్చుకుంటారు. భస్మం చేసిన ముత్యాలు, బంగారం కూడా యునానీ వైద్యంలో తరచు కనిపిస్తూ ఉంటాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=యునానీ&oldid=3278290" నుండి వెలికితీశారు