Jump to content

హోమియోపతీ వైద్య విధానం

వికీపీడియా నుండి
(హోమియోపతీ నుండి దారిమార్పు చెందింది)
సేమ్యూల్ హానిమాన్, హోమియోథెరపీ స్థాపకుడు

హోమియోపతీ (Homeopathy) ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఒక వైద్య పద్ధతి; ముఖ్యంగా భారత దేశంలో దీనికి లభిస్తున్న ప్రజాదరణ, ఆ కారణంగా అది పొందే ప్రభుత్వాదరణ, ప్రపంచంలో మరెక్కడా అది పొందుటలేదనుట అతిశయోక్తి కాదు. ఈ పద్ధతి దరిదాపు రెండు వందల ఏళ్ళనుంచి వాడుకలో ఉన్నప్పటికీ, దీనికి శాస్త్రీయమైన పునాదులు లేవనే నింద ఒక చెరగని మచ్చలా ఉండిపోయింది. ఆధునిక శాస్త్రీయ దృక్పధంతో చూస్తే ఈ నిందారోపణ సబబయినదే అనిపించవచ్చు. కాని హోమియోపతీ వైద్యం వల్ల వ్యాధి నయమైన వారు ముందుకు వచ్చి ఇచ్చే సాక్ష్యం సంగతి ఏమిటని ప్రతి సవాలు చేసేవారూ ఉన్నారు.

హానిమన్ హోమియోపతీ వైద్యం ముఖ్యం గా మూడు అంశాలు పై ఆధారపడి ఉంది.[ఆధారం చూపాలి] అవి 1. ఆర్గనాన్ (హోమియోపతీ వైద్య సూత్రాలు), 2. హోమియోపతీ మెటీరియా మెడికా (హోమియోపతీ వస్తుగుణ దీపిక). 3. మయాజమ్స్ (దీర్ఘ వ్యాధుల చికిత్స). మొదట ఆర్గనాన్ ను బాగా చదివి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మయాజమ్స్ ను బాగా చదివి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే హానిమన్ ఆర్గనాన్ లో చెప్పినట్లుగా మెటీరియా మెడికాను బాగా చదివి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత హానిమన్ చెప్పినట్లుగా చేసే వైద్యాన్ని మాత్రమే హానిమన్ హోమియోపతీ వైద్యం అంటారు. అప్పుడు మాత్రమే డిసీజ్ క్యూర్ అనేది సాధ్యం.

హానిమన్ వ్రాసిన బుక్స్ లలో ముఖ్యమైనవి 1. ఆర్గనాన్ (హోమియో ఫిలాసఫీ); 2. క్రానిక్ డిసీజెస్ (దీర్ఘ వ్యాధుల చికిత్స) (మయాజమ్స్); 3.హోమియోపతీ మెటీరియా మెడికా ప్యూరా (హోమియోపతీ వస్తుగుణ దీపిక). ఈ బుక్స్ లలో హానిమన్ చెప్పినది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం కనుక ముందు జేమ్స్ టేలర్ కెంట్ అనే గొప్ప హోమియోపతీ వైద్యుడు వ్రాసిన బుక్స్ చదవాలి. అవి 1. లెక్చర్స్ ఆన్ హోమియోపతీ ఫిలాసఫీ, 2. లెక్చర్స్ ఆన్ హోమియోపతీ మెటీరియా మెడికా. ఈ బుక్స్ బాగా చదివి అర్థం చేసుకుంటే అపుడు హానిమన్ వ్రాసిన బుక్స్ లలో వ్రాసినది అర్థం అవుతుంది. ఇలాగ కెంట్ ద్వారానే హానిమన్ ను అర్థం చేసుకోగలము.

