రాం నారాయణ్
రాం నారాయణ్ | |
---|---|
2009లో రాం నారాయణ్
| |
వ్యక్తిగత సమాచారం | |
సంగీత రీతి | హిందుస్థానీ సంగీతము |
వాయిద్యం | సారంగి |
Website | పండిత్ రాం నారాయణ్ |
రామ్ నారాయణ్ హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలో ప్రాచుర్యం పొందిన భారతీయ సంగీతకారుడు. ఆయన్ను పండిట్ అనే బిరుదుతో పిలుస్తూంటారు. సారంగిని వాయిద్యంతో సోలో కచేరీలు చేసి, అంతర్జాతీయంగా పేరుతెచ్చుకున్న మొదటి సారంగి వాయిద్యకారుడు.
రామ్ నారాయణ్ 1927 డిసెంబరు 25 న రాజస్థాన్‌లో ఉదయపూర్ సమీపంలోని అంబర్ గ్రామంలో జన్మించాడు. [1] [2] అతని ముత్తాత తండ్రి, బాగాజీ బియావత్, గాయకుడు. అతను, నారాయణ్ ముత్తాత సాగద్ డాంజి బియావత్‌లు ఉదయపూర్ మహారాణా ఆస్థానంలో పాడారు. [2] నారాయణ్ తాత హర్ లాల్జీ బియావత్, తండ్రి నాథూజీ బియావత్ లు రైతులు, గాయకులు. నాథూజీ దిల్రుబా వాయిద్యాన్ని వాయించేవాడు. నారాయణ్ తల్లి సంగీత ప్రియురాలు. [3] నారాయణ్ మొదటి భాష రాజస్థానీ. హిందీ, ఆ తరువాత ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. [4] [5] సుమారు ఆరేళ్ల వయసులో, అతని వంశ చరిత్ర కారుడు గంగా గురు వద్ద ఒక చిన్న సారంగిని కనుగొన్నాడు. అతని తండ్రి అభివృద్ధి చేసిన ఫింగరింగ్ టెక్నిక్‌ను నేర్చుకున్నాడు. [6] [7] నారాయణ్ తండ్రి అతనికి నేర్పించాడు గానీ, వేశ్యా సంగీతంతో సారంగికి ఉన్న అనుబంధం వలన ఈ వాయిద్యానికి తక్కువ సామాజిక హోదా ఉండేది. ఆ కారణాన కుమారుడు సారంగి నేర్చుకోవడం పట్ల ఆయన చింతించాడు. [3] [8] ఒక సంవత్సరం తరువాత, బియావత్ తన కుమారుడికి బోధించమని జైపూర్‌కు చెందిన సారంగి వాయిద్యకారుడు మెహబూబ్ ఖాన్‌ను కోరాడు. కాని నారాయణ్ తన ఫింగరింగ్ టెక్నిక్‌ను మార్చుకోవలసి ఉంటుందని ఖాన్ చెప్పినప్పుడు అతడు మనసు మార్చుకున్నాడు. [7] ఇక పాఠశాల వదిలి సారంగి వాయించేందుకు అంకితం కమ్మని నారాయణ్‌ను తండ్రి ప్రోత్సహించాడు. [6]
లాహోర్ లోని ఆల్ ఇండియా రేడియో 1944 లో నారాయణ్‌ను ఇతర గాయకులతో పాటుగా నిలయ విద్వాంసుడిగా నియమించింది. అతను 1947 లో భారతదేశ విభజన తరువాత ఢిల్లీకి తరలి వెళ్ళాడు. కచేరీల్లో తోడు వాయిద్యకారుడి పాత్రతో అతడు విసుగు చెందాడు. దాన్ని దాటి ఎదగాలని భావించాడు. 1949 లో నారాయణ్ సినిమాల్లో పనిచేయడానికి ముంబై వెళ్ళాడు.
నారాయణ్ 1956 లో కచేరీ సోలో ఆర్టిస్ట్ అయ్యాడు. అప్పటి నుండి భారతదేశంలోని ప్రధాన సంగీత ఉత్సవాల్లో ప్రదర్శన ఇచ్చాడు. సితార్ ప్లేయర్ రవిశంకర్ పాశ్చాత్య దేశాలలో విజయవంతంగా ప్రదర్శన ఇచ్చిన తరువాత, నారాయణ్ అతడి మార్గాన్ని అనుసరించాడు. అతను సోలో సంకలనాలను రికార్డ్ చేసారు. 1964 లో తన అన్నయ్య చతుర్ లాల్‌తో కలిసి అమెరికా, ఐరోపా లలో తన మొదటి అంతర్జాతీయ పర్యటనను చేసాడు. చతుర్ లాల్, రవిశంకర్ తో 1950ల్లో పర్యటించిన తబలా వాయిద్యకారుడు. నారాయణ్ భారతీయ, విదేశీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చాడు. భారతదేశం వెలుపల తరచూ 2000 ల వరకూ ప్రదర్శన లిచ్చాడు. 2005 లో ఆయనకు భారతదేశపు రెండవ అత్యున్నత పౌర గౌరవం పద్మ విభూషణ్ లభించింది.