హానిమన్ మహాశయుడు లోకోపకారం కోసం కనిపెట్టిన అద్భుతమైన వైద్య సూత్రాలు నాలుగు ఉన్నాయి.[ఆధారం చూపాలి] అవి 1. సారూప్య ఔషధ సిద్ధాంతం, 2. దీర్ఘ వ్యాధుల చికిత్స (మయాజమ్స్), 3. ఔషధాలను పొటెన్సీలుగా మార్చుట (పొటెంటైజేషన్), వ్యాధి తీవ్రతను బట్టి ఎంత పొటెన్సీలో మందును ఇవ్వాలి, 4. డోసులను ఎప్పుడు ఎక్కడ ఎలాగ ఎన్ని ఇవ్వాలి. ఇవి ప్రకృతి లో సహజంగా ఉన్న వైద్య సూత్రాలు.[ఆధారం చూపాలి]

చరిత్ర

[మార్చు]
1857 painting by Alexander Beydeman showing historical figures and personifications of homeopathy observing the brutality of medicine of the 19th century

హోమియోపతీ అన్నది హోమోయిస్ (ఒకే రకమైన), పేథోస్ (బాధ, రోగ లక్షణం) అనే రెండు గ్రీకు మాటలని సంధించగా పుట్టిన మాట. కనుక కావలిస్తే దీనిని తెలుగులో సారూప్యలక్షణవైద్యం అనొచ్చు. ఉష్ణం ఉష్ణేన శీతలం అన్నట్లు, వజ్రం వజ్రేనభిద్యతే అన్నట్లు ఒక పదార్థం ఏ బాధని కలిగిస్తుందో ఆ బాధని నివారించటానికి అదే పదార్ధాన్ని మందుగా వాడాలి అన్నది హోమియోపతీ మూల సూత్రం. ఈ వైద్యపద్ధతిని, ఈ మాటని కనిపెట్టినది సేమ్యూల్ హానిమాన్ (Samuel_Hahnemann; 1755-1843) అనే జర్మనీ దేశపు వైద్యుడు. ఈయన వైద్య కళాశాలకి వెళ్ళి లక్షణంగా అప్పటి వైద్యశాస్త్రం అధ్యయనం చేసేడు. ఆ రోజులలో వైద్యం అంటే నాటు వైద్యమే. రోగానికి కారణం మలినపు రక్తం అనే నమ్మకంతో రోగి రక్తనాళాలని కోసి రక్తం ఓడ్చేసేవారు. దేహనిర్మాణశాస్త్రం (ఎనాటమీ), రోగనిర్ణయశాస్త్రం, రసాయనశాస్త్రం అప్పటికి ఇంకా బాగా పుంజుకోలేదు. కనుక అప్పటి వైద్య విధానాలలో హానిమాన్ కి లోపాలు కనిపించటం సహజం. ఈ లోపాలని సవరించటానికి ఆయన ఒక కొత్త పద్ధతిని కనిపెట్టేడు. అదే హోమియోపతీ. హోమియోపతీ వాడుకలోకి వచ్చిన తరువాత హోమియోపతీ భక్తులు ఇప్పుడు వాడుకలో ఉన్న "ఇంగ్లీషు వైద్యాన్ని" ఎల్లోపతీ (allopathy) అనటం మొదలు పెట్టేరు. అంతేకాని ఇంగ్లీషు వైద్యులు ఎవ్వరూ వారి వైద్యపద్ధతిని "ఎల్లోపతీ" అని అనరు.

హోమియోపతి పితామహుడు డాక్టర్ శామ్యూల్ హానిమెన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10న ప్రపంచ హోమియోపతి దినోత్సవంను జరుపుకుంటారు.[1]

విభిన్న పద్ధతులు

[మార్చు]

దరిదాపు రెండున్నర శతాబ్దాల క్రితం పుట్టిన ఈ పద్ధతి కాలక్రమేణా కొన్ని మార్పులు చెందింది. మొదట్లో హానిమాన్ ప్రవచించిన పద్ధతిని సనాతన హోమియోపతీ (classical homeopathy) అనీ, ఇప్పుడు వాడుకలో ఉన్న పద్ధతిని అధునాతన హోమియోపతీ (modern homeopathy) అనీ అందాం. కాని ఇక్కడ విచారణ చేసేది ముఖ్యంగా సనాతన పద్ధతి గురించే.

మూల సూత్రాలు, ఆక్షేపణలు

[మార్చు]
Homeopathic remedy Rhus toxicodendron, derived from poison ivy.
Mortar and pestle used for grinding insoluble solids, including quartz and oyster shells, into homeopathic remedies
This bottle contains arnica montana (wolf's bane) D6, i.e. the nominal dilution is one part in a million (10-6).

హోమియోపతీ వైద్యానికి కొన్ని మూల సూత్రాలు ఉన్నాయి.

మొదటి సూత్రం. మనం ఇచ్చే మందు రోగానికి, రోగ లక్షణాలను తగ్గించటానికి కాదు; మనిషికి. ఒకే రోగం అందరిలోనూ ఒకే లక్షణాలని చూపించదనేది సర్వులూ గమనిస్తూన్న విషయమే. ఇది పటిష్ఠమైన సూత్రమే అని మానసిక శాస్త్రంలో ప్రావీణ్యత ఉన్నవారు ఒప్పుకుంటున్నారు. ఈ సూత్రానికి “mind over matter” అని ఇంగ్లీషులో భాష్యం చెప్పొచ్చు. కనుక రోగి ఎన్ని లక్షణాలు ఏకరవు పెట్టినా వాటన్నిటికి ఒకే ఒక మూల కారణం ఉంటుందనేది వీరి సిద్ధాంతం. కనుక రోగి ఎన్ని లక్షణాలు ఏకరవు పెట్టినా వాటన్నిటికి ఒకే ఒక మందు (remedy) ఇస్తారు - సనాతన హోమియోపతీలో. మందుల ఖాతాలో ఉన్న ఏ మందు ఏ రోగికి నప్పుతుందో ఎంపిక చెయ్యటం చాల కష్టం. పది పుస్తకాలు చదివినంత మాత్రాన అబ్బే ప్రతిభ కాదు ఇది; అనుభవం ఉండాలి. అందుకనే హొమియోపతీ వైద్యం అందరి చేతిలోనూ రాణించదు. అందుకనే కాబోలు, అధునాతనులు ఈ సూత్రాన్ని సమయానుకూలంగా విస్మరిస్తారు.

రెండవ సూత్రం. రోగికి ఏ మందు ఇవ్వాలనే ప్రశ్నకి సమాధానం చెబుతుంది ఈ సూత్రం. ఆరోగ్యంగా ఉన్న ఒక వ్యక్తి చేత ఏదైనా మందు తినిపించినప్పుడు ఆ వ్యక్తి శరీరంలో ఏయే లక్షణాలు పొడచూపుతాయో అయా లక్షణాలు ప్రదర్శించిన రోగికి అదే పదార్థం మందుగా పనిచేస్తుంది. ఈ సూత్రానికి “ఉష్ణం ఉష్ణేన శీతలం” అని సంస్కృతంలో భాష్యం చెప్పొచ్చు. ఈ సిద్ధాంతాన్నే లాటిన్ భాషలో similia similibus curentur అంటారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి సింకోనా తింటే చలిజ్వరం లక్షణాలు కనిపించేయనుకుందాం. అప్పుడు చలిజ్వరంతో బాధ పడే రోగికి అతి చిన్న మోతాదులలో సింకోనా ఇస్తే రోగ లక్షణాలు ఉపశమించి, క్రమేపీ రోగం నయమవుతుందని సనాతన హోమియోపతీ వాదిస్తుంది. ఎల్లోపతీ వైద్యంలో కూడా ఈ సూత్రం ఉంది. టీకాల మందులు దీనికి ఒక ఉదాహరణ. ఏ రోగం బారి నుండి తప్పించుకోవాలంటే ఆ రోగం లక్షణాలను శరీరంలో పుట్టిస్తుంది టీకాల మందు. కలరా, మసూచికం (smallpox), పోలియో, టెటనస్, నుమోనియా, ఫ్లూ మొదలైన వాటికి ఎన్నిటికో “టీకాల మందులు” (vaccinations) కనిపెట్టేరు. పుప్పొడి (pollen) పడని వాళ్ళకి కూడా టీకాల మందులు ఉన్నాయి. మలేరియా వంటి వ్యాధులకి కూడా టీకాల మందుల కోసం వేట సాగుతోంది. కనుక ఈ సూత్రంలో లోపం లేదు. కాని ప్రాయోగికమైన విషయాలలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఉదాహరణకి, టీకాలు వేయించుకున్న వ్యక్తి రక్తం పరీక్ష చేసి చూస్తే టీకాల వల్ల శరీరంలో వచ్చిన మార్పు (ప్రతికాయాలు (antibodies) కనిపించటం) ఏమిటో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే టీకా మందు వల్ల శరీరం ఎలా స్పందిస్తుందో రక్తం పరీక్ష చేసి మనం రుజువు చూపించవచ్చు. హోమియోపతీ మందు వేసుకున్న తరువాత శరీరంలోని రక్తంలో కాని, జీవకణాలలో కాని ఎటువంటి మార్పు వస్తుందో ఇంతవరకు ఎవ్వరూ ప్రమాణాత్మకంగా రుజువు చేసి చూపించలేకపోయారు.

మూడవ సూత్రం. ఇచ్చే మందు అతి సూక్షమమైన మోతాదులో ఇవ్వాలి. సాధారణంగా రోగి వేసుకొనే మూడు మాత్రలలో మందు ఒక పాలు ఉంటే పంచదార (కాకపోతే ఆల్కహాలు, కాకపోతే నీళ్ళు) 1,000,000,000,000 పాళ్ళు ఉంటుంది. ఇంత తక్కువ మోతాదులో ఉన్న మందు ఎలా పనిచేస్తుందో, దాని వెనక ఉన్న తర్కం ఏమిటో ఇంతవరకు ఎవ్వరూ నిక్కచ్చిగా రుజువు చేసి నిర్ద్వందంగా చెప్పలేకపోయారు.

తధాస్తు ప్రభావం

[మార్చు]

ఇంగ్లీషులో ప్లసీబో (placebo) అనే మాట ఉంది. లాటిన్ లో ఈ మాటకి "అలాగే! సంతోషిస్తాను" అనే అర్ధం ఉంది. అలాగే వైద్య శాస్త్రంలో "ఈ మందు గుణం చేస్తుంది" అని చెప్పి వైద్యుడు పంచదార మాత్రలు ఇచ్చినా కొందరిలో గుణం కనిపిస్తుంది. ఈ దృగ్విషయాన్ని శాస్త్రీయ పద్ధతిలో అనేక కోణాలనుండి రుజువు చేసేరు. ఈ సందర్భంలో ఔషధం లేని ఉత్త పంచదార మాత్రలని ప్లసీబో అంటారు. దీనిని తెలుగులో "తధాస్తు మందు" (placebo) అనిన్నీ, ఈ ప్రభావాన్ని తధాస్తు ప్రభావం (placebo effect) అనిన్నీ అనొచ్చు; ఎందుకంటే సంస్కృతంలో తధాస్తు అంటే "అలాగే జరుగుతుంది" అని ఆర్ధం కనుక.

హోమియోపతీ వాడకంలో కనిపించే గుణం కేవలం తధాస్తు ప్రభావమే అని ఆధునిక శాస్త్రీయ దృక్పధపు వాదన. తధాస్తు ప్రభావం వల్ల కనిపించే గుణం ఉత్త ఊహాజనితమూ కాదు, మనస్సు మనని మభ్య పెట్టటమూ కాదు. ఈ ప్రభావం వల్ల వ్యాధి నిజంగా నయం అవుతుంది. నమ్మకంతో తులసిదళంతో నూతినీళ్ళు తాగినా కొందరిలో గుణం కనిపిస్తుంది. అలాగని నూతినీళ్ళకి మహత్తు ఉందనడం శాస్త్రీయం అనిపించుకోదు. వచ్చిన చిక్కల్లా ఈ తధాస్తు ప్రభావం అందరిలోనూ కనిపించదు. ఈ దృగ్విషయం (phenomenon) పరిపూర్ణంగా అర్ధం అయిననాడు హోమియోపతీ వైద్యం కూడా ఎలా పనిచేస్తున్నదో అర్ధం అవటానికి సావకాశాలు ఉన్నాయి.

ప్రజాదరణకి కారణాలు

[మార్చు]
హోమియోపతి మందులు

హోమియోపతీ శాస్త్రీయత లేని ఒక బూటకపు వైద్య పద్ధతి అనే ఆక్షేపణ ఒకటి బహుళ ప్రచారంలో ఉన్నప్పటికీ, హోమియోపతీ పద్ధతికి ప్రజలలో, కొన్ని పరిధులలో, ఆదరణ ఉంది.[ఆధారం చూపాలి] ఉదాహరణకి బడుగు దేశాలలోనూ, బీదవారిలోనూ ఉన్న ఆదరణ సంపన్న దేశాలలోనూ, సంపన్నులలోనూ లేదు. సంపన్న దేశాలలో కూడా మిగిలిన దేశాలతో పోల్చి చూస్తే అమెరికాలో ఆదరణ చాల తక్కువ. ఇదే విధంగా విద్యాగంధం తక్కువ ఉన్న వారిలో ఉన్న ఆదరణ విద్యావంతులలో లేదు. విద్యావంతులలో కూడా ఆధునిక శాస్త్రంతో పరిచయం లేని వారిలో ఉన్న ఆదరణ శాస్త్రం తెలిసిన వారిలో లేదు. ఏది ఏమయినప్పటికీ, ఎన్ని ఆక్షేపణలు ఉన్నప్పటికీ, హోమియోపతీ వైద్యం రెండున్నర శతాబ్దాల కాలం నిలదొక్కుకోటానికి కారణాలు లేకపోలేదు.

  1. హోమియోపతీ వైద్యం, మందులు (కనీసం భారత డేశంలో) బాగా చౌక - ఇంగ్లీషు మందులతో పోల్చి చూసినా, ఆయుర్వేదం మందులతో పోల్చి చూసినా ఈ వైద్యం భారతదేశంలో చౌకే. కనుక బీద వారికి అందుబాటులో ఉన్న పద్ధతి ఇది.
  2. సరి అయిన మందు వేసుకుంటే గుణం కనిపిస్తుంది. త్వరగా కనిపిస్తుంది. చేసిన గుణం తాత్కాలికం కాకుండా శాశ్వతంగా ఉంటుంది.
  3. హోమియోపతీ మందులు హాని చెయ్యవు. ఒక వేళ సరి అయిన మందు పడక పోతే గుణం కనిపించదు తప్ప, హాని ఉండదు.
  4. హోమియోపతీ మందులు ప్రకృతిలో దొరికే పదార్ధాలతోటే తయారవుతాయి గాని కృత్రిమంగా సంధించబడ్డ రసాయనాలు కాదు.
  5. హోమియోపతీ మందులు బాహ్య లక్షణాలను అదుపులో పెట్టటానికి ప్రయత్నించవు; బయటకి కనిపించే లక్షణాలకి మూల హేతువు ఏదో వాటి మీద పని చేస్తాయి. ఉదాహరణకి జ్వరం, దగ్గు మొదలయినవి బయటకి కనిపించే లక్షణాలు. ఈ లక్షణాలు పొడచూపగానే వాటిని వెంటనే అణచిపెట్టటానికి మందు వేసుకుంటే అసలు కారణం కప్పబడిపోతుందని ఆధునిక వైద్య శాస్త్రం కూడా అంటుంది.
  6. హోమియోపతీ పూర్ణదృక్పధ (holistic) సిద్దాంతం. అంటే రోగిని ఒక రోగాల పుట్టలా కాకుండా ఒక వ్యక్తిగా చూసి, రోగికి ప్రస్ఫుటంగా కనిపించే బాహ్య లక్షణాలతో పాటు, రోగి మానసిక స్థితిని, మూర్తిత్వ వ్యక్తిత్వాలను సమీక్షించి, రోగ లక్షణాలను కాకుండా రోగ కారణాలను దృష్టిలో పెట్టుకుని ఔషధ నిర్ణయం చెయ్యాలంటుంది.

చిక్కులు

[మార్చు]

జలతారు పోగుల మధ్య నల్ల బట్ట ఉన్నట్లు, హోమియోపతీ సిద్ధాంతాలు చెప్పటానికీ, వినటానికీ బాగానే ఉంటాయి కాని, వీటిని ఆచరణలో పెట్టటంలో కొన్ని చిక్కులు ఉన్నాయి. రోగితో కనీసం గంటయినా గడపకుండా రోగ నిర్ణయం చేసి ఔషదాన్ని ఎంపిక చెయ్యటం కష్టం. సరి అయిన ఔషధం ఎంపిక చెయ్యక పోతే గుణం కనిపించదు. హోమియోపతీలో తలనొప్పికి ఫలానా, జ్వరానికి ఫలానా అంటూ మందులు లేవు. తలనొప్పి ఎక్కడ వస్తున్నది, ఎప్పుడు వస్తున్నది, ఎప్పుడు ఉద్రేకం (aggravation) అవుతున్నది, ఎప్పుడు ఉపశమనం (amelioration) అవుతున్నది, రోగి మూర్తిత్వ, వ్యక్తిత్వాలు ఏమిటి, వగయిరా ప్రశ్నలన్నిటికి సమాధానాలు రాబట్టాలంటే సమయం పడుతుంది.

ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; పేరు లేని ref లలో తప్పనిసరిగా కంటెంటు ఉండాలి==ఉపయుక్త గ్రంధావళి==

[2]

అంతర్జాలపు లంకెలు

[మార్చు]

Associations and regulatory bodies

[మార్చు]

ఇతర లంకెలు

[మార్చు]
  • Homeopathy: Real Medicine or Empty Promises?Food and Drug Administration report
  • Questions and Answers About Homeopathy National Center for Complementary and Alternative Medicine (NCCAM) ˑ National Institutes of Health Research Report
  • HomeoWatch: Your Skeptical Guide to Homeopathic History, Theories, and Current PracticesStephen Barrett
  • The Scientific Evidence on Homeopathy – January 2000 article from the American Council on Science and Health
  • Wilhelm Ameke, History of Homœopathy, with an appendix on the present state of University medicine, translated by A. E. Drysdale, edited by R. E. Dudgeon, London: E. Gould & Son, 1885
  • Homeopathy Explained – Video (14 min 34 sec) – Portion of James Randi's 2001 Princeton lecture. (Complete 2 hr 10 min 43 sec lecture.)
  • John Langone (September 18, 1996). "Challenging the mainstream". Time Magazine. Archived from the original on 2008-05-10. Retrieved 2008-05-03.
  • Does Homeopathy work? [3] A debate on the evidence on both sides with Dr Peter Fisher, Clinical Director of the Royal London Homeopathic Hospital and Dr Ben Goldacre, medical writer and broadcaster.
  • https://www.youtube.com/watch?v=Di6FUno3ysk

[3]

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (10 April 2017). "నేడు ప్రపంచ హోమియోపతి దినోత్సవం". Archived from the original on 10 April 2019. Retrieved 10 April 2019.
  2. https://te.wikisource.org/wiki/%E0%B0%85%E0%B0%AC%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%B5%E0%B1%87%E0%B0%9F_-_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%AC%E0%B0%BE%E0%B0%9F/%E0%B0%B9%E0%B1%8B%E0%B0%AE%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%AF%E0%B0%AE%E0%B0%A8%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B_%E0%B0%8E%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%A1%E0%B0%BE_%E0%B0%B0%E0%B1%81%E0%B0%9C%E0%B1%81%E0%B0%B5%E0%B1%81%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%87%E0%B0%A6%E0%B1%81_[permanent dead link]!
  3. https://te.wikisource.org/wiki/%E0%B0%85%E0%B0%AC%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%B5%E0%B1%87%E0%B0%9F_-_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%AC%E0%B0%BE%E0%B0%9F/%E0%B0%B9%E0%B1%8B%E0%B0%AE%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%AF%E0%B0%AE%E0%B0%A8%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B_%E0%B0%8E%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%A1%E0%B0%BE_%E0%B0%B0%E0%B1%81%E0%B0%9C%E0%B1%81%E0%B0%B5%E0%B1%81%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%87%E0%B0%A6%E0%B1%81_[permanent dead link]